పాల పళ్ళు ఎందుకు ? - -డా. కె. ఎల్. వి. ప్రసాద్.

why

పిల్లలు పాలు తాగే సమయంలోనూ ,పాలు తాగడం మానేసే సమయంలోనూ,దౌడలలో వుండే పళ్ళను ‘పాలపళ్ళు ‘అంటారు. సాంకేతిక పరంగా ఆంగ్లంలో వీటిని ‘డేసి డ్యుయష్ టీత్ ‘అంటారు. వీటి మనుగడ దౌడ లలో తాత్కాలికమే గానీ,వీటి నిలకడ తనం రాబోయే స్థిర దంతాలకు ఎంతగానో అవసరం పడతాయి. అందుకే స్తిరదంతాలకు వీటిని పునాది రాళ్లుగా ను , మార్గ దర్శనం చేసే దంతాలుగాను చెబుతారు. పాపగానీ ,బాబు గానీ,పుట్టిన ఆరునెలలకు మొదటి పన్ను సాధారణంగా క్రింది దౌడ లో వస్తుంది. అలా అని అందరిలోనూ,మొదట క్రింది దౌడలోనే రావాలనే నియమం ఏమీ లేదు. కానీ ఎక్కడ వచ్చినా ముందరి పళ్ళు మాత్రమే వస్తాయి. ఈ పన్ను రాగానే పసిపాప ముఖం లో,నవ్వులో ముద్దొచ్చే మార్పు వస్తుంది. బిడ్డ ఎదుగుదలను ఇలాంటి మైలు రాళ్లు సూచిస్తాయి కనుక తల్లి దండ్రులకు ఈ మార్పులు ఎంతో సంతోషాన్ని కలిగిస్తాయి. ఈ విధంగా ఒక్కో వయసులో ఒక్కో పన్ను వచ్చి క్రింది దౌడలో పది ,పై దౌడలో పది మొత్తం ఇరవై పళ్ళు ఉంటాయి. సంఖ్యా పరంగా ఇవి స్థిర దంతాలకంటే తక్కువగా ఉంటాయి. జ్ఞాన దంతాలు ,చిన్న విసురుడు దంతాలు పాల పళ్లల్లో వుండవ్వు. ఆ వయసులో తినగలిగే ఘనపదార్ధాల కోసం,ఆ పళ్ళు అవసరం చాలు. ఈ పాల పళ్ళు దౌడలలో రెండు సంవత్సరాల కాలంలో వాటి రాకడ పూర్తి అయి ,అవి ఆరేళ్ళ వయసు వచ్చేవరకూ అదేవిధంగా నిలకడగా ఉంటాయి. ఈ మధ్య కాలంలో పాలిచ్చే తల్లి సకాలంలో పాలు ఇవ్వడం ఆపకపోతే తల్లి రొమ్ముకు ,గాయం అయ్యే పరిస్థితి ఏర్పడుతుంది. అందుచేత పిల్లల వైద్య నిపుణుల సలహా మేరకు సకాలంలో స్తన్యం ఇవ్వడం మానుకోవాలి. కొరకకూడదు అనే జ్ఞానం ఈ వయస్సులో పిల్లలకు ఉండదు కనుక జాగ్రత్తలు మనమే తీసుకోవాలి. ఈ విషయంలో పిల్లలిని తిట్టడం , కొట్టడం సరికాదని తెలుసుకోవాలి. నిజానికి,పిల్లల జీవితంలో,మొదట పాకడం,కూర్చోవడం,నడక నేర్చుకోవడం,చిన్న.. చిన్న.. శబ్దాలు చేయడం,అలాగే దౌడ లలో మొదటిసారి పళ్ళు రావడం మైలు రాళ్లుగా నిలిచిపోతాయి. బిడ్డ పుట్టినప్పటికే పళ్లతో పుడతాడు,కానీ అవి ‘పంటి మొగ్గ ; స్థాయిలో ఉంటాయి. పంటి మొగ్గలు క్రమంగా అభివృద్ధి చెంది పళ్ళుగా రూపాంతరం చెందుతాయి. ఇలా పన్నుగా మారి చిగురును చీల్చుకుని పైకి రావడాన్ని ‘ టీతింగ్’అంటారు.

పళ్లు వచ్చేటప్పుడు -

కనిపించే సాధారణ లక్షణాలు 

1)దురద -చికాకు. 
2)నొప్పి కలిగించే వాచిన  చిగురు/చిగుళ్లు. 
3)సొల్లు కార్చడం 
4)నిద్ర లేమి. 
5)తిండిని తిరస్క రించడం. 
6)చిగురు క్రింద పన్ను కనిపించడం.  అలా అని పళ్ళు వచ్చే పిల్లలందరికీ పై లక్షణాలన్నీ కనిపించాలనే నియమం ఏమీ లేదు. కనిపిస్తే కనుక పాప /బాబు కి,పళ్ళు వస్తున్నట్టుగా నిర్ధారించ వచ్చు. పిల్లలకు దద్దుర్లు గానీ,జ్వరం ,వాంతులు -విరేచనాలు,పళ్ళు వచ్చే సమయంలో కనిపిస్తే వాటిని ఆషామాషీగా తీసుకోరాదు. ఈ లక్షణాలు 24 గంటలు మించి ఉంటే తప్పనిసరిగా పిల్లల వైద్య నిపుణులకు చూపించాల్సి ఉంటుంది. పళ్ళువచ్చే సమయంలో పిల్లలు కనిపించిన ప్రతి వస్తువును నోట్లో పెట్టుకుని కొరకడమో,చీకడమొ చేస్తుంటారు. వీటి ద్వారా బాక్తీరియా,వైరసులు సులభంగా శరీరంలో ప్రవేశించి కొన్ని వ్యాధులకు కారణం అయ్యే అవకాశమూ,ప్రమాదమూ పొంచి ఉంటాయి.

పాల పళ్ళు ఎందుకు ?

బాల్యంలో బిడ్డ ఎదుగుదల క్రమంలో పాలపళ్ళు పాత్ర ఎంతో ప్రత్యేకతను సంతరించుకుని వుంది. పిల్లలు -నమలడం లో,మాట్లాడడం లో,చక్కగా నవ్వడంలో ఇవి ఎంతగానో ఉపయోగ పడతాయి. రాబోయే స్థిర దంతాల కోసం దౌడలో సరి పడినంత స్థలాన్ని ఇవి జాగ్రత్తపరుస్తాయి. ప్రక్రుతి సిద్ధంగా ఊడవలసిన సమయంకంటే ఏదైనా పాలపన్ను ముందుగా ఊడిపోతే,రాబోయే స్థిర దంతం పక్కలకు వంగి పోతుంది. దీనినే ‘ డ్రిఫ్టింగ్’ అంటారు.తద్వారా ఎత్తు పళ్ళు,ఎగుడు-దిగుడు పళ్ళు,వంకర -టింకర పళ్ళు వస్తాయి. అందుకే చిన్న పిల్లల దంత సంరక్షణ చాలా ముఖ్యమైనది. 5-7 నెలల లోపు పిల్లల్లో పళ్ళు రానంత మాత్రాన తల్లిదండ్రులు భయంతో తల్లడిల్లి పోనవసరం లేదు. ఒకవేళ 18 నెలల వయసు వచ్చిన పళ్ళు రాకుంటే అప్పుడు మాత్రం తప్పక పిల్లల దంతవైద్యుని(పీడో-డా న్టిస్ట్ )ని సంప్రదించ వలసి ఉంటుంది.

జాగ్రత్తలు:

పాలపళ్ళు తాత్కాలికమని ,అవి త్వరలో రాలిపోయే పళ్ళనీ వాటి విషయంలో పెద్దగా జాగ్రత్తలు తీసుకొన వలసిన అవసరం లేదనే మూఢ నమ్మకం ఇంకా ఈ ఆధునిక తల్లి దండ్రుల్లోకూడా వుంది. కానీ అది సరి అయిన ఆలోచన కాదు. ఈ స్థాయిలో కూడా దంత సంరక్షణ -నోటి పరి శుభ్రతల ఆవశ్యకత ఎంతగానో వుంది ! బిడ్డ దవుడ లో పళ్ళు రాకముందునుంచి కూడా ,స్తన్యం ఇచ్చినవెంటనే తల్లి పరిశుభ్రమైన మెత్తని పొడి బట్టతో చిగుళ్లు సున్నితంగా,వత్తాలి. పళ్ళువచ్చిన తర్వాత కూడా ,ఘన పదార్ధాలు తినే వయస్సు వచ్చేవరకూ,శుభ్రమైన మెత్తని పొడి బట్టతో ప్రతి దినం శుభ్రం చేయాలి . నోట్లో వేసుకున్న నీళ్లు వుమ్మే అలవాటు వచ్చిన తర్వాత,పిల్లలకు పిల్లల టూత్ బ్రష్ ,పేస్ట్ ప్రారంభించి దంతధావనం మొదలు పెట్టవచ్చు. ద్రవ /ఆహార పదార్ధాలు పిల్లలకు ఇచ్చినప్పుడు,ముఖ్యంగా అతుక్కునే గుణంగల బిస్కెట్లు కేక్ లు పిల్లలకు పెట్టినప్పుడు తప్పని సరిగా నోరు పుక్కిలించే అలవాటు చేయాలి చిన్నతనం నుంచి నాలుక గీసుకోవడం కూడా అలవాటు చేయాలి. 

మరిన్ని వ్యాసాలు

వివేకానంద రాక్ మెమోరియల్ స్థపతిశ్రీ.ఎస్.కె ఆచార్య
స్థపతిశ్రీ.ఎస్.కె ఆచార్య
- కుందుర్తి నాగబ్రహ్మాచార్యులు
రాజస్తాన్ ప్రాంత నిర్మాణ విశేషాలు
రాజస్తాన్ ప్రాంత నిర్మాణ విశేషాలు
- కుందుర్తి నాగబ్రహ్మచార్యులు
Kanyakumarilo vunna tiruvalluvar vigraham nirmana charitra
తిరువళ్లువర్ విగ్రహం నిర్మాణ చరిత్ర
- కుందుర్తి నాగబ్రహ్మాచార్యులు
శ్రీసాయి లీలామృతం
శ్రీసాయి లీలామృతం
- సి.హెచ్.ప్రతాప్
మా చార్ధామ్ యాత్ర-2
మా చార్ధామ్ యాత్ర-2
- కర్రా నాగలక్ష్మి