ఎందరో మహానుభావులు- అందరికీ వందనాలు - భమిడిపాటి ఫణిబాబు

endaro mahanubhavulu andarikee vandanaalu

 ఈవారం ( 15/11- 21/11) మహానుభావులు

జయంతులు

 నవంబర్ 16

శ్రీ తాడేపల్లి లక్ష్మీకాంతారావు :  కాంతారావు గా ప్రసిధ్ధి చెందిన వీరు, నవంబర్ 16,1923 న కోదాడ లో జన్మించారు. తెలుగు సినిమాల్లో అనేక సాంఘిక,  జానపద, పౌరాణిక పాత్రలు ధరించారు. .. సుమారు 400 చిత్రాలలో నటించారు.

నవంబర్ 20

శ్రీ ప్రయాగ నరసింహ శాస్త్రి : వీరు నవంబర్ 20, 1909 న పెదగాడి లో జన్మించారు. ప్రముఖ ఆకాశవాణి ప్రయోక్త మరియు తెలుగు నటుడు..  బావగారి కబుర్ల ద్వారా వీరు శ్రోతలకి చేరువయ్యారు. విరు, గాడేపల్లి సూర్యనారాయణ గారు కలిసి బావగారి కబుర్లు నిర్వహించేవారు. అవి శ్రోతల జీవనంలో భాగమైపోయాయి. ' ఏమండోయ్ బావగారు ! రావాలి ! రావాలి ! ' అనే పలకరింపులు సహజమయ్యాయి. స్క్రిప్టు లేకుండా యధాలాపంగా అనర్గళంగా తన సంభాషణలతో వినోదాన్ని అందించేవారు ప్రయాగ…విజయవాడ లో  గ్రామీణ కార్యక్రమాల ప్రయోక్తగా పనిచేశారు. ఎన్నో జానపద గేయాలను పాడి, పాడించి శ్రోతల మన్ననలందుకొన్నారు. హరికథలు స్వయంగా రచించి గానం చేశారు.

2. దాసరి యతిరాజ సంపత్ కుమార్

“ ఆంధ్ర జాలరి “  DY సంపత్ కుమార్ గా ప్రసిధ్ధులు. పేదల శరీర కష్టానికి భాష్యం చెప్పే ఈ దృశ్యం- ఆంధ్ర, ఆంధ్రేతర రంగస్థలాల మీద అవతరించి,ఒక ప్రత్యేకతను సంతరించుకుని జానపద నృత్యరీతికి ప్రోదిచేసింది .అతి సామాన్యంగా కనిపించే ఈ దృశ్యం నృత్యనాటిక రూపాన్ని పొందింది సంపత్ కుమార్ మనస్సులో.కాగా,ఆంధ్రా జాలరికి పర్యాయ పదంగా సంపత్ కుమార్, ఆయనకు బిరుదుగా "ఆంధ్ర జాలరి" కలగలిసిపోయారు.

వర్ధంతులు

నవంబర్ 15

శ్రీ వేదాంతం సత్యనారాయణ శర్మ :  కూచిపూడి ప్రముఖ నృత్య కళాకారులు, రంగస్థల నటులు..ఉషాపరిణయం నాటకంలో పార్వతీ పాత్రను పోషించి స్త్రీ పాత్రధారణకు ప్రాణం పోశారు. అప్పటి నుంచి స్త్రీ పాత్రలలో రాణించారు. అభినవ సత్యభామగా సత్యనారాయణ శర్మ మంచి గుర్తింపు పొందారు. దేశ విదేశాలలో సత్యనారాయణశర్మ అనేక ప్రదర్శనలు ఇచ్చారు. ఆయన పద్మశ్రీ, కేంద్ర సంగీత నాటక అకాడమీ, ఆంధ్రప్రదేశ్‌ నృత్య అకాడమీ, భారత కళా ప్రపూర్ణ, కళాదాస్‌ సన్మాన అవార్డులను అందుకున్నారు. భామా కలాపంలో సత్యభామ, శ్రీకృష్ణుడు, సూత్రధారులనే మూడు పాత్రలతో నడిచిన శృంగార, భక్తి, జ్ఞాన, వైరాగ్య బోదకమైన ముచ్చటగొలిపే నాటక ప్రక్రియ. సత్యభామ పాత్రలు పోషించిన వారు ఆనాటి నుండి ఈనాటి వరకూ ఎందరో ఉన్నా సమకాలీనంగా గుర్తుకు వచ్చేది ఈయనే. వీరు నవంబర్ 15, 2012 న స్వర్గస్థులయారు.

నవంబర్ 17

శ్రీ గురజాడ కృష్ణదాస్ వెంకటేష్ ; ప్రముఖ సంగీత దర్శకులు.  G K  వెంకటేష్ గా ప్రసిధ్ధిచెందారు. ప్రఖ్యాత దక్షిణ భారత సినిమా సంగీత దర్శకుడు. ఈయన తెలుగు, తమిళ సినిమాలకు సంగీతము సమకూర్చినప్పటికీ కన్నడ చిత్రరంగములో 1960ల నుండి 1980ల వరకు అనేక కన్నడ సినిమాలకు సంగీతం సమకూర్చారు.. ఒక సాంఘిక సినిమా కన్నడ నాట ఒకే థియేటర్లో ఒకే రోజు మూడు ఆటల చొప్పున సంవత్సరానికి మూడు మాసాల పాటు ఏకథాటిగా నడిచింది. ఆ సినిమా పేరు బంగారద మనష్య, ఈ సినిమాకు సంగీతదర్శకుడు జి.కె.వెంకటేషే. ఈ సినిమాను తెలుగులో బంగారు మనిషిగా తిరిగి తీశారు. వీరు నవంబర్ 17, 193 న స్వర్గస్థులయారు.

నవంబర్ 19

శ్రీ మద్దిపట్ల సూరి  :  ప్రముఖ రచయిత, అనువాదకుడు మరియు సాహితీవేత్త. 1993 లో సాహిత్య అకాడమీ అనువాద బహుమతి వీరికి ఇచ్చారు. అనువాద కోవిదాగ్రణిగా ప్రసిద్ధులయిన “మద్దిపట్ల సూరి”  అనేక సుప్రసిద్ధనవలలు బెంగాలీ, హిందీ భాషలనుండి తెలుగులోకి స్వతంత్ర నవలలు అనిపించేంత సహజంగా అనువాదాలు చేసి అనువాద కోవిదాగ్రణి అని పేరు పొందారు. వీరు నవంబర్ 19, 1995 న స్వర్గస్థులయారు.

2.శ్రీ పులికంటి కృష్ణారెడ్డి  : కథకుడు, కవి, రంగస్థల కళాకారుడు, బుర్రకథ గాయకుడు.. ఆయన దాదాపు 200 కథలు, 60 వచన కవితలు, 5 దృశ్యనాటికలు,  శ్రవ్యనాటికలు, పది బుర్రకథలు, 4 సంగీత రూపకాలు, జానపద 43 అమ్మిపదాలు, 60 లలిత గేయాలు రాసారు.. రాయల సీమ జీవన వ్యథల్ని దాదాపు 200 కథలుగా వెలువరించిన ఈయన గూడుకోసం గువ్వలు, పులికంటి కథలు, పులికంటి దళిత కథలు, పులికంటి కథావాహిని సంపుటాలను తెచ్చారు.. వీరి కథలు ఇంగ్లీషు, తమిళం, మలయాళం, హిందీ, కన్నడ భాషలలోకి అనువదించబడ్డాయి.. వీరు నవంబర్ 19, 2007 న స్వర్గస్థులయారు.

నవంబర్ 21
శ్రీ బెల్లంకొండ సుబ్బారావు :  ప్రముఖ రంగస్థల నటుడు, న్యాయవాది..  శ్రీకృష్ణ పాత్రధారణలో వీరి నటన తారాస్థాయినందుకుంది.చక్కగా పద్యం విడమరిచి పాడడం, నాభి దగ్గరనుండి నాదాన్ని తీసుకురావడం, పద్యంలోని ముఖ్య పాదాన్ని తిరిగి తిరిగి చదవడం వీరి ప్రత్యేకత.కృష్ణుడు వేషంమీద మీసాలు పెట్టుకుంది వీరొక్కరే.అందుకనే వీరిని మీసాల కృష్ణుడు అనేవారు. శ్రీకృష్ణుని పాత్రకు మీసాలు పెట్టవచ్చా, పెట్టకూడదా అనే సమస్యపై అంధ్రదేశంలో తర్జన భర్జనలకు గురికావడానికి వీరి మీసాలే కారణం. కృష్ణపాత్రకు అంకితమైపోయిన నటుడు. వీరు నవంబర్ 21, 1952 న స్వర్గస్థులయారు.

మరిన్ని వ్యాసాలు

vennela vaanalo manam
వెన్నెల వానలో మనం ...
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
Guru geetha prasasthyam
గురు గీత ప్రాశస్త్యం
- సి.హెచ్.ప్రతాప్
కల్పవృక్ష వినాయక స్వరూపం శిల్పి
కల్పవృక్ష వినాయక స్వరూపం శిల్పి
- కుందుర్తి నాగబ్రహ్మాచార్యులు
సంత్ నరహరి సోనార్
సంత్ నరహరి సోనార్
- కుందుర్తి నాగబ్రహ్మాచార్యులు
మా చార్ధామ్ యాత్ర
మా చార్ధామ్ యాత్ర
- కర్రా నాగలక్ష్మి