కర్నాటక తీర్థయాత్రలు / విహారయాత్రలు - కర్రా నాగలక్ష్మి

karnataka teerdhayatralu

( బేలూరు చెన్నకేశవ మందిరం ) కిందటివారం పచ్చని కొండలు జలపాతాలలో విహరించేం కదా ? ఈ వారం అద్భుతమైన శిల్పకళని సందర్శిద్దాం . రాజుల సొమ్ము రాళ్లపాలు అనే సామెత వూరికే రాలేదు కాని అలా రాళ్లపాలు చేసి అద్భుతమైన శిల్పసంపదని మనకి వదిలి పోయిన రాజులను వందలసంవత్సరాలు గతించినా గుర్తుంచుకున్నామంటే అదివారు నిర్మించిన కట్టడాలవల్లే కదా ? , అదే రాజులు వాళ్లుతిని పిల్లలకు పెట్టుకొని లేదా రాజ్యకాంక్షతో కొట్టుకు చచ్చినవాళ్లు కొన్ని వందలలో వున్నా మనం వారిని తలుచుకోం , తలచుకోడానికి వాళ్లపేర్లే తెలీవు . అలాంటి అద్భుతమైన శిల్పకళ యెక్కడుందో తెలుసుకుందాం . బెంగళూరుకి 200 కిలోమీటర్ల దూరంలో వున్న’ హసన్ ‘ నగరానికి సుమారు 35 కిలోమీటర్ల దూరంలోనూ , చికమగళూరికి 22 కిలోమీటర్ల దూరంలోనూ వున్న ‘ బేలూరు ‘ గురించి ఈ రోజు చదువుదాం . 1000 సంవత్సరం నుంచి పదమూడు వందల మధ్యవరకు దక్షిణదేశాన్ని పరిపాలించిన ‘ హోసల ‘ రాజుల రాజధానిగా వుండేది . దీనిని బెలహూరు , వేలూరు , వేలాపురి గా పిలువబడుతూ ప్రస్తుతం బేలూరు గా మారింది . హోసల రాజులు సుమారు 350 సంవత్సరాలు పరిపాలన సాగించేరు , ఈ కాలంలో వారు సుమారు 1500 కు పైబడి పెద్దచిన్న మందిరాలు నిర్మించేరు . అంటే సగటున యేడాదికి 5 మందిరాలు నిర్మించేరన్నమాట , చాలా గొప్పవిషయం . వీరికాలంలో శిల్పకళ యెంతో అభివృద్ది చెందిందని చెప్పొచ్చు . బేలూరులోని ముఖ్య పర్యాటక ఆకర్షణ అక్కడవున్న ‘చెన్నకేశవ ‘ మందిరం . ఈ మందిరనిర్మాణం 1117లో ‘ విష్ణువర్ధనునిచే ప్రారంభించబడి 105 సంవత్సరాలు పట్టింది పూర్తవడానికి . అంటే విష్ణువర్ధనుని మనవడు పూర్తిచేసేడు . దీనిని మందిరం అనే బదులు మందిరసమూహం అంటే సరిపోతుంది .

ఈ మందిరం లోని శిల్పకళ అప్పటికి ప్రాచుర్యంలో వున్న అన్ని శిల్పకళల సమ్మేళనంగా చెప్తారు . ఇక్కడ శిల్పాలను చెక్కడానికి సోపురాయి ( సోప్ స్టోన్ ) ని వుపయోగించేరు . ఈ రాయి ప్రత్యేకతేమిటంటే రాయి శిల్పాలను మలచడానికి చాలా అనువుగా వుండి చిన్నచిన్న చెక్కడాలుకూడా చాలా చక్కగా వస్తాయట , ఆపైన వానాయెండలకి యీ రాయి చాలా గట్టిబడిపోతుందట , కాబట్టి చెక్కడానికి అనువుగా వుండి యెన్నోయేళ్లు పాడవకుండా వుంటుందని యీ రాయని వుపయోగించేరు . కొన్ని వందలమంది వందసంవత్సరాలు పడ్డకష్టం మనం యిప్పుడు చూస్తున్నాం .అయితే మధ్యలో వచ్చిన ముస్లిం రాజులు కొన్ని గంటలలో వీటిని నేలమట్టం గావించడం జరిగింది . అలా చాలా సార్లు జరిగినట్లు చరిత్రలో లిఖించబడింది . పోయినవి పోగా యిప్పటికీ చెక్కుచెదరకుండా చాలా శిల్పాలు వున్నాయి . తరువాత రాజ్యానికి వచ్చిన విజయనగర రాజులు ఈ మందిరంలో నవరంగ మంటపము , కొన్ని స్థంబాల నిర్మాణం చేసినట్లు శిలాశాసనాలు వున్నాయి , ఈమందిరంలో లభ్యమయిన 108 శిలాశాసనాల ద్వారా , యేయే నిర్మాణం యెప్పుడు జరిగింది , యెవరు పడగొడితే తిరిగి యెవరు మరమ్మత్తులు చేయించేరు మొదలైన వివరాలు వున్నాయి .

దేశ విదేశీ కళలను కలిపి కొత్త కళలను సృష్టించాలని , కొత్తదనాన్ని ఆహ్వానించాలని పదకొండవ శతాబ్దపు శిల్పులలో వుండేదని ఉత్తరాది , దక్షిణాది శిల్పకళలని మేళవించిన తీరు ఇక్కడి శిల్పాలు చెప్తాయి . శిల్పాలను చెక్కిన శిల్పులు మరణించేరు కాని వారు చెక్కిన శిల్పాల ద్వారా వారికి మరణం లేదు . ఇవి మనదేశపు సంపద , పొందవలసినంత ప్రాచుర్యం పొందలేదనేదే నా బాధ . నామమాత్రపు సదుపాయాలే వున్నాయి , ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ద చూపెడితే ఈ మందిరంలోని శిల్పాలు విదేశీ పర్యాటకులను ఆకర్షిస్తాయనడంలో యెంతమాత్రం అతిశయోక్తి లేదు . ప్రస్తుతంలోకి వస్తే ‘హసన్ ‘ నుంచి , ‘ చికమగళూరు ‘ నుంచి రవాణా సదుపాయాలున్నాయి . రెండు నగరాలలోనూ వసతి , భోజనసదుపాయాలు వున్నాయి .

1117 వ సంవత్సరంలో హోసల వంశానికి చెందిన ‘ విష్ణువర్ధన ‘ మహారాజు  ‘ యాగచ్చి ‘ నది వొడ్డున మందిర నిర్మాణం ప్రారంభించేడు . 105 సంవత్సరాలనంతరం అతని మనుమనిచే ఈ మందిరం పూర్తి చెయ్యబడింది . 12 వశతాబ్దం వరకు దీనికి ప్రహారీగోడ లేదు , తరవాత ప్రహారీగోడ , లోపల కొన్ని మంటపాలు , స్థంబాలు కట్టబడ్డాయి . ఇది మందిర సముదాయమని చెప్పుకున్నాంకదా ? ప్రహారీ గోడ లోపల చిన్నపెద్ద యెన్నో మందిరాలున్నాయి , ముఖ్య మందిరం ‘ చెన్నకేశవునిది ‘ . చెన్నకేశవుని మందిరానికి శిఖరం వుండదు , ముస్లిం రాజులు పడగొట్టారో లేక మరే ప్రకృతి విపత్తు వల్ల కూలిపోయిందో తెలీదు , పక్కగా వున్న ‘ చెన్నిగరాయ ‘ మందిరం రాణీగారి కోరికమేరకు నిర్మింపబడింది , దీనిని ‘ కప్ప చెన్నిగరాయ ‘ మందిరమని కూడా అంటారు . కప్ప చెన్నిగరాయ అని యెందుకు పేరొచ్చిందంటే చెన్నిగరాయ విగ్రహనిర్మాణం జరిగిన తరువాత విగ్రహం పొట్టలో కప్ప వున్నదని అది పూజకు పనికిరాదనే వాదన రాగా రాజు విగ్రహం పొట్టని పగులగొడితే అందులోంచి జీవించి వున్న కప్ప బయటకి వచ్చిందట , ఈ కధ నాకు ‘ అమరశిల్పి జక్కన్న ‘ సినిమాని గుర్తుకు తెచ్చింది ,  అయితే ఇక్కడ శిల్పి పేరు తెలీదు . వేరువేరు కధలు కావొచ్చు .

విజయనగర సామ్రాజ్య స్థాపకుడు హరిహరరాయలు నిర్మించిన యేడంతస్థుల యిటుక గోపురం 19వ శతాబ్దంలో తిరిగి నిర్మించేరు . హరిహరరాయలు నిర్మించిన గరుడస్థంబం మందిరంలో చూడొచ్చు . విజయనగరరాజులు అమ్మవారు ‘ సౌమ్యనాయకి ‘ మందిరం , నాగనాయక మందిరాలను , నవరంగమండపాలను నిర్మించేరు . విజయనగర పతనానంతరం యీ కోవెల మొదటిసారి ముస్లిం పరిపాలకుల చేతిలో పడగొట్టబడింది . తరవాత చాలా సార్లు నిర్మించబడింది , పగులకొట్టబడింది కూడా . 19 శతాబ్దంలో ‘ చెన్నిగరాయ ‘ మందిరాన్ని పునఃనిర్మించేరు . పగులగొట్టబడ్డతరువాత మిగిలినది యిప్పుడు మనం చూస్తున్న మందిరం . చెన్నకేశవమందిరం బయట ప్రదక్షిణ ప్రాకారం చుట్టూ ప్రదక్షిణ చేస్తూ కోవెల వెలుపల వున్న శిల్పాలు చూడ్డానికి రెండు కళ్లుచాలవు , చిన్నచిన్న శిల్పాలు పట్టీలలో చెక్కేరు , ఓ పట్టీలో రకరకాల విన్యాసాలు చేస్తున్నట్లుగా వున్న ఏనుగులు , వాద్యకారులు , సుందరీమణులు , నర్తకులు , పూలు , పళ్లు , పులులు , పక్షులు ఒకటేమిటి యెన్నెన్నో . ముందు చెన్నకేశవుని దర్శించుకుందాం , గర్భగుడి ద్వారానికి జయవిజయులు కాపలాకాస్తూ వుండగా ద్వారం పైన లక్ష్మీనారాయణులు , వారికి యిరువైపులా మకరాలపైన కూర్చొని వున్న ‘ వరుణుడు ‘ , ‘ వరుణి ‘ లను చూడొచ్చు . క్రిందన వివిధ వాద్యాలతో వాద్యకారుల శిల్పాలు చూడొచ్చు . గర్భగుడిలోపల మూడడుగుల అరుగుపైన ప్రతిష్టించిన ఆరడుగుల ‘ చెన్నకేశవుడు పైనున్నరెండుచేతులలో శంఖం , చక్రం దిగువనున్న చేతులలో గద, కలువపువ్వులను ధరించి నిల్చున్నట్లుగా వుంటాడు . వృత్తాకారంలో పైన దశావతారాలు చూడొచ్చు . 

చెన్నకేశవాలయానికి ఎడమవైపున ‘ వీరనారాయణ మందిరం వుంది ఈ మందిరం చిన్నదే అయినా ‘ నవరంగ మంటపం , గర్భగుడిలతో వుంటుంది . ఈ కోవెల చెన్నకేశవమందిరానికి నమూనా అని అంటారు , అందుకే ఈ మందిర విమానగోపురం లానే చెన్నకేశవ మందిర విమానగోపురం వుండేదని వూహించుకోవచ్చు . ఆగ్నేయంగా వున్న అమ్మవారి మందిరంలో అమ్మవారు ‘ రంగనాయకి ‘ గా పూజలందుకుంటోంది . అమ్మవారి కోవెలమీదచెక్కిన ఏనుగులు పువ్వులే కాక సుమారు 30 వివిధ దేవీదేవతల శిల్పాలు చూడచక్కగా వుంటాయి . వేణుగోపాలుడు , మోహిని , లక్ష్మి , యెన్నో పురాణ ఘట్టాలు చాలా చక్కగా చెక్కేరు . ఈ మందిర సమూహంలో నరసింహ , రామ , జియ్యరు , ఆళ్వారులు , అమ్మవారి మందిరం పక్కన కృష్ణ, వేదాంతదేశిక , భాస్కరాచార్య , ఆర్యభట్ట , రామానుజ మందిరాలు వున్నాయి , వీళ్లని పదకొండవ శతాబ్దపు కోవెలలో యెలా చెక్కేరు అనే సందేహం వద్దు , ఆయా విగ్రహాలను వారి తరువాత మలిచేరని అక్కడ దొరికిన శిలాశాసనాలలో లఖించేరు . అక్కడవున్న రెండు రాతి స్థంబాలలో ఒకటి దీపస్థంబం దీనిని హోసలరాజులు నిర్మించేరు , రెండవది గరుడ స్థంబం దీనిని విజయనగర రాజులు నిర్మించేరు .

వీరనారాయణ మందిరందగ్గరవున్న వాహనమండపంలో ప్రతీ యేడాదీ నిర్వహించే రథాయాత్రలో వుపయోగించే రథం వుంటుంది . 17 వ శతాబ్దంలో నిర్మించిన కళ్యాణ మంటపం లో వుత్సవాలు నిర్వహిస్తారు. అమ్మవారి కోవెల పక్కగా ధాన్యాగారం పాకశాలలు వుంటాయి , ఎదురుగా మెట్లతో వున్న పుష్కరిణి దీనిని కల్యాణి లేక కేశవసరోవరం అని అంటారు . ఇవీ ఈమందిర సముదాయంలో వున్న మందిరాలు , ఇక ఈ కోవెలలోని శిల్పాలగురించి తెలుసుకుందాం . చెన్నకేశవ మందిరం గోడలమీద హోసల రాజదర్బారు , కాళింది మర్ధన , హనుమ , గరుడ , వామనుడికి బలిచక్రవర్తి మూడడుగులు దానం చేసే ఘట్టం , శివుడు నంది , వినాయకుడు , కార్తికేయుడు , ప్రహ్లాద హిరణ్య కశిపులకు నరసింహావతారం స్థంబం నుంచి ప్రకటితమవడం . ప్రహ్లాదుడు టెంకాలి నామంతో వుండడం ( అంటే ఊర్ధ్వపుండరాలతో ) . యోగనృసింహస్వామి హనుమంతుడు గరుడులతో వున్నట్లు , అమృతమథనం , కంససంహారం , శేషశయన రంగనాధుడు , శివలింగం కొరకు యుద్దం చేస్తున్న హనుమంతుడు గరుడుడు , 40 శాలభంజికలు వీటిలో రెండు విరిగి పోగా మిగతా 38 బాగున్నాయి . నాట్యశాస్త్ర భంగిమలతో వున్న సుందరాంగులు , వాద్యకళాకారులు వివిధ వాయిద్యాలతో , స్త్రీలు అలంకరించుకుంటున్నట్లు గా చెక్కిన శిల్పాలు , చిలుకను చేత ధరించిన సుందరి ఒకటిని మించి ఒకటి వుంటాయి .

బొమ్మలు మాట్లాడతాయి అంటే నిజం అని అనిపించేటట్లుగా వుంటాయి ఈశిల్పాలు . దశావతారాలు , మహిశాసురమర్థని , రతీ మన్మధులు , వినాయకుడు , బ్రహ్మ , సరస్వతి , చంద్రుడు , మత్సయంత్రాన్ని ఛేదిస్తున్న అర్జనుడు , శివపర్వారసమేతంగా కైలాసపర్వతాన్ని యెత్తలేక కష్టపడపతున్న రావణుడు , దక్షుడు , బలిచక్రవర్తి , శుక్రాచార్యుడు ఒకటనేమిటి యెన్నో శిల్పాలు హావభావాలతో సహా చక్కగా చెక్కబడ్డాయి . బౌద్దమతానికి చెందిన బుద్దుని విగ్రహాలు , జైన తీర్థంకరుల విగ్రహాలు కూడా వున్నాయి . దీనివల్ల అప్పట్లో సర్వమతసమానవత్వం వుండేదని తెలుస్తుంది . మూడుతరాల శిల్పులచేతులలో చెక్కబడ్డ ఈ శిల్పాలను వర్ణించడం నా తరమా ? కాని చూసినవాటిని గురించి మీకు చెప్పకుండా వుండలేను కదా ? బేలూరు యెవరైనా వెళితే గనక తప్పక చూడవలసిన శిల్పాలు మరో రెంటింటి గురించి చెప్పి ముగిస్తాను .
ఒక చోట చెక్కబడ్డ శిల్పం గురించి చెప్తాను , ఆ శిల్పి పనితనం తెలియజేసే శిల్పం యిది .

పళ్లతో నిండిన చెట్టు , ఓ పండుమీద వాలిన ఈగ , ఆ ఈగను తినాలని వస్తున్న బల్లి యెంతబాగుందో ఆశిల్పం , ఆకులు , పళ్లు చెక్కిన తీరు అద్భుతమే . మరొక చోట గెద్ద పాముని పట్టుకోడానికి వస్తూ వుంటుంది , పాము పడగవిప్పి సింహాన్ని కాటువెయ్యాలని చూస్తూ వుంటుంది , సింహం ఏనుగుని చంపడానికి ఏనుగు పైకి లంఘిస్తూ వుంటుంది , ఏనుగు దారికి అడ్డంగా వచ్చిన పాముని కాలితో తొక్కాలని చూస్తూ వుంటుంది . ఓ ముని ఈ జంతువులన్నిటి చేష్టలూ చూసి ఆశ్చర్యపడుతూ వున్నట్లు చెక్కబడిన శిల్పంలో జంతువుల హావభావాలు , ముని ముఖకవళికలు మెచ్చుకోదగ్గవి . మందిరం తూర్పు గోడలకు భైరవ , దుర్గ విగ్రహాలు వుంటాయి . దక్షిణ గోడకి తాండవేశ్వరుడు , బ్రహ్మాణి , ఉత్తరగోడకు విష్ణుమూర్తి , మహిషాసుర మర్ధని విగ్రహాలు వుంటాయి . ఇక నవరంగ మండపంలో వున్న 48 స్థంబాలమీద వున్న నగిషీలు గాని విగ్రహాలు కాని ఒకదానిని పోలి మరొకటి వుండవు . ఈ మందిరం మనస్సుకి ప్రశాంతతనే కాదు కళ్లకి విందుని కూడా యిస్తుంది . వచ్చేవారం మరికొన్ని వివరాలతో మీ ముందుకు వస్తాను అంతవరకు శలవు .

మరిన్ని వ్యాసాలు