ఈవారం ( 22/11-28/11) మహానుభావులుజయంతులు
నవంబర్ 23
భగవాన్ శ్రీ సత్య సాయి బాబా : వీరు నవంబర్ 23, 1926 న పుట్టపర్తి లో జన్మించారు. ప్రసిధ్ధ ఆధ్యాత్మిక గురువు. ప్రపంచ వ్యాప్తంగా ఆరాధించేవారి సంఖ్య కొన్ని లక్షల్లో ఉంది. ఎన్నో సామాజిక కార్యక్రమాలు చేపట్టారు.
నవంబర్ 24
శ్రీ భోగరాజు పట్టాభి సీతారామయ్య : వీరు నవంబర్ 24, 1880 న గుండుగొలను లో జన్మించారు. ప్రముఖ స్వాతంత్ర సమర యోధులు. రాష్ట్రం బయట పనిచేసిననూ తెలుగు భాషపై మమకారం కోల్పోలేదు. తను స్థాపించిన ఆర్థిక సంస్థలలో ఉత్తర ప్రత్యుత్తరాలు తెలుగులోనే జరగాలని సూచించేవారు. . తెలుగు భాషకు, తెలుగు జాతికి ఎన్నో చిరస్మరణీయ సేవలను అందించారు. Andhra Bank వ్యవస్థాపకులు. శ్రీ వంగర వెంకట సుబ్బయ్య : వీరు నవంబర్ 24, 1897 న జాగర్లమూడి లో జన్మించారు. ప్రముఖ నాటక, సినిమా నటుడు. “ వంగర “ గా ప్రసిధ్ధి చెందారు. ఈయన ఇంచుమించు వందకు పైగా తెలుగు చిత్రాలలో నటించారు.. వీటిలో పెద్దమనుషులు, కన్యాశుల్కం, లక్ష్మమ్మ, ప్రియురాలు, లక్ష్మి, చక్రపాణి, పల్నాటి యుద్ధం, తెనాలి రామకృష్ణ, శ్రీకృష్ణ తులాభారం వీరికి ఎంతో పేరుతెచ్చిపెట్టాయి..
శ్రీ భమిడిపాటి రాధాకృష్ణ : వీరు నవంబర్ 24, 1929 న రాజమండ్రి లో జన్మించారు. ప్రముఖ నాటక, సినీ కథా రచయిత, జ్యోతిష శాస్త్ర పండితుడు, సంఖ్యాశాస్త్ర నిపుణుడు. . బహుముఖ ప్రజ్ఞశాలి. భమిడిపాటి రాధాకృష్ణ 3 నాటకాలు, 6 నాటికలు రచించగా అవి కన్నడ, తమిళ, హిందీ భాషల్లోకి అనువాదమయ్యాయి. ఇదేమిటి, కీర్తిశేషులు, మనస్తత్వాలు, భజంత్రీలు, దంత వేదాంతం వంటి నాటికలు, నాటకాలు రాసారు. భమిడిపాటి రాధాకృష్ణ క్యాలెండర్ పేరిట క్రీస్తుపూర్వం 45 నుంచి క్రీస్తుశకం 5555 వరకు అంటే ఆరు వేల సంవత్సరాల క్యాలెండర్ రూపొందించారు. జ్యోతిషరంగంలో కూడా ఆయనకి పట్టు ఉండేది
నవంబర్ 28
శ్రీ వెన్నెలకంటి సుబ్బారావు : వీరు నవంబర్ 28, 1784 న నెల్లూరు ప్రాంతంలోని ఓ కుగ్రామం లో జన్మించారు. ఆంగ్లం లో తొలి స్వీయచరిత్ర రచించిన మొదటి వ్యక్తిగా పేరు పొందారు. తెలుగు, ఆంగ్ల భాషల్లోనే కాక ఇతర భాషల్లో నిష్ణాతులైనా సుబ్బారావు పంతులు వ్యాకరణ రచనలు, అనువాదాలు, స్వీయచరిత్ర రచన వంటివి సాగించారు…
వర్ధంతులు
నవంబర్ 22
శ్రీ మంగళంపల్లి బాలమురళీ కృష్ణ : ప్రఖ్యాత కర్ణాటక సంగీత గాయకుడు, వయొలిన్ విద్వాంసుడు, వాగ్గేయకారుడు, సినీ సంగీత దర్శకుడు, గాయకుడు. ప్రపంచ వ్యాప్తంగా 25 వేలకు పైగా ప్రదర్శనలు ఇచ్చారు. . ఆయన వయోలిన్, మృదంగం, కంజీరా లాంటి వాయిద్యాలన్నీ బాగా వాయించగలిగేవారు. పలు చిత్రాలకు ఆయన సంగీతం అందించారు. ప్రపంచవ్యాప్తంగా ఆయన 25000 కచేరీలదాకా చేసారు. వీరు నవంబర్ 22, 2016 న స్వర్గస్థులయారు.
నవంబర్ 25
శ్రీ రాచమల్లు రామచంద్రారెడ్డి : బహుముఖప్రజ్ఞాశాలి. ఆయన తెలుగు సాహిత్యానికి తన విమర్శతో, అనువాదాలతో, పాత్రికేయ రచనలతో ఎంతో దోహదం చేశారు.. ఆయన రాసిన అనువాద సమస్యలు అనే గ్రంథానికి కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు లభించింది. ఆయన రాసిన మరో ప్రసిద్ధ గ్రంథం 'సారస్వత వివేచన'. దీనికి రాష్ట్ర సాహిత్య అకాడెమీ బహుమతి లభించింది. మాస్కోలో ప్రగతి ప్రచురణాలయంలో తెలుగు అనువాదకునిగా ఆరేళ్ళు పనిచేసి ఎన్నో విలువైన గ్రంథాలను అనువదించారు. వీరు నవంబర్ .25, 1988 న స్వర్గస్థులయారు..
2. శ్రీ ఆచంట వెంకటరత్నం నాయుడు : ప్రముఖ రంగస్థల నటుడు. కేవలం పద్యనాటకమేకాక అనేక సాంఘిక నాటకాల్లో కూడా ఆచంట తమ ప్రతిభా పాటవాలను తెలుగు దేశ ప్రజలకి తెలియజేశారు. విజయవాడకి సుమారు 30 కిలో మీటర్ల దూరంలో ఉన్న ‘నున్న’ ప్రాంతంలో ఒక చిల్డ్రన్ నటశిక్షణాలయం స్థాపించి భావితరాలకు పద్యనాటక కళాకారులను తీర్చిదిద్దారు వీరు నవంబర్ 25, 2015 న స్వర్గస్థులయారు.
నవంబర్ 26
శ్రీమతి గరికపాటి వరలక్ష్మి : జి. వరలక్ష్మి గా ప్రసిధ్ధి చెందారు. అలనాటి రంగస్థల, సినిమా నటి.1940ల నుండి 1960 వరకు తెలుగు తమిళ సినిమా రంగాలలో ప్రాచుర్యమైన నటిగా వెలుగొందారు. ఒక తెలుగు సినిమాకు దర్శకత్వం కూడా చేసారు. వీరు నవంబర్ 26, 2006 న స్వర్గస్థులయారు.
నవంబర్ 28
శ్రీ అవసరాల రామకృష్ణారావు : ప్రముఖ నవలా రచయిత. తన కథలు, నవలల ద్వారా ‘స్ర్తీ-విముక్తి’ ఆవశ్యకతను చాటారు. ‘సంపెంగలూ-సన్నజాజులూ’ నవల ఆయనకు మంచి పేరు తెచ్చింది. భారతీయ సాంస్కృతిక రాయబారిగా అభిమానులు ప్రేమగా పిలుచుకునే చందమామ పత్రిక తొలి సంచికకు 1947లో కేవలం పదహారేళ్ల వయస్సులో “పొట్టి పిచిక కథ” అనే కథను రాసి పంపారు.[2] వీరు నవంబర్ 28, 2011 న స్వర్గస్థులయారు.