అమ్మ భాష !!! - కొత్తపల్లి ఉదయబాబు

amma bhasha

జన్మించిన ప్రతీ జీవికి ఆది గురువు ‘అమ్మ’. ఆ అమ్మ తన పిల్లలకు నేర్పే భాషే ‘అమ్మ భాష’ . అదే ఆజీవికి మాతృభాష. మనుషులకు లాగానే జంతువులకు వాటి భాష ఉంటుంది. ఆ భాషలో తల్లి ఒక్కసారి అరిచినపుడు దాని బిడ్డ ఎక్కడున్నా వచ్కి తల్లి ఒడిని చేరుతుంది. ఇవన్నీ మన నిత్యజీవితంలో చూస్తూనే  ఉంటాం. ఆవు ‘అంబా’ అని అరచినపుడు దాని దూడ చెంగు చెంగున గెంతుతూ వచ్చి తల్లి పొదుగును చేరగానే తల్లి ఆవు తన బిడ్డను ప్రేమగా నాకుతుంది. చెట్లమీద కోతుల గుంపు చేరినపుడు పిల్ల కోతులు  తల్లిని విడివడి చెట్ల కొమ్మలపై వేస్తున్న ‘ కోతి వేషాలు ‘ మనకు చూడముచ్చటగా ఉంటాయి. ఎవరినా తుంటరోడు రాయితో అదిలిస్తే వెంటనే ప్రతీ  కోతిపిల్ల తన తల్లి ఒడిని చేరిపోతాయి. అలాగే తల్లి మేక పిలవగానే పిల్లమేక ‘మే..మే..’’ అని తిరిగి సమాధానమిస్తుంది. అయితే కాకి తన గుడ్లను  కోయిల గూటిలో పెట్టినప్పుడు గుడ్ల బేధం తెలియని కోయిల వాటిని పొదిగి పిల్లలను చేస్తుంది. అన్నింటికీ  ఆహారం సంపాదించి ఒకే విధంగా పెడుతుంది.పెంచి పెద్ద చేస్తుంది. కొంచెం పెద్దవైన కాకి పిల్లలు ‘కావ్ ..కావ్.. ‘’మని అరవడంతో అవి తమ పిల్లలు కావని గుర్తించి వాటిని తరిమేస్తుంది. తమ తమ పిల్లలను గుర్తించడానికైనా, తరిమి కొట్టడానికైనా మాతృభాష జంతువులకు  పక్షులులకు అలా ఉపయోగపడుతుంది.

మరి మన తెలుగువారికి అందరికీ మాతృభాష తెలుగు. ఆభాషకు 56 అక్షరాలు. కొన్ని సంవత్సరాల క్రిందట  ప్రతీ తెలుగు కుటుంబం లోనూ చదువుకున్న తల్లి తన పిల్లలకు ఇంట్లో అక్షరాభ్యాసం చేయించిన నాటినుంచి తన పనులు తాను చేసుకుంటూ  అక్షరాలు, గుణింతాలు, పదాలు, వాక్యాలు నేర్పుకుని ఆది గురువు అయ్యేది.అలాగే ఒకటి నుంచి పన్నెడ్లు  వరకు, ఒకటో ఎక్కం నుంచి పన్నెండో ఎక్కం వరకు వల్లే వేయించేది. ఒకటినుంచి వెయ్యి వరకు అంకెలు నేర్పించేది. తనకు వచ్కిన వేమన శతక పద్యాలను పిల్లలకు రోజుకొకటి చొప్పున నేర్పించేది. రామాయణ, భారత, భాగవతాలు...ధ్రువుడు, ప్రహ్లాదుడు, గరుత్మతుడు, ఆంజనేయుడు మొదలైన భక్తుల కధలను, బుద్దుడు, శివాజీ, ఝాన్సీలక్ష్మీ బాయి వంటి వీరుల చరిత్రలు పిల్లలకు చెబుతుంటే వారి చిన్నారి  మనసుల్లోముద్రించుకుపోయేవి.  దాంతో ఒకటవ తరగతికి అవసరమైన పునాది ఇంట్లోనే విద్యార్ధికి పడటంతో  పాఠశాలలో మొదటి రెండుమూడు రోజులు ఏడ్చినా ఉపాధ్యాయుల ప్రేమతో కూడిన ఓదార్పుతో విద్యార్ధులు పాఠశాలకు  అలవాటు పడిపోయేవారు.

ఉపాధ్యాయులు ప్రేమతో పాఠాలు అర్ధమయ్యేలా చెప్పేవారు. చదువురానివారిపై ప్రత్యేక శ్రద్ధచూపేవారు. అటువంటి విద్యార్ధులను దగ్గర కూర్చోపెట్టుకుని వారికి కధలు, పిల్లల పాటలు (ఇపుడు వాటిని ఆంగ్లం మీద మోజుతో రైమ్స్ అంటున్నారు) చెప్పి చదువు పట్ల ఉన్న భయాన్ని పోగొట్టేవారు.చదవడం రాయడం అన్నీ  శ్రద్ధగా  నేర్పేవారు.తప్పులు  దిద్దేవారు. మాతృభాషలోని కాపీ, చూసివ్రాత డబల్ రూల్డ్ పుస్తకంపై రాయించి ప్రతీ పుస్తకాన్ని శ్రద్ధగా తప్పులు దిద్ది సరిచేసి, సంతకం పెట్టి ఇచ్చేవారు. రోజుకొక పది పదాలు డిక్టేషన్ చెప్పేవారు. తప్పుగా రాసిన పదాలను విద్యార్ధి  స్థాయిని బట్టి పైకి అనుకుంటూ రాయమనేవారు.పునాది తరగతుల్లోనే అక్షర దోషాలు లేకుండా  నేర్చుకోవడంతో మాతృభాష ఎవరికైనా అలవోకగా వచ్చేసేది. పాకల బడులలో , చెట్ల కింద, పెంకుటిళ్ళ బడులలో చదువు చెప్పిన గురువులందరూ అచ్చమైన సరస్వతీ ప్రతిరూపాలు.  పాఠశాలకు వస్తే చాలు తల్లిని మరపించేసేవారు.తప్పు చేస్తే విద్యార్ధి శారీరక ధారుడ్యాన్ని బట్టి శిక్ష విధించేవారు. దెబ్బ వేయడం కన్నా వేస్తే ఎలా ఉంటుందో అన్న భయంతో ఉపాధ్యాయులు చెప్పింది చెప్పినట్టు చదివేసేవారు విద్యార్ధులు. అందుకే ‘’ఒక దేశ భవిష్యత్తు ఒక పాఠశాలలోని తరగతి గదిలో తయారుచేయబడుతుంది’’ అన్న కోఠారీ కమీషన్ చెప్పిన మాట అక్షర సత్యం. ప్రతీ తరగతిలోను  ప్రసిద్ధులైన కవులు రచించిన కావ్యాలలోని పద్యాలను ‘’పద్యభాగం ‘’ కింద ఎనిమిది- తొమ్మిది పాఠాలు ఉండేవి. వాటిలో చదవడానికి కొంచెం కష్ట తరమైన పద్యాలకు పువ్వు గుర్తులు ఉండేవి. ఒకటి నుండి అయిదవ తరగతి వరుకు సుమారుగా ముప్పది పద్యాలు ఉండేవి.ఆరవ తరగతి నుండి పడవ తరగతి వరకు 60 నుండి 70 పద్యాలవరకు వుండేవి..ప్రతీ పద్యానికి  ప్రతిపదార్ధం, భావం, జాతీయాలు, కవి కాలాదులు, కఠిన పదాలకు అర్ధాలు, గణవిభజన, పద్య లక్షణాలు...అన్నీ విపులంగా ఉండేవి.

గద్యభాగంలో కూడా ఎనిమిది – తొమ్మిది పాఠాలు ఉండేవి. అర్ధసందర్భాలు, వాక్యప్రయోగాలు, పాఠ్య సారాంశం,పాఠ్యాంశానికి ముందు సందర్భం, పర్యాయ పదాలు, ప్రకృతి వికృతులు, సమాసాలు, సంధులు , సంధికార్యాలు (ఆ పదాల కలయికలో ఇమిడి ఉన్న సూత్రములు )అలంకారాలు...ఇవన్నీ భాష నేర్చుకోవడానికి సాధనాలుగా ఉపయోగపడేవి.భాష నేర్చుకున్న విద్యార్ధి  వజ్రపుతునకలా మెరిసిపోయేవాడు. ప్రధానోపాధ్యాయుడు అధ్యక్షునిగా, తెలుగు వుపాధ్యాయుడు సమన్వయ కర్తగా, ప్రతీ తరగతిలోను బాగా చదివే విద్యార్ధులు  కార్యవర్గ సభ్యులుగా,  విద్యార్ధులందరూ సభ్యులుగా, ‘’తెలుగు సారస్వత సంఘం’’ అనే ఒక సంఘం ఉండేది. ఆ సంఘ కార్యక్రమం ప్రతీ నెల తెలుగు ఊపాధ్యాయుని నిర్వహణలో నిర్వహింపబడేది. ఆ సందర్భంగా వ్యాసరచన, వకృత్వము, కంఠస్థ పద్యములు పోటీ, వారం రోజుల ముందుగానే నిర్వహించి ఆరోజున సభ అనంతరం విద్యార్ధులకు ప్రసిద్ధ రచయితలు రచించిన పుస్తకాలను బహుమతులుగా ఇప్పించేవారు.ఆ సభకు వక్తలుగా విచ్చేసిన ప్రముఖులు ఎన్నెన్నో తెలియని అంశాలమీద ఇంకా వినాలనిపించే విధంగా  ప్రసంగించేవారు. రాబోయే పరీక్షలను ఎలా ధైర్యంతో ఎదుర్కోవాలో తమదైన శైలిలో ఎవరికి వారు చిట్కాలు చెప్పేవారు. బహుమతులు అందించి మరింతగా ప్రోత్సహించేవారు. స్థానిక పర్యవేక్షాధికారి మూడు నెలలకోసారి,  స్వయంగా జిల్లా విద్యాశాఖాధికారి వార్షిక తనిఖీ  నిర్వహించేవారు. విద్యార్ధుల అబివృద్ధికి ఎన్నెన్నో సూచనలు చేసేవారు. చదువుకునే ప్రతీ విద్యార్ధీ తన జీవన మనుగడ జరగాలంటే  మాతృభాషయే జీవన పరమావధి అని గ్రహించాలి. గుర్తించాలి .అవగాహన చేసుకుని నిరంతరాయంగా కృషీచెయ్యాలి.విద్యార్ధికి చిన్నతనంలో అంత అవగాహన ఉండదు కాబట్టి ఆ బాధ్యత తల్లితండ్రులు ఇంటివద్ద, ఉపాద్యాయులు పాఠశాలలోనూ తీసుకోవాలి. మనిషి కాలానుగుణంగా, పరిస్తితులకనుగుణంగా అనేక చోట్లకు వెళ్ళి అనేక భాషలు మాట్లాడాల్సివస్తుంది  కాబట్టి తన మాతృభాష చిన్న నాటినుంచి లోతుగా నేర్చుకుంటే  యేఇతర  భాషను నేర్చుకునేటప్పుడైనా మాతృభాషలోకి తర్జుమాచేసుకుంటూ  ఆ భాషను నేర్చుకుంటే ఆ భాషలోనూ పరిపూర్ణుడవుతాడు అనే నిజాన్ని గ్రహించాలి. అలా చేస్తే మాతృభాష ఆధారంగా ఎన్ని భాషలైనా నేర్చుకోవచ్చు.అందుకే మాతృభాషను నేర్వడం లో విద్యార్ధి కొన్ని మెళకువలు పాటించాలి. అక్షరమాల నేర్చుకునే నాటినుంచే పరిపూర్ణంగా, తప్పులు లేకుండా నేర్చుకోవాలి. గుణింతాలు, ద్విత్వాక్షరాలు, సంయుక్తాక్షరాల పట్ల పూర్తి అవగాహన కలిగించుకుని పదాలు స్పస్టం గా పలకడం,నేర్చుకోవాలి. కఠినపదాలకు ఎప్పటికప్పుడు నిఘంటువు సహాయంతో అర్ధాలు తెలుసుకోవాలి.

పద్యాలను కంఠస్థ పట్టడం, చదివినది మర్చిపోకుండా  వెంటనే చూడకుండా రాసుకోవడం, తనకు తాను తప్పులు దిద్దుకోవడం తప్పనిసరిగా కొనసాగించాలి. మాతృభాషను బోధించే ప్రతీ ఉపాధ్యాయుడు తాను బోధిస్తున్న పాఠశాలలో వారసులను తయారుచేయడంపై దృష్టి పెట్టాలి. గ్రంధాలయంలో తరచూ వార్తాపత్రికలు, విజ్నానదాయకమైన పుస్తకాలు చదువుకోవడం, భావ వ్యక్తీకరణకోసం, భాషలో విజ్నాన పరిధి పెంచుకోవడం కోసం  తరచూ  ఉత్సాహంగా పోటీలలో పాల్గోనడం, వంటి కార్యక్రమాలు చేపట్టాలి. పై సూచనలలో  కొన్నిటినైనా ఆచరించగలిగిన నాడు మాతృభాషపట్ల అభిరుచే కాదు అవ్యాజమైన ప్రేమ పెరుగుతుంది. ప్రపంచంలో యే భాష నేర్వాలన్నా మాతృభాష పునాదుల ఆధారంగా నేర్చిననాడు భాషకు మరణం ఉండదు. అసలు  మరణించేది భాష అవ్వదు.. దానిని అవసరమున్నపుడు కూడా సవ్యంగా ఉపయోగించని మనుషులున్న కారణంగా భాష కనుమరుగవుతుందేమో గానీ ఒక సారి సృస్టించబడిన భాష మృతభాష కాదు కానేరదు. మళ్ళీ దానిని పునరుద్ధరించే మహానుభావుడు జన్మించి తన లక్స్య సాధనతో సారధ్యం వహించి ముందుకుసాగిన నాడు తిరిగి మబ్బుతొలగిన సూర్యుడై లోకమంతా పరుచుకుంటుంది. దానిని నమ్ముకుని అసుసరించినవాడు తప్పక తరువాతి తరాలకు మార్గదర్శి అవుతాడు.

‘’ ఇటాలియన్ ఆఫ్ తే ఈస్ట్ ‘’  గా వినుతికెక్కిన మన అమ్మభాష అయిన తెలుగు  ఆచంద్రార్కమూ
‘’దేశభాశలందు తెలుగు లెస్స’’!!!

మరిన్ని వ్యాసాలు

వివేకానంద రాక్ మెమోరియల్ స్థపతిశ్రీ.ఎస్.కె ఆచార్య
స్థపతిశ్రీ.ఎస్.కె ఆచార్య
- కుందుర్తి నాగబ్రహ్మాచార్యులు
రాజస్తాన్ ప్రాంత నిర్మాణ విశేషాలు
రాజస్తాన్ ప్రాంత నిర్మాణ విశేషాలు
- కుందుర్తి నాగబ్రహ్మచార్యులు
Kanyakumarilo vunna tiruvalluvar vigraham nirmana charitra
తిరువళ్లువర్ విగ్రహం నిర్మాణ చరిత్ర
- కుందుర్తి నాగబ్రహ్మాచార్యులు
శ్రీసాయి లీలామృతం
శ్రీసాయి లీలామృతం
- సి.హెచ్.ప్రతాప్
మా చార్ధామ్ యాత్ర-2
మా చార్ధామ్ యాత్ర-2
- కర్రా నాగలక్ష్మి