దండకడియం - ఇంజమూరి మహేష్

dandakadiyam

మా తాత చేతికున్న
దండకడియాన్ని
సప్పుడుజేయకుండ కాజేసి

మాయింట్ల గుంతగిన్నెనీ
ఇడుపునున్న ఎర్రమన్ను తట్టనీ
ఎత్తుకవోయిండు ఓ కవితల్లుకుంటని

చియ్యకూరల పాటవాడుకుంట
పిల్లలముందు వానలకాసేపు
కాగితం పడవలేసిండు

కూలితల్లి తెచ్చుకున్న గంజిచుక్క,
జొన్నరొట్టెకమ్మదనాన్నీ
అరచేయిచాచి రుచిచూసిండు..

నాన్నగుర్తొచ్చినప్పుడల్లా
దుఃఖపుగంపనెత్తుకుని చెరువుగట్టు మీద
కూర్చుంటాడు పరుగెత్తుకెళ్ళి

అమ్మదీపాన్ని గల్లగురిగిల దాసుకపోయి
నాలుగుగిన్నెల కూడలిలో
వెలుగు లేనిచోట ఎలిగిస్తడు

ఒకే ఆకాశాన్ని కప్పుకున్నవాళ్ళం
మనమధ్య అడ్డుగోడలెందుకంటు
గుండెకొమ్మమీంచి మాటలపావురాలెగురేస్తడు

మాఇంటికొచ్చి మా నాన్న గొడ్డలితీస్కవోయి
అడవితులసిని కొల్చి,తుమ్మకొమ్మను నరికి
వాళ్ళ అముడాల మర్కపిల్లలకు మేతేస్తడు

పొద్దుపొద్దున్నేలేసి కూటికోసం
కన్నీటిదారపుకండె వడికి
చెమటనదిలో తడిసిపోతుంటడు

చిమ్మచీకటికమ్ముకున్న జీవితంలో
దుఃఖనదిని దాటుకుంటూ వెళ్ళడం
నెత్తుటిపాదాలకు కొత్తేం కాదంటాడు

వెలిమామిడికి కట్టుకున్న మట్టిఊయలఊగుతూ అరవైమూడు ఎండపద్యాలు పాడి అలిసిపోయి
ఎంటదెచ్చుకున్న ఈతసాపమీన కునుకుతీస్తడు

అవినీతిలవడి తెలంగాణ మనిషిపల్చనైతున్నపుడు
దుసరితీగలపాన్పువాడి పాటవాడుకుంట
దుఃఖమాగుతలేదని కన్నీళ్ళువెడ్తడు

వాళ్ళు రంగులద్దినవాక్యాలన్ని కలిపి వాడు
ఆల్బమ్ చేస్కుంటే పుట్టమన్నులాంటి అక్షరాన్ని
ఎగరేసుకెళ్ళింది గాలి,ఎక్కడిగాలో ఇది అన్కుంటడు

ఊరవతల మనిషిచెట్టువి ఏడంత్రాలమల్లెలు తెచ్చి పెండ్లంచేతిలోవెడ్తె,బువ్వచేతికొంగుతో
నొసటిపై గాయాన్ని తడిమిందని సంబురపడ్తడు

అమ్మలేని నేను
కాలికి ముద్దిచ్చిన ముల్లుపాఠాన్ని
ఆలికి చెప్పి మురిసిపోతానంటడు

ఉగాదిపిలుపుకొచ్చిన బామ్మర్దికి ఉన్నంతల మర్యాదజేసి పక్కకెళ్ళి పెండ్లంతో,
మా బంగారానివి కదూ..ఇంగోపారెల్దువులే అంటాడు

హత్యాచార బాధితుల
కన్నవారినిచూసి వారికీ
కడుపుకోతలెందుకు దేవుడా?ని బాధవడ్తడు

జీవితమొక సంద్రమని,దఃఖమనేది తప్పదని
తెలిసి ఓ కనికరంలేని సముద్రమా? ఈతరాని
మమ్ము దిగమింగుతవెందుకంటాడు.

కూటికోసం దొంగతనం చేసినా
మనసులో దొరతనం వాడిసొంతం
ఏమైనా!వాడులేకుంటే అడవిలో పొద్దూకినట్లుంది.!!


-తగుళ్ళ గోపాల్ రాసిన "దండకడియం" లోని కవితాశీర్షికలన్నీ కలిపి ఈ వాక్యాలు రాయడం జరిగింది.

మరిన్ని వ్యాసాలు