అనాధయిన తెలుగు కధ - అయ్యగారి శ్రీనివాస్

telugu story

"ఈ మనీషి జీవితమే ఒక పెద్ద పుస్తకం. అందులో ఆరు దశాబ్దాలకు పైబడి తెలుగు బాష, కధ, నాటక, రేడియో, సినిమా, పాత్రికేయ చరిత్ర నిక్షిప్తమై వుంది. అత్యంత అరుదైన ఆ మహానుభావుడే గొల్లపూడి మారుతీరావు "  గత ఆరు దశాబ్దాలుగా  తెలుగుకధా రచయితగా,  ప్రతీ తెలుగు గడప కి సుపరిచితుడై,మరి తెలుగు నాటక, నటనా రంగాలలో తనదైన స్టాంప్ వేసుకొని తెలుగు తల్లికి  ఎనలేని సేవలందించిన ఒక వెలుగు, ఒక్కసారి మనల్నందర్నీ వదలి,  వెళ్ళిపోయింది ఎక్కడో తెలియని లోకంలోకి.  భువి నించి నింగికెగసింది, ఒక ధ్రువ తార లా ఈ వినీలాకాశం నుంచి  తెలుగు జగత్తుకి కలకాలం విద్వత్ వెలుగులు అందించడానికి అన్నట్టు, తెలుగు భాషాజ్యోతి.

నా వయసు బహుశా అప్పుడు సుమారు ఏడెనిమిది ఏళ్ళు ఉండవచ్చు, కానీ నాకు మాత్రం చాలా గుర్తు  . మా అమ్మగారు చాలా సాహితీ అభిమాని, పుస్తకాలు, కథలు చదవడం చాలా ఇష్టం ఆవిడకి.  ఆవిడ దగ్గరే విన్నాను సుమారు అయిదు దశాబ్దాలక్రితం ఈ  మహామనిషి గురించి.    "నాకు గొల్లపూడి మారుతీ రావు రచనలంటే చాలా ఇష్టం రా..అయన రాసే కధ ఎప్పుడూ మనలాంటి మధ్యతరగతి కుటుంబాల చుట్టూనే తిరుగుతూ ఉంటుంది.  అంత సహజం గా సమాజం లోని మనుషులు, మమతలు, అనుబంధాల మీద, మనలో ఒక మనిషి లా ఊహించుకుని మరీ రాస్తారు రా, అంటూ  గొల్లపూడి మారుతీరావు గురించి  మొట్టమొదటి ఇంట్రడక్షన్ ఇచ్చిందావిడ.  చిన్నవాడ్ని, అమ్మ చెప్పింది నాకు ఏమి అర్థం కాకపోయినా, నా మైండ్ లో ఇంప్రింట్ అయిపొయింది గొల్లపూడి గారి పేరు. ఆరోజుల్లో మారుతీరావు గారు అల్ ఇండియా రేడియోలో పనిచేసే రోజుల్లో, ఆయన రాసిన నాటకాలు మా ఇంట్లో వాళ్లందరమూ రేడియో చుట్టు మూగి వినడం ఈ నాటికి గుర్తే.

తరువాత నా జీవితం చదువు, ఉద్యోగం, సంసారం అనే మూడింటి మధ్య సర్కస్ చేసి, చివరికి  స్వచ్చంద పదవీ విరమణ అనే సాకు తొ ఉద్యోగం అనే బందిఖానా నుంచి  విముక్తుడినై సువిశాలమైన నాదైన ఈ సాహితీ  ప్రపంచంలోకి మూడేళ్ల క్రితం అడుగుపెట్టాక, నా స్మార్ట్ ఫోన్ లో నేను గూగుల్ చేసిన మొట్టమొదటి పదం "గొల్లపూడి మారుతీరావు". ఆ రోజు నుంచీ మొదలుపెట్టాను, ఆయన రాసిన, చెప్పిన అనేకానేక  కధలు, రచనలు చదవడం. మనిషి జీవితం మీద ఆయనకే సొంతమైన రీతిలో రాసిన జీవన కాలం లు. చూశాను యు ట్యూబ్ లో అయన ఇచ్చిన ప్రసంగాలు, ఇంటర్వ్యూ లు.  ఈ వ్యక్తి గురించి తెలుకోడానికి   గత మూడేళ్ల గా ప్రతిరోజు కనీసం రెండు గంటలు కేటాయిస్తూ వచ్చాను, అయినా నేను అయనను చదవగలిగింది అతి తక్కువ మాత్రమే, అయన రాసిన పుస్తకాలు అన్నీ చదవగలిగితే బహుశా నాకు అయన గురించి అవగాహన వస్తుందేమో. ఎందుకంటే యే మనిషికి అయినా ఒక కోణం మహవుంటే రెండో కోణం వుంటాయేమో. మరి ఈ మహానుభావుడి కి వున్నవి విభిన్న కోణాలు, ఎన్నో పార్శ్వాలు, ఒకే వ్యక్తి ఇన్ని రంగాల్లో రాణించడం, ఒక్క గొల్లపూడి మారుతీ రావు గారికే తగిందేమో.

అయన లో నేను ముఖ్యం గా గమనించింది అయన తెలుగు ఇంగ్లీష్ రెండు భాషల్లోనూ సంపాదించిన  అపార ప్రావీణ్యత. బహుశా మిగిలిన  తెలుగు యే రచయిత కి మన గొల్లపూడి వారికి వున్న ఆంగ్ల భాషా పరిజ్ఞానం లేదు అంటే అతిశయోక్తి కాదు.  విశ్వనాథ సత్యనారాయణ గారి సాహిత్యం గురించి ఎంత అథారిటీ తొ మాట్లాడగలరో, అంతే కాంఫిడెన్స్ తొ ఆంగ్ల రచయత సోమర్సెట్ మామ్ గురించీ చెప్పగలరు. ఎంత చక్కగా శ్రీ శ్రీ పద్యం వర్ణించగలరో, అంతే అద్భుతం గా  టెన్నిసన్ పోయెట్రీ ని కూడా వివరించగలరు. అలాగే ఒక థామస్ హార్డీ, అలెగ్జాండర్ చెకోవ్ ల్లాంటి వారు  రాసిన పుస్తకాలు అయన కి కొట్టిన పిండి.

ఆయన రాసిన "రాగ రాగిణి " నాటకం ఆ రోజుల్లో ఒక సంచలనం.అలాగే అయిదుగురు చూపులేని వ్యక్తుల మీద ఆధారపడి రాసిన "కళ్ళు" నాటకం కళ్ళు లేని మనుషుల్లో వుండే మానవతా విలువల్ని, అదే గ్రూప్ లోని ఒక వ్యక్తికి కంటి చూపు వస్తే అతనిలో క్రమంగా ప్రజ్వరిల్లే దానవత్వం, కళ్లుండి కూడా గుడ్డివాళ్ళగా నటించే వ్యక్తుల్లో కనపడే దురాశ, దుర్బుద్ధి, లాంటి అవలక్షణాల్ని, కొట్టొచ్చినట్టు కనపడేలా చూపిస్తుంది. మారుతీరావు గారు రాసిన "సాయంకాలమైంది" నవల, ఎప్పుడో రాసినా, ప్రస్తుత సమాజానికి కూడా సరిపడేలా ఉంటుంది. ఎక్కడో ఒక మారుమూల ఒక పల్లెటూరు లో గేదెలు కాసే  పిల్ల ,  అమెరికా లో తేలే దాకా సాగిన విచిత్ర పయనమే అయన రాసిన  "ఎర్ర సీత " నవల.

అల్ ఇండియా రేడియో లో ఇరవై రెండేళ్ల వయసు లో చేరేసరికే  అయన తెలుగు కధ, నాటకాలు రాయడం లో పేరు తెచ్చుకున్నారు.ఒకానొక ఇంటర్వ్యూ లో అయన అంటారు "దాదాపు ఎనభై ఏళ్ళ వయసు లో కూడా  నేను సాహితీ రంగం లో యువకుడ్ని సరే, కానీ  అల్ ఇండియా రేడియో లో చేరేనాటికి నేను ఒక కుర్రాడ్ని మాత్రమే. ఎందుకంటే ఆరోజు నా ఎదురుగా ,|

రావూరి భరద్వాజ, దేవులపల్లి కృష్ణశాస్త్రి, మునిమాణిక్యం నరసింహారావు, న్యాపతి రాఘవ రావు, వేలూరి సహజానంద నాయని సుబ్బారావు, త్రిపురనేని గోపీచంద్ లాంటి ఉద్దండులు వున్నారు " అంటూ. అయన సమకాలీనులు శంకరమంచి సత్యం, ఉషశ్రీలు.తెలుగు సాహిత్యం లో గత అరవై ఏళ్లగా, ఆయన కలవని రచయిత లేడు, మాట్లాడని కవి లేడు. అందరూ ఆయనకు సుపరిచయమే. ఒక రాచకొండ విశ్వనాధ శాస్త్రి, శ్రీ శ్రీ, వాకాటి పాండురంగారావు, దేవులపల్లి, ఆరుద్ర, ఆత్రేయ, దాశరధి, సి నా రే, కాళీపట్నం రామారావు, మాలతీ చందూర్, గణేష్ పాత్రో, చలం, కొర్రపాటి గంగాధర రావు, పురిపండ అప్పలస్వామి,పురాణం సుబ్రహ్మణ్యశర్మ,  ఎం వి ఎల్ నరసింహారావు, బుచ్చిబాబు,  ఆలా చెప్తూ పొతే ఎంత మందో,  ఎంతెంత మందో. ఒక స్టార్ రైటర్ గా ఖ్యాతి గడించిన గొల్లపూడి తన నలభై రెండేళ్ల వయసు లో "ఇంట్లో రామయ్య వీధిలో కృష్ణయ్య" ద్వారానటుడి గా సినిమా రంగం లోకి అడుగుపెట్టారు. అయన నటించిన మొట్టమొదటి సినిమాతోనే అయన తెలుగు ప్రేక్షకుల గుండెల్లో నిలబడిపోయారు. కేవలం గొల్లపూడి మారుతీ రావు గారి గురించే సినిమాల్లో  పాత్రలు కావాలని సృష్టించారు అంటే ఆశ్చర్యం కలుగుతుంది.  చాలా సందర్భాలలో అయన చెప్తూ ఉండేవారు "నేటి యువతరం నన్ను సినిమా నటుడి గానే గుర్తించడం బాధ కలిగిస్తుంది, నిజానికి నేను రచయిత ని, తరువాతే నటుడ్ని " అంటూ.  గొల్లపూడి గార్ని నటుడి గా కంటే ఒక అద్భుత రచయిత గా అభిమానించి, ఆరాధించే వ్యక్తుల్లో నేను ముందుంటాను.

అయినా అయన నటించిన సినిమాల్లోని కొన్ని పాత్రలు నా హృదయం మారుమూలల్లోకి వెళ్లి మరీ దాక్కున్నాయి. ఉదాహరణకి "సంసారం ఒక చదరంగం" సినిమా లో ఏమి చేయలేని ఒక నిస్సహాయ  మధ్య తరగతి గృహ యజమాని గా అయన చూపించిన అభినయం, ప్రేక్షకుల కళ్ళల్లోంచి నీళ్లు తెప్పిస్తుంది.అలాగే "అభిలాష" చిత్రం లో ఓబులేసు పాత్ర,  దాంట్లో అయన నటించారు అనడం కంటే ఆ పాత్ర లో జీవించారు అంటే బాగుంటుందేమో. 1964 లో విడుదలై సంచలనం సృష్టించిన "డాక్టర్ చక్రవర్తి " సినిమా కధ కోడూరి కౌసల్యాదేవి రాస్తే, డైలాగ్స్ రాసింది మన గొల్లపూడి వారే. తరువాత అయన ఎన్నో సినిమాలకి డైలాగ్స్, స్క్రీన్ ప్లే చేశారు. అయన రాత లో ఎన్నో చమక్కులుండేవి. రాచకొండ విశ్వనాధ శాస్త్రి గారు మరణించిన సందర్బంలో ఆయన,  సాధారణంగా అందరూ చెప్పేటట్లు "రాచకొండ వారు కన్ను మూత " అని చెప్పకుండా "రాచకొండ వారి పెన్ను మూత " అని వ్యాఖ్యానించడం, తెలుగు మాట మీద అయనకున్న పట్టు తెలియచేస్తుంది.

ఇక అయన రాసిన పుస్తకాలు ఉస్మానియా, ఆంధ్ర యూనివర్సిటీ పోస్ట్ గ్రాడ్యుయేషన్ విద్యార్థుల పాఠ్యఅంశం గా తీసుకోవడం జరిగింది. గొల్లపూడి ఒక జర్నలిస్ట్ గా ఒక కాలమిస్ట్ గా ఎన్నో వందల వ్యాసాలు, ఆర్టికల్స్ రాసారు. దాంట్లో ఆయన రాసిన "జీవన కాలం" చాలా కాలం వివిధ తెలుగు వార్తాపత్రికల్లో ప్రచురితమౌతూ వచ్చాయి. జీవన కాలం లో అయన టచ్ చెయ్యని సబ్జెక్టు అంటూ లేదు. ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ గారి దగ్గర్నుంచి  ఆనాటి మద్రాస్ లోని లజ్ కార్నర్ లో పాత పుస్తకాలు అమ్మే ఆళ్వార్ అనే వ్యక్తి దాకా, సమాజం లోని ప్రతీ మూల మూల తాకి మన కళ్లెదుట నిలపెట్టారు.

హెచ్ ఎం టి వి సంస్థ నిర్వహించిన అత్యుత్తమ తెలుగు కధ శీర్షిక అయన నిర్వహించిన తీరు, పాఠకుల హృదయాలు ఒక ఆర్ద్రత తో నింపేస్తుంది. కధ వివరించేముందు, ఆ కధ రాసిన రచయిత గురించి ఆయన ప్రకటించే భావాలు మన గుండెల్ని ఒక తీయ్యని భావాలతో నింపేస్తుంది.నూట ఇరవై ఎపిసోడ్లతో గొల్లపూడి గారి సంపాదకత్వం లో ప్రసారమైన, ఈ "వందేళ్ల తెలుగు కధ కి వందనాలు " కార్యక్రమం, తెలుగు భాష, కధాభిమానుల్ని మంత్రముగ్దుల్ని చేస్తుంది.అలాగే  అయన చేసిన మరో ప్రయోగం కౌముది ఇంటర్నెట్ పత్రిక కోసం ఆయన చెప్పిన ఆడియో కథలు.

అయన మాట మాట్లాడితే పుట్టుకొస్తుందీ ఒక కధ, అదే మాట కి ఇంకో మాట కలిపితే, నడిచొస్తుందో నవల. చెప్పాలంటే  అయన ఒక వాకింగ్ ఎన్సైక్లోపీడియా, ఒక సమగ్ర గ్రంధాలయం. ఆయన మాట్లాడే భాష ఏమాత్రం భేషజం లేకుండా, ఒక మామూలు మధ్య తరగతి వ్యక్తి మాట్లాడుతున్నట్టు ఉంటుంది.  ఆయన్ని చూస్తే నా చిన్నతనం రోజుల్లో మా ఇంటి పక్కన వుండే మాస్టారు గుర్తుకోచ్చేలా వుంటారు, అతి సామాన్య మనిషి లా, మన అతి సమీప బంధువులా. మాట కడు తీపి, మృదు మధురం. అయన మాట్లాడుతూ వుంటే ఇంకా ఇంకా వినాలనిపిస్తుంది.  మనిషి నిగర్వి. నాకు తెలిసి ఆయన కారు లో ప్రయాణించడం కన్నా, నడుస్తూ, నడుస్తూ వెళ్లడమే ఇష్టపడేవారేమో అనిపిస్తుంది. ఎందుకంటే, అయన రాసిన రచనల్లో, మట్టి రోడ్డు మీద వెళ్తున్న సామాన్యుడు కనిపిస్తాడు, రైల్వే ప్లాటుఫారం మీద నడుస్తున్న కంటి చూపులేని అభాగ్యులు కనిపిస్తారు,  అలాగే పిల్లలు దూర దేశాలకి వెళ్లిపోగా, తమ పాత పెంకుటింట్లో బిక్కు బిక్కు మంటూ రోజులు వెళ్లదీస్తున్న ముసలి దంపతులూ కనిపిస్తారు.    చెన్నై, హైదరాబాద్, విజయవాడ లాంటి ఊళ్ళల్లో చాలా కాలం వున్నా, ఆయనకీ విశాఖపట్నం అంటే అంతులేని ప్రీతీ మమకారం. తాను చదువుకున్న ఏ వి యెన్ కాలేజీ,  ఆంధ్ర యూనివర్సిటీ  కాలేజీ లు ఎప్పుడూ మర్చిపోలేదు. అందరూ మిత్రులే, అందరూ బంధువులే ఆయనకి.అందరికీ కావాల్సిన మనిషే.

డాడీ, మమ్మీ సంస్కృతి వచ్చాక తెలుగు భాష దాదాపు అంతరించిపోయే స్థితి..  ఆయన రాసిన కధ లు రచనలు, విద్యార్థుల కి చెప్పగలిగితే  కనీసం వాళ్ళకి మళ్ళి తెలుగు భాష మీద మక్కువ తేవచ్చేమో. ఇంతటి ఒక మల్టీ ఫేసెటెడ్ పర్సనాలిటీ, ఏ అమెరికా లోనో, ఇంగ్లాండ్ లోనో, కనీసం మన తెలుగు రాష్ట్రాల బయట పుట్టి ఉండి వుంటే, బహుశా ప్రపంచానికి ఇంకో టెన్నిసన్నో, లేదా ఇంకో సోమర్సెట్ మామో పరిచయం అయివుండేవాడు.  మన గొల్లపూడి వారు కనీసం ఒక పద్మశ్రీ క్కూడా నోచుకోలేకపోయారు అంటే, అక్కడ చిన్నబోయింది ఆయన వ్యక్తిత్వం మాత్రం కాదు. అదే విషయాన్నీ ఆయన ఒక ఇంటర్వ్యూ లో చెప్పారు "నా కధ నాకు నచ్చింది, ఇక వేరేవాళ్ళ ప్రశంసలు ఎందుకండీ " అని వేదాంతి లాగా ఒక నవ్వు నవ్వుతూ.

ఆయన కొద్దిసేపట్లో వెళ్ళిపోతారన్న సమయం లో కూడా, ఆయన తృప్తి గా నవ్వుతూ ఆప్యాయంగా తన మిత్రులతో మాట్లాడ్డం, నలభై ఏళ్ళ స్నేహాన్ని గుర్తు తెచ్చుకోవడం చూస్తే అయన మహా వ్యక్తిత్వం లో ఒక పరిపూర్ణత స్పష్టంగా గా కనిపిస్తుంది. కొంతమంది మాట్లాడితే చేటు, కానీ మన మారుతీరావు గారి మాట లేకపోతే లోటు, తీరని లోటు.  ఇన్ని కోట్ల మందిని తన రాత, మాట తో ఒక జీవిత కాలం అలరించి, అలంకరించి, తిరిగిరాని లోకానికి వెళ్లిపోయారు..ఒక తాత్వికుడి లాగ. ఒక యోగి లాగా..

మరి తెలుగు సాహితీ పద సంపద గురించిన చరిత్ర కధలు కథలు గా చెప్పే, కధకుడ్నిమాత్రంకోల్పోయాం ఎప్పటికీ , మనం. అయనతొ అంతరించింది,  తమదైన ఒక తరం, ఇంకో విధంగా చూస్తే ముగిసింది  ఒక శకం. ఒక్కటి మాత్రం సత్యం, తెలుగు మాట ఉన్నంత కాలం గొల్లపూడి మారుతీరావు గారు జీవించేవుంటారు "మన హృదయాల్లో". 

మరిన్ని వ్యాసాలు

సినిమా గీతాలలో  షెహనాయ్ వాద్యం.
సినిమా గీతాలలో షెహనాయ్ వాద్యం.
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
పురాణాలలో ఒకే పేరు పలువురికి -3
పురాణాలలో ఒకే పేరు పలువురికి-3
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
108
108
- శ్రీరామ్ లక్ష్మీనారాయణ మూర్తి
పురాణాలలో ఒకే పేరు పలువురికి 2.
పురాణాలలో ఒకే పేరు పలువురికి 2.
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
డప్పు గీతాలు.
డప్పు గీతాలు.
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు