పాలపళ్ళు
బాల్యం జీవితంలో బహు ముఖ్యమైనది ,ఎంతో క్లిష్టమైనది. ఎంతో జాగ్రత్తగా తీర్చి దిద్దితే తప్ప ఒక ఆదర్శ పౌరుడిగా /పౌరురాలుగా రూపుదిద్దుకోవడం చాలా కష్టమైనపని. దీనికి భిన్నంగా,బాల్యంను దృష్టిలో ఉంచుకుని,చాలా విషయాలను చూసీ చూడనట్టు వదిలేసే మనఃస్తత్వం మన పెద్దలది. పిల్లలు ఏమి చేసినా -’’ వాడికేం తెలుసు .. వాడు చిన్న పిల్లాడు కదా పాపం !’’అని సమర్ధిస్తూ క్షమించేస్తారు అలా .. పిల్లలు చేసే ఎలాంటి పెంకి పనులైనా కూడా ఓపిగ్గా కొంతకాలం భరించాల్సిన పని ఏర్పడుతుంది. తాత/అమ్మమ్మలకు,తాత/నానమ్మలకు,ఇది ఎట్లానూ తప్పదు మరి !ముద్దు -మురిపెంతో,మనవల మీద అధిక ప్రేమతో పిల్లలు యెంత అల్లరి చేసినా ఆనందంగా భరించేస్తారు.
’అల్లరి ,పిల్లలు కాకుంటే ఇంకెవరు చేస్తారు ?’’అని కూడా అనేస్తారు. తాతలు,బామ్మలూ,తల్లిదండ్రులు,చేసే గారాభాన్ని ఆసరాగా తీసుకుని,పిల్లలు ఇంకా రెచ్చిపోయి పెంకిపిల్లలుగా,అల్లరి పిల్లలుగా తయారవు తయారు. ఇలాంటి పిల్లలతో ఇంట్లోనే కాదు బయటికి ఎక్కడికి వెళ్లినా ఇబ్బందే ! అందుకే జీవితంలో ఈ భాగం చాలా ముఖ్యమైనది. దీనిని సజావుగా నడిపించవలసిన బాధ్యత పూర్తిగా తల్లిదండ్రులదే !అయితే,కొన్ని విషయాలకు సంబంధించి ,గారాభాన్ని కాస్సేపు పక్కన పెట్టి,పిల్లలను క్రమశిక్షణలో పెట్టకపోతే,తరువాత నష్టపోయేది పిల్లలే !వాళ్ళను చూసి ఇబంది పడుతూ ,బాధపడేది పెద్దలే !!ఈ నేపథ్యంలో పిల్లల పాలపళ్ళు విషయంలో,వాటి శుభ్రత,సంరక్షణల గురించి ఆలోచించినట్లయితే,ఈ ఆధునిక యుగంలో ఇప్పటికీ చాలా -మంది తల్లిదండ్రులు,సంరక్షకులు,లేదా ఇంటి పెద్దలు,పాలపళ్ళు విషయంలో అనాగరిక మూఢ నమ్మకాలను వల్లే వేస్తుంటారు. ‘’దోడలలో తాత్కాలికంగా వుండే పళ్లే కదా !పైగా త్వరగా ఊడిపోయే పళ్ళేకదా!వాటి కోసం అంత ఆందోళన పడవలసిన అవసరం ఉందా ?అన్ని జాగ్రత్తలు అవసరమా ?’’ అని వాదిస్తారు. ఇది అలాంటి వారి వితండవాదం తప్పమరోటి కాదు. విషయం పరిజ్ఞానం లేని నాగరికులుగా అలాంటి వారిని లెక్కగట్టాలి. ఎందుచేతనంటే,రేపు -జీవితాంతం దౌడలలో వుండే ,స్థిర దంతాలు,స్థిరంగా,పటిష్టంగా,ఆరోగ్యంగా,అందంగా ఉండాలంటే, పాలపళ్ళు ఆరోగ్యంగా ఉంటేనే అది సాధ్యం అవుతుంది.
ఆరు నెలల వయసునుండి -ఆరు సంవత్సరాల వయస్సు వరకూ,దౌడలలో ,మనకు కనిపించే పాలపళ్లను ఏంతో జాగ్రత్తగా సంరక్షించుకోవలసిన అవసరం వుంది. అందుచేతనే రాబోయే స్థిర దంతాలకు పాలపళ్లను ‘ పునాది రాళ్లు ‘గా అభివర్ణిస్తారు. పాలపళ్లను ఎలా సంరక్షించుకోవాలి ?పాలపళ్ళు దౌడలలో రాకముందు నుంచే పిల్లల దౌడ చిగుళ్ళను -సున్నితంగా మర్దనా చేయాలి.
2)పరిశుభ్రమైన మెత్తని పొడిగుడ్డతో చిగుళ్ళను మృదువుగా వత్తాలి.
3)ఆరు నెలల వయసులో పాలపళ్ళు రావడం మొదలైనప్పటినుండి,ఆ .. పళ్ళను,చిగుళ్ళను,ముఖ్యంగా తల్లి స్తన్యం ఇచ్చిన వెంటనే శుభ్రమైన మెత్తటి పొడిగుడ్డతో పళ్లపైనా,చిగుళ్ల పైనా అద్దాలి.
4) స్త్రీ -వైద్య నిపుణుల,మరియు పీడో -డాంటిస్టుల,సలహా మేరకు పాలిచ్చేతల్లులు,తమ పిల్లలకు మంచి ఆరోగ్యవంతమైన పళ్ళు రావడం కోసం, తగిన ఆహారపదార్ధాలను ఎంచుకుని తినాలి.
5) పిల్లల్లో పాలపళ్ళు రాకడను గమనించి,గుర్తించి,తగిన సలహాలు పొందే విషయంలో ఎప్పటికప్పుడు,పిల్లల-దంతవైద్య నిపుణులను సంప్రదిస్తూ ఉండాలి. ఎప్పటికప్పుడు డెంటల్ -హిస్టరీ నమోదు చేస్తూ
ఉండాలి.
6)బిస్కెట్లు ,కేకులు,చాకోలెట్లు,ఇతర అంటుకునే గుణంగల చిరుతిండ్లు , తీపి పదార్ధాలు,తినడానికి పిల్లలకు ఇచ్చినప్పుడు,పిల్లల పళ్ళు-నోరు శుభ్రంచేసి /చేయించే /అలవాటుచేసే ,బాధ్యత తల్లిదండ్రులదే !
7) పిల్లలు స్వయంగా నోరు పుక్కిలించి నీటిని ఉమ్మివేసే వయసు వచ్చినప్పుడు,అలవాటు అయినప్పుడు,జూనియర్-బ్రష్ తో పళ్ళుతోముకునే ,అలవాటును క్రమంగా ,కార్యరూపంలోకి తీసుకు రావాలి. ముందు తల్లిగాని,తండ్రి గాని,బ్రష్ తో పళ్ళుతోమీ ,తర్వాత పిల్లలు అలవాటు చేసుకునే పరిస్థితులు తీసుకు రావాలి. ఇలా చేయడం వల్ల పిల్లలు చాలా త్వరగా అలవాటు చేసేసు కుంటారు. కొందరు పిల్లలు పళ్ళు తోమే క్రమంలో పేస్ట్ చప్పరిస్తూ మింగేస్తుంటారు తల్లిదండ్రులు జాగ్రత్తగా ఎంతో సహనంతో ఈ అలవాటును తమ తెలివి తేటలతో మాన్పించాలి. పిల్లలకోసం ప్రత్యేకంగా లభ్యమయ్యే టూత్ పేస్టులను మాత్రమే వాడాలి మృదువైన నాలుక బద్ద (టంగ్ క్లినర్ )తో నాలుక గీసుకోవటం జాగ్రత్తగా గీసుకోవడం అలవాటు చేయాలి.
8) మిశ్రమ దంతాల సమయంలో దౌడలలో రెండు వరుసల పళ్ళు ఏర్పడే అవకాశం వుంది. అలాంటప్పుడు పిల్లలు తిన్న ఆహారపదార్ధపు అణువులు పలువరుసలమధ్య చిక్కుకుని పరిశుభ్రతకు నోచుకోని పక్షంలో చిగురు వ్యాధులు ,దంతవ్యాధులు రావడమేగాక ,పిల్లల నోటినుండి దుర్వాసన వచ్చే అవకాశం వుంది. ఇలాంటి పిల్లల విషయంలో తల్లి -దండ్రులు ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉండాలి. సరిగా దంతధావనం చేయించడంతో పాటు ఎప్పటికప్పుడు మంచినీటితో నోరు పుక్కిలించే -అలవాటు చేయించాలి. పంటి సమస్యలు వున్నా లేకున్నా,కనీసం ఆరునెలల కొకసారి దంత వైద్య పరీక్షలు చేయించాలి. ఆరోగ్యవంతమైన పాలపళ్ళు స్థిర దంతాలకు పునాది రాళ్లు !!