ముక్కెర - శానాపతి(ఏడిద) ప్రసన్నలక్ష్మి

mukkera story

పంతం వీడని విక్రమార్కుడు ఎప్పటిలాగే చెట్టుపై నుంచి శవాన్ని దించి భుజాన్న వేసుకుని శ్మశానం వైపు నడవసాగాడు మౌనంగా. అప్పుడు శవంలోని బేతాళుడు రాజు నుద్దేశిస్తూ...

"రాజా...ఈ నిశీధి రాత్రి  ఏం ప్రయోజనం ఆశించి ఈ.చెట్లూ,  తుప్పలూ పట్టుకుని   తిరుగుతున్నావో నాకైతే ఇంతవరకూ  అర్థం కాలేదు. ఒక మగవాని విజయం వెనుక ఒక స్త్రీ ఉంటుందన్నది జగమెరిగిన సత్యం. అలానే ఎంతటి కష్టాన్నైనా సులువుగా చేధించవచ్చని ఓ కంసాలి భార్య దేవయాని భార్య నిరూపించింది. ఆ కథ చెబుతాను. శ్రమ తెలియకుండా విను. కథ విన్న తర్వాత నేను అడిగిన ప్రశ్నలకు సమాధానం తెలిసి కూడా చెప్పకపోతే నీ తల వేయిముక్కలవుతుంది" అంటూ రాజును ముందుగానే హెచ్చరించి....కథను ఈవిధంగా చెప్పడం మొదలుపెట్టాడు బేతాళుడు.

పూర్వం దేవశిఖర రాజ్యంలో నరసింహగుప్తుడనే కంసాలి ఉండేవాడు. అతి చిన్న వస్తువునైనా ఎంతో నైపుణ్యంతో తయారుచేయడం...అతని పనితనంలో గొప్ప విశేషం. దానితో ఆ కంసాలి పేరు చుట్టు పక్కల రాజ్యాల్లో కూడా వ్యాపించింది.

ఓ రోజు  ఒక దొంగ చిన్న ముక్కెరను తెచ్చి కాంసాలికి అమ్మాడు. చూడగానే...చాలా అబ్బురపడ్డాడు. తానే అనుకుంటే...తనకు తలదన్నే కంసాలి ఇంకెవరో ఉన్నారన్నమాట అనుకున్నాడు...ముక్కెర తయారీదనంలోని  నైపుణ్యం చూసి.  ఎంతో భద్రంగా దాచిన ఆ ముక్కెరపై కంసాలి భార్య  ముచ్చటపడింది. భర్తకు తెలియకుండా దాన్ని ఒకసారి తీసి  ముక్కుకి ధరించింది. అదేమీ చిత్రమో...తన కురూపితనం పోయి నమ్మలేని రూపలావణ్యవతి అయిపోయింది ఒక్కసారిగా. తన అందాన్ని కళ్లారా చూసుకుంటుండగానే...భర్త నరసింహగుప్తుడు ఇంట్లోకి రావడంతో...ఆ రూపం చూసి ముగ్ధుడైపోయాడు...జరిగిన విషయం తెలిసి ఆమె తన భార్యే అని తెలిసి మరింత ఆశ్చర్యపోయాడు. నరసింహ గుప్తుడు తన  ఇంట్లో ఎవరో అందాల రాశిని ఉంచుకుని...భార్యను హతమార్చి వుంటాడని...అసలు విషయం తెలియని జనాలు  పుకార్లతో రాజ్యమంతా గుప్పుమనిపించారు.

ఆ విషయం స్త్రీలోలుడైన చంద్రగుప్తుని చెవిన పడ్డంతో... తన సైనికులను నరసింహగుప్తుని  ఇంటికి పంపించి ..తక్షణం అతన్ని కొలువుకి తీసుకురమ్మని ఆజ్ఞ జారీచేశాడు.

ఓ నరసింహగుప్తా...!  నిన్ను నమ్ముకున్న ఆలిని మాయం చేసి ఎవరో సుందరాంగితో  వుంటున్నావని నీపై అభియోగం వచ్చింది. దీనికి నీ సమాధానం ఏమిటని అడిగాడు రాజు. ఓ రాజా...! ఆమెవరో కాదు. నా భార్య దేవయానే. ఎవరో నావద్దకు వచ్చి ముక్కెరను అమ్మియున్నారు. దానిని నా భార్య ధరించడంతో అతిలోకసుందరిగా మారిపోయింది. బహుశా అదంతా ఆముక్కెర మహిమ అయ్యుంటుంది". అని  పూస గుచ్చినట్టుగా  సెలవిచ్చాడు.

నరసింహగుప్తా...నీవు చెప్పే కట్టుకథ నమ్ముటకు మేము అమాయకులం కాదు. రేపు ఉదయమే స్వయముగా మేమే మీఇంటికి వస్తాం. ఆ విషయం నాకళ్లముందే నిర్ధారించు అంటూ హుకుం జారీచేశాడు చంద్రగుప్తుడు. నరసింహగుప్తా తల ఆడించక తప్పలేదు. దిగాలుగా ఇంటికి చేరిన భర్త వాలకం చూసి భార్య దేవయాని  అసలు విషయం అడిగి తెలుసుకుంది. మరునాడు ఉదయమే నరసింహగుప్తుని ఇంటికొచ్చిన చంద్రగుప్తుడు  దేవయాని సౌందర్యం చూసి...ఇటువంటి కాంత  ఉండేది ఓ సాధారణ కంసాలి ఇంటనా...?అనుకుంటూ ఆమె చేయి పట్టుకోబోయాడు. వెనువెంటనే దేవయాని ఆ ముక్కెర తీసి మండుతున్న కొలిమిలో పడవేయగానే...పూర్వరూపం వచ్చేసింది.  ఆ కురూపి రూపం  చూసి నిర్ఘాంతపోయాడు రాజు.

ఆ రాత్రి మరలా భర్త ముందు సౌందర్యరాశిగా దర్శనమిచ్చింది.

ఇప్పుడు చెప్పు రాజా...!

దేవయాన్ని చూసిన ప్రజలు  ఎందుకు భార్యను హతమార్చి ఉంటాడని నరసింహగుప్తునిపై అనుమానపడ్డారు...?

దేవయాన్ని చూసిన రాజు ఎందులకు ఆమె చేయి పట్టుకున్నాడు...?

రాజు ఎదుట  దేవయాని పూర్వరూపంలోకి  ఎందుకు  మారింది...?

ఆ రాత్రి భర్త ఎదుట మళ్లీ  సౌందర్యాన్ని ఎలా సంతరించుకుంది...?  బేతాళుడు ప్రశ్నలపై ప్రశ్నలు కురిపించాడు.

ఆ  ప్రశ్నలకు రాజు చిన్నగా నవ్వుకున్నాడు.

బేతాళా...!  దేవయాని ధరించిన ముక్కెర విషయం ప్రజలకు తెలియకపోవడంతో...ఆ సౌందర్యారాశిని చూసి...నరసింహుడు భార్యను హతమార్చి...ఆ స్థానంలో ఆమెను చేరదీసాడని అపోహపడ్డారు.

ఇక రెండో ప్రశ్నకు సమాధానం... ప్రతిరాజూ కోరుకునేది తన చెంత సౌందర్యరాశి వుండాలనుకోవడమే.  అటువంటి అందగత్తెను  కనులారా గాంచి తాను  చెరబట్టాలనే  ఆలోచనతో నరసింహగుప్తుని ఇంటికొచ్చి ...ఆమె రూపానికి ముగ్ధుడై చేయిపట్టుకున్నాడు.  పోతే మూడో ప్రశ్నకు సమాధానం...స్వతహాగా అందవికారి అయిన దేవయాని సొందర్యంపై ఆశతో దాన్ని దక్కించుకోవాలనుకుంది.  రాజు చేయి పట్టుకో బోతుండ గా.. .అతన్నుంచి రక్షణకై  ముక్కెరను తీసి మండుతున్న కొలిమిలో పడవేసి పూర్వరూపాన్ని పొందినా గానీ...పడవేసిన ఆ ముక్కెర  నకిలీదే గానీ అసలైనది కాదు.

ఆఖరి ప్రశ్నకు నా సమాధానం ఏమంటే....రాజుకి  కన్నుగప్పి దాచేసిన ముక్కెరను ఇకపై రాత్రి మాత్రమే ధరించాలని నిర్ణయం తీసుకుని.... తన భర్తకు సౌందర్యారాశిగా కనిపించింది.

రాజు నుంచి సరైన సమాధానాలు రావడంతో...

మౌనభంగం కలిగించిన బేతాళుడు శవంతో సహా మాయమై తిరిగి చెట్టెక్కాడు. 

మరిన్ని వ్యాసాలు