దంతం అంటే .. ఇలా !! - డా. కె. ఎల్. వి. ప్రసాద్.

Teeth is like this!

దంతం అయినా, పన్ను అయిన,దాని అవసరం,ఆహరం నవలడం లో దాని ప్రాధాన్యత,స్వచంగా మాట్లాడడంలో దాని విశిష్టత , ముఖారవిందంలో   దాని ప్రాముఖ్యత తెలుసుకున్న తరువాత,దంత సంరక్షణ విషయంలో మనం ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలన్నా,పంటి నిర్మాణం ,దాని లోపలి భాగాల గురించి కనీస జ్ఞానం తెలిసివుండడం చాలా అవసరం. దంతవైద్యులను సంప్రదించినప్పుడు వారు మాట్లాడే పారిభాషిక పదాలు లేదా సాంకేతిక పరమైన పదజాలంతో మాట్లాడుతున్నప్పుడు,వాటిని అర్ధం చేసుకోవడానికి ,కనీస పరిజ్ఞానం ఉంటే తేలిగ్గా సమస్యను మనం కూడా అర్ధంచే--తీసుకునే వెసులుబాటు కలుగుతుంది. అందుచేతనే అక్షర పరిజ్ఞానంవున్న తల్లిదండ్రుల పకంలో,పర్యవేక్షణ లో పెరిగిన పిల్లలు ఆరోగ్యాన్ని సులభంగా పరిరక్షించుకోగల అదృష్ట వం తులు అవుతారు.అలాంటి తల్లి-దండ్రులకోసము,సంరక్షకుల కోసమే ఈ చిరు వ్యాసం. సాధారణంగా దౌడ లోని వెనుక పళ్ళను దంతాలు అనీ ,ముందరి వాటిని పళ్ళు అని పిలవడం వాడుక. ఆయా పన్ను పనిచేసే విధానాన్ని బట్టి ఒక్కో దానికీ ఒక్కో పేరు ఉంటుంది. ఒక్కో వయస్సును బట్టి ఒక్కో పన్ను దౌడ లో ప్రత్యక్షం అవుతుంది. అందుకే ఒక వ్యక్తి వయస్సును అంచనా వేసే విషయంలో దౌడ లోని పలువరుసను కూడా పరిగణన లోనికి తీసుకుంటారు. ఇక అసలు విషయానికొస్తే ... పన్ను గానీ దంతం గానీ,దౌడ లోని పంటి కుదురులో పటిష్టంగా అమర్చబడి ఉంటుంది. ఇలా అమర్చబడి వున్నపంటిని,దృష్టిలో ఉంచుకుని పంటిని, రెండు ముఖ్య భాగాలుగా విభజిస్తారు. దౌడలో పైకి కనపడే భాగాన్ని శీర్షము లేదా క్రౌన్ అంటారు. ఇది తెల్లగాను 

లేదా లేత గోధుమ రంగు లోను ఉంటుంది. రెండవ భాగం మన కంటికి, రెండు.. కనిపించనిది. ఇది దౌడ పంటి కుదురులో బంధించ బడి ఉంటుంది.దీనిని మూలము లేదా రూట్ అంటారు. పంటిని  బట్టి మూలాల సంఖ్యఉంటుంది. క్రింది దౌడ లోని వెనుక దంతాలకు (విసురుడు దంతాలు )రెండేసి మూలాలు ఉంటాయి. పై దౌడ లోని విసురుడు దంతాలకు మూడేసి మూలాల చొప్పున ఉంటాయి. తరువాత ఇరు దౌడలలోను వుండే చిన్న-విసురుడు దంతాలకు (ప్రీ -మోలార్స్ )రెండేసి మూలాల చొప్పున ఉంటాయి. ఈ మూలాలు,విడిగా కానీ  కలిసిపోయిగానీ ఉంటాయి. ఇక ఇన్సిజార్స్ అనబడే ముందరి పళ్లకు ఒక్కో మూలం చొప్పున ఉంటుంది. దౌడ నుండి మూలం క్రింది భాగం మూల రంధ్రం ద్వారా నరాలు,రక్తనాళాలు,మూల నాళం లేదా రూట్ కెనాల్ ద్వారా పంటిలోపలికి సరఫరా చేయబడతాయి. ఇక పంటి లోపలి భాగాలను తెలుసుకోవలసి వచ్చినప్పుడు పంటి అడ్డు- కోతను ఊహించు కోవాలి అలా ఊహించు కున్నప్పుడు,బాహ్యంగా పన్నుమూడు ముఖ్య భాగాలుగా ఉంటుంది. 1)కిరీటము (క్రౌన్ )2)మూలము (రూట్ )3)ఈ రెంటినీ కలిపే మధ్య భాగం ,మెడ లేదా నెక్ అంటారు. ఇక పంటి లోపలి భాగాలవైపు దృష్టి మళ్లించినట్లైతే,ముందుగా మనకు కనిపించే భాగము,ఎనామిల్ దీనినే పింగాణీ పొర అని కూడా అంటారు. ఈ పింగాణీ పొర గట్టిగా కాస్త పెళుసుదనం కలిగి ఉంటుంది.అరిగినా,కరి --
గినా,విరిగినా,పెరిగే (గ్రోత్)గుణాన్ని కలిగి ఉండదు. పింగాణీ పొరలో పిప్పి (కెరీస్ )రంధ్రం ఏర్పడినా,చివరి భాగం విరిగినా,నొప్పి అనిపించదు.కారణం ఏమిటంటే,పింగాణీ పొరలోనికి ,నరాలు -రక్తనాళాలు విస్తరించి వుండవు. అందుచేతనే ప్రాధమిక దశల్లో పిప్పిపన్ను వ్యాధి వల్ల నొప్పి తెలియదు. ఇది తదుపరి భాగమైన ‘డెంటీన్’పొరకు రక్షక కవచం మాదిరిగా ఉంటుంది పింగాణీ పొర స్థాయిలో పిప్పి పన్ను వ్యాధి పరిమితమై ఉంటే, ఫిల్లింగ్ మూడు చికిత్స ద్వారా పిప్పి వ్యాధిని అదుపుచేసి పంటిని సంరక్షించు కోవచ్చు. 
ఇక,పింగాణీపొర తర్వాత ముఖ్యమైన పంటి పొర ‘డెంటీన్’ ఇది కొద్దిగా సాగే గుణాన్ని కలిగి ఉంటుంది. అదేవిధంగా నరాల చివరలు,ఈ భాగంలో చొచ్చుకుని ఉండడం వల్ల ,కొంత స్పర్శ లక్షణం కలిగి వుండి,పిప్పి పన్ను వ్యాధి డెంటీన్ పొరలోనికి ప్రవేశించినట్లైతే ,కొద్దిగా నొప్పి కలుగు తుంది. అంతే కాకుండా,ఎలాంటి ప్రమాద పరిస్థితిలోనైనా డెంటీన్ పొరకు నష్టం వాటిల్లితే తిరిగి ఆ భాగం ఎదిగే శక్తిని కలిగి ఉంటుంది. ఇక్కడ కూడా పంటి పరిస్థితిని బట్టి,ఫిల్లింగ్ చికిత్స చేయించుకునే అవకాశం వుంది.  డెంటీన్ పొర తర్వాత కనిపించే అతి ముఖ్యమైన పల్ప్ కుహరం దీనినే పల్ప్ కేవిటీ .. అని కూడా అంటారు. నరాలు,రక్తనాళాలు ,ఇక్కడ గుంపులుగా (బండిల్స్)ఉంటాయి. అందుచేతనే పిప్పివ్యాధి ఈ భాగంలోకి చేరినా,ప్రమాదాలలో పన్ను విరిగినా,ఫిల్లింగ్ చేసేటప్పుడు దంత వైద్యుల అశ్రద్ధవల్ల ఎక్కువ రంధ్రం చేసినా తీవ్రమైన నొప్పి వస్తుంది. ఇది భరించరానంతగా ఉంటుంది. పల్ప్ వరకు పన్ను విరిగిన సందర్భాలలో,పల్ప్ కుహరం నుంచి రక్త స్రావం కూడా జరిగే అవకాశం వుంది. ఇక్కడ తక్షణ జాగ్రత్తలు తీసుకోకుంటే పన్ను చచ్చుపడిపోయే ప్రమాదం (నాన్ -వైటల్ )కూడా లేకపోలేదు. ఇవన్నీ అందరికీ అవసరమా ?అన్న ప్రశ్న చాలామందిలో వెంటనే మనస్సులో తట్టవచ్చు. అవసరం అనుకున్న వాళ్లకి చాలా అవసరం. వారి కోసమే ఈ చిన్న ప్రయత్నం !! 

మరిన్ని వ్యాసాలు