నా జ్ఞాపకాల్లోంచి ... - డా.కె.ఎల్ .వి.ప్రసాద్

 

 

‘ఇది  నువ్వే రాశావా..?’

ఒక్కోసారి ఎవరు ఎందుకు అలా .. మాట్లాడతారో అర్ధం కాదు. అర్ధం చేసుకునే శక్తి ఆ వయస్సులో ఉండవచ్చు, ఉండక పోవచ్చు కూడా. సందర్భంతో సంబంధం లేకుండా  ఎదుటి వ్యక్తి చేసే వ్యాఖ్యానాలు ఒక్కోసారి మానసికంగా కృంగదీస్తాయి. పరిస్థితిని బట్టి  అది ఏ స్థితిలోనికైనా పోవచ్చు. అది ఇంట్లో జరిగినా, బయట జరిగినా, జరిగే నష్టం ఎలాగూ జరుగుతుంది. సమస్య ఇంట్లో జరిగితే వివిధ రూపాల్లో దాన్ని సర్దుబాటు చేసుకునే అవకాశం ఉంటుంది. అదే బయటి వారితో జరిగితే పరిస్థితి వేరుగా ఉంటుంది. ఎవరో మనల్ని కావాలని అపహాస్యం చేస్తున్నట్టు, అవమాన పరుస్తున్నట్టు ఫీల్ అవుతాము. అంత మాత్రమే కాదు, ఒక్కోసారి, నిరుత్సాహం అహం, కోపం వంటి సమస్యలు ఉత్పన్నం కావచ్చు. తొందర పడితే అది ఎలాంటి అఘాయిత్యానికైనా దారి తీయవచ్చు, లేదా మన ప్రతిభను మరోసారి చాటి ఆ అసందర్భ వ్యాఖ్యానం చేసిన వారికి కనువిప్పు కలిగేట్లు కూడా చేయవచ్చు. సమస్య వచ్చేదల్లా, మనం ఢీ కొనవలసిన వ్యక్తి ఎలాంటివాడు, ఎంతటివాడు, ఎలా ఎదుర్కోవాలన్నది  ముఖ్య విషయం.

కొందరి మాటలు మనస్సులో ముళ్ళు గుచ్చుకున్నంత తీవ్రంగా ఉంటాయి. ఎంత అనుకున్నా సర్దుబాటు చేసుకోలేనంత ఆవేదన మనస్సులో కలుక్కుమనిపిస్తుంది. మొండి వాళ్లకు పెద్ద సమస్య ఉండదు గానీ, సున్నిత మనస్కులకు ఇది ఇబ్బంది కలిగించే అంశమే. ప్రతి వాళ్ళ జీవితంలోనూ ఎక్కడో ఒక చోట ఇలాంటి సన్నివేశాలు ఎదుర్కోక తప్పదు. సమస్యను ఎదుర్కున్న మార్గాలు వేరు విధంగా ఉండవచ్చు, ఎందుకంటె అందరికీ ఒకే రకమైన సమస్యలు ఎదురు కావు కదా! నేను చదువుకున్న కాలంలో ఎదుర్కున్న సమస్యను వివరిస్తాను. ఇది భవిష్యత్ లో చాలా మందికి అక్కరకు రావచ్చును.

**************

అవి నేను దంత వైద్య శాస్త్రం వృత్తి విద్యలో చేరిన రోజులు. అప్పటి వరకూ ఇలాంటి విద్య ఒకటి  ఉందని నాకు తెలవనే తెలవదు. 1975 లో నాగార్జున సాగర్ (హిల్ కాలనీ)లో ఇంటర్ మీడియెట్ పూర్తి చేసి, హైదరాబాద్ లో చింతల్ బస్తీ లో అప్పుడే ప్రారంభం అయిన ప్రభుత్వ ఆర్స్ & సైన్స్ కళాశాలలో బి.జడ్.సి, గ్రూపుతో బి.ఎస్సీ మొదటి సంవత్సరంలో చేరాను. అప్పటికి మెడిసిన్ కోసం ‘ఎం సెట్ ‘ ప్రవేశ పరీక్షా విధానం రాలేదు. మామూలు ప్రవేశ పరీక్షా విధానం ఉండేది. దంత వైద్యం కోసం, ఇంటర్ లో మార్కుల ఆధారంగా సీట్లు కేటాయించేవారు. నేను మెడిసిన్ కూ, చిన్నన్నయ్య డా.కె.మధుసూదన్ సలహా మేరకు బి.డి.ఎస్ కు అప్లై చేసాను. మెడిసిన్ లో సీటు రాలేదు కానీ, బి.డి.ఎస్, లో మాత్రం సీటు వచ్చింది. నిజానికి  మా పెద్దన్నయ్య -ప్రముఖ నవల/కథ/అనువాద రచయిత స్వర్గీయ కె.కె.మీనన్న నన్ను మాస్కోలో మెడిసిన్ చేయించడానికి తన శాయశక్తులా కృషి చేసాడు. కానీ ఫలితం దక్కక పోవడంతో, నాకు బి.డి.ఎస్, లో సీటు రావడం ఆయనకు కొంత ఊరట కలిగించింది. అనేక మంది తన స్నేహితులను, వైద్యరంగం లో స్థిర పడిన పెద్దలను కలసి, వృత్తి విద్యగా బి. డి.ఎస్ కు ఎంత వరకూ భవిష్యత్తు ఉంటుందో తెలుసుకుని, వారిచ్చిన సలహాలకు తృప్తి పడి నన్ను ఉస్మానియా కళాశాలకు అప్పుడు అనుబంధంగా ఉన్న డెంటల్ వింగ్ లో జాయిన్ చేశారు. అప్పట్లో ‘ప్రీ-ప్రొఫెషనల్ కోర్స్ అని ఉండేది. మెడికల్/డెంటల్ లో చేరిన విద్యార్ధులకి మొదటి ఆరునెలలు ఈ కోర్సు ఉండేది. అంటే మళ్ళీ ఒక ఆరు నెలల పాటు ఇంటెర్మీడియేట్ చదివినట్టు.

ఆ .. ఆరు నెలలు పాఠాలు ఉస్మానియా వైద్య కళాశాల కోఠీ లో ఉండేవి. అది ముగిసిన పిమ్మట కొన్ని క్లాసులు అఫ్జల్ గంజ్ లోని దంత వైద్య విభాగంలోనూ, కొన్ని ఉస్మానియా వైద్య  కళాశాలలోనూ జరిగేవి. జనరల్ సబ్జెక్ట్స్ అయి పోయిన తర్వాత కేవలం దంత వైద్య విభాగానికే పరిమితం అయ్యేవాళ్ళం. అందుచేత కోఠీ--అఫ్జల్ గంజ్, అఫ్జల్ గంజ్ --కోఠీ, బస్సు ప్రయాణాలతో సరదాగా గడిచిపోయేది. నా బి.డి.ఎస్- రెండవ సంవత్సరంలో అనుకుంటాను, నేను ఒక వ్యాసం రాసి అప్పటి పత్రికలలో ఒకటైన ఆంద్ర పత్రిక దిన పత్రికకు పంపించాను. నిజానికి ఆ పత్రిక ఆఫీసు ఎక్కడ ఉందో, దాని సంపాదకులు ఎవరో కూడా తెలీదు నాకు. నా ప్రయత్నం ఫలించి అది సకాలం లోనే అచ్చయింది. ఆ చిరు వ్యాసం పేరు ‘కట్టుడు పళ్ళు అవసరమా?’ నిజానికి  నేను ఆ వ్యాసం రాసే సమయానికి, దానికి సంబంధించిన పరీక్ష పూర్తి కాలేదు. అయినా ఆ వ్యాస పరిధి బహు తక్కువ గనుక అంత క్షుణ్ణంగా చదవక్కర లేదు. ప్రాధమిక అంశాలు తెలిస్తే చాలు.

నేను ఆ వ్యాసం ఎవరికీ చూపించకుండా పుస్తకంలో దాచుకున్నాను. అనుకోకుండా ఒక రోజు అనుకోకుండా ఒక సహాధ్యాయి మిత్రుడి కళ్లబడింది. అతని చేతిలో నుండి ఇంకొక అమ్మాయి చేతిలోకి వెళ్ళిందది. నాకైతే దానికి సంబంధించిన ప్రచారం అసలు ఇష్టం లేదు. సహాధ్యాయులు మాత్రం దానిని గొప్పగా చిత్రించి, ఊహించని రీతిలో కీర్తించడం మొదలు పెట్టారు. అంతటితో ఆగిపోతే సమస్య ఉండేది కాదు. వ్యాసం తీసుకున్న అమ్మాయి నేరుగా ఆది పట్టుకుని ప్రొస్థెటిక్స్ లాబ్ కు పరిగెత్తింది. ఆ రోజు మాకు ప్రొస్థెటిక్స్ ప్రయోగాలు ల్యాబ్ క్లాసు. క్లాసులో అసిస్టెంట్ ప్రొఫెసర్ డా. మానందం గారు వున్నారు. ఆయన తర్వాత కీర్తి శేషులైనారు. వ్యాసం ఆయన చేతిలో పెట్టింది ఆ అమ్మాయి. నా సహాధ్యాయులందరూ ఆయన స్పందన కోసం ఉత్కంఠత తో ఎదురు చూస్తున్నారు. నేను మాత్రం వ్యాసం ఆయన చేతిలోకి వెళ్లినందుకు సిగ్గు పడుతూ ఒక మూల నిలబడ్డాను.

నిజానికి నేను అప్పుడు అక్కడ కాలరెత్తుకుని నిలబడాలి. కానీ చెప్పలేని భయం ఏదో నా హృదయ  కవాటాల్ని కుమ్ముతున్నట్టు అనిపించింది. అసలైన గురువు అయితే నన్ను ప్రోత్సహించాలి. మరి ఈయన ఏమంటాడో నన్నఆత్రుత. ప్రతి క్షణం గడ్డుగా కదులుతోంది. ఇంతలో మా ప్రేమానందం సార్ నన్ను దగ్గరకు పిలిచారు. నన్ను పైనించి క్రిందికి రెండుమూడు సార్లు చూసి ‘ఇది  నువ్వే రాశావా?’ అని సూటి ప్రశ్న వేశారు. ఒక్క సారి నా మెదడు మొద్దుబారి పోయింది. జవాబు చెప్పలేని మూగ జీవిని అయి పోయాను. ఒక పక్క బాధ, ఉక్రోషం, అవమానం ఇలా అన్నీ కలగలుపుకుని దుఃఖం రూపంలో కళ్ళు చెమ్మగిల్లి అక్కడి నుండి వడివడిగా బయటకు వెళ్ళిపోయాను.  జరిగిన దాని గురించి తిరిగి ఎవరితోనూ చర్చించలేదు. కానీ, నాలో అవమానం , పట్టుదలగా రూపాంతరం చెంది వెంటనే మరో వ్యాసం రాయడానికి ఉసిగొల్పింది. అనుకున్నది వెంటనే కార్య రూపంలో పెట్టడం మొదటి నుంచీ నాకు అలవాటు!

అదే పని చేసాను. మరో వ్యాసం తయారు అయింది. వెంటనే దానిని విజయవాడలో వున్న ఆంద్ర పత్రిక ఆఫీసుకు పంపాను. హైదరాబాద్  బషీర్ బాగ్ లో పత్రిక బ్రాంచి ఆఫీసు ఉండేది. ఆదివారం ప్రత్యేక సంచిక శనివారం సాయంత్రం అక్కడికి వచ్చేది. ఆ వారం ఆదివారం దిన పత్రికలో నా రెండవ వ్యాసం వచ్చింది. అది స్వయంగా నేనే మా ప్రేమానందం సార్ దగ్గరకు వెళ్లి చూపించాను. ఆయన ఆ వ్యాసం చదివి నువ్వు భవిష్యత్తులో మంచి రచయిత అవుతావు అన్నారు. అది ఆయన దీవెన గానే తీసుకున్నాను. ఆ విధంగా ఆయన ప్రేరరణ/దీవెన, నాలోని రచయితను నిద్ర లేపినట్లయింది. ఈ రోజు సాహితీ రంగంలో నిలదొక్కుకుని, కవిగా, కథకుడిగా, వ్యాస రచయితగా పేరు సంపాదించుకోగలిగాను. నా వృత్తి దంత వైద్యం అయినప్పటికీ, ప్రవృత్తిగా తెలుగు సాహిత్యం నేను ఊహించని స్థాయికి నన్ను తీసుకెళ్లింది. ఇదంతా బలమైన పట్టుదల వల్ల సాధ్యం అయింది.

ఉపసంహారం --

ఈ ఉదంతం పాఠకులకు అందించడంలో నా స్వార్ధం ఏమీ లేదు. కానీ ఎవరికైనా ఇలాంటి పరిస్థితులు ఎదురైనప్పుడు, కృంగి పోక, మనసు పాడు చేసుకోక, పట్టుదలతో దైర్యంగా ముందుకు సాగాలనే సందేశాన్ని అందించడమే దీని ముఖ్యోద్దేశం. ‘కృషి ఉంటే మనుష్యులు ఋషులౌతారు' అన్నది ఒట్టిమాట ఏమాత్రం కాదు.

మరిన్ని వ్యాసాలు