నా జ్ఞాపకాల్లోంచి ... - - డా.కె.ఎల్ .వి.ప్రసాద్ , హనంకొండ

తనదాకా వస్తే …. !!

మానవ జీవితంలో ముఖ్యంగా చదువుకున్నవాళ్ళ జీవితంలో విద్యార్థి దశ చెప్పుకోదగ్గది,గుర్తు పెట్టుకోదగ్గదిగా ఉంటుంది. ఫలానా వాళ్ళు అని చెప్పడం కాదుగానీ ,ఇంచుమించు అందరి జీవితాల్లోనూ ఎన్నో విషయాలు , అద్భుతాలు,సంఘటనలు జరుగుతాయి. కొందరు వీటిని తేలిగ్గా తీసి పారేసి ఇంచు మించు మరచిపోతారు కూడా !జరిగిపోయిన గతాన్ని తవ్వి తోడుకునే అంశానికి ప్రాధాన్యత నిచ్చేవాళ్ళు తక్కువగా వుంటారు. అలాంటి వాళ్ళు వర్తమానం తోనే సతమత మవుతుంటారు. గతాన్ని గురించి గానీ,భవిష్యత్తు గురించి గానీ ఆలోచించే ఓపిక సమయం వీరికి ఉండదు. అలా కాకుండా కొంతమంది వయసుతో ఏమాత్రం సంబంధం లేకుండా తమ గత జీవిత ముఖ్య సంఘటనలను సింహావలోకనం చేసుకుని మానసిక తృప్తిని అనుభవించడమే కాదు,ముఖ్య స్నేహితులతోనూ , బంధువులతోనూ ,కుటుంభ సభ్యులతోను పంచుకుని ఆనందాన్నిఅనుభావించడంలో గొప్ప అనుభూతిని పొందుతారు. ఇలా కాకుండా,అవి బాధా కరమైన విషయాలు అయితే కాసేపు వాటిని తలచుకుని బాధపడతయారు .ఇవన్నీ అందరి జీవితాల్లోనూ ఎదురయ్యే అంశాలే !

ముఖ్యంగా విద్యార్థి దశలో ఇంటర్మీడియెట్ అనేది జీవితానికి ఒక మైలు రాయిగా చెప్పుకోవచ్చు. జీవితాలని ఆటో -ఇటో తేల్చి పారేసేది ఇక్కడే ! చాలా మంది గ్రామీణ వాతావరణంలో పదవ తరగతి వరకూ చదువుకుని ఇంటర్మీడియెట్ కోసం పట్టణ ప్రాంతాలకో,నగరాలకో,చేరుకుంటారు. మిస మిస లాడే యవ్వన ప్రాంగణం లోనికి అడుగుపెట్టే సమయం ఇది. మానసిక పరిపక్వత,ఆలోచనా విధానం అంచనాలకు మించి పరుగుపెట్టే రెండు అతి చక్కని కుర్రతనం. యువతీ యువకులకు మళ్ళీ మళ్ళీ తిరిగిరాని తనం ! ఇక్కడ యువతరాన్ని కొన్ని వర్గాలుగా విభజించి చూడ వచ్చు.  ప్రతి నిముషం పుస్తాకాలతో కుస్తీ పట్టె, పుస్తకాల పురుగులు అనే సార్ధక నామధేయులు. వీరికి ఇక అసలు బయటి (ఇతర )ప్రపంచంతో పని ఉండదు. చదువుకునే వాళ్ళని చెడగొట్టి వాళ్ళతో కలసి సినిమాలకీ,షికార్ల కీ నిత్యం బయట గడిపేవాళ్లు ,అందమైన అమ్మాయిలతో స్నేహానికి ఆరాట పడుతూ చేతనైన ప్రయత్నాలు చేసుకునేవాళ్ళు,అమ్మాయిల వెంటపడి,వాళ్ళ దృష్టిలో పడడానికి వివిధ ప్రయోగాలతో సతమతమయ్యేవాళ్ళు, ఎదుటి వాళ్ళ మనసేమిటో తెలియకుండానే వాళ్ళని ప్రేమించేస్తున్నామని బ్రమపడే అభినవ దేవదాసులు,ఆడ పిల్లలతో మాట్లాడాలని ఉంటుంది కానీ,మాట్లాడడానికి బిడియం,భయం ,జంకు -అందుకే కామెంట్లు చేసి తృప్తి పడేవాళ్ళు ఇలా కొత్త లోకంలో రకరకాలుగా కలలు కనేవాళ్ళతో వింత పోకడలు మొదలయ్యే వయస్సు ఇది. నా జీవితంలోని ఒక అనుభవాన్ని (ఇంటర్ )ఇక్కడ వివరిస్తే తప్ప నా ఈ ఉపోద్ఘాతానికి పరిపూర్ణత ఏర్పడదు కదా !

*********

నాగార్జున సాగర్ లో,ఇంటర్మీడియెట్ చదూకోవడం నా పూర్వ జన్మ సుకృతం గానూ,గొప్ప అదృష్టం గానూ భావిస్తాను. మా పెద్దక్క స్వర్గీయకుమారి మహానీయమ్మ అక్కడ ఉపాధ్యాయినిగా పనిచేయడమే నాకు కలిసొచ్చిన అదృష్టం. ఆ .. గొప్ప త్యాగమయి దగ్గరవుండి చదూకోవడం జీవితంలో మరవలేని /మరవకూడని అంశం ఉండేది దక్షిణ విజయపురి,జూనియర్ కళాశాల వున్నది,ఉత్తర విజయ పూరిలో హిల్ కాలనీ లో వుంది. కాలేజీ బస్సులో ప్రతిరోజూ మిత్రులతో పిక్ నిక్ కు వెల్తున్నంత సంబరంగా ఉండేది. ఆడపిల్లలు కూడా చాలా మంది వుండేవాళ్ళు గానీ,సంభాషణలు ఎక్కువగా సాగేవి కాదు. అసలు మూడు విషయానికి వస్తే ఇప్పుడు ప్రముఖంగా చెప్పుకోవలసింది ‘ తెలుగు -క్లాసు ‘ గురించి. తెలుగు క్లాసు విద్యార్ధీ-విద్యార్థినులతో నిండుకుండలా కళ కళ లాడుతుండేది. మా బయాలజీ క్లాసు విద్యార్థుల తో పాటు,ఆర్ట్స్,కామర్స్,మేథ్స్ వాళ్ళు కలిసేవాళ్ళు. అందుకే క్లాసు నిండుగా ఉండేది. పైగా ఎట్టి పరిస్థితిలోనూ,ఎవరూ తెలుగు క్లాసు మిస్ అయ్యేవాళ్ళు కాదు. మిస్ అయితే ఏదో పోగొట్టుకున్న భావన కలిగేది. దీనికి ప్రధాన కారణం మా తెలుగు లెక్చరర్ స్వర్గీయ గోలి వెంకట్రామయ్య  గారు. పాఠం అద్భుతం గా చెప్పేవారు. నేను ఆయనకు  ఏకలవ్య శిష్యుడినని చెప్పుకోవడానికి గర్వ పడుతుంటాను.

ఆ.. రోజు తెలుగు క్లాసు ప్రారంభం అయింది. అక్కడక్కడా కొద్దీ ఖాళీలు తప్ప మొత్తం మీద క్లాసు ఫుల్ గా వుంది. నేను మరీ ముందువరుసలో కాకుండా,మరీ వెనుక వరుసలో కాకుండా మధ్య బెంచీలో కూర్చునేవాడిని. నా పక్కన ఎప్పుడూ మిత్రుడు రాజు (పేరు మార్చడం జరిగింది ) కూర్చునే వాడు. ఉన్నత కుటుంబం నుండి వచ్చిన వాడిగా కనిపించే వాడు. అతని ఆహార్యం ప్రత్యేకంగా ఉండేది. అయినా,అతని పూర్వాపరాలను తెలుసుకోవడానికి నేను ఎన్నడూ ప్రయత్నించలేదు. అందుకే మా స్నేహం అంత పటిష్టంగా వుండెదనుకుంటాను. రాజు పాఠం గురించి పెద్దగా పట్టించుకోకుండా జోకులు పేల్చి నవ్విస్తూ ఉండేవాడు. అతని జోకులు ఉల్లాసం కలిగించినా పాఠం వినడానికి ప్రాధాన్యత నిచ్చేవాడిని. అయినా నన్ను వదిలి పెట్టేవాడు కాదు. మా క్లాసులోని ప్రతి అమ్మాయి కదలికలను గమనిస్తూ వాళ్లపై పచ్చి జోకులు వేసేవాడు. అయితే ఆ .. రోజు గురువుగారు పాఠం మద్యలో ఆపి దానికి సంభందించిన కథలోని శకుంతల గురించి వర్ణించడం మొదలు పెట్టారు. ఆయన కళ్ళజోడు తీసి టేబుల్ మీద పెట్టారంటే విద్యార్థుల్లో ఆసక్తి పదింతలయ్యెది . అందరం ఆయన మీదే దృష్టి పెట్టి పాఠం వింటున్నాం. శృంగార నాలుగు శకుంతలను వర్ణిస్తూ సడెన్ గా మాష్టారు “అదుగో .. అప్పుడు శకుంతల అలా వుంది “అని చెప్పి క్లాసు ముఖ ద్వారం వైపు కళ్ళతో సైగ చేశారు. అది విని అందరం అటువైపు చూసాం. అక్కడ క్లాసుకి ఆలస్యంగా వచ్చిన అందమైన అమ్మాయి కనిపించింది. అందరి చూపు అటువైపే పడ్డది. ఆ .. అమ్మాయి కొంచెం అవమానంగా ఫీల్ అయింది,సిగ్గుతో తల వంచుకుని నెమ్మదిగా వెళ్లి తన సీట్లో కూర్చుంది. అది అలా ఉండగా నా బెంచి మిత్రుడు ఎటో చూస్తూ పరధ్యానంగా కూర్చున్నాడు. ఎప్పుడూ లేనిది అతని పాత్రలోకి నేను పరకాయ ప్రవేశం చేసాను. మెల్లగా అతని తొడమీద గిచ్చాను.. ఒక్కసారి ఉలిక్కి పడి

‘’ ఏంటి గురూ … !’’ అన్నాడు.

‘’ ఏంటి పరధ్యానంగా వున్నావ్ .. ?’’ అన్నాను .

‘’ నేనా .. అబ్బే .. అదేం లేదు … ‘’ అన్నాడు.

‘’  ఆ.. అమ్మాయి బాగుంది కదా .. ! ‘’అన్నాను.

‘’ ఏ .. అమ్మాయి .. ?’’ అన్నాడు.

‘’ అదే .. ఇప్పుడు ఆలస్యంగా వస్తే .. సార్ .. శకుంతలతో పోల్చాడు చూడు .. ఆ .. బ్యూటీ .. ‘’ అన్నాను. మిత్రుడి దగ్గరనుంచి ఎలాంటి స్పందన లేదు.

‘’ తెల్ల ఓణీ లో తలస్నానం చేసి ..వదులుగా వదిలేసిన ఆ .. జుత్తు లో ఆమె అందం పదింతలు అయినట్టు లేదూ .. !’’ అన్నాను. మూగ జీవిలా ,మిత్రుడు నిశ్శబ్దాన్ని చాలా క్రమశిక్షణతో పాటిస్తున్నట్టుగా కనిపించాడు.

‘’ ఏంటి .. నీలో అసలు చలనం లేకుండా పోయింది. అందమైన అమ్మాయి ,కనిపిస్తే వర్ణించకుండా ,ఓ పట్టాన వదలవు కదా !’’ అన్నాను.

‘’ వూ .. !’’ అన్నాడు.

‘’ ఈ వాళ ఏమైంది నీకు ?చక్కని చుక్క గురించి చెబుతుంటే, ఏమిటీ..అయిదు..

ఆ .. పరాకు ?’’ అన్నాను.

‘’ ఇక  ఆ .. విషయం వదిలేయ్ గురూ .. ‘’ అన్నాడు.

‘’ ఎందుకట .. !రాముడు మంచి బాలుడు అన్నట్టు .. ‘’అని ఇంకా ఏదో అనబోతుండగా ——నా .. నెత్తి మీద చిన్నగా మొట్టి , ‘’ ఆ .. అమ్మాయి మా  చెల్లెలు .. సంపూర్ణ ‘’ అన్నాడు.  ఒక్కసారి నా తల గిర్రున తిరిగి కింద పడతానేమోనన్న భయం కలిగింది. మాట్లాడితే ఎక్కడ కొడతాడోనని భయం పుట్టి ‘ సారీ  ‘కూడా చెప్పకుండా సైలెంట్ అయిపోయాను.

మరిన్ని వ్యాసాలు