కర్నాటక తీర్థయాత్రలు / విహారయాత్రలు - కర్రా నాగలక్ష్మి

karnataka teerdhayatralu

(హలబీడు మందిరాలు) 

బేలూరు హలబీడు అని రెండింటినీ కలిపి వాడడం చూస్తూ వుంటాం , ఈ రెండు పట్టణాలు దగ్గరదగ్గరగా వుండడం ఒకకారణం అయితే ఈ రెండు ప్రదేశాలలోనూ ఒకే కాలంలో మందిరనిర్మాణం జరగడం మరో కారణం . హలబీడులో వున్న హోసలేశ్వర మందిరాన్ని హోసలవంశానికి చెందిన విష్ణువర్ధన మహారాజు కాలంలో అంటే 1121 లో మొదలుపెట్టబడి 1160 లో పూర్తి చెయ్యబడింది . ఈ కోవెలలో దొరకిన శిలాశాసనం ప్రకారం ఈ మందిరాన్ని విష్ణువర్ధనుని మంత్రి ‘ కేతమల్లు ‘ రాజుగారి గౌరవార్ధం నిర్మించినట్లుగా తెలుస్తోంది . ఈ మందిర నిర్మాణానికి కావలసిన ధనం విష్ణువర్ధనుడు సమకూర్చినట్లు గా కూడా లిఖించబడింది . విష్ణువర్ధన మహారాజు కాలంలో మందిరనిర్మాణాలేకాక సత్రములు , బావులు , చెరువుల నిర్మాణంకూడా చేసినట్లు , ప్రజారంజకంగా పరిపాలన చేసినట్లు చెప్తారు .బేలూరుకి సుమారు 9 కిలోమీటర్ల దూరంలో వుంది హలబీడు . హోసలరాజులు రాజ్యానికి వచ్చిన తరువాత కొత్త రాజధాని నిర్మాణం చేయ సంకల్పించి తగిన ప్రదేశం కొరకు వెతకి ఈ హలబీడు ప్రాంతంలో కొత్తరాజధాని నిర్మాణం చేపట్టేరు . విష్ణువర్ధనుడు తన పరిపాలన కొత్తరాజధాని అయిన ‘ ద్వార సముద్ర ‘ లో మొదలుపెట్టేడు . హలబీడు ని పూర్వం ‘ ద్వారసముద్ర ‘ అని పిలిచేవారు . స్థానిక భాషలో సముద్రము అంటే పెద్ద సరస్సు అని కూడా అర్దం , హలబీడు లో పెద్ద మానవనిర్మిత సరస్సు వుంది . సుమారు 300 సంత్సరాలు చాలా ఉఛ్చదశలో వుండి హోసల సామ్రాజ్య పతనంతో బీడు పట్టిపోడంతో ఈ ప్రాంతం ‘ హలబీడు ‘ గా పిలువబడసాగింది .300 సంవత్సరాలు సిరిసంపదలతో తులతూగిన రాజధాని హోసలసామ్రాజ్య పతనానంతరం ఒక్కసారి బీడుగా మారిపోవడం కూడావింతే . అయితే దీనివెనుక ఓ చిన్నకధ వుందండోయ్ , రాజులు శత్రువుల చేతులలో ఓటమి తప్పదని తెలిసినప్పుడు రాజుపరివారం సామూహిక ప్రాణత్యాగం చెయ్యడం గురించి మనం విన్నాం , అలాంటిదే ఇక్కడకూడా జరిగిందట . ఇలాంటి శాపగ్రస్త నగరాలు మన చరిత్రలో చాలా వున్నాయి , హలబీడు కూడా అలాంటిదే అని అంటారు .

ఈ విషయం నిజమేననడానికి ఈ హోసలేశ్వర మందిరంలో గరుడ స్థంబం పైన వీరులు తమ ఖడ్గాలతో తమ శిరస్సులను ఖండించుకుంటున్నట్లుగా చెక్కిన శిల్పాలే నిదర్శనం . చెక్కిన శిల్పి యెవరో కాని ఓ చారిత్రాత్మక నిజాన్ని తరతరాలు నిలిచేటట్లు చేసేడు . దీని వల్ల ఈ స్థంబ నిర్మాణం తరవాత కాలంలో జరిగినట్లుగాతెలుస్తోంది. బేలూరు చెన్నకేశవ మందిరం హోసల రాజుల తరువాత చాలా రాజుల చేత పునః నిర్మాణం జరిగింది . కాని ఈ శివాలయం నిరాదరణకి గురికావడం వల్ల బాగా పాడుబడిందనే చెప్పుకోవాలి . అయితే శిల్పకళలో మాత్రం యేం తక్కువలేదు .చాలా పెద్దపెద్ద శిల్పాలు చాలా పాడుబడి , ముఖాలు చెక్కేసి , చేతులు కాళ్లు విరగకొట్టబడి చాలా శిధిలావస్థలో వున్నాయి , కొన్నింటిని కాపాడే వుద్దేశ్యంతో అతుకులు వెయ్యబడ్డాయి , కాని ఆ అతుకులు పరమ అసహ్యంగా కనబడుతున్నాయి . హోసలేశ్వరుని మందిరం పెద్దమైదానం లో వుంటుంది , విమానగోపురాలులేని మందిరం , ప్రకృతి విపత్తులవలన కూలిపోయేయో , ముస్లిం రాజులు పడగొట్టేరో మరి , లోపల రెండు మందిరాలు ఒకదానికొకటి ఆనుకొని వేర్వేరు శిఖరాలు , వేర్వేరు నంది విగ్రహాలు , గర్భగుడులతో వుంటాయి , ఈ మందిరాలని ‘ కవల ‘ మందిరాలని అంటారు , యెందుకంటే రెండు మందిరాలు ఒకేలా వుంటాయి . ఒకటి ‘ హోసలేశ్వరుని ‘ మందిరం , ‘ హోసలేశ్వరుడు ‘ అంటే హోసలరజ్యాన్ని పరిపాలించే రాజు మందిరం , రెండవది శివుడు శక్తి రూపంగా పూజలందుకొనే ‘ సంతలేశ్వరి ‘ మందిరం . శంతలేశ్వరి మందిరం రాణి శంతలాదేవికి సమర్పించబడింది .

ఈ మందిరనిర్మాణ కాలం బేలూరు చెన్నకేశవ మందిర నిర్మాణం ఒకేసారి మొదలయిందని చెప్పుకున్నాం కదా ? , అలాగే ఈ కోవెల నిర్మాణానికి వుపయోగించిన రాయ కూడా చెన్నకేశవ స్వామి కోవెలలో వుపయోగించిన ‘ సోపు రాయే ‘ . శిల్పకళ కూడా ఇంచుమించుగా ఒకటే . ఈ కోవెల శివకోవల అయినప్పటికీ ఇక్కడ వైష్ణవ , శక్త్య , జైన, బౌద్ద మతాలకు చెందిన దేవీదేవతల విగ్రహాలను చూడొచ్చు . గర్భగుడి గోడలకి రామాయణ , మహాభారత , మహా భాగవత కథలలోని ముఖ్య ఘట్టాలను చెక్కిన తీరు అద్భుతంగా వుంటుంది .బేలూరు హలబీడు మందిరాలను చూసేటప్పుడు పురాణకధలు తెలిస్తే శిల్పాలు వాటి వెనుక కధలు తెలుస్తాయి , లేదా ’ గైడు ‘ ని పెట్టుకుంటే మందిర చరిత్ర , పురాణకధలు మొదలయినవన్నీ వివరిస్తారు , వివరం తెలియకుండా శిల్పాలని మెచ్చుకోడం కష్టమైన పనే . కొన్ని ముఖ్యమయిన శిల్పాలను గురించి చెప్తాను , గర్భగుడి చుట్టూ , బయట ప్రాకారం గోడలపైన చిన్నచిన్న బొమ్మలను కూడా యెంతో శ్రద్దగా మలిచేరు , హంసలు , యేనుగులు , ‘ ‘ యలి ‘ ( యలి అంటే పురాణ కాలంలో వుండేవని చెప్పబడే ఏనుగు శరీరం సింహం ముఖం , గుర్రం శరీరం పులి ముఖం ) లను చెక్కిన తీరు , పువ్వులు , సుందరాంగులు , వాయిద్యకారులు , నృత్యభంగిమలు , నర్తకుల హావభావాలు చాలా చక్కగా వుంటాయి . ఈ కోవెలలో ‘ఖజురాహో ‘  మందిరాలలో కనిపించే చుంబన , ఆలింగన శిల్పాలు వున్నాయి . ఈ మందిరంలో ద్వారపాలకులు జటాముకుటాలతో నాలుగు చేతుల( విరిగిపోయి వున్నాయి ) లో పాము ఢమురకము , త్రిశూలం ధరించి  మూడు కళ్లతో వున్నట్లు చెక్కేరు , ద్వారపాలకుల ఆభరణాలను చెక్కిన తీరు చాలా బాగుంటుంది . గర్భగుడి ద్వారానికి మకరవాహనులైన ‘ వరుణ , ‘ వరుణి ‘ లను శివపార్వతులను చూడొచ్చు . పూర్ణకలశాలతో దేవీదేవతలను చూడొచ్చు . నవరంగ మంటప స్థంబాలకు వున్న ‘ శాలభంజికలు , వారి నగలు , చీర మడతలు చెక్కిన శిల్పులు అమరులు . మందిరం వెలుపల ప్రాకారం చుట్టుకొలత సుమారు 200 మీటర్లు , ఈ రెండు వందల మీటర్లు సూదిమొన జాగా కూడా లేకుండా చెక్కిన శిల్పాల అందం వివరించడం నా తరమా ? , వీటి మీద పెద్ద విగ్రహాలు సుమారు 340 వున్నట్లు అంచనా . ఇవి కాక రామాయణకథకు చెందిన రామ వనవాసం , బంగారులేడి , రాముడిని హనుమ సుగ్రీవుని వద్దకు తీసుకు వెళ్లడం , రాముడు వేసిన బాణం ఏడు తాటిచెట్లను చీల్చుకొని వెళ్లడం  హనుమంతుడు రాముని ముద్రికను సీతమ్మకు ఆనవాలుగా చూపడం లాంటివి , రావణుడు శివపార్వతులతో సహా కైలాశపర్వతాన్ని కదిలించే ప్రయత్నంచెయ్యడం , రావణుని మొహంలో ఆ బరువు యెత్తలేని నిస్సహాయత చాలా బాగా కనబడుతుంది . కృష్ణజననం , వసుదేవుడు కృష్ణుని తలపై పెట్టుకొని యమునను దాటడం , పూతన వధ , అసురి వధ , గోవర్ధన పర్వతం చిటికెలవేలితో యెత్తడం, నవనీతచోర కృష్ణ , శ్రీకృష్ణుని పిల్లనగ్రోవికి గోపాలురు , గోపికలు , గోవులు నృత్యం చేస్తున్నట్లు , కృష్ణ ప్రద్యుమ్నుల కథ , ధర్మరాజు శకునితో పాచికలాడడం , కీచకుడు ద్రౌపతిని మోహించడం , భీముడు ద్రౌపతి వేషంలో కీచకుని వధించడం , మందిర దక్షిణ గోడలకి మహాభారతంలో భీష్మ పర్వం , ద్రోణపర్వం , ద్రోణుడిపై అర్జనుని విజయ సంబరాలు , కృష్ణార్జనుల స్నేహం , పాండవుల విజయ సంబరాలు , హోసల రాజ దర్బారు , మోహిని , దక్షిణామూర్తి , ఉమామహేశ్వరులు , తాండవేశ్వరుడు , అర్జనుడు శివుని కొరకై తపస్సుచేసి అతనిని ప్రత్యక్షం చేసుకోడం , మహాభారతంలోని అరణ్యపర్వం , భీముడు భాగదత్తుల కథ , భైరవుడు , గణేశుడు , వామనుడు , నృత్యకళాకారులు , ఉమాశంకరుల వివాహం , త్రిమూర్తులు , తారకాసుర సంహారం , మూడు ముఖాలతో బ్రహ్మ  హంసవాహనం పై ఆసీనుడై , యోగ నృసింహ స్వామి , నాట్యం చేస్తున్న మోహిని , శివుడు , దేవీదేవతలతో శేషశయన విష్ణుమూర్తి , ప్రహ్లాద హిరణ్యకశిపుల వృత్తాంతం , మోహిని భైరవిగా భైరవుని పక్కన వున్నట్లు , రామరావణ పోరు , బ్రహ్మ , సరస్వతి  , ఇంద్ర , కృష్ణ-అర్జున , భీష్మ- దుశ్సాసన , మోహిని కథలు , రతీమన్మధులు ఇలా యెన్నో శిల్పాలు చూడొచ్చు .

పార్వతి ఇంద్రాలిక వృత్తాంతం , విష్ణుమూర్తి శేషుని పై శయనించి ప్రపంచ రూపకల్పన చేస్తున్న దృశ్యం , అర్జున భీమ వృత్తాంతం , అష్టరుద్రులు , నృత్యం చేస్తున్న నటరాజు , గణపతి , సరస్వత్ , భైరవి , ఉగ్ర నృసింహస్వామి , శివుడు గజాసురుని వధించుట , నృత్యభంగిమలో వినాయకుడు , నెమలివాహనంపై కార్తికేయుడు , షణ్ముఖుడు సుభ్రమణ్యేశ్వరుడిగా యిలా ఒకటని కాదు పురాణాలలో వివరించిన ముఖ్య ఘట్టాలను ఒక్కటీ విడిచి పెట్టలేదేమో అని అని పిస్తుంది . యోగ పార్వతి , నగ్న భైరవుడు , వేదాల ప్రకారం ద్వాదశ ఆదిత్యులు ఇవి ఈ మందిరంలో మాత్రమే చూడగలం . నవరంగమంటపంలో ప్రతీ స్థంబానికీ వున్న శాలభంజికలు ఒకటనేమిటి ప్రతీ శిల్పం ఓ అద్భుతమే , ఇన్ని విగ్రహాలూ దేనికదే సాటి , మందిర గోడలపై వున్న చిన్నచిన్న శిల్పాలు వందలలో వున్నాయి , దేనికదే ప్రత్యేకంగా వుంటాయి , యేరెండు శిల్పాలూ ఒకేలా లేవు , చేతితో చేసిన యేదైనా ఒకదానిని పోలి మరొకటి వుండదు .           హోసలేశ్వర మందిరం , బేలూరు మందిరం ఆర్కియాలజీ వారి సంరక్షణలో వున్నాయి . ఆర్కియాలజీ వారి ఆర్ధైర్యంలో వున్న సంగ్రహాలయంలో చాలా అరుదైన శిల్పాలు వున్నాయి , హలబీడు మందిరాన్ని చూసిన తరువాత ఈ మ్యూజియం ని కూడా చూడడండి . మన శిల్ప సంపద యెంత పాడుచెయ్యబడిందో తెలుస్తుంది . వచ్చేవారం ఈ ప్రాంతంలో వున్న హోసలవంశరాజులచే నిర్మింపబడిన మరికొన్ని దేవాలయాల గురించి చదువుదాం , అంతవరకు శలవు .

మరిన్ని వ్యాసాలు

పాలెగాళ్ళు.
పాలెగాళ్ళు.
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
పురాణాలలో ఒకే పేరు ఉన్నవారు.4.
పురాణాలలో ఒకే పేరు ఉన్నవారు.4.
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
సినిమా గీతాలలో  షెహనాయ్ వాద్యం.
సినిమా గీతాలలో షెహనాయ్ వాద్యం.
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
పురాణాలలో ఒకే పేరు పలువురికి -3
పురాణాలలో ఒకే పేరు పలువురికి-3
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
108
108
- శ్రీరామ్ లక్ష్మీనారాయణ మూర్తి