కార్తీక మాసం అనగానే మనకు గుర్తుకు వచ్చేది వనభోజనాలు. ఎందుకంటే పిల్లలకు పెద్దలకు కూడా ఉల్లాసంగా గడిపేరోజు కాబట్టి. వనభోజనాలకు పురాణాల్లో ఎంతో ప్రాశస్త్యం వుంది. నైమిశారణ్యం లో సూత మహాముని తోటి మునులందరితో కలిసి వన భోజనం చేసినట్టు పురాణాల్లో వుంది. అలాగీ శ్రీ కృష్ణుడు కూడా తోటి నంద గోపబాలురతో కలిసి వనభోజనం చేసినట్టు,, ఆ రోజు ఆ బాలురకు తాను ఎన్నో లీలలు చూపించినట్టు పురాణాల్లో వివరించడం జరిగింది.
వనభోజనంకి ఎంతో ప్రాముఖ్యం వుంది. కార్తీక మాసంలో ఏదైనా ఒక రోజు మన నివాస స్థలం నుండీ దగ్గరలో వున్న ఏదైనా ఒక వనంకి (పలు వృక్షాలు వున్న ప్రదేశంకి) వెళ్ళి చెట్ల క్రింద భోజనం చేయాలి. ఈ వనభోజనానికి కొన్ని నియమాలు వున్నాయి. వనం లోని ధాత్రి (ఉసిరి చెట్టు ) వృక్షం కింద శివ కేశవుల చిత్ర పటము పెట్టి పసుపు కుంకుమ గంధ పుష్పాదులతో స్వామిని పూజించి, అనంతరం శుచిగా రుచిగా ఆ వనం లోని చెట్ల క్రింద వంటలు చేసి భోజనాలు చేయాలి. కార్తీక మాసం లో వనం లోనే భోజనాలు ఎందుకు చేయాలి అనే సందేహం కలగవచ్చు.. వనభోజనాలకు ఆధ్యాత్మిక, సంప్రదాయ ప్రయోజనాలే కాకుండా ఆరోగ్య ప్రయోజనాలు కూడా వుంటాయి. కార్తీక మాసం శీతాకాలంలో వస్తుంది . ఈ కాలంలో వనాలు పచ్చగా కళ కళలాడుతూ వుంటాయి . ఆహ్లాదకరమైన వాతావరణం వుంటుంది. మరియు వనాలలో దేవతలు సంచరిస్తూ ఉంటారని పురాణ కధనం. వనంలో ఆహ్లాదకరమైన, ఆరోగ్యకరమైన వాతావరణం లో భోజనం చేయడం వలన ప్రజలు ఆరోగ్యంగా ఆనందంగా వుంటారు . వనాలలో దేవతలు సంచరిస్తూ వుంటారు కావున వారి కరుణా కటాక్ష వీక్షణాలు కూడా మనకు లభిస్తాయి అని విశ్వాసం. వనాలలో వుండే ఉసిరి, మర్రి, వేప, మారేడు మొదలైన వృక్షాల వల్ల వచ్చే గాలి ఎంతో ఆరోగ్యవంతమైనది మరియు పవిత్రమైనది కావున ఈ వన భోజనాల వలన ఆధ్యాత్మికం మరియు ఆరోగ్యం రెండు ప్రయోజనాలు కలుగుతాయి. ధాత్రి (ఉసిరి / ఆమ్లక ) వృక్షం కింద శ్రీహరిని పూజించి భోజనం చేయడం వలన ఎంతో పుణ్యం లభిస్తుంది అని పురాణాలలో చెప్పబడినది.
వన భోజనం అనేది ఒక ఆధ్యాత్మిక సంప్రదాయం, అంతే కానీ విలాస కార్యక్రమం కాదు.. వన భోజనం ఎంతో పవిత్రంగా ఆధ్యాత్మిక దృష్టితో పాటించాలి కానీ కులాల ప్రాతిపదిక మీద చేయరాదు . ఈ నవ సమాజంలో ఎవరి కులాల సంఘాలు వారి వారి కులాల వారిని కలుపుకుని వనభోజనానికి వెళ్తున్నారు . ఇది సరి అయిన పద్దతి కాదు. వనభోజనం అనే సాప్రదాయం సమాజం లోని అన్ని కులాల వారిని అన్ని వర్గాల వారిని కలపడానికి ఉపయోగించాలి అంతే కాని మరే ఇతర ప్రయోజనాలకి వాడకూడదు .
వన భోజనం అనేది కార్తీక మాసం లో చేయవలసిన ఒక ధర్మం , ఒక సంప్రదాయం . వనభోజనాల ముఖ్యోద్దేశ్యం సంఘం లోని జనులందరూ కలిసి మెలసి వుండాలని , ఒకరికొకరు పరిచయం అవ్వాలని , మరియు ఒకరికొకరు పరిచయం అవడం వలన మానవ సంబంధ బాంధవ్యాలు పెంపొంది సఖ్యతతో కూడిన సంఘ జీవనం కొనసాగించాలనేది ప్రధాన ఉద్దేశ్యం .
బంధు మిత్రులతో కలిసి వన భోజనానికి వెళ్ళడం వలన బహుళ ప్రయోజనాలు కలవు . ఈ కలియిక వలన పిల్లలకు తమ తమ ఇరుగు పొరుగు వారి పేర్లు వారి ప్రతిభా పాటవాలు తెలుస్తాయి, ఈ వనభోజనాల్లో ఆట పాటల పోటీలు పెట్టడం వలన పిల్లల్లో వున్నా ప్రతిభ మెరుగు పడుతుంది. పిల్లలకు కూడా యాంత్రిక జీవితం లోనుండీ ఒక రోజు ఆటవిడుపు గా వుంటుంది.వనం లో భోజనానికి వెళ్ళడం వలన పిల్లలకు వృక్షాల పేర్లు వాటి వలన కలిగే ఔషధ ప్రయోజనాలు తెలుస్తాయి . పరోక్షంగా పిల్లలకు శాస్త్రీయ జ్ఞానం అందుతుంది. అలాగే పెద్దలు వంటలు చేస్తూ వుంటే పిల్లలు చిన్న చిన్న పనుల్లో సాయం చేయడం కూడా ఉత్సాహంగా ఉంటుది పిల్లలకి . కొత్త స్నేహ సంబంధాలు ఏర్పడడానికి ఈ వనభోజం అనేది ఒక సువర్ణావకాశం అని చెప్పవచ్చు . ఈ వనభోజనం వలన సమాజం లోని ప్రజల ఆహారపు అలవాట్లు ఒకరికొకరికి అవగతం అవుతాయి . బహుళ రీతిలో ప్రయోజనాలు గల వనభోజనాలను పవిత్రంగా , ఉన్నతంగా ఆచరిద్దాం ..
సర్వేజనా సుఖినో భవంతు
లోక సమస్తా సుఖినో భవంతు