విజయరహస్యం' - కొత్తపల్లి ఉదయబాబు

vijaya rahasyam

నేటి బాలలు రేపటి పౌరులు...అందుకే  ఒక మంచి వ్యక్తిత్వం గల పౌరునిగా మనిషి ఎదగాలంటే  ప్రతీవ్యక్తీ  విద్యావంతుడు కావాలి. అలా విద్యావంతుడు కావాలంటే అతనికి అక్షరాభ్యాసం జరిగిన నాటినుంచే నేర్చుకోవడం పట్ల ఆసక్తి కలిగేలా ప్రవర్తించవలసిన  బాధ్యత అతని చుట్టూ  ఉన్న పెద్దల మీద ఉంది. వారు కన్న తల్లి తండ్రులు కావచ్చు.ఉపాధ్యాయులు కావచ్చు, వాతావరణం కావచ్చు. వనరులు కావచ్చు.

‘’మనిషిలోని శారీరక, మానసిక, ఆధ్యాత్మిక శక్తులను బహిర్గతం చెయ్యడమే  విద్య’’ అని మహాత్మా గాంధీ చెప్పినట్లుగా విద్యార్ధిని సంపూర్ణ మూర్తిమత్వం కలిగి ఉండేలా చేసేదే విద్య. అయితే అక్షరాభ్యాసం చేసి, పాఠశాలలో చేరకముందే విద్యార్ధికి విద్యనేర్వడానికి అవసరమైన మౌలిక భావనలు తల్లి తండ్రులు నేర్పితే, వాటి పునాదులమీద విషయ పరిజ్నానాన్ని గోడలుగా పేర్చుతూ వెళ్ళేది ఉపాధ్యాయులు.

ఐతే ఎవరి బాధ్యత వారు నిర్వర్తించినా విద్యార్ధి తన బాధ్యత తాను గుర్తించి తన భవిష్యత్తును తీర్చి దిద్దుకునేందుకు ‘’నియమాలతో పెట్టుకున్న క్రమశిక్షణ అవసరం ‘’. అలా  ప్రణాళికా బధ్ధంగా ముందుకు సాగిన నాడు అతనికి సర్వత్ర విజయమే.అలాంటి ప్రణాళిక యొక్క అవసరాన్ని విద్యార్ధికి తెలియచేయవలసింది ఉపాద్యాయులు.

ముఖ్యంగా విద్యార్ధులు తాము చదువుతున్న సబ్జెక్ట్ లలో  కొన్నిటి పట్ల మాత్రమే బాగా చదవడానికి ఇష్టపడుతూ ఉంటారు.దానికి కారణాలు ఆ సబ్జెక్టులను బోధించే ఉపాధ్యాయులు పూర్తి అవగాహన కలిగేలా బోధించడం.. మిగతా సబ్జెక్ట్ లను కూడా ఆయా ఉపాధ్యాయులు అంతే బాధ్యతగా బోధిస్తారు.అయితే సబ్జక్ట్ లో కష్టతరమైన భావనలను విద్యార్ధి స్థాయికి దిగి బోధించగిలిగితే పరవాలేదు. ఉపాధ్యాయుడు తన సిలబుస్ అవ్వాలనే ద్రుక్పధం  తో వివరంగా బోధించినా దానిని అందుకోలేని విద్యార్ధులు ఆ సబ్జెక్టు పట్ల అనాసక్తత పెంచుకుంటారు. క్రమంగా అది భయంగా మారి బాగా చదివే సబ్జెక్టుల మీద కూడా ఆ ప్రభావం పడి బాగా చదివే విధ్యార్ధి లో కూడా గణనీయమైన మార్పు వచ్చే  అవకాశం ఉంది.

అందుకే ప్రతీ ఉపాధ్యాయుడు తన సబ్జెక్టును విద్యార్ధి ప్రణాళికా బద్ధంగా ఎలా చదవాలి ? ఎలా విషయ పరిజ్నానమ్ పట్ల  పట్టు సాధించాలి అనే విషయాన్ని వారికి  తెలియచేయాలి. అవసరమైతే అందుకొక కాలనిర్ణయ పట్టిక వేసి ఇవ్వాలి.ఆవిధంగా చదువుతున్నాడో లేదో పర్యవేక్షించాలి .సాధించిన విషయాన్ని క్రోడీకరిస్తూ అతని తప్పులను సరి దిద్దుతూ ముందుకు వెళ్ళేలా చొరవతీసుకోవాలి.

మార్చ్ నెలలో పబ్లిక్ పరీక్షలు జరుగుతాయని ప్రభుత్వ ప్రకటన వెలువడగానే విద్యార్ధులలో దిగుల గుబులు ప్రారంబమవుతుంది. తమ తమ పాఠ్యాంశాలు పూర్తిచేసి పునర్విమర్శ దశలో  ఉపాధ్యాయులు విద్యార్ధులను ఒత్తిడికి గురి చేస్తుంటారు.తమ తమ సబ్జెక్టు లలో సంవత్సర మంతా  చెప్పిన పాఠ్యాంశాలన్నీ రోజువారీగా ఎక్కువ భాగం ఇంటిపనిగా ఇచ్చి విద్యార్ధులను అయోమయ స్థితికి గురిచేస్తుంటారు.

సరిగ్గా ఇలాంటి పరిస్తితి ఎదురైనప్పుడు ఇక్కడ తల్లితండ్రుల బాధ్యత గణనీయమైనది. వారు తమ పిల్లల చదువు పట్ల చురుకుగా వ్యవహరించవలసిన  సమయం ఇది. విద్యార్ధులకు ఎంత వర్క్ యే యే వుపాధ్యాయులు ఇస్తున్నారో తమ పిల్లల ద్వారా తెలుసుకుని వారికి ఉదయం 5 గంటలనుంచి పాఠశాలకు వెళ్ళే గంట  ముందు వరకు గల సమయంలో గంట  కొక సభ్జెక్ట్  చొప్పున చదివేలా టైమ్ టేబుల్ వేసి ఇవ్వాలి. అంతే కాదు పాఠశాల విడిచిన  ఆనంతరం పిల్లలు ఇంటికి వచ్చిన ఒక గంట తరువాత పడుకోబోయే సమయం వరకు ఉన్న సమయాన్ని బట్టి మిగతా సబ్జెక్ట్స్ చదువుకునే విధంగా సాయంత్రం టైమ్ –టేబుల్ వేసి ఇవ్వాలి. ప్రతీ సబ్జెక్టు లోనూ ఒక రెండు పెద్ద ప్రశ్నలు, నాలుగు చిన్న ప్రశ్నలు, 5 ఐచ్చిక సమాధాన ప్రశ్నలు ఉండేవిధంగా పాఠ్యాంశాలను విభజించిఇవ్వాలి. ఇలాంటి సమయాలలో అవసరమైతే వారికి మంచి విషయాలను, సమాజం లో ఉన్నత ష్ఠానాలలో ఉన్న మార్గదర్శకులైన వారికి చెందిన విషయాలను తెలియజేయడం ద్వారా వారిని ఉత్సాహపరచాలి.

ఆ విధంగా ప్రతీ రోజు విద్యార్ధి చదివే సబ్జెక్టులు అన్నీ  టైమ్- టేబల్ పరిధిలోకి వచ్చేలా  వేసి ఇస్తే పిల్లలకు తమ చదువు పట్ల ఒక అవగాహన వస్తుంది. అంతే కాదు. వారు యే యే సబ్జెక్ట్ లు ఎంతవరకు చదివారు. అన్న దానిని ప్రతే గంటకూ దగ్గరుండి పర్యవేక్షించాలి. తమ వుద్యోగపు అలసటను మరచి తండ్రి పర్యవేక్షించాలి. తన పనులను పిల్లలు లేని సమయం లో నిర్వర్తించుకుని, పిల్లలు వచ్చాకా తల్లి కూడా వారిదగ్గర కూర్చుని ప్రేమతో చదివించాలి.

అలా ఏరోజు కారోజు ఆయా పాఠ్యాంశాలన్నీ పూర్తిచేసేలా చూసుకునేలా వారిని ప్రోత్సహించాలి.మరునాటికి వాయిదా వేసే అవకాశం ఇవ్వకూ డదు.   ఈ విధానం అసలు సంవత్సర ప్రారంభం లోనే తల్లి తండ్రులు తమ పిల్లల విషయం లో ప్రారంభిస్తే విద్యార్ధులలో వెనుక బాటుతనం  ఉండదు. ఎప్పటికప్పుడు ఆ యా సబ్జెక్టు లలో కొత్త విషయాలను అంతర్జాలం ద్వారా సేకరించి  నేర్చుకుంటూ చైతన్యులౌతారు. అతని మానసిక పరిధి పెరుగుతుంది.. సంవత్సరం మొదట్లో తక్కువ  పాఠాలు ఉంటాయి కాబట్టి విద్యార్ధులకు చదవడం తేలిక.ఎప్పటి చదువు అప్పుడు పూర్తిచేయ్యడం వలన విద్యార్హికి సబ్జెక్ట్ పట్ల అవగాహన పెరిగి చదవడంలో ఇష్టతను పెంచుకుంటాడు. అతనికి వత్తిడి తగ్గుతుంది. తల్లి తండ్రులకు కూడా చివరలో తమ పిల్లలపట్ల ఆందోళన ఉండదు.

అయితే దురదృష్టం కొద్దీ ఈనాటి విద్యావిధానం లో విద్యార్ధులకు పుస్తకాలు తెరిచి దృష్టి పెట్టి చదువుకోవాలన్న ధ్యాస లేదు.తమ పిల్లలకు, కనీసం నాలుగు తరాల వారసులకు కోట్లు సంపాదించి అందించాలన్న తాపత్రయం లో తండ్రులు పనిచేస్తోంటే భర్తలు తెచ్చిన సంపదతో తమ కోరికలు, ఆశలు అన్నీ తీర్చుకుంటూ జీవితాన్ని ‘ఎంజాయ్’   చేయాలన్న స్థాయిలో తల్లిదండ్రులున్నారు. ఎక్కువ డబ్బు కడితే తమపిల్లలకు ఎక్కువ విద్య అబ్బుతుందని కార్పొరేట్ పాఠశాలల్లో తమ పిల్లలను చేర్పించి రాంకుల మోజులో పిల్లల భవిష్యత్తును త్రిశంకుస్వర్గం గా మారుస్తున్నారు.డబ్బు కట్టేస్తే చాలు తమ పిల్లల బాధ్యత వారిదే అన్న రీతిలో ఎక్కువ శాతం తల్లితండ్రులు ప్రవర్తించడం వల్ల, ఒక్కరిద్దరు పిల్లలు కావడంతో గారాబం వల్ల, వాళ్ళు ఏది కోరినా ఇచ్చి చేజెతులారా పిల్లలను పాడుచేసుకుంటున్నారు.

ఉదయం లేచిన దగ్గరనుంచి పిల్లలు ఏంచేస్తున్నారు, వారి స్నేహితులెవరు, ఎలా చదువుతున్నారు  అనే విషయాన్ని పట్టించుకోకుండా తమ బిడ్డ జీవితంలో స్థిరపడేంతవరకు తన లక్ష్యం వైపు ఆర్జనుని  పాశుపతాస్త్రంగా దూసుకువెళ్లవలసిన వాడు, చిలువ పలవుల వ్యాపకాలతో   తన గమ్యాన్ని బలహీనపరచుకుని ఉత్తమ శ్రేణిలో ఉత్తీర్ణుడు కావలసినవాడు సామాన్యుడిగా మిగులుతున్నాడు. చేతులు కాలాకా ఆకులు పట్టుకోలేని చందాన...తన కలలు నెరవేర్చుకోలేక తల్లితండ్రులకి భారమై, తన విద్యార్హతలకు సమతూకమైన ఉద్యోగం సంపాదించలేక ఆత్మన్యూనతతో బాధ పడుతున్నాడు.ఉన్నతంగా బతకవలసిన జీవితాన్ని నిరాశతో కొనసాగిస్తున్నాడు.

దీనికంతటికీ మూల కారణం ప్రణాళికాబద్ధమైన ప్రణాళికతో ముందుకు వెళ్లకపోవడమే.కాబట్టి ప్రతీ మనిషి విజయ రహస్యం వెనుక  ప్రణాళిక నిర్దిష్టంగా  ఉండాలి. దానికి స్వీయ క్రమశిక్షణ తోడైన నాడు అతను తాను అనుకున్న రంగంలో అజేయుడై సమాజానికి ఆదర్శవంతుడౌతాడు.

మరిన్ని వ్యాసాలు

Kanyakumarilo vunna tiruvalluvar vigraham nirmana charitra
తిరువళ్లువర్ విగ్రహం నిర్మాణ చరిత్ర
- కుందుర్తి నాగబ్రహ్మాచార్యులు
శ్రీసాయి లీలామృతం
శ్రీసాయి లీలామృతం
- సి.హెచ్.ప్రతాప్
మా చార్ధామ్ యాత్ర-2
మా చార్ధామ్ యాత్ర-2
- కర్రా నాగలక్ష్మి
Devashilpi viswakarma cheta srujinchabadina dhanussulu
విశ్వకర్మ చేత సృజనచేయబడిన ధనస్సులు
- కుందుర్తి నాగబ్రహ్మచార్యులు
vennela vaanalo manam
వెన్నెల వానలో మనం ...
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు