గుర్రం నేర్పిన పాఠం - పేట యుగేంధర్

gurram nerpina patham

గాధింగి గ్రామంలో గోవిందయ్య దగ్గర ఒక గుర్రం ఉండేది. ఆ గుర్రం సహాయంతో గాధింగి, పళ్లిపట్టు మధ్య సరుకులను రవాణా చేస్తూ, గోవిందయ్య తన కుటుంబాన్ని పోషించుకొనేవాడు.  గోవిందయ్య దంపతులకు ఆ గుర్రం అంటే ఎంతో ఇష్టం. తమకు పిల్లలు లేని కారణంగా ఆ గుర్రాన్ని తమ సొంత బిడ్డలా చూసుకొనేవారు. గుర్రానికి కూడా తన యజమాని గోవిందయ్య, అతని భార్య లక్ష్మి అంటే అంతే ఇష్టం.
దుర్గసముద్రంలో గుర్రపు పందేలు జరుగుతున్నాయని తెలిసి తన గుర్రంతో సహా ఆ పోటీలో పాల్గొన్నాడు గోవిందయ్య. అనూహ్యంగా గోవిందయ్య గుర్రం ఆ పోటీలో మొదటి బహుమతి పొందింది. దాంతో గోవిందయ్య పేరు గాధింగి చుట్టుప్రక్కల గ్రామాల్లో మారు మ్రోగిపోయింది. విషయం తెలుసుకొన్న వారందరూ గాధింగి వచ్చి, పందెంలో గెలిచిన గుర్రాన్ని చూసి, గోవిందయ్యను మొచ్చుకోవడం మొదలుపెట్టారు. విషయం ఆనోటా ఈనొటా నాని ఆ ప్రాంత షావుకారైన బంగారయ్య చెవిలో పడింది.

బంగారయ్యకు ధనవంతుడనే అహంకారం ఎక్కువ.  దేశాదేశాలు తిరిగి వ్యాపారాలు చేస్తుంటాడు. అతనికి నాణ్యమైన గుర్రాలను సేకరించే అలవాటు ఉంది. చుట్టు ప్రక్కల ప్రాంతాలలో ఎక్కడైనా మేలుజాతి గుర్రం ఉందని తెలిస్తే, ధరను లెక్కచేయకుండా ఆ గుర్రాన్ని కొనుగోలు చేస్తాడు. ఆ విధంగా అతని అశ్వశాలలో  పదులు సంఖ్యలో గుర్రాలు ఉన్నాయి. గోవిందయ్య దగ్గరున్న గుర్రం గురించి తెలియగానే గాధింగి వెళ్ళి, ఆ గుర్రాన్ని చూసి ముచ్చటపడి, ఆ గుర్రాన్ని తనకు అమ్మివేయమని గోవిందయ్యను అడిగాడు బంగారయ్య. అతనికి మంచి ధరను ఆశ చూపాడు కూడా. 

“అయ్యా! ఈ గుర్రం పుట్టినప్పటి నుండి నా తోనే ఉంది. ఇది నా బిడ్డతో సమానం. మీరు ఎంత డబ్బు ముట్టజెప్పినా దీన్ని మీకు అమ్మలేను. నన్ను క్షమించండి.” అంటూ బంగారయ్యకు వినయంగా చెప్పాడు గోవిందయ్య. ఊహించని పరిణామానికి బంగారయ్య ఆశ్చర్యపోయాడు. గోవిందయ్య తనను అవమానించినట్టు భావించాడు. 

*****

కాలం గిర్రున తిరిగింది. గోవిందయ్య భార్య లక్ష్మికి అనారోగ్యం చేసింది. శస్తచికిత్స చేయాలని, అందుకు చాలా డబ్బులు ఖర్చవుతుందని, డబ్బులు సర్ధుబాటు చేసుకొని ఆసుపత్రికి తీసుకురమ్మని వైద్యులు గోవిందయ్యకు సూచించారు. గోవిందయ్య అప్పుకోసం ప్రయత్నించాడు. గోవిందయ్య పరిస్థితి తెలుసుకొన్న బంగారయ్య అతనికి ఎక్కడా అప్పు పుట్టకుండా  చేశాడు. పైగా అప్పు అడిగిన ప్రతిఒక్కరూ బంగారయ్యను కలవమని సలహా కూడా ఇచ్చారు. గత్యంతరం లేక  అప్పు కోసం బంగారయ్యను  ఆశ్రయించాడు గోవిందయ్య. డబ్బులు అప్పుగా ఇవ్వడం కుదరదని, గుర్రాన్ని అమ్మేసి కావల్సినంత డబ్బు పట్టుకెళ్లమని చెప్పాడు బంగారయ్య. భార్య ప్రాణాలు కాపాడుకోవడానికి బిడ్డ లాంటి గుర్రాన్ని అమ్మడం తప్ప వేరే దారి లేక పోయింది గోవిందయ్యకు.

*****

ఆసుపత్రిలోనే నెల రోజులు గడిచిపోయింది. గోవిందయ్య భార్యకు  ఆరోగ్యం కుదుటపడింది. వైద్యుల సూచనతో లక్ష్మిని ఆసుపత్రి నుండి ఇంటికి తీసుకొని వచ్చాడు గోవిందయ్య. భార్యను ఇంట్లో విడచి పెట్టి తన గుర్రాన్ని చూసి రావడానికి ప్రక్క ఊరిలోని  బంగారయ్య ఇంటికి వెళ్ళాడు. 
గుర్రాన్ని చూడగానే గోవిందయ్య గుండె చెరువయ్యింది. అది బాగా బక్కచిక్కి పోయింది. ముఖంలో కళ, శరీరంలో పట్టు కోల్పోయింది. దాని పరిస్థితి చూసి గోవిందయ్య కుమిలిపోయాడు. గుర్రాన్ని పట్టుకొని విలపించాడు. గోవిందయ్య ను చూసి గుర్రం కూడా మౌనంగా రోదించింది. ఆ దృశ్యాన్ని చూసి బంగారయ్య చలించిపోయాడు. 

“గోవిందయ్యా! గుర్రం నా ఇంటికి వచ్చినప్పటి నుండి మేత మేయడం లేదు. నీరైనా త్రాగడం లేదు. నీ మీద బెంగ పెట్టుకొన్నట్టు ఉంది. నీ అవసరాన్ని ఆసరాగా తీసుకొని దాన్ని సొంతం చేసుకొన్నానే గానీ, నీ లాగా నేను దాని మనసు గెలుచుకోలేక పోయాను. డబ్బుతో అన్నింటినీ కొనలేము అనే గుణపాఠాన్ని నీ గుర్రం ద్వారా నేర్చుకొన్నాను. నిన్నూ, నీ  గుర్రాన్ని బాధపెట్టాను. నన్ను క్షమించి, నీ గుర్రాన్ని నువ్వు తీసుకొని వెళ్ళు.” అని చెప్పాడు బంగారయ్య.

“అయ్యా! మీరు స్వార్ధంతో చేసిన పనే అయినా మీరిచ్చిన డబ్బుతో నా భార్య అనారోగ్యం కుదుటపడి, ఆరోగ్యంగా ఇంటికి వచ్చింది. ఈ గుర్రం పుట్టినప్పటి నుండీ ఒక్క రోజు కూడా నన్ను విడచి ఉండలేదు. అందుకే నా మీద బెంగ పెట్టుకొంది. మీరు నాకు డబ్బులు ఇచ్చి గుర్రాన్ని కొనుగోలు చేశారు. న్యాయం ప్రకారం ఈ గుర్రం మీదే. కనుక ఈ గుర్రాన్ని నేను తీసుకొని వెళ్ళడం న్యాయం అనిపించుకోదు.” అంటూ వినయంగా చెప్పాడు గోవిందయ్య.

బాగా ఆలోచించిన బంగారయ్యకు ఒక ఆలోచన వచ్చింది.“గోవిందయ్యా! నిన్ను చూడకుండా గుర్రం ఉండలేదు. గుర్రం లేకుండా నువ్వూ ఉండలేవు. గుర్రాల్ని మచ్చిక చేయడంలో నీకు ఎంతో నైపుణ్యం ఉంది. కనుక నా అశ్వశాలకు సంరక్షకునిగా నువ్వు  నా వద్దే  పనిలో చేరు. నీ గుర్రం లాగే ఇక్కడున్న  గుర్రాలన్నింటినీ ప్రేమగా చూస్తూ, వాటన్నిటికీ మంచి తర్ఫీదును అందించు.” అని గోవిందయ్య కోరాడు బంగారయ్య. అందుకు గోవిందయ్య సంతోషంగా అంగీకరించాడు. అప్పటి నుండి అశ్వశాలలోని ఆశ్వాలన్నింటినీ ప్రేమగా పెంచసాగాడు గోవిందయ్య.. 

మరిన్ని వ్యాసాలు

vennela vaanalo manam
వెన్నెల వానలో మనం ...
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
Guru geetha prasasthyam
గురు గీత ప్రాశస్త్యం
- సి.హెచ్.ప్రతాప్
కల్పవృక్ష వినాయక స్వరూపం శిల్పి
కల్పవృక్ష వినాయక స్వరూపం శిల్పి
- కుందుర్తి నాగబ్రహ్మాచార్యులు
సంత్ నరహరి సోనార్
సంత్ నరహరి సోనార్
- కుందుర్తి నాగబ్రహ్మాచార్యులు
మా చార్ధామ్ యాత్ర
మా చార్ధామ్ యాత్ర
- కర్రా నాగలక్ష్మి