మిశ్రమ దంతాలు అంటే …. !! - డా.కె.ఎల్ .వి.ప్రసాద్

Mixed teeth means

ఒకప్పుడు పంటి నొప్పి ,గృహ వైద్యం ,పన్నుతీసేయడం వరకూ పరిమితమైన,దంత వైద్య రంగం ,ఇప్పుడు ఊహించని రీతిలో దంత సంరక్షణకు ,దంత వైద్య చికిత్సావిధానాల కు గొప్ప గొప్ప పరిశోధనలు జరిగి ఎట్టి పరిస్థితి లోను పంటిని కోల్పోకుండా జీవితాంతమూ సంరక్షించుకుని , బ్రతికినంతకాలమూ సజావుగా ఉపయోగించుకునే పరిస్థితులు అందుబాటు లోనికి వచ్చాయి. ఆధునిక దంతవైద్యం ఇప్పటికీ సామాన్య  మానవుడికి అందని ద్రాక్షగా మిగిలిపోయినా,అయినవాళ్లకు అన్నిరకాల చికిత్సావిధానాలు ఆనందంగా పొందే అవకాశాలు మెండుగా వున్నాయి.  ఈ రోజున పన్నుతీయడం అనేది ఆధునిక చికిత్సా విధానాలలో ఆఖరుది! ఆధునిక దంతసంరక్షణ విధానాలు అందుబాటులోనికి వచ్చాక,అభివృద్ధి  చెందిన దేశాలలో,పన్ను తీయడం అనీ చికిత్సావిధానం ఇంచుమించు కనుమరుగైనట్టే భావించాలి. సౌందర్య దంత వైద్య చికిత్సా విధానాలలోనూ,చికిత్సాపరంగా తప్పనిసరిగా జ్ఞాన దంతం తీయడం వంటి సందర్భాలలో లోనే పళ్ళు తీసే పరిస్థితులు ఏర్పడుతున్నాయి తప్ప , వ్యాధి పరంగా పళ్ళుతీసే పరిస్థితులకు కాలం చెల్లిపోయినట్టే!!

ఈ నేపథ్యంలో దంతవైద్య రంగంలో జరుగుతున్నపరిశోధనలు,ఫలితంగా  నొప్పిలేని దంత చికిత్సా విధానాలు, సహజత్వం చూపించే సౌందర్య సాధనాలు,ఆధునిక పరికరాలు,డెంటల్ -మెటీరియల్స్ ,అందుబాటులోనికి రావడమే గాక,అందరూ అవగాహన చేసుకునే విధంగా అతి సామాన్యుడు అర్ధం చేసుకునే విధంగా ‘దంత వైద్య విజ్ఞానం ‘అందుబాటులోనికి వస్తున్నది . దిన వార మాస పత్రికలలో ఇవి చోటు చేసుకుంటున్నవి, అనేక ప్రసార మాధ్యమాల ద్వారా అనుభవజ్ఞులైన దంత వైద్య నిపుణులు ఈ సమాచారాన్ని అతి సులభంగా అందించగలుగుతున్నారు. ప్రాంతీయ భాషలకు తర్జుమా చేసి దంత వైద్య విజ్ఞానం ప్రతి చదవరికి అందుబాటులోకి వచ్చేవిధంగా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ముందస్తు దంతవైద్య-పరీక్షలను అధికంగా ప్రోత్సహిస్తున్నారు. పాఠశాలల్లో,కళాశాలల్లో,గ్రామాలలో అనేక స్వచ్చంద సేవా సంస్థలు ఉచిత దంత వైద్య శిబిరాలను ఏర్పాటు చేస్తున్నారు. ఎన్ని చేసిన వాటి వెనుక ప్రధాన ఉద్దేశ్యం సామాన్యుడికి ,తాను దంత వైద్య చికిత్సలు చేయించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడినప్పుడు కనీస దంత వైద్య విజ్ఞానం తెలిసి వుండాలని ! ఇక ,అసలు విషయానికి వస్తే -మనిషి జీవితకాలం లో రెండు దశల పళ్ళు ఉంటాయి. మొదటివి తాత్కాలిక పాలపళ్ళు, రెండవ దశ -స్తిరదంతాలు,ఇవి జాగ్రత్తలుఉంటాయి  తీసుకుంటే బ్రతికింత కాలం ఆరోగ్యంగా పటిష్టంగా ఉంటాయి. ఈ రెండు దశలకు మధ్య మరొక తాత్కాలిక,పాక్షిక పంటి దశ ఉంటుంది ,దానినే మిశ్రమ దంతాల దశ అంటారు. అంటే ఆ వయస్సులో రెండు దౌడ లలోనూ -పాలపళ్ళు కొన్ని ,స్తిరదంతాలు కొన్ని ఉంటాయి. ఒక్కోసారి ఈ మిశ్రమ దంతాలు రెండువరుసలలో కనిపిస్తాయి. ఒక వరుసలో పాల పళ్ళు ,మరోవరుసలో స్తిరదంతాలు ఉంటాయన్నమాట !

ఎందుకు ఇలా ?------

చాలా మంది కి ఉదయించే ప్రశ్న ఇది. ఆరు నెలల నుండి రెండు సంవత్సరాల వయస్సులో పాలపళ్ళు అన్నీ వచ్చి అవి ఆరు సంవత్సరాల వయస్సు వచ్చేవరకు దౌడలలో నిశ్చలంగా ఉంటాయి. ఆరు సంవత్సరాల వయస్సు వచ్చాక ముందరి పళ్ళు ఊడిపోయి వాటి స్థానంలో అదే జాతికి చెందిన స్థిరమైన పళ్ళు వస్తాయి. అలా ఒక్కో వయసులో ఒక్కో పాలపన్ను రాలిపోయి వాటిస్థానంలో స్థిరమైన పళ్ళు వచ్చేస్తాయి. ఈ ప్రక్రియ ఇంచుమించు పన్నెండు సంవత్సరాల వయస్సు వచ్చేవరకు జరిగి ఆగిపోతుంది. అంటే ఒక్క జ్ఞాన దంతం అనబడే మూడవ విసురుడు దంతం తప్ప అన్ని స్తిరదంతాలు వచ్చేస్తాయి.మిశ్రమ దంతాల స్థాయి సమాప్తమై షుమారు పదిహేడు సంవత్సరాల వయసు వచ్చేవరకూ ఎలాంటి మార్పులు వుండవు. 17-21 సంవత్సరాల మధ్య వయస్సులో జ్ఞానదంతం వస్తుంది.

జాగ్రత్తలు

మిశ్రమ దంతాల సమయంలో ,పిల్లల దంతసంరక్షణ విషయంలో తల్లిదండ్రులు అప్రమత్తంగా ఉండాలి. రోజు రోజుకు కనిపించే మార్పులను గమనిస్తుండాలి. రాలిపోవలసిన పాలపన్ను రాలిపోకుండా,దౌడలో అలాగే వుండి ,దానిస్థానం లో రావలసిన స్థిరమైన పన్ను పాలపన్ను వెనుక వచ్చి రెండు వరుసలుగా కనిపిస్తాయి. ఇది గమనించిన వెంటనే ,అనుభవిజ్ఞులైన దంత వైద్యులకు గానీ ,పిల్లల దంత వైద్యులకు గానీ (పీడో -డాన్ టిస్ట్ ) దగ్గరకు గానీ తీసుకువెళ్లి పాలపన్ను తీయించాలి. లేనిపక్షంలో,స్తిర దంతం వచ్చిన చోటే స్థిరపడిపోయి పలువరుసలో మార్పులు కనిపించవ్సచ్చు. తదుపరి ఆర్థోడాంటిక్ చికిత్స అవసరం రావచ్చు. ఆడపిల్లల విషయంలో మరింత ఇబ్బంది కలగవచ్చు !పాలపళ్ళు రాలిపోక ,రావలసిన స్థిరమైన పళ్ళు వచ్చినప్పుడు దౌడలలో ఒక వింత పరిస్థితి ఏర్పడుతుంది. పళ్ళు రెండువరుసలలో కనిపించి కాస్త ఎబ్బెట్టుగా అనిపిస్తుంది. అంతమాత్రమే కాదు,పిల్లలు తినే ఆహారపదార్ధాలు ,రెండు వరుసల మధ్య చిక్కుకుని,దంతధావనం అనుకూలించక ,నోటి దుర్వాసన వెలువడే అవకాశం ఉంటుంది.

ఇలాంటి పిల్లలను ఇంట్లోని వారేకాక ,బయట ముఖ్యంగా బడులలో సహాధ్యాయులు కూడా అసహ్యించుకునే పరిస్థితులు దాపురిస్తాయి. ఇలాంటి పిల్లలు రోజుకు రెండుమూడు సార్లు ఉప్పు నీటి తో నోరు శుభ్రంగా పుక్కిలించాలి. ఎలాంటి ఆహార పదార్ధాలు తిన్నా,పానీయాలు తాగినా తక్షణం నోరు పుక్కిలించాలి. దంతధావనం విషయంలో ప్రత్యేక శ్రద్ద వహించాలి. సాధ్యమయినంత త్వరగా ఊడవలసిన పళ్ళను తీయించి వేయాలి. రెండు వరుసల పళ్ళు అశ్రద్ధ చేయడం వల్ల ఆర్థో డాంటిక్ చికిత్స అవసరం అనుకుంటే ,15-16 సంవత్సరాల కాలంలో మొదలు పెట్టాలి. రెండువరుసల వల్ల నోటి పరిశుభ్రత లోపించి ,పంటి సమస్యలు,చిగురు సమస్యలు రాకుండా అప్రమత్తంగా ఉండాలి. మిశ్రమ దంతాల సమయం చాలా ముఖ్యమైనదిగా భావించి. ఎప్పటికప్పుడు సకాలంలో తగిన చర్యలు తీసుకోవాలి. సౌందర్య దంత చికిత్సా విదహనాలకు అయ్యే వ్యయం సామాన్యులు తట్టుకోలేరు కను క ,ఈ వర్గం తమ పిల్లల దంత సంరక్షణ విషయంలో మరింత జాగ్రత్తగా ఉండడం అత్యవసరం !ముఖార విందానికి దంతాలే కదా సౌందర్య మూలకాలు !!

మరిన్ని వ్యాసాలు