మానవ శరీరం అనేక అంగాలతోనూ,అంగ విభాగాలతోనూ నిర్మితమై ఉంటుంది. ప్రతి అంగానికి -అంగ విభాగానికి ప్రత్యేకమైన క్రియతో సంబంధాన్ని కలిగి వుండి శరీరనిర్మాణం, దాని విధులపై పట్టుకలిగి అవసరమైన పనుల పైనా, అనవసరమైన పనులపైనా నియంత్రణ చేసే స్వభావాన్ని కలిగి ఉంటాయి. ఆరోగ్యవంతుడైన మనిషి లోని అన్ని అంగాలూ, అంగ విభాగాలు సక్రమంగా తమ విధులను నిర్వర్తిస్తుంటాయి. వీటి విధి నిర్వహణలో ఏమాత్రం లోటు వచ్చినా శరీరం అనారోగ్యానికి గురికావడం ఖాయం. అందుచేత , శరీరంలో ప్రతి అంగం అంగ విభాగం నిర్వర్తించే విధులు.
మరో అంగం - అంగ విభాగం నిర్వర్తించే విధులతో సంబంధాన్ని కలిగి ఉంటాయి. మెదడు, కళ్ళు, గుండె, ఊపిరితిత్తులు, చెవి - ముక్కు - గొంతు నాలుక, కాళ్ళు - చేతులు, మూత్రపిండాలు,కాలేయం ,రక్తనాళాలూ ఇలా అన్నీ కూడా తమకు నిర్ధేశించబడిన విధులను సక్రమంగా నిర్వహిస్తూ శరీరాన్ని ఆరోగ్యంగా వుంచగలుగుతున్నాయి. వాటిల్లో ఎక్కడ, ఏ మాత్రం తేడా వచ్చినా, దాని ప్రభావం శరీరం మీద వుండి ఆ శరీరం అనారోగ్యం పాలవుతుంది. దంతాలు, వీటికి ఏమాత్రం అతీతం కాదు. వాటి అవసరమూ, ప్రాధాన్యత ను బట్టి దీనికి సంబంధించిన ఒక ప్రత్యేక విభాగాన్ని సృష్టించడం జరిగింది. దీనినే దంత వైద్య విభాగం అన్నారు. దీనిలో దంతాలకూ శరీరంలోని ఇతర భాగాలకు గల సంబంధాన్ని కూడా సవివరంగా వివరించబడుతుంది. వ్యాధిగ్రస్తమైన పళ్ల వల్ల, వాటికి సంభంధించిన విష పదార్ధాలు రక్తం ద్వారా ఇతర శరీర భాగాలకు వ్యాపించి అనారోగ్య సమస్యలు తలెత్తుతాయి.
అందుచేత, పళ్ళ వల్ల జరిగే ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని, తక్షణం రెండు వాటి సంరక్షణ, అవసరం ప్రత్యేకంగా గుర్తించబడింది. పంటి ప్రాముఖ్యతను దృష్టిలో ఉంచుకుని పంటి ఉపయోగాలను మూడు ముఖ్య భాగాలుగా విడదీసినారు. అవి నమలడం స్వచ్ఛమైన మాట, సౌందర్యం ఈ మూడు ప్రక్రియలను బట్టి దంతాల అవసరం ఎంతటిదో మనకు అర్ధం అవుతుంది. నమలడం అనే ప్రక్రియ రెండు దవుడలలో వుండే విసురుడు దంతాల (మొలర్స్) కలయిక ద్వారా జరుగుతుంది. పై దవుడ దంతాలు స్థిరంగా కదలకుండా ఉంటాయి. పై దవుడ కదలకుండా, పుర్రెకు అతుక్కొని ఉండడమే దీనికి కారణం. క్రింది దవుడ దంతాలు మాత్రం క్రిందికి, పైకి, ముందుకీ, వెనుకకి కదులుతుంటాయి. కీలు సహాయంతో క్రింది దవుడ కదిలే శక్తిని కలిగివుంటుంది. ఈ కదలికలన్నీ,ముఖంలో ఇరుపక్కలావుండే,కండరాల ఆధీనంలో ఉంటాయి. అందు చేత ఇలా నమలడానికి ,సహకరించే కండరాలను ‘మజిల్స్ -ఆఫ్ మాస్టికేషన్’ అంటారు. ఈ నమిలే విధానాన్ని ‘మాస్టికేషన్’(మస్తిచతిఒన్ )అంటారు. ఈ నమలడం అనే ప్రక్రియ వల్ల ,మనం తీసుకునే ఆహార పదార్ధాలు మెత్తగా నోటిలో నమలబడి,పొట్టలో అనేక ఎంజైముల చర్యవల్ల ఆహార పదార్ధాలు చక్కగా జీర్ణం కాబడి శరీరానికి కావలసిన శక్తినీ రక్తాన్నీ అందిస్తాయి. అందుచేత ప్రతి మనిషికీ నమలడం అనే ప్రక్రియ జీవితాంతం వరకూ అత్యంత అవసరమే. అందు చేతనే మన దంతాల విషయంలో,ముఖ్యంగా దంతసంరక్షణ విషయంలో ,పాల పళ్ళ స్థాయినుండి అప్రమత్తంగా వుండ వలసిందే !
పద ఉచ్చారణ - మనిషి సంఘ జీవి. ఒకరి అవసరం మరొకరికి ,ఏదో ఒక విషయంలో ఏదో ఒక సందర్భంలో తప్పక వుంది తీరుతుంది. అలాంటి సమయంలో మనసులోని మాటను వ్యక్త పరచాలంటే ,మాట్లాడగల గాలి. స్పష్టమైన పద ఉచ్చారణతో ,ఎదుటి వ్యక్తికి అర్ధమయ్యే రీతిలో చెప్పగలగాలి. ఈ నేపథ్యంలో కొన్ని పదాలు (దంత్యములు ) పళ్ళు లేకుంటే స్పష్టంగా పలకలేని పరిస్థితి ఉంటుంది. దవుడ లలో పళ్ళు ఉన్నవారు-అలాగే పళ్ళులేనివారు మాట్లాడుతున్నప్పుడు ఎవరైనా ఈ విషయాన్నిచక్కగాగ్రహించ గలర.అందుచేత స్పష్టమైన పద ఉచ్చారణకు ఆరోగ్యవంతమైన దంతాల అవసరం వెల కట్టలేనిది దవుడ లలో,దంతాలు పూర్తిగా లేకపోయిన పాక్షికంగా కోల్పోయినా మాట్లాడే మాటల్లో స్పష్టత కరువు అవుతుంది .ఈసమస్యను అధిగమించడానికి ఎన్నోఆధునిక చికిత్సాపద్ధతులు, ఇప్పుడు మనకు అందుబాటులోనికి వచ్చాయి.
సౌందర్యం
అందం చూడవయా .. ఆనందించవయా .. ‘ అన్నారు. అందాన్ని ఆస్వాదించని వారు,అందాన్ని కోరుకొని వారు,అందం కోసం తాపత్రాయం పాడనీ వారూ ఎవరూ వుండరు. యెంత కురూపి అయినా ఉన్నదాంట్లో అందంగా కనిపించడానికి ప్రయత్నం చేస్తారు. ఈ నేపథ్యంలో ముఖారవిందానికి దంతాల పాత్ర అంతా -ఇంత నినాలుగు చెప్పలేము. వృద్ధాప్యంలో పళ్ళు కోల్పోతే ఎవరూ పెద్దగా పట్టించుకోరు గాని ,యవ్వనంలోనూ ,నడి వయస్సులోనూ ,పూర్తిగా గానీ పాక్షికంగా గానీ,దంతాలను కోల్పోయినా ,అనుకోని రీతి లో పళ్ళు విరిగి పోవడం,అతిగా తోమడం వల్ల పళ్ళు అరిగిపోవడం , ప్రమాదాలలో దెబ్బలు తగిలి పళ్ళు చచ్చుపడిపోవడం,ఫ్లోరోసిస్ వంటి సమస్యల వల్ల పళ్ళ రంగు మారిపోవడం వంటి సమస్యలు ఉత్పన్నమైనప్పుడు ,ఎత్తు పళ్ళు ,ఎగుడు దిగుడు పళ్ళు ,వంకర -టింకర పళ్ళువంటి సమస్యలు ఎదురైనప్పుడు ,ముఖం అంద విహీనంగా తయారవుతుంది.
ఈ సమస్యల వ ల్ల,అందవిహీనంగా కనిపించడమేకాక ,ముఖ్యంగా యవ్వనంలో వున్న ఆడ పిల్లలు మానసికంగా ఎంతగానో కృంగిపోతారు. ఇలాంటి సమస్యలకు చాలంజింగ్ గా ఈ రోజున దంత వైద్య రంగంలో అత్యాధునిక చికిత్సా విధానాలతో కూడిన ‘ సౌందర్య దంత చికిత్సా-విధానాలు ‘అందుబాటు లోనికి వచ్చాయి. ఇవి సామాన్యుడికి అందని ద్రాక్షపండ్లే అయినప్పటికీ ,కలవారికి మాత్రం కలిసొచ్చిన అదృష్టం గానే భావించాలి. ఎలాంటి చింతా లేకుండా సకాలంలో గుర్తించ లేనంతగా అందమైన పలువరుసను పొందవచ్చు. అంత మాత్రమే కాదు,అందం మాత్రమే కాకుండా,స్వచ్ఛంగా స్పష్టంగా మాట్లాడే అవకాశం కలుగుతుంది. మానవ జీవితంలో దంతాల పాత్ర /వాటి అవసరం అవగాహన చేసుకున్నాక,బాల్యమునుండి చివరి క్షణాల వరకూ దంతాలను సంరక్షించుకోవలసిన బాధ్యత మనదీ ,బాల్యంలో సంరక్షకులదీ ,తల్లిదండ్రుల దీను !
********
పాఠకులకు గమనిక: మీకెలాంటి దంత సమస్యలు/సందేహాలు వున్నా తగు సలహాలు, సూచనలు అందివ్వడానికి వ్యాసకర్త దంతవైద్యులు డాక్టర్ ఎల్.వి.ప్రసాద్ కానేటి గారు అంగీకరించారని తెలియజేయడానికి సంతోషిస్తున్నాము. మీ సందేహాలను గోతెలుగుకి మెయిల్ చేస్తే మేము డాక్టర్ గారికి అందించగలము..మీరు పంపవలసిన మెయిల్ ఐడీ.. [email protected]