చమత్కారం - భమిడిపాటి ఫణిబాబు

chamatkaram

మా చిన్నప్పుడు వేశవి వెళ్ళి వర్షాలు అందులోనూ మొదటి వర్షం వచ్చేముందర ఒక రకమైన మధురమైన సువాసన ఆస్వాదించేవాళ్ళం.మట్టి మీద మొదటి చినుకు పడగానే వచ్చే వాసన ఇప్పటి రోజుల్లో ఓ తీయటి జ్ఞాపకంగానే మిగిలిపోయింది.నగరాల్లో అస్సలు మట్టి అనేది ఎక్కడైనా కనిపిస్తోందా? ఏదో గవర్నమెంటు క్వార్టర్స్ ఉన్నచోట కొన్ని కొన్ని ఖాళీ ప్రదేశాలు కనిపిస్తూంటాయి.పోనీ అక్కడైనా ఈ సువాసన ఉంటుందేమో  అని చూస్తే, ఈ ప్రకృతి కూడా మనమీద కక్ష కట్టినట్లనిపిస్తూంది.

ఆ పాత రోజులు గుర్తుతెచ్చుకుంటూ బ్రతికేయడమే మనకి రాసిపెట్టినట్లుంది.ఆ మట్టి వాసన రావాలికదా అని,బయట ఉన్న మట్టిమీద నీళ్ళు పోస్తే వస్తుందా? ఆ తొలకరి చినుకు ప్రకృతిసిధ్ధమైన మట్టిమీద పడ్డప్పుడే ఆ సువాసన వస్తుంది. ఇప్పటి వాళ్ళకి ఆ విషయాలు చెప్తే ఏం అర్ధం అవుతుందీ? ఇప్పుడు ఎక్కడ చూసినా గ్లోబల్ వార్మింగే. అలాటిదే మరో సువాసన పురిటి రోజులు వెళ్ళేదాకా పసిబిడ్డ వద్ద వచ్చే సువాసన! ఇదివరకటి రోజుల్లో పసిబిడ్డలకి, ఆముదమో, ఏదో నూనో మర్దనా చేసి, నలుగు పిండితో నలుగు పెట్టి, శుభ్రంగా స్నానం చేయించి, సాంబ్రాణి పొగ పెడితే, రోజంతా , ఆ పసిబిడ్డ దగ్గర సువాసనే సువాసన. ఇప్పటి రోజుల్లో అలా కాదే! నూనె పెడితే ఎలర్జీ,పెసరపిండి పెడితే ఎలర్జీ,సాంబ్రాణి పొగ పెడితే ఎలర్జీ.ఇవన్నీ నేను చెప్పేమాటలు కావండోయ్. ఏవో రాషెస్ వచ్చాయని డాక్టరు దగ్గరకు వెళ్ళడం, ఆయనేమో, ఈ బేబీ కి రోజూ ఏం చేస్తున్నారని అడగడం, వీళ్ళు చెప్పినదాన్ని బట్టి, పై చెప్పినవన్నీ అంటే నూనె,పెసరపిండి, సాంబ్రాణి బ్యాన్ చేసేయడం! ఇదివరకటి రోజుల్లో శుభ్రంగా ఉపయోగించేవి, ఈ రోజుల్లో ఎందుకు పనికిమాలినవయ్యాయో నాకైతే తెలియడం లేదు. వాతావరణంలో మార్పా, మనం తినే తిండిలో మార్పా, లేక మన మనస్థత్వాల్లో మార్పా?

ఈ మధ్యన పేపర్లలో చదివాను—పసిబిడ్డలకి వంటినిండా రాసే  “ జాన్సన్ పౌడర్ “ లో ఏవేవో కలుపుతున్నారనీ, దానివలన పసిపిల్లలకి హానికరమూ అని..అమెరికాలో ఎవరో కేసు పెట్టారుట.. కొన్ని సంవత్సరాలపాటు మనదేశంలో వాడాము, ఇంకా వాడుతున్నాము కూడా.. ఇప్పుడు సడెన్ గా హానికరమనడమేమిటో? అలాగని ఆ వార్తని పట్టించుకోకుండా కూడా ఉండలేమాయే..

నిజం చెప్పాలంటే, ఈ అంతర్జాలం మనకి అందుబాటులో లేనంత కాలం, హాయిగా బతికేసాము, పిల్లల్ని కూడా , పాత పధ్ధతుల్లో పెంచాము. ఈరోజుల్లో ప్రతీ విషయమూ ప్రశ్నార్ధకమైపోయింది. ఈ రోజుల్లో గర్భిణీ స్త్రీలు ఇంటర్నెట్ ధర్మమా అని ఎంత వత్తిడికి లోనౌతున్నారో అందరికీ తెలిసిందే..   దాన్ని దృష్టిలో పెట్టుకుని,గర్బిణీ స్త్రీలే కాదు, పుట్టిన పిల్లల గురించి కూడా, ఇంటర్నెట్ లో ఏవేవో చూసేసి, ఏవేవో ఊహించేసి వాళ్ళు ఖంగారు పడిపోయి, ఇంట్లో ఉన్నవాళ్ళని ఖంగారు పెట్టేస్తున్నారు.పసిపిల్లాడు గుక్కత్రిప్పుకోకుండా ఏడిస్తే, వెంటనే నెట్ ఓపెన్ చేసేయడం,అందులో వాడేదో వ్రాస్తాడు, అది చదివేసి, వెంటనే డాక్టర్ కి ఫోన్ చేసేసి, ఎపాయింట్మెంట్ ఫిక్స్ చేసేసి, వెళ్ళడం.అక్కడ ఆయనేమో, వీళ్ళింకా ఉపయోగిస్తున్నవాటి గురించి అడిగి, వాటిని కూడా బ్యాన్ చేసేయడం.

కొన్ని సంవత్సరాలనుండీ సాంప్రదాయపధ్ధతి లో చేస్తూన్న పనులు ఇప్పుడెవరికీ నచ్చడం లేదు. ఏమైనా అంటే, గూగులమ్మ చెప్పిందీ అంటారు. మరో చిత్రం ఏమిటంటే, ఇదే అంతర్జాలం లో, ఎవరికి వారే ఓ విడియో తీసి పెట్టేయడం… ఫలానా  ఆకు తినండి, ఫలానా రసం తాగండీ.. అంటూ.. పోనీ వాటిల్లోనైనా ఏకీభావం ఉంటుందా అంటే అదీ లేదూ… ఒకడికి అమృతమైనది, మరొకరికి విషం.. పోనీ ఏ డాక్టరునైనా అడుగుదామా అనుకుంటే, “ ఇవన్నీ చెత్త “ అంటాడాయన. ఒకానొకప్పుడు పసిపిల్లలకి ఏదైనా నలతచేసి ఏడుస్తూంటే, కాళ్ళ మీద పడుక్కోబెట్టుకుని ఓ స్పోన్  “ గ్రైప్ వాటర్ “ ఇచ్చేస్తే, హాయిగా ఉండేవాడు. దాన్ని కాస్తా నిషేధించారు ఏవేవో కారణాలు చెప్పి. జనాలని గందరగోళం పెట్టడమే ధ్యేయంగా పెట్టుకున్నట్టున్నారు..

సర్వే జనా సుఖినోభవంతూ..

మరిన్ని వ్యాసాలు

vennela vaanalo manam
వెన్నెల వానలో మనం ...
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
Guru geetha prasasthyam
గురు గీత ప్రాశస్త్యం
- సి.హెచ్.ప్రతాప్
కల్పవృక్ష వినాయక స్వరూపం శిల్పి
కల్పవృక్ష వినాయక స్వరూపం శిల్పి
- కుందుర్తి నాగబ్రహ్మాచార్యులు
సంత్ నరహరి సోనార్
సంత్ నరహరి సోనార్
- కుందుర్తి నాగబ్రహ్మాచార్యులు
మా చార్ధామ్ యాత్ర
మా చార్ధామ్ యాత్ర
- కర్రా నాగలక్ష్మి
శివుడు నటరాజ మూర్తిగా మారడానికి ప్రేరకుడైన
మంకణ మహాముని కథ
- ambadipudi syamasundar rao