మీరేమిటోళ్లు … ?
మన దేశం అభివృద్ధి చెందింది, చాలా సాధించేసాం అని గొప్పగా,గొప్పలు చెప్పు కుంటాం. ఇతరదేశాలతో పోల్చుకుని కాలర్ ఎగరేస్తుంటాం. మనం ఇక సాధించ వలసింది ఏమీ లేదన్నట్టు అంచనాలకు మించి ఫీల్ అయిపోతాం. స్వాతంత్ర్యానికి ముందు, స్వాతంత్ర్యానికి తర్వాత,అభివృద్ధిని గురించిఆలోచిస్తే ,మనం వెనకబడి ఉన్నామని చెప్పలేము. శాస్త్ర విజ్ఞాన విషయాలలో ఇతర దేశాలతో పోటీగా మనం అభివృద్ధి చెందుతున్న విషయం వాస్తవం. మరి మనం ఎందులో,ఎక్కడ వెనకబడి వున్నాం ? ఇతర దేశాలలో లేని కొన్ని దుర్భాగ్యపు సమస్యలు తర తరాల నుండి మనల్ని వెంబడిస్తూనే వున్నాయ్. వాటి రుగ్మతలనుండి మనం ఇంకా ఏమాత్రం కోలుకోలేక పోయాం. ఆ .. అంశాలలో అభివృద్ధిని సాధించ లేకపోయాం. అవే సమస్యలు సామాన్యుడినుండి సంపన్నుడిని సైతం భూతంలా ,పట్టి పీడిస్తున్నాయి.కుల వివక్షత,వరకట్నం,స్త్రీని ఇంకా బానిసగా చూడడం,ఎన్ని శాసనాలు ప్రభుత్వ పరంగా చేసినా మహిళకు రక్షణ లేకపోవడం,పేదవాడి భూములు దర్జాగా కబ్జాలకు గురికావడం,వంటివి ఇలా ఎన్నో!వీటికి తోడు రాజకీయ నాయకులు,ఆయా పార్టీలు ,ఓట్ల బాంక్ కోసం ఆకర్షక పథకాలు ప్రవేశపెట్టి ప్రజల ఆలోచనను,శ్రమ శక్తిని నిర్వీర్యం చేయడం వంటి పనుల వల్ల యువతలో అభివృద్దిపట్ల భవిష్యత్ పట్ల నిరాశక్తత ఏర్పడుతున్నాయి
వీటన్నింటిలోనూ కులవివక్షత మహా రాక్షసిలా ఇంకా పై .. పైకి,విజృంభిస్తూనే వుంది. తక్కువ కులాలవాళ్లుగా చెప్పబడుతున్న వాళ్ళు ఎక్కువగా చదువుకున్న ఓర్వలేని పరిస్థితులు,కులం నిరూపించుకోవడానికి వాళ్ళు పడే అష్టకష్టాలు,ఆలోచిస్తే గుండెలు ఝల్లుమంటుంటాయి.ఈ బాధలు పడలేక,ఎంతోమంది యువతీ యువకులు తల్లిదండ్రులకు,ఇతర బంధువులకూ దూరంగా,పాస్చాత్య దేశాలకు వలసపోయి అక్కడ తమ మేధస్సుతో మంచి ఉద్యోగాలు సంపాదించుకుని ఇతరకులాలకు ధీటుగా గౌరవప్రదమైన జీవితాన్ని గడపగలుగుతున్నారు. మరి,అక్కడ కులాన్ని బట్టి ఉద్యోగాలు ఇవ్వడం లేదుకదా! ఈ కుల వివక్షత,పల్లెల్లో పట్నాలలో ఇంకా నిత్యకళ్యాణం పచ్చ తోరణంలా విలాసిల్లుతూనే వుంది. ఉన్నత ఉద్యోగాలలో ఉన్నవారికీ ఈ తిప్పలు తప్పడం లేదు. దీనికి నిలువెత్తు సాక్ష్యం నా ఉద్యోగ జీవితంలో ఒక చిన్న సంఘటన మీ కోసం
------
ఉద్యోగులకు బదిలీ అన్నది సహజం. 3-4 సంవత్సరాలకు బదిలీ తప్పని సరి! పైగా నా ఉద్యోగం రాష్ట్ర స్థాయిది కాబట్టి,రాష్ట్రంలో ఎక్కడికైనా పంపించవచ్చు. కానీ నేను పనిచేసిన మహబూబాబాద్ అప్పట్లో పెద్ద డిమాండ్ గల ప్రదేశం కాదు కాబట్టి,నాపై నా సోదర ఉద్యోగుల వత్తిడి ఉండేది కాదు. పైగా అప్పట్లో అది రాడికల్స్ కు పెట్టింది పేరు. ఎవ్వరు అక్కడ పని చేయడానికి పెద్దగా ఉత్సాహం చూపించేవారు కాదు. అందుచేత నిరాటంకంగా మహబూబాద్ ప్రభుత్వ ఆసుపత్రిలో,పన్నెండు సంవత్సరాలు పని చేయగలిగాను. అక్కడి వాతావరణం ఆనందంగా ఆస్వాదించగలిగాను. అక్కడ నాకు కుల వివక్షత పెద్దగా ఉండేది కాదు. నా వెనుక ఏమైనా చర్చలు జరిగేవేమో గానీ,ప్రత్యక్షంగా అలాంటి పరిస్థితులు నాకు ఎదురు కాలేదు. బహుశః రచనా వ్యాసంగం,ఉపన్యాస ప్రతిభ ,వాటిని నా దరిచేరకుండా చేశాయేమోనని ఇప్పుడు అనిపిస్తుంటుంది. ఇప్పటికీ ఆ ప్రాంతంతో సత్సంబంధాలు కలిగి ఉండడమే దీనికి ముఖ్య ఉదాహరణ ! ఇక అసలు విషయానికి వస్తే,1994 లో,మహబూబాబాద్ నుండి నాకు జనగాం ప్రభుత్వ ఆసుపత్రికి బదిలీఅయింది. అప్పటి పేదల(సామాన్యుల) ప్రజాప్రతినిధి నర్సంపేట నాటి శాసన సభ్యులు స్వర్గీయ ఎం. ఓంకార్ గారి వల్ల ఇది నాకు సుసాధ్యమయింది. లేకుంటే నేను చీరాల ప్రభుత్వ ఆసుపత్రికి విసిరివేయబడి ఉండేవాడిని. బదిలీ పత్రాలు తీసుకుని జనగామ ఆసుపత్రికి జాయినింగ్ రిపోర్ట్ ఇవ్వడానికి వెళ్లాను. అది అప్పటికి తాలూకా స్థాయి ఆసుపత్రి. నేను ఉండగానే అది ఏరియా ఆసుపత్రి అయింది. తెలంగాణా రాష్ట్రం ఏర్పడిన తర్వాత,జనగాం ,జిల్లా అయింది తద్వారా ఆసుపత్రి ఇప్పుడు జిల్లా ఆసుపత్రిగా మారింది.
అక్కడ అప్పటి చీఫ్ డిప్యూటీ సివిల్ సర్జన్ కేడర్ ఉండేది.ఆ పోస్ట్ భర్తీ కానందున,ఆసుపత్రి పరిపాలనా వ్యవహారాలు ఉన్న వైద్యుల్లో సీనియర్ చూసేవారు. అప్పుడు అదే ప్రాంతానికి చెందిన ఒక డాక్టర్ గారు ఆసుపత్రి పరిపాలనా భాద్యతలు చూసేవారు. ఆయన గురించి తెలుసుకుని వెతుక్కుంటూ జనరల్ అవుట్ పేషంట్ గదికి వెళ్లాను. ఆయన అక్కడ పేషేంట్స్ ను చూస్తూ చాలా బిజీగా వున్నారు. విష్ చేసి విషయం చెప్పి ,నా చేతిలో వున్నా కాగితాలు ఆయన చేతిలో పెట్టాను. కర్టెసీ కోసమైనా కూర్చోమంటారేమో అనుకున్నా. ఆ పని ఆయన చేయలేదు. కాగితాలు అటూ ఇటూ కాస్సేపు తిప్పి,నన్ను కాసేపు ఎగాదిగా చూసి,సీరియస్ గా..‘’ మీరు ఏమిటోళ్లు ?’’ అన్నాడు. నా సతాయిలో ఉన్నవాడికి అలాంటి ప్రశ్న వస్తుందని అసలు నేను ఊహించలేదు. గతంలో ఎప్పుడూ ఇలాంటి సమస్య ఎదురు కాలేదు. అందుకే ఆశ్చర్యానికి గురిఅయి,నిలకడగా మారి నా ,కులం ఏమిటో చెప్పాను. నా వంక కాస్త ఆశ్చర్యం గాను ,కించిత్ అనుమానం గాను చూస్తూ ---
‘’అవునా -మరి,అలా కనిపిస్తలేరు కదా !’’అన్నాడు. ఇది ఇంకా మింగుడు పడని ప్రశ్న అనిపించి,కాస్సేపు ఆలోచించి ‘’ ఆ కులం వాళ్ళ వేషం యెట్లా ఉండాలంటారు ‘’ అన్నాను.
‘’ ఉహు .. అట్లా కాదుగానీ .. అలా .. కనిపిస్తలేరు .. ‘’అన్నాడు.
‘’ మరి .. ఎలా ఉండాలంటారు ?పోనీ మీకు అలా అనిపించడానికి గుడ్డల మీద బురద చల్లుకుని ,అక్కడక్కడా చింపుకొని రానా ?’’అన్నా కాస్త సీరియస్ గా. అప్పటికి ఆయనకు ఇంచుమించు సమాన స్థాయిలో ఉన్నవాడిని,పన్నెండు సంవత్సరాలు గజిటెడ్ హోదాలో పని చేసిన వాడిని ,ఆ మాత్రం మంచి బట్టలు వేసుకోకూడదా ?అనుకున్నాను మనస్సులో. నేను ఇచ్చిన సమాధానం ఆయనకు ఎక్కడో గుచ్చుకున్నట్లయింది.
‘’ అదికాదు .. డాక్టర్ సాబ్ ,మీరు తప్పుగా అనుకోకండి,నేను మామూలు గానే అడిగాను ,ఎలాంటి దురుద్దేశ్యంతోను ,మిమ్ములను అలా అడగ లేదు .. మిమ్ములను కించపరచాలని అసలు అనలేదు ‘’ అన్నాడు కాస్త - గిల్టీగా ఫీల్ అవుతూ …
’ అది సరే సార్ ,మనం చదువుకున్న వాళ్ళం,ఉన్నత ఉద్యోగాల్లో వున్న- వాళ్ళం ,మన స్థాయికి ఆ విధంగా మాట్లాడుకోవడం సభ్య సమాజం హర్షించదు. మనం ఒకళ్ళకి చెప్పవలసిన వాళ్ళమే కానీ,చెప్పించుకునే పరిస్థితి మనకు రాకూడదు కదా !’’ అన్నాను ,నవ్వుతూ.
‘’ మీరు చెప్పింది అక్షరాలా నిజం,నన్ను తప్పుగా అర్ధం చేసుకోకండి,అసలు విషయం చెప్పనా ,మనిషి పరిచయం కాగానే ‘మీరు ఏమిటోళ్లు “ అని అడగడం సర్వ సాధారణం. ఈ విషయంలో మీ పరిచయం నాకు కళ్ళు తెరిపించింది,మనిద్దరం ఇక ముందు మంచి స్నేహితులం,’’అని లేచినిలబడి గట్టిగా కౌగలించుకున్నాడు. నిజంగానే అప్పటి నుండి ఇప్పటి వరకూ మేము మంచి స్నేహితులుగానే మిగిలిపోయాం. ఆయన జీవితానికి సంభందించి నా చిరు సలహాలు కూడ హృదయ పూర్వకంగా స్వీకరించేవాడు కుల వివక్షత అనేది రావడానికి ఒక అవతల వ్యక్తిని తప్పుపట్టడం సరికాదని నా అనుభవం నాకు నేర్పింది. వృత్తి పట్ల శ్రద్ధ ,క్రమశిక్షణ,సేవాభావం ,అందరితో కలిసిపోయే స్వభావం ఉంటే ,మనకు మనం గిరిగీసుకునే తత్త్వం మానుకుంటే,ఇలాంటి సమస్యలు పెద్దగా ఉత్పన్నం కావని నా ప్రఘాడ విస్వాసం. వెనుక వినబడే అనవసర కామెంట్లను ఎవరూ ఆపలేరు ,అది వేరే విషయం ,మనకు అనవసరం కూడా !ప్రతి అనుభవం ఒక జ్ఞాపకంగా మాత్రమే మిగిలిపోక ,జీవితాలను సరిదిద్దుకునే అవకాశాలు మెండుగా కల్పిస్తుందన్నది మాత్రం అక్షరాలా నిజం !!