టిక్ టాక్ అనేది మధ్యకాలంలో ఇంటర్నెట్లో సెన్సేషనల్ గా మారిన పాపులర్ యాప్. ముఖ్యంగా యువత ఈ యాప్ కి విపరీతంగా కనెక్ట్ అయిపోయారు. ఇప్పుడీ టిక్ టాక్ లో ఓ ప్రమాదకరమైన ఛాలెంజ్ అనేది తల్లిదండ్రులను హడలెత్తిస్తోంది. ఈ ఛాలెంజ్ అనేది వైరల్ గా మారింది. ఇందులో గనక పార్టిసిపేట్ చేస్తే ఎముకలు విరిగిపోవడం ఖాయం.
అసలీ ఛాలెంజ్ ఏంటి?
దీని పేరు స్కల్ బ్రేకర్. పేరుకు తగ్గట్టే ఇది ప్రమాదకర ఛాలెంజ్. ఈ ఛాలెంజ్ అనేది ఎంతో మందిని గాయాలపాలు చేసి ఆసుపత్రిలో అడ్మిట్ అయ్యేలా చేస్తోంది. నిజానికి, చాలామంది ఐసీయులో కూడా చేరారంటే దీని వ్యాప్తి ఏ రేంజ్ లో ఉందో ఊహించండి.
ఈ జంపింగ్ ఛాలెంజ్ లో ముగ్గురు పార్టిసిపెంట్స్ ఉంటారు. ముగ్గురు పక్కపక్కన నించుంటారు. ముగ్గురు జంప్ చేస్తూ ఉండగా మధ్యలో ఉన్నవారి కాళ్ళను అటూ ఇటూ నించున్న వారు తమ కాళ్లతో లాగేస్తారు. దాంతో, మధ్యలోనున్నవారు ధభీమని కిందపడిపోతారు. ఈ ఛాలెంజ్ గురించి అవగాహన లేని వారిని ఇలా మధ్యలో నించోపట్టి బురిడీ కొట్టిస్తారు. నిజానికి ప్రాంక్ అన్నమాట.
ప్రాంక్ వీడియోస్ ఎక్కువ మందిని ఆకర్షిస్తాయన్న కాన్సెప్ట్ ను పట్టుకుని ఎవరో ఆకతాయిలు ఇటువంటి ఛాలెంజెస్ కు శ్రీకారం చుట్టినట్టున్నారు. అమాయక యువత వీటి బారిన పడుతున్నారు.
ఇటువంటి వీడియోస్ టిక్ టాక్ లో హల్చల్ చేస్తున్నాయి. ఐతే, పడిపోయిన వారి పరిస్థితి ఏంటో మాత్రం వీడియోస్ లో చూపించట్లేదు. ఏది ఏమైనా ఇది సురక్షితమైన ఛాలెంజ్ ఏ మాత్రం కాదు. ఈ ఛాలెంజ్ అనేది టిక్ టాక్ కి మాత్రమే పరిమితం కాలేదు. వాట్సాప్ ద్వారా కూడా ఫార్వర్డ్స్ రూపంలో స్ప్రెడ్ అవుతోంది.
ఇటువంటి ఛాలెంజెస్ కు ఆకర్షితులవకుండా తల్లిదండ్రులు తమ పిల్లలకు అవగాహన కల్పించాలి. స్కూల్స్ అలాగే కాలేజెస్ లో కూడా సోషల్ మీడియా పరిధి ఏంట అనేది విద్యార్థులకు అవగాహన కలిపించాలి.