కర్నాటక తీర్థయాత్రలు / విహారయాత్రలు - కర్రా నాగలక్ష్మి

karnataka teerdhayatralu

ఇంతవరకు మనం కర్నాటకలోని పుణ్యక్షేత్రాలను గురించి తెలుసుకున్నాం , ఈవారం మనం కొన్ని విహారస్థలాలను గురించి తెలుసుకుందాం .ముఖ్యంగా కర్నాటక లోని దక్షిణ కన్నడ , శిమోగ , చిక్కమగళూరు లలో చాలా ప్రదేశాలు విహారస్థలాలుగా ప్రసిద్ది కెక్కాయి , అయితే ఊటీ కొడైకెనాలులతో పోలిస్తే ఇవి అంతప్రాముఖ్యతని పొందలేదనే చెప్పాలి , అందువల్లే యివి చాలాస్వఛ్చంగా  ప్రశాంతంగా వుంటాయి . మనుషులుకూడా అమాయకంగా వుంటారు .  ముఖ్యంగా పడమటికనుమలలో వున్న ఈ ప్రదేశాలు చక్కని ప్రకృతి మధ్య ప్రశాంతంగావుంటాయి .      ముందుగా మనం చికమగళూరు జిల్లా గురించి చెప్పుకుందాం . ఈ జిల్లాలో కుద్రేముఖ్ , కెమ్మనగుండి ముఖ్య పర్యాటక స్థలాలుగా చెప్పుకోవచ్చు . చికమగళూరు జిల్లాకి చెందిన పడమటి కనుమలలో తుంగ , భద్ర , నేత్రావతి నదులు పుట్టేయి . ఈ జిల్లాలోనే పడమటి కనుమలలో అతి యెత్తైన ‘ ముల్లయానగిరి ‘ కూడా వుంది , పడమటి కనుమలలో ప్రతీరోజూ వానపడుతూనే వుండడం వల్ల అనేక చిన్నపెద్ద జలపాతాలుకూడా వున్నాయి .

ఉడిపి నుంచి  సుమారు 90 కిలోమీటర్ల  దూరంలోను బెంగళూరు నుంచి 330  కిలోమీటర్ల దూరంలోనూ  వుంది  కుద్రేముఖ్ .  చికమగళూరు  జిల్లాలో ‘ మడికెరి ‘ తాలూకాలో వుంది కుద్రేముఖ్ .     సుమారు 1892  మీటర్ల యెత్తున్న గుర్రపుమొహం  ఆకారంలో వుండే పర్వతశిఖరం దగ్గరవున్న వూరుకి కుద్రేముఖ్ ( గుర్రపు మొహం ) అనేపేరు స్థిరపడింది . ఇది పడమటి కనుమలలో వున్న రెండో యెత్తైన శిఖరం . 2006 వరకు యిక్కడ కుద్రేముఖ్ గనులనుంచి ఇనుపఖనిజం కోసం త్రవ్వకాలు జరిగేవి , 2006 లో  త్రవ్వకాల వల్ల పర్యావరణానికి హాని కలుగుతోందని మూసివేసేరు . కుద్రేముఖ్ లో ‘ కుద్రేముఖ్ ఐరన్ ఓర్ కంపెనీ వారి కాలనీ వుంది . ఈ ప్రాంతమంతా ఓవైపు కొండలమీద దట్టమైన అడవి మరో పక్క పచ్చని పచ్చిక మైదానాలతో చాలా అందంగా వుంటుంది . వాతావరణం , కొండలు , పచ్చికమైదానాలు అన్నీ కూడా ఉత్తరాఖంఢ్ లోని రాణీ ఖేత్ ని గుర్తుకు తెస్తాయి , తేడా యేమిటీ అంటే అక్కడ శీతాకాలంలో హిమపాతం జరుగుతుంది , పడమటి కనుమలలో  అలాంటిది వుండదు . కుద్రేముఖ్ ఇప్పుడిప్పుడే మంచి వేసవి విడిదిగా ప్రాముఖ్యతని పొందుతోంది .కుద్రేముఖ్ కి దగ్గరగా భగవతి , వరాహ మూర్తులకు మందిరాలు వున్నాయి .రోజులో కొన్ని గంటలు వానపడుతూ వుండడండం వల్ల ప్రతీ వస్తువూ పాకుబట్టి వుండడం కనబడుతుంది , చెట్లమీద రకరకాల ఆర్కిడ్స్ పెరుగుతూ వుంటాయి , ప్రతీ ఇంటి పైకప్పు పైనా గడ్డి , ఆర్కిడ్లు పెరుగుతూ కనిపిస్తాయి , ఇలాంటి దృశ్యాలు మిగతా వేసవి విడుదలలో చాలా తక్కువగా కనిపిస్తాయి . కుద్రేముఖ్ అభయారణ్యం లో సింహం జూలుని పోలిన జూలుతో వుండే కోతులు , ఎలుగుబంటి , లేళ్లు మొదలయిన జంతువులను చూడొచ్చు . రకరకాల పక్షిజాతులు కనబడతాయి . మడికెరి కూడా ఓ వేసవి విడిదే , ‘ ముద్దురాజ కెరి ( ముద్దురాజుగారి వూరు ) ‘ మడికెరిగా మారిపోయింది . 600  సంవత్సరం  నుంచి  1834  వరకు  పరిపాలించిన  ‘ హలెరి ‘  వంశానికి  చెందిన  ‘ ముద్దురాజు ‘  ఈ  ప్రదేశాన్ని  చదును  చేయించి  మట్టి కోటను  నిర్మించేడు ,  టిప్పు సుల్తాను దానిని పటిష్టం చేయించేడు .

ప్రశాంతమైన వూరు , హాయిగా కమ్మని కాఫీ తాగుతూ ,  అలా వీధులంట నడుస్తూ కాలక్షేపం  చెయ్యడానికి  చాలా బాగుంటుంది . నగరకాలుష్యం నుంచి  తప్పించుకోడానికి అనువైన ప్రదేశం . కొండల అంచులలో పెరుగుతున్న కాఫీ చెట్లు వాటి కాయలను పళ్లను చూస్తూ నడవడం గమ్మత్తుగా వుంటుంది . టీ తోటలు కనుచూపు మేరవరకు ఒకే విధంగా కత్తిరించబడి వుంటాయి కానీ కాఫీతోటలు అడ్డదిడ్డంగా పెరిగి నిండా కాయలతో నిజంగా యిదికాఫీచెట్టా అని అనిపిస్తూ వుంటుంది . ఊరికి కాస్త దూరంలో ‘ గద్దిగె ‘ సమాధి వుంటుంది , సమాధులు చూడడం నాకు నచ్చదు అందుకే దగ్గరగా వెళ్లలేదు , సమాధి గురించిన వివరాలు తెలీవు . చికమగళూరు జిల్లాలో వున్న మరో వేసవి విడిది ‘ కెమ్మనగుండి ‘ దీనిని కెంపు + మన్ను + గుండి అంటే యెర్రటి మన్నుతో కూడిన ప్రదేశం గా పిలువబడుతూ కెమ్మనగుండిగా రూపాంతరం చెందింది . దీనిని ‘ కృష్ణరాజేంద్ర ‘ వేసవి విడిది అని కూడా అంటారు . కృష్ణరాజేంద్రవడయార్ -4 వేసవి లో యిక్కడ గడిపేవాడట అతని పేరుమీద కృష్ణరాజేంద్ర వేసవివిడిది అనే పేరొచ్చింది . మడికెరి నుంచి ప్రతీగంటకీ బస్సు సదుపాయం వుంది . మడికెరి కన్నా చాలా యెత్తులో వుండడం వల్ల ప్రాయాణం అంతా ఘాటురోడ్లో సాగుతుంది . మబ్బులను చీల్చుకుంటూ చేసే ప్రయాణం చాలా బాగుంటుంది . మడికెరిలో కన్నా యిక్కడ కాస్త పర్యాటకుల సంఖ్య యెక్కువగా కనిపిస్తుంది . వాతావరణం తేమగా చాలా చల్లగా వుంటుంది . ఎక్కడచూసినా మబ్బులు దూదిపింజెలు వెదజల్లినట్లుగా అని పిస్తూవుంటుంది , కొన్ని మబ్బులు మన శరీరాలను తాకుతూ పోతూ చలిని కొన్ని మబ్బులు చిరుజల్లుని వదిలి పోతూ వుంటాయి . కెమ్మనగుండిలో రాజభవనం ఒక ఆకర్షణ . కర్నాటక ప్రభుత్వం వారిచే సంరక్షించబడుతున్న రోజ్ గార్డెన్ , రాక్ గార్డెన్లు చాలా ముచ్చటగా వుంటాయి . రోజ్ గార్డెన్లో వున్న గులాబీ రకాలు చాలా ముచ్చటగా వుంటాయి . కెమ్మనగుండిలో వున్న మిగతా ముఖ్యపర్యాటక స్థలాల గురించి తెలుసుకుందాం . 

ములయానగిరి ——

పడమటి కనుమలలో అతి యెత్తైన శిఖరం ములయానగిరి . ‘ ములప్ప స్వామి ‘ యీ కొండపైన వున్న గుహలలో తపస్సుచేసుకున్నాడట , కొండపైన అతని సమాధి వుంది , పూర్వం సమాధిచేరుకోడానికి రాతి మెట్లు వుండేవట , ప్రస్తుతం చాలా సన్నని కాలిబాట తప్ప మరేమీ లేదు , ఔత్సాహిక పర్వతారోహకులు మాత్రం వెళుతూ వుంటారు .

హెబ్బ జలపాతం ——

రాజభవనం నుంచి సుమారు 8 కిలోమీటర్లు కొండదిగితే అక్కడ హెబ్బ జలపాతం చూడొచ్చు . మబ్బులను తాకుతూ జలపాతం చూడడం ఓ అనుభవం , ఎన్నోజలపాతాలని చూసేం ఒక్కోజలపాతానిది ఒక్కో అందం , ప్రకృతి మనకి యిచ్చిన బహుమతి అంతే.

కలత్తి జలపాతం ——— కలత్తి లేదా కలహత్తి జలపాతం కెమ్మనగుండి నుంచి ‘ తరికెరి ‘ వెళ్లేదారిలో పదికిలోమీటర్లు ప్రయాణించేక చీలిక దారిగుండా ప్రయాణించి చేరుకుంటాం . ఈ జలపాతం సుమారు 125 మీటర్ల యెత్తునుంచి పడుతూ వుంటుంది . 
బాబుబుదనగిరి———- పశ్చిమ కనుమలలో వున్న మరో యెత్తైన శిఖరం బాబుబుదనగిరి . ఈ శిఖరం మీద దర్గా , దత్తపీఠం వున్నాయి . ఇప్పుడు మనం కర్నాటకలో ‘ ఉత్తర కన్నడ ‘ జిల్లాలో వున్న అతి పెద్ద పర్యాటక స్థలమైన ‘ జోగ్ ‘ జలపాతాల గురించి తెలుసుకుందాం . నాకు తెలుసు మనలో చాలా మంది వీటిని చూసే వుంటారు , అద్భుతం అని కూడా అనిపించే వుంటుంది అయితే యిప్పుడు వివరంగా తెలుసుకుందాం . హుబ్లి నుంచి 130 కిలోమీటర్లు , బెంగుళూరునుంచి 340 కిలోమీటర్లు , మంగళూరునుంచి 200 కిలోమీటర్ల దూరం లో వున్నాయి జోగ్ ఫాల్స్ . అసలు వీటిని జోగ్ ఫాల్స్ అని గాని జోగ్ జలపాతాలు అని గాని అనకూడదు యెందకంటే జోగ్ అంటేనే జలపాతం అని అర్దం , మనం మనకి తెలియకుండా యిలాంటివెన్నో వాడెస్తూ వుంటాం , అలాంటిదే ‘ నాథుల్లా పాస్ ‘ స్థానిక భాషలో లా అంటే పాస్ అని అర్దం , నాథుల్లా అంటే సరిపోతుంది లేదా నాథుపాస్ అంటే సరిపోతుంది కాని మనం ‘ నాథుల్లా పాస్ ‘ అనే వ్యవహరిస్తాం . అలగే యీ జోగ్ ఫాల్స్ కూడా . శరావతి నది మైదానాలలో ప్రవహించి వస్తూ ఇక్కడ కొండపైనుంచి కిందకి ప్రవహించడం వల్ల యేర్పడ్డ జలపాతాలివి . ఇవి పూర్తిగా వర్షాధారం , వర్షాలుపడి శరావతి నదిలో నీటి ప్రవాహం యెక్కువైనప్పుడు యీ జలపాతాలు పర్యాటకులకు కనువిందు చేస్తాయి , వర్షాలు సరిగ్గా కురవలేదు అంటే మాత్రం పర్యాటకులకు నిరాశే . ఇక్కడకి వెళ్లదల్చుకున్నవారు ముందుగా వివరాలు సేకరించి వెళితే మంచిది . మనదేశంలో వున్న అతి యెత్తైన జలపాతాల జాబితాలో జోగ్ రెండవ స్థానంలో వుంది . మొదటి స్థానంలో మేఘాలయ ‘  లో వున్న ‘ నోహ్కలికై ‘ వుంది . ‘ నోహ్కలికై జలపాతం సుమారు 1,115 అడుగుల యెత్తునుంచి పడుతూ వుంటే , జోగ్ సుమారు 835 అడుగుల యెత్తునుంచి పడుతున్నాయి . వర్షాకాలంలో పూర్తి స్థాయు జలపాతం పొడవు సుమారు 250 మీటర్లు నాలుగు ముఖ్యమైన జలధారలతో కూడుకొని వుంటుంది . వీటి ప్రవాహవేగాన్ని దృష్టిలో వుంచుకొని వీటికి రాజ , రోరర్ , రాకెట్ , రాణి జలపాతాలని అంటారు . నీటి ప్రవాహం నుంచి ఎలక్ట్రసిటి ఉత్పత్తి కోసం లింగనమక్కి  ఆనకట్ట నిర్మాణం చేసేరు . దీనికి ‘ కృష్ణరాజేంద్ర హైడ్రో ఎలక్ట్రికల్ పవర్ ప్లాంటు ‘ గా నామకరణం చేసేరు . 1960 లో దీనిని ‘ మహాత్మగాంధీ హైడ్రొ ఎలక్ట్రికల్ పవర్ ప్లాంటు ‘ గా మార్చేరు . జోగ్ కి దగ్గరగా వున్న రైల్వే స్టేషను ‘ సాగర్ ‘ . సాగర్ భద్ర అభయారణ్యంలో వున్న గ్రామం , ఇక్కడవుండి అభయారణ్యం చుట్టి రావొచ్చు . దీనిని టైగర్ రిజర్వ్ గా కూడా గుర్తించేరు . ఇక్కడ దుర్లభ జాతిగా గుర్తించిన ‘ మలబారు పునుగు పిల్లిని ‘ చూడొచ్చు . చరుతలు , లేళ్లు , కోతులు , ఎలుగులు , నక్కలు , అడవికుక్కలు మొదలైన జంతువులు , రకరకాల పక్షులకు ఆవాసం భద్ర అభయారణ్యం . కర్నాటక అడవులలో గంధం చెట్లు విరివిగా వున్నట్లు వో అంచనా , సాగరు , బత్కల్ ప్రాంతాలలో గంధం చెక్కలతో చేసిన కళాకృతులు , గంధం చెక్కలు సరసమైన ధరలకు విరివిగా దొరుకుతాయి . భద్ర అభయారణ్యం శిమోగ , దక్షిణ కన్నడ , ఉత్తర కన్నడ , చికమగళూరులను కలుపుతూ మధ్యగా వుంటుంది , ఈ అభయారణ్యం చేరుకోవాలంటే నాలుగు జిల్లాలనుంచి వెళ్లొచ్చు .

జీవితంలో ఒక్కసారైనా దర్శించుకో దగ్గ ప్రదేశం ‘ జోగ్ ‘ అని చెప్తూ యీ వారం మీదగ్గర శలవు తీసుకుంటున్నాను . వచ్చేవారం ‘ హసన్ ‘ గురించి తెలియజేస్తాను , అంతవరకు శలవు .  

మరిన్ని వ్యాసాలు

పాలెగాళ్ళు.
పాలెగాళ్ళు.
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
పురాణాలలో ఒకే పేరు ఉన్నవారు.4.
పురాణాలలో ఒకే పేరు ఉన్నవారు.4.
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
సినిమా గీతాలలో  షెహనాయ్ వాద్యం.
సినిమా గీతాలలో షెహనాయ్ వాద్యం.
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
పురాణాలలో ఒకే పేరు పలువురికి -3
పురాణాలలో ఒకే పేరు పలువురికి-3
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
108
108
- శ్రీరామ్ లక్ష్మీనారాయణ మూర్తి