కర్నాటక తీర్థయాత్రలు / విహారయాత్రలు - కర్రానాగలక్ష్మి

karnataka teerdhayatralu

త్రిమూర్తులు, త్రిదేవీలు కొలువై వున్న క్షేత్రం ... ఇదే.... 

( కొల్లూరు మూకాంబిక , ఉడిపి )

ఈ వారం మనం ఉడిపి జిల్లాలో వున్న మరో అద్భుతమైన మందిరం గురించి చదవుదాం . మంగళూరికి సుమారు 140 కిలోమీటర్లు , కుందాపుర నుంచి 35 కిలోమీటర్లు , శిమోగ నుంచి 130 కిలోమీటర్ల దూరంలో వున్న కొల్లూరు మూకాంబిక అమ్మవారి కోవెల గురించి తెలుసుకుందాం . ఉడిపి జిల్లాలో పడమటి కనుమలలో గల సుమారు 275 చదరపు కిలోమీటర్ల భాగాన్ని 1974 లో మూకాంబిక సంరక్షితఅరణ్యంగా  నిర్ధారించేరు . కొల్లూరు గ్రామం కూడా ఆ సంరక్షిత అరణ్యంలోవుంది , కొల్లూరులో కొలువై వున్న అమ్మవారిని మూకాంబిక అమ్మవారుగా భక్తులు కొలుచు కుంటారు . పడమట కనుమలలో ప్రయాణం చల్లగా హాయిగా సాగుతుంది . ఉడిపి నుంచి కొల్లూరుకి ప్రతీ గంటకీ బస్సులున్నాయి .

చిన్నచిన్న పల్లెలు , యెత్తైనకొండలు , జలపాతాలు చూసుకుంటూ ప్రయాణించడం బాగుంటుంది . ఈ జలపాతాలన్నీ వర్షాధారాలు కావడం వల్ల వర్షాకాలంలోనే చూడగలం . పల్లెలు చిన్నవేగాని సంపన్నమైనవని చెప్పాలి , ఎందుకంటే యిక్కడ పండే పంటలు గొప్పవి , అడవులలో పంటలేమిటని అనుకుంటున్నారా ? , ఇక్కడ మేలురకమైన ఏలకులు , లవంగాలు పండుతాయి , కొండలలో వూరు అంటే ఓ నాలుగైదు యిళ్లు మాత్రమే అవి కూడా రోడ్డు మీదనే వుంటాయి , అలా బస్సులో వెళుతూ బస్తాలతో ఏలకులు , లవంగాలు చూసి అక్కడదిగిపోయేం వూరుపేరు గుర్తులేదు కాని , కొండవాలులలో పండుతున్న సుగంథ ద్రవ్యాలు , కాఫీపంటను చూస్తే కడుపు నిండిపోయింది , ఆ ఇంటివారిచ్చిన కాఫీ సేవించి , తరవాతి బస్సులో కొల్లూరు చేరుకున్నాం . మూకాంబిక కోవెల కేరళ స్టైల్ లో కట్టబడింది . కోవెలకి అనుబంధంగా వసతి భోజన సౌకర్యాలు వున్నాయి . గర్భగుడిలో అమ్మవారి పంచలోహ విగ్రహం నాలుగు ముఖాలతో కళకళలాడుతూ వుంటుంది . ఇక స్వయంభూ శివలింగం గురించి చెప్పుకోవాలంటే ఈ శివలింగం లో త్రిదేవిలు ( పార్వతి , లక్ష్మి , సరస్వతి ) త్రిమూర్తులు కలసి వున్నారు ఇలాంటి మందిరాలు చాలా అరుదనే చెప్పుకోవాలి , నాకు తెలిసినంతవరకు యిదొక్కటేనేమో ? , ఈ శివలింగం సన్నని బంగారురంగు గీతతో రెండుభాగాలుగా వున్నట్లు వుంటుంది , కుడివైపు త్రిమూర్తులు కొలువై వుండగా ఎడమవైపు త్రిదేవీలు కొలువై వుంటారు ప్రతీ రోజూ పగలు 5 గంటలకి జరిగే నిర్మాల్యసేవకి వెళితే శివలింగాన్ని దర్శించుకోవచ్చు . బంగారురంగు రేఖని ప్రత్యక్షంగా చూడొచ్చు . భక్తులు కోవెల వెనుకవైపున ప్రవహిస్తున్న ‘ సౌపర్ణిక ‘ నదిలో స్నానాలు చేసి అమవారిని దర్శించుకుంటారు . ఇక్కడ పగలు కూడా చల్లగా వుంటుంది , రాత్రి చాలా చల్లగా వుంటుంది .

రాత్రి అక్కడ వుండదల్చుకున్నవారికి మందిరట్రస్టు వారు బస యేర్పాటు చేస్తారు , అభయారణ్యం కాబట్టి రాత్రి ప్రయాణ సౌకర్యాలు వుండవు , అలాగే కోవెల చుట్టుపక్కలకూడా సూర్యాస్తమయం అవగానే నిచ్చాటుగా మారుతుంది , గదిదాటి బయటకు రాకూడదనే ఆంక్షలు కూడా వున్నాయి . ఇక స్థలపురాణం గురించి తెలుసుకుందాం . పార్వతీ దేవి శక్తి స్వరూపిణిగా కౌంహాసురుని  సంహరించిన ప్రదేశమని  పురాణంలో వుంది , ఇతనికి ‘ మూకు ‘ డు అనే పేరుకూడా వుండడం వల్ల అమ్మవారిని ‘ మూకాంబిక ‘ గా పూజిస్తున్నారు . ఆది శంకరులు యీ కోవెలకి సుమారు 21 కిలోమీటర్లదూరంలో వున్న 1343 మీటర్ల యెత్తుగల ‘ కొడభాద్రి’ అనే పర్వతం  పై తపస్సు చేసుకుంటూ వుండగా అమ్మవారు ప్రత్యక్షమై  మందిర నిర్మాణం చేయించమని శలవీయగా శంకరభగవత్పాదులు అమ్మవారిని తీసుకొని బయలుదేరేరట , అమ్మవారు శంకరులు వెనుకకు తిరిగి చూడరాదనే షరతుతో అతని వెనుక రాగా యిప్పుడు మందిరం వున్న ప్రదేశంలో అమ్మవారి కాలి అందెల రవళి శంకరులకు వినబడకపోవడంతో అతని వెనుతిరిగి చూడగా అమ్మవారి శిల అయినారట , శంకరులు అమ్మవారిని ప్రార్ధంచగా ఆమె ప్రత్యక్షమై కౌంహాసురుని సంహరించిన ప్రదేశంలో తనకు మందిరనిర్మాణం జరపాలని కోరగా శంకరులు శ్రీచక్రం పైన అమ్మవారి పంచలోహ విగ్రహాన్ని ప్రతిస్ఠించేరట , శివలింగం స్వయంభూగా ఉధ్భవించిందట .

ఇప్పటికీ కూడా యీ కోవెలలో శంకరులచే నిర్ధేశించబడ్డ ‘ విజయగామ ‘ పధ్దతిలోనే పూజలు జరుపుతారు . గర్భగుడిలోపల యెడమ వైపున శంకరాచార్య పీఠం వుంటుంది చూడొచ్చు . ఈ కోవెలలో మంగళశుక్రవారాలు , శ్రావం మాసం లలో విశేషపూజలు జరుగుతాయి , రద్దీ కూడా యెక్కువగా వుంటుంది .ఫాల్గుణ మాసంలో వచ్చే మూల నక్షత్రం రోజుని అమ్మవారి పుట్టిన రోజుగా జరుపుకుంటారు , ప్రతీ యేటా రధోత్సవం జరుపుతారు . ఈ కోవెల ట్రస్ట్ వారిచే కాలేజీలు నడుపబడుతున్నాయి . మూకాంబిక అభయారణ్యం లో చిరుతలు , లేళ్లు , అడవిపందులు , పులులు లాంటి జంతువులు వున్నాయి . రకరకాలైన పక్షి జాతులను చూడొచ్చు . ఈ అడవిలో యెక్కువగా పనస , జామ మొదలైన పండ్లతోటలు వుండడంతో కోతులు కూడా చాలా యెక్కువగా వున్నాయి . ఇక మనం ఉడిపి జిల్లా ముఖ్యకార్యాలయమైన ‘ ఉడిపి ‘ పట్టణం వెళదాం .  చాలా యేళ్లు ఉడిపి వైష్ణవ మఠాలకు కేంద్రంగా వుండిపోయింది . తరవాత ఉడిపి చుట్టుపక్కల వచ్చిన నిజ కళాశాలలు దేశవిదేశాలలో పేరు తెచ్చుకోడంతో హోటల్స్ నిర్మాణం జరిగి రాకపోకలు పెరిగి పెద్దనగరంగా రూపుదిద్దుకుంది . సముద్రతీరానికి దగ్గరగా వుండడం వల్ల పర్యాటకుల రద్దీ కూడా గణనీయంగా పెరిగింది .

దేశవ్యాప్తంగా ‘ ఉడిపి ‘ అనగానే మనకి గుర్తొచ్చేది రుచికరమైన టిఫిన్లు , అలాంటిది ఉడిపి లోనే అయితే యే హోటల్ లో తిన్నా యెంతో రుచికరమైన అహారం దొరుకుతుంది . వైష్ణవ ప్రాబల్యం యెక్కువకాబట్టి శుచి శుభ్రత కూడా యెక్కువే , ఉడిపి అనగానే మనకి మసాలదోశతో పాటు కృష్ణుని మందిరం కూడా గుర్తొస్తుంది . ఈ కృష్ణడిని రోజుకో రకంగా అలంకరిస్తారు . ఉడిపి నగరానికి ఆహ్వానిస్తూ రోడ్డుమీద పెద్ద ద్వారాలు వుంటాయి . ఉడిపి కృష్ణుని మందిరం చుట్టూరా గదులూ అవీ వుంటాయి , మనకి కోవెలలోకి వచ్చినట్లుగా వుండదు , యేదో మఠంలో వున్నట్లే వుంటుంది . కోవెల లోపల అంటే బయటకి కనబడకుండా వుంటుంది పుష్కరిణి అక్కడకి పర్యాటకులకు ప్రవేశంలేదు . మఠాధిపతులు , సన్యాసులు మాత్రమే స్నానానికి వాడుతారు . ఈ మందిరం పాతకొత్తల కలయికతో వుంటుంది . అటూయిటూ తిరుగుతూ స్వామీజీలు , వారికి దారి కల్పించడం కోసం తప్పుకోండి తప్పుకోండి అంటూ తరుముతూ వంధిమాగదులు కాస్త చిరాకుని కలిగిస్తారు . గర్భ గుడిలోని కృష్ణుడి పశ్చిమాభిముఖంగా వుంటాడు , కృష్ణుడిని చూడడానికి రెండు కిటికీలు వుంటాయి , ముందు ‘ కనకనకుండి ‘ బంగారు కిటికి యిందులోంచి చూడాలి . తోపులాట బాగా వుంటుంది . అన్ని విష్ణు మందిరాలలోనూ తోపులాట తప్పదు , యెందుకో తెలీదు మరి , యిక్కడా అంతే , అక్కడనుంచి లోపలకి వెళ్లేక మరో వెండి కిటికి వుంటుంది దానిని ‘ నవగ్రహకుండి ‘ అంటారు దాంట్లోంచే చూడాలి . ఒక్కసారి చూస్తే కళ్లు తిప్పుకోలేం , అంతముద్దొస్తూవుంటాడు కృష్ణుడు . ద్వారం లోంచి యెందుకు చూడకూడదో యిలా కిటికీలలోంచి చూడడానికి గల కారణాలేమిటో మాత్రం తెలియలేదు .

దర్శనం తరువాత మఠాలవైపుగా వెళితే చుట్టూరా మఠాలు మధ్యన పెద్ద మైదానంలా వుండే ఖాళీ ప్రదేశం కొంచెం ముందుకి వెళితే అక్కడ ‘ అనంతేశ్వరుని ఆలయం వుంటాయి . అనంతేశ్వరుడే ఉడిపి కి మహదేవుడని అంటారు . ఇది శివాలయం . ఈ కోవెల సుమారు 8వ శతాబ్దంలో నిర్మింపబడింది . 13 వ శతాబ్దానికి చెందిన జరద్గురు మద్వాచార్యులు ఈ మందిరంలో గురుకులం ప్రారంభించేరట , ఇతను మహాపండితుడు , ఉపనిషత్తులకు భాష్యం రాసిన మహనీయుడు , సుమారు 37 సంస్కృత గ్రంథాలను రచించేరు . మధ్వాచార్యులు బ్రహ్మసూత్రాలకి సంస్కృతంలో భాష్యం చెప్పేరు . శంకరాచార్యులు బోధించిన అధ్వైతాన్ని , రామానుజులు పాఠించిన విశిష్ఠ అధ్వైతాన్ని తర్కదృష్టితో విమర్శించి ద్వైత వేదాంతాన్ని బోధించేడు . గోవర్ధన చందనంతో చేసిన కృష్ణ విగ్రహానికి పూజలు చేస్తూకృష్ణామఠాన్ని స్థాపించేడు ,  కృష్ణామఠం దేశవిదేశాలలో హిందూమతాన్ని , మతం యొక్క మహత్వాన్ని బోధిస్తున్నారు . అఖండ భారతదేశయాత్రచేసి 1285 లో ద్వారకనుంచి కృష్ణ విగ్రహాన్ని తెచ్చి ప్రతిష్టించేరు . కృష్ణామఠానికి అనుబంధంగా వున్న అష్టమఠాలవారు కృష్ణ మందిరంలో పూజలు నిర్వహిస్తూవుంటారు , మందిర సేవలు ప్రతీ మఠానికి రెండు సంవత్సరాలకాలం వుంటాయి . ఈ మఠాలలో ఉచిత భోజన సదుపాయాలున్నాయి . ఒకప్పుడు యీ మఠానికి చాలా భూములు మాన్యాలుగా వుండేవి , 1954 లో వచ్చిన భూచట్టం వల్ల చాలా భూములు గవర్నమెంటు వారి ఆధీనమయేయి . కాని యిప్పటికీ కూడా యీ మఠాలు చాలా సంపన్నవైనవని అంటారు . ఇక్కడ తిరుగుతూ వుంటే కృష్ణుడు నడయాడిన వ్రేపల్లె లో తిరుతున్నట్లుగా వుంటుంది , ప్రతీ అణువణువునా భక్తిభావం కనిపిస్తుంది . వచ్చేవారం రావణాసురుడు తెచ్చిన ఆత్మలింగం గురించిన వివరాలు చదువుదాం అంతవరకు శలవు .

మరిన్ని వ్యాసాలు

vennela vaanalo manam
వెన్నెల వానలో మనం ...
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
Guru geetha prasasthyam
గురు గీత ప్రాశస్త్యం
- సి.హెచ్.ప్రతాప్
కల్పవృక్ష వినాయక స్వరూపం శిల్పి
కల్పవృక్ష వినాయక స్వరూపం శిల్పి
- కుందుర్తి నాగబ్రహ్మాచార్యులు
సంత్ నరహరి సోనార్
సంత్ నరహరి సోనార్
- కుందుర్తి నాగబ్రహ్మాచార్యులు
మా చార్ధామ్ యాత్ర
మా చార్ధామ్ యాత్ర
- కర్రా నాగలక్ష్మి