గాలి, నీరు, నిప్పు, భూమి, ఆకాశం.. పంచభూతాలుగా అభవర్ణిస్తాం. వీటిలో అన్నింటికీ రేటు కట్టేశారు. ఒక్క గాలికి తప్ప. ఆ గాలి కూడా ఇప్పుడు భారమైపోయింది. కొనుక్కునే పరిస్థితి వచ్చేసింది. అప్పుడెప్పుడో ఈ పరిస్థితిని ఊహించే తన కాలజ్ఞానంలో పొందుపరిచేశారు వీర బ్రహ్మంగారు. ఇప్పుడా పరిస్థితిని రియల్‌గా చూస్తున్నాం. దేశ రాజధాని ఢిల్లీలో పెరిగిపోయిన కాలుష్యం కారణంగా అక్కడి గాలి దారుణంగా కలుషితమైపోయింది. బయటికి వచ్చి గాలి పీల్చుకోలేనంతగా. విద్యా సంస్థలు వంటి కొన్ని వర్కింగ్ సంస్థలకు అక్కడి ప్రభుత్వం సెలవులు ప్రకటించింది. కాలుష్యం కారణంగా ప్రకటించిన సెలవులు ఇవి. సహజంగానే ఈ సీజన్‌లో ఢిల్లీలో కాలుష్యం ఎక్కువగా ఉంటుంది. అది కాస్తా శృతి మించిపోయిందిప్పుడు. అత్యవసరమై బయటికి రావల్సి వస్తే, మాస్క్‌లు ధరించాలని ఆదేశాలు వెలువడ్డాయి.
ఈ పరిస్థితుల్లో వాతావరణంలో ఆక్సిజన్ అస్సలు లభించడం లేదు. దాంతో ఆక్సిజన్ అమ్మకాలు మొదలైపోయాయి. గ్రాములు, కేజీల లెక్కల్లో రేట్లు ఫిక్స్ చేసి, ఆక్సిజన్‌ని అమ్మకానికి పెట్టేశారు. దేశ రాజధాని ఢిల్లీలోనే పరిస్థితి ఇలా ఉంటే, ఇక కాలుష్య కోరల్లో ఉన్న హైద్రాబాద్, విజయవాడ తదితర ఇతర మహా నగరాల పరిస్థితి ముందు ముందు ఎలా ఉండబోతోందో తలచుకుంటేనే కష్టంగా ఉంది. ప్రభుత్వాలు చెట్లను పెంచాలంటూ నినాదాలు చేస్తున్నాయి. ఇంటికో మొక్క అంటూ చెట్ల పెంపకంపై జనాన్ని చైతన్యవంతుల్ని చేస్తున్నాయి. కానీ, అభివృద్ధి పేరుతో ఆ ప్రభుత్వాలే చెట్లను నరికేస్తున్నాయి. ఒక మొక్కను నాటి, దాన్ని చెట్టుగా పెంచడానికి చాలా ఏళ్ల సమయం పడుతుంది. కానీ, రోడ్లకిరువైపులా ఏపుగా పెరిగిన చెట్లను కొన్ని క్షణాల్లోనే నరికి, కాంక్రీట్ జంగిల్స్ పెంచడానికి కొద్ది నెలలు మాత్రమే సమయం పడుతోంది. అభవృద్ధి పేరుతో జరుగుతున్న వినాశనం ఇంత త్వరగా జరుగుతుంటే, వినాశనాన్ని అరికట్టే పచ్చదనం అభవృద్ధికి కొన్ని జనరేషన్ల కాలం పడుతుంది. ఈ చిన్న విషయాన్ని మన ప్రభుత్వాలు పట్టించుకోవడం లేదు. స్టేజ్‌లు ఎక్కి ఉపన్యాసాలు ఇవ్వడం, చెట్లు నాటుతున్నట్లుగా ఫోటోలకి పోజివ్వడం వంటి వాటిపై పెడుతున్న దృష్టి, నాటిన చెట్లను సంరక్షించడంలోనూ, ఉన్న చెట్లను కాపాడడంలోనూ పెడితే, కొంతలో కొంతైనా రానున్న వినాశనాన్ని ఆపే అవకాశం ఉంటుంది.
ప్రస్తుతం నెలకొన్న పరిస్థితి ఇలాగే కొనసాగితే, మరో ఏడాదిలోనే ఈ భూమిపై ఉన్న ఆక్సిజన్ జీరో లెవల్‌కి పడిపోయి, ఆ ప్లేస్‌లో ఆర్టిఫిషియల్ ఆక్సిజన్‌తో లిమిటెడ్ లైఫ్‌ని లీడ్ చేయాల్సి వస్తుంది. ఇప్పటికే నూరేళ్ల జీవిత కాలం కాస్తా, ఆరు పదులకు పడిపోయింది. ఇక కొనుకున్న ఆక్సిజన్‌తో ఆర్టిఫిషియల్‌గా మనిషి మనుగడకు జీవిత కాలం లెక్కిచేదెలా.? పెరుమాళ్లకెరుక.