కర్నాటక తీర్థయాత్రలు / విహారయాత్రలు - కర్రా నాగలక్ష్మి

karnataka teerdhayatralu

( గోకర్ణ )

కర్నాటక లోని ఉత్తరకన్నడ జిల్లాలో వున్న మరో ప్రసిధ్ద మందిరం గురించి ఈ వారం తెలుసుకుందాం. ణ్ -17 బొంబాయి మంగళూరు హై వే ని ఆనుకొని అరేబియా సముద్రపు వొడ్డున వున్న గోకర్ణ గ్రామం లో వున్న మహాబలేశ్వర మందిరం గురించి తెలుసుకుందాం . మేంగళూరు నుంచి సుమారు 256 కిలోమీటర్లు , బెంళూరునుంచి సుమారు 460 కిలోమీటర్ల దూరంలోను వుంది యీ ప్రసిధ్ద గ్రామం, గోకర్ణకి దగ్గరగా వుండే విమానాశ్రయం గోవా విమానాశ్రయం సుమారు 155 కిలోమీటర్ల దూరంలో వుంది .

గోకర్ణ కి రైల్వే స్టేషను వుంది , చాలా ఎక్సప్రెస్ రైళ్లు యిక్కడ ఆగుతాయి , సుమారు 56 కిలో మీటర్ల దూరంలో వున్న ‘ కార్వార్ ‘ స్టేషనులో అన్ని రైళ్లూ ఆగుతాయి , బొంబాయి , మంగళూరు హైవే చాలా మటుకు సముద్రపు వొడ్డునుంచి వెళుతుంది , కార్వారు దాటాక యెత్తైన కొండలమీద సాగుతుంది ప్రయాణం . కొండలమీంచి సముద్రాన్ని చూస్తూ ప్రయాణించడం చాలా అహ్లాదకరంగా వుంటుంది . కార్ వార్ బీచ్ తరువాత గోకర్ణకి దగ్గరగా ‘ ఓం ‘ బీచ్ ఈ మధ్య పర్యాటకులను ఆకట్టుకుంటోంది . గోవా బీచ్ లలో రద్దీ పెరగడం వల్ల పర్యాటకులు నిశ్సబ్దంగా వుండే ఓం బీచ్ లో గడపడానికి యిష్టపడుతున్నారు . ఓం బీచ్ కి ఓ ఐదు కిలోమీటర్ల దూరం నుంచి కొండలపైనుంచి చూస్తే సంస్కృత ‘ ఓం ( ऊं ) ‘ అక్షరంలా కనబడుతుంది . అందుకే దీనిని ఓం బీచ్ అని అంటారు . ఇక గోకర్ణ విషయానికి వస్తే కొత్తపోకడలు సోకని చిన్న ముచ్చటైన వూరు , చుట్టూ వరిపొలాలు వూరికి రెండువైపులా గంగావళి , అఘనాసిని నదులు ప్రవహిస్తున్నాయి . ఈ మధ్య విదేశీ పర్యాటకులు బీచ్ లకోసం రావడం ఎక్కువవడం వల్ల వారికోసం కొత్తగా హోటల్స్ రెస్టొరాంట్స్ మొదలయేయి . కాని యింకా గాలి స్వఛ్చంగా వుండడం వల్ల గోకర్ణయొక్క పవిత్రత అలాగేవుంది . కోవెల గురించి తెలుసుకునే ముందు గోకర్ణ అనే పేరు ఆ వూరికెలా వచ్చిందో , కోవెల స్థలపురాణం తెలుసుకుందాం .  గోకర్ణాన్ని ‘ భూలోకంలో వెలసిన కైలాసం ‘ అని కూడా అంటారు .

రావణబ్రహ్మ తల్లి ‘ పుష్పోత్కట ‘ తన నివాసంలో శివలింగాన్ని ప్రతిష్టించి నిత్యార్చన చేస్తూ వుంటుంది , ఆమె శివభక్తికి ముల్లోకాలూ కంపించసాగేయి . దేవలోకానికి నష్టం వాటిల్లుతుందని భయపడిన ఇంద్రుడు శివలింగాన్ని పెకిలించి సముద్రంలో పడవేస్తాడు . శివలింగం కానరాక విలపిస్తున్న తల్లిని చూచి రావణుడు స్వయంగా శివునినే తెచ్చి యిస్తానని మాటయిచ్చి కైలాశానికేగి శివుని కొరకై తపస్సు చేసి శివుని మెప్పిస్తాడు . విష్ణమూర్తి రావణుని కోరిక అవగతడంతో శివుడు లంకానగరానికి తరలిపోతాడని భయపడి శివుడు ప్రత్యక్షమయినపుడు రావణునిచే పార్వతి కావాలని అడిగిస్తాడు . విష్ణుమాయలో పడ్డ రావణుడు పార్వతినీయమని అడుగుతాడు . చేసేదిలేక శివుడు పార్వతిని రావణునితో పంపుతూ కన్నెత్తి అమ్మవారిని చూడరాదనే షరతు విధిస్తాడు , నారదుడు రావణునికి యెదురుపడి యెవతెనో వెంటపెట్టుకు పోతున్నావేమని  ప్రశ్నిస్తాడు . ఎవతో కాదు ఆమె పార్వతి అని జవాబిస్తాడు రావణుడు , పార్వతిని నేనెరుగనా ? ఈమె పార్వతికాదు అంటాడు నారదుడు , రావణుడు పార్వతిని చూడడానికి ప్రయత్నించగా శివుని షరతుకి భంగం వాటిల్లడంతో పార్వతి అదృష్యమైపోతుంది . తనతో వచ్చినది పార్వతి కాకపోతే మరి పార్వతి యెక్కడవుందని అడిగిన రావణునితో పార్వతి పాతాళలోకంలో దాగుందని చెప్తాడు నారదుడు పాతాళ లోకానికి వెళ్లిన రావణుడు కనిపించిన మండోదరిని వివాహమాడి లంకానగరానికి వెళ్లి హాయిగా కాలంగడుపుతూ వుంటాడు . కొన్నేళ్లతరువాత విష్ణమాయ తొలగిపోయి జరిగిన మోసం గ్రహించుకొని తిరిగి కైలాశానికి వెళ్లి తపస్సు చేస్తాడు , శివుడు ప్రసన్నుడు కాకపోతే తన శిరస్సును ఖండించుకొని ఆ తలకు తనపేగులను తీగలుగా పేర్చి ఆ వీణపై శివతాండవ స్తోత్రం ఆలపించగా ముల్లోకాలూ అల్లకల్లోలమవుతాయి , శివునికి  ప్రత్యక్షమవక తప్పలేదు . రావణాసురుడు శివుని లంకకు రావలసినదిగా ప్రార్ధిస్తాడు , శివుడు తన ఆత్మలింగాన్ని రావణుడికి యిచ్చి ఆలింగం నేలను తాకిన మరుక్షణం అక్కడే స్థాపితం అవుతుందని చెప్తాడు .

సంధ్యా సమయం లోపల లంకచేరాలనే తొందరలో రావణాసురుడు వాయువేగం తో పయనిస్తూ వుంటాడు . విష్ణమూర్తి సూర్యునకు చక్రం అడ్డుగా వేస్తాడు , సూర్యకిరణాలకు చక్రం అడ్డుగా వుండడంతో సాయంకాలమైనట్లుగా కనిపిస్తుంది . రావణుడు సంధ్యవార్చుకొనే సమయం అవడంతో శివలింగాన్ని క్రిందపెట్టలేక గోవులను కాచుకొనే కుర్రాణ్ని చూసి లింగాన్ని పట్టుకోమని చెప్తాడు , గొల్లవాని రూపంలో వున్న వినాయకుడు నేను మోయలేకపోతే ముమ్మారు పిలుస్తాను , మూడోసారి పిలచిన తరువాత లింగాన్ని క్రిందపెట్టెస్తాను అని చెప్తాడు . సరేనన్న రావణుడు సముద్రంలో స్నానంచెయ్యడానికి వెళతాడు . ఓ మునకవేసేసరికి పిల్లవాడు రావణా అని పిలుస్తాడు , మరో మనక వేసేసరికి రెండోపిలుపు మూడో మునకకి మూడోపిలుపు  పిలుస్తాడు , రావణాసురుడు వచ్చేలోపల వినాయకుడు శివలింగాన్ని క్రిందపెట్టి పారిపోయి కొద్దిదూరంలో శిలగా మారిపోతాడు . కోపంతో రావణాసురుడు వినాయకుని శిలపై గట్టిగా మొట్టుతాడు , ఆదెబ్బకు శిలపై రంధ్రం యేర్పడింది , వినాయకుడు  కాస్తున్న గోవులమంద పాతాళానికి వెళ్లిపోతూ వుండగా కోపంలో వున్న రావణుడు గోవులను పట్టుకోడానికి ప్రయత్నించగా ఆఖరిగోవు యొక్క చెవి చేతికి దొరకగా దానిని బలంగా పైకిలాగి పడేసాడట , గోవుయొక్క చెవి పడ్డ ప్రదేశం కాబట్టి అది గోకర్ణంగా పిలువబడుతోంది .

అందుకే గోకర్ణంలో శివకోవెల వెలుపల వున్న వినాయకుని ముందుగా దర్శంచుకుంటారు . తిరిగి శివలింగం వద్దకు వచ్చిన రావణాసురుడు లింగాన్ని పెకిలించే ప్రయత్నం చేస్తాడు కాని ఆలింగం పెరుగుతూ పెరుగుతూ పెద్దగా అవుతుంది . చేసేదిలేక రావణాసురుడు వట్టి చేతులతో లంకానగరం చేరుకుంటాడు . రావణుడు పెకలించలేకపోయిన లింగం కాబట్టి దీనికి మహాబలేశ్వరుడు అనే పేరు వచ్చింది . ఈ కోవెల 4 వ శతాబ్దంలో కదంబ వంశానికి చెందిన మయూరశర్మ చే నిర్మింపబడింది , ఈ కోవెలలో వేదపఠనం , అశ్వమేధయాగం చేయించాలని తలచిన మయూరశర్మ కాంచీపురానికి ( ఆ కాలంలో కాంచీపురాన్ని పల్లవరాజులు పరిపాలిస్తున్నారు ) వేదశాస్త్రాలు అభ్యసించాలని వెళ్లగా అక్కడి బ్రాహ్మణులు అతనిని హేళనచేస్తారు . అవమానభారంతో మయూరశర్మ తనరాజ్యానికి వెళ్లిపోతాడు , ఆకోపంతో  మహాబలేశ్వరుని వద్ద ఆశీస్సులు పొంది పల్లవును ఓడించి కాంచీపురాన్ని కదంబ రాజ్యంలో కలుపుకుంటాడు .  దేశదేశాలనుంచి వేదపండితులను రప్పించి వారికి అనేక మాన్యాలు యిచ్చి గోకర్ణంలో వారికి నివాసంయిచ్చి ప్రతీరోజూ మహాబలేశ్వరునికి వేదమంత్రాలతో పూజలు ,  ప్రతీరోజూ యజ్ఞం నిర్వహించవలసినదిగా ఆబ్రాహ్మణులను కోరుతాడు , అదే ప్రకారంగా ఈ నాటికి కూడా పూజాదులు నిర్వహించబడుతున్నాయి , గర్భగుడికి యెదురుగా మండపంలో వున్న యజ్ఞకుండం లో యజ్ఞం జరుపుతూవుంటారు . మహాకవి కాళిదాసు తన సంస్కృతగ్రంధమైన రఘువంశంలో గోకర్ణం గురించి , మహాబలేశ్వరుని మందిరం గురించి రచించేడు .14వ శతాబ్దంలో విజయనగర సామ్రాజ్యాన్ని పరిపాలించిన రాజులు ఈ మందిరంలో తులాభారంలో బంగారం యిచ్చినట్లు , 16వ శతాబ్దంలో ‘ శివాజీమహరాజ్ ‘ తన సైన్యంతో యీప్రాంతాలలో ప్రయాణిస్తూ ఈ మందిరాన్ని దర్శించుకున్నట్లు , 17 వ శతాబ్దంలో రాణీ చెన్నమ్మ , ఆమె పుతృడు సోమశేఖర నాయకరులు మహాబలేశ్వరుని దర్శించుకొని యెన్నో విలువైన కానుకలు యిచ్చినట్లుగా కోవెల చరిత్రలో లిఖించబడింది .

‘ హొసలనాడు ‘ కుందాపుర రాజు విశ్వేశ్వరాయ మందిరంలోని ‘ చంద్రశాల , నందిశాలలు నిర్మించేడు . గర్భగుడిలో పెద్దగట్టు మీద శివలింగం వుంటుంది , గట్టుకున్న రంధ్రంలోంచిచూస్తే లోపలవుండే ఆత్మలింగం కనిపిస్తుందట , గర్భగుడిలోకి వెళ్లదలచుకొన్నభక్తులు ఉపవాస దీక్షలో వుండి అరేబియా సముద్రంలో స్నానం చేసుకొని తడిపంచతో ముందుగా వినాయకుని మందిరంలో వినాయకుని పూజించుకొని తరువాత గర్భగుడిలోని శివలింగానికి అర్చనలు చేసుకోవచ్చు , లేనివారు దూరంనుంచి దర్శించుకొని వెనుతిరగాలి . గర్భగుడిలో  రెండు చేతులతో నిలుచొని వున్నట్లుగా రాతితో చెక్కిన శివుని విగ్రహం వుంటుంది , ఈ విగ్రహం సుమారు 1500 సంవత్సరాల క్రిందటిదని నిర్ణయించేరు .  శివలింగానికి యెదురుగా హోమకుండం , పక్కగా గోశాల వుంటాయి , మందిరం అంతా ద్రవిడ శిల్పకళతో కట్టిన రాతి కట్టడం .

మహాబలేశ్వరుని కోవెలకు వెళ్లే దారిలోనే వుంటుంది వినాయకునికి కట్టిన పెద్ద మందిరం . ఇక్కడ వినాయకుని విగ్రహం అయిదడుగుల యెత్తుంటుంది , మహాగణపతి మందిరం , సిద్దగణపతి మందిరం అని అంటారు . కోటి తీర్థం అనే పుష్కరిణి మందిరానికి కాస్త దూరంలో వుంటుంది . ఇందులో భక్తులు స్నానాలుచేసుకొని పితృదేవతలకు పిండప్రధానాలు చేస్తూ వుంటారు .

గోకర్ణాన్ని దక్షిణ కాశి అని కూడా అంటారు . దీనిని ముక్తి క్షేత్రమని కూడా అంటారు , ఇక్కడ పిండప్రధానం చేస్తే జీవుడు ముక్తిపొంది కైలాశాన్ని చేరుకుంటాడని అంటారు . గోకర్ణ దగ్గర వున్న బీచులన్నీ యెంతో ప్రశాంతంగా వుంటాయి , ఈ మధ్యకాలంలో యీ బీచ్ లు యెంతో మంది పర్యాటకులను ఆకర్షిస్తున్నాయి . ఓం బీచ్ ముఖ్యంగా చూడదగ్గది . గోకర్ణం చుట్టుపక్కల వున్న కొండలలో ‘ గో గర్భ ‘ అనే గుహ వుంది , ఇక్కడే వినాయకుడు కాచుతున్న గోవులు పాతాళంలోకి ప్రవేశించిన ప్రదేశమని అంటారు . గోగర్భ గుహలలో యిప్పటికీ సాధువులు సాధనకోసం వస్తూ వుంటారు . ఈ గుహలో చేసే సాధన ఫలిస్తుందని వారి నమకం . ఓ రెండుగంటల ముందు చెప్తే డబ్బులు తీసుకొని భోజనాలు పెట్టే యెన్నో బ్రాహ్మణ కుటుంబాలు వున్నాయి , మడిగా సుచిగా వండిపెడతారు .ఇక్కడ శివరాత్రి ఉత్సవాలు చాలా బాగుంటాయని అంటారు , ప్రతీ యేడూ మహాబలేశ్వరుడికి రథాయాత్ర నిర్వహిస్తారు . ఈ మందిరంలో జరిగే శివరాత్రి వుత్సవాలను గురించి 16 వ శతాబ్దానికి చెందిన ప్రాయటకుడు చాలా గొప్పగా గరాసేడని చరిత్ర . గ్రామం మొదట్లో వుండే భద్రకాళి అమ్మవారిని గ్రామాన్ని రక్షించేందుకు శివుడు నియమించేడని అంటారు . ఇవి గోకర్ణం లో చూడదగ్గ ప్రదేశాలు .

వచ్చేవారం మరో ప్రదేశంలో వహరిద్దాం, అంతవరకు శలవు .

మరిన్ని వ్యాసాలు

వివేకానంద రాక్ మెమోరియల్ స్థపతిశ్రీ.ఎస్.కె ఆచార్య
స్థపతిశ్రీ.ఎస్.కె ఆచార్య
- కుందుర్తి నాగబ్రహ్మాచార్యులు
రాజస్తాన్ ప్రాంత నిర్మాణ విశేషాలు
రాజస్తాన్ ప్రాంత నిర్మాణ విశేషాలు
- కుందుర్తి నాగబ్రహ్మచార్యులు
Kanyakumarilo vunna tiruvalluvar vigraham nirmana charitra
తిరువళ్లువర్ విగ్రహం నిర్మాణ చరిత్ర
- కుందుర్తి నాగబ్రహ్మాచార్యులు
శ్రీసాయి లీలామృతం
శ్రీసాయి లీలామృతం
- సి.హెచ్.ప్రతాప్
మా చార్ధామ్ యాత్ర-2
మా చార్ధామ్ యాత్ర-2
- కర్రా నాగలక్ష్మి