మొక్కు (చిన్నపిల్లల కథ) - డి వి డి ప్రసాద్

prayer(children story)

బ్రహ్మపురంలో నివసించే సుబ్బయ్య అనే వ్యాపారస్తుడు చాలా పిసినారి గుణం కలవాడు. వారసత్వంగా సంక్రమించిన ఆస్థులున్నా,  వ్యాపారంలో బాగా సంపాదించినా కూడా డబ్బులు ఖర్చు పెట్టేటప్పుడు మాత్రం ఒకటికి వందసార్లు ఆలోచిస్తాడు. దానధర్మాలు, దైవ కార్యాలకి డబ్బులు ఖర్చు పెట్టడానికి అతను పూర్తి వ్యతిరేకి. అయితే, అతని భార్య సుబ్బమ్మకి మాత్రం దైవభక్తి మెండుగా ఉంది. అమె అతన్ని ఆలయానికి రమ్మని ఎప్పుడూ సతాయిస్తూ ఉండేది.  అంతేకాక రకరకాల మొక్కులు మొక్కి అవి తీర్చమనేది.  ఆ మొక్కులు తీర్చటం, వాటికోసం డబ్బులు ఖర్చు చేయడం బొత్తిగా ఇష్టం unDEdi kaadu సుబ్బయ్యకి.  అందుకే ఎవో సాకులు చెప్పి ఎప్పటికప్పుడు తప్పించుకునేవాడు. 

ఇలా ఉండగా పొరుగు ఊళ్ళో రెండేళ్ళకొకసారి జరిగే అమ్మవారి సంబరాలు ఆరంభమయ్యాయి. ఆ ఊళ్లో సుబ్బమ్మ అక్క, బావ ఉంటున్నారు. సంబరాలు ఆరంభమయ్యాయన్న విషయం వాళ్ళద్వారా తెలుసుకున్న సుబ్బమ్మ అక్కడికి వెళ్లడానికి తయారై భర్త సుబ్బయ్యతో అంది, "నిరుడు మీకు జబ్బు చేసినప్పుడు నేను అమ్మవారికి మొక్కాను, అమ్మవారికి చీర ఇస్తానని, ఇంకా వంద వరహాలు హుండీలో  వేస్తానని కూడా మొక్కుకున్నాను. రేపు ఉదయమే బయలుదేరదాం, బాడుగ బండికి మాట్లాడండి.”

భార్య మాటలు వింటూనే సుబ్బయ్య గుండెల్లో రాయి పడింది. బాడుగ బండిలో వెళ్ళిరావడానికి, మొక్కు చెల్లించుకోవడానికి అయ్యే ఖర్చు తలచుకొనేసరికి సుబ్బయ్యకి కళ్ళు బైర్లు కమ్మాయి.  అదంతా దండుగ ఖర్చని తలచి ప్రయాణం తప్పించు కోవడానికి ఉపాయాలు ఆలోచించసాగాడు సుబ్బయ్య.

కొద్దిగా ఆలోచించిన మీదట ఒక ఉపాయం తట్టింది.  ఆ మరుసటి రోజు ఉదయం పెందరాడే లేచి సుబ్బమ్మ ప్రయాణానికి తయారయ్యే సరికి సుబ్బయ్య మంచం మీద నుండి లేవకుండా బాధ నటిస్తూ మూలుగుతున్నాడు.  అతన్ని లేపడానికి వెళ్ళిన సుబ్బమ్మతో, "నా నడుం పట్టేసి విపరీతంగా నొప్పిపెడుతోంది, నేను ఒక్క అడుగు కూడా వెయ్యలేను. ఈ పరిస్థితిలో ప్రయాణం చేయలేను." అన్నాడు. బాధ నటిస్తూ. 

అతని పరిస్థితి గ్రహించి వేడినీళ్ళ కాపడం పెట్టిందామె, అయినా ఉపశమనం కలగనట్లు నటించాడు సుబ్బయ్య.  అతని బాధ త్వరగా తగ్గితే అమ్మవారి సంబరాలకి తీసుకు పోయి మొక్కు తీర్చుకోవచ్చని ఆమె భావన. అయితే, సుబ్బయ్య మాత్రం ఎలాగైనా ఖర్చు తప్పించుకోవడానికి బాగా బాధ పడుతున్నట్లు నటించసాగాడు.  ఇంకో నాలుగు రోజులు ఇలాగే చేస్తే, సంబరాలు కూడా అయిపోతాయి, మరో రెండేళ్ళ వరకూ తన భార్య మొక్కు విషయం ఎత్తదని, ఆ తర్వాత మర్చిపోయినా మర్చి పోవచ్చని భావన సుబ్బయ్యది.

ఇంకొంచెం ఎక్కువ నొప్పి ఉన్నట్లు, అసలు నడవ లేనట్లు నటించ సాగాడు.  సుబ్బమ్మ వైద్యుడ్ని పిలుచుకొచ్చింది.  వైద్యానికైన ఖర్చుకి బెంబేలెత్తినా, మొక్కు ఖర్చు తప్పించుకోవచ్చని, అతను ఇచ్చిన లేహ్యాలు వాడినట్లు, అయినా నొప్పి తగ్గనట్లు  నటించ సాగాడు సుబ్బయ్య.  అతని పరిస్థితి చూసి చేసేది లేక ప్రయాణం మానుకుంది సుబ్బమ్మ.  ఆ రోజుతో సంబరాలు ముగుస్తాయి.  ఇక తన నాటకానికి ముగింపు పలకొచ్చని సుబ్బయ్య అనుకుంటుండగా సుబ్బమ్మ అంది, "మన ఊరి వైద్యుడిచ్చిన మందులు మీకు పని చేసినట్లు లేవు.  రేపు ఉదయమే మనం బాడుగబండి కట్టించుకొని పట్నం వెళ్దాం.  అక్కడ మంచి వైద్యులుంటారు, మీకు వెంటనే నయమవుతుంది. ఆ తరవాత తిరుపతి వెంకన్న దయ!"

మళ్ళీ వైద్యం, బాడుగ బండి, వాటి ఖర్చు తల్చుకొనే సరికి సుబ్బయ్య కలవరపడ్డాడు.  ఆ రోజు మరేం అనక ఆ తర్వాత రోజు ఉదయమే తన నాటకం చాలించి సుబ్బయ్య లేచి నడుస్తూ, "ఎమేవ్!  నా నడుం నొప్పి పూర్తిగా తగ్గిపోయింది. మన ఊరి వైద్యుడిచ్చిన మందు బాగా పనిచేసింది. మరి పట్నం వెళ్ళనవసరం లేదు." అన్నాడు.

అది చూస్తూనే సుబ్బమ్మ అనందంగా,"అమ్మయ్య! నేను అనుకున్నట్లు మీకు పూర్తిగా నయమైంది. అంతా ఆ ఏడుకొండలవాడి దయ! నా మొక్కు ఫలించింది. మీకు ఎంతకీ నయమవక పోవడంతో నిన్న రాత్రి తిరుపతి వెంకన్నకి మొక్కుకున్నా, మీకు వెంటనే నయమవుతే తిరుపతి కాలి నడకన వెళ్ళి హుండీలో వెయ్యవరహాలు వేస్తానని.  అంతే కాకుండా అమ్మ వారి పాత మొక్కు చెల్లించుకోక పొవడం వల్ల ఇలా జరిగిందని ఈ సారి రెండు వందల వరహాలు మొక్కాను" అంది.

ఆ మాటలు వింటూనే సుబ్బయ్యకి మూర్చ వచ్చినంత పనయ్యింది. వంద వరహాల మొక్కు ఖర్చు తప్పించుకుందామంటే రెండు వందల మొక్కే కాక, దానితో పాటు వెయ్య వరహల కొత్త మొక్కు ఖర్చు తగులుకుందని  దిగులు పట్టుకుంది మరి అతనికి. 
 

మరిన్ని వ్యాసాలు

మా చార్ధామ్ యాత్ర-4
మా చార్ధామ్ యాత్ర-4
- కర్రా నాగలక్ష్మి
Maa chardham yatra
మా చార్ధామ్ యాత్ర
- కర్రా నాగలక్ష్మి
సినీ అప్సరస గీతాలు .
సినీ అప్సరస గీతాలు .
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
వివేకానంద రాక్ మెమోరియల్ స్థపతిశ్రీ.ఎస్.కె ఆచార్య
స్థపతిశ్రీ.ఎస్.కె ఆచార్య
- కుందుర్తి నాగబ్రహ్మాచార్యులు
రాజస్తాన్ ప్రాంత నిర్మాణ విశేషాలు
రాజస్తాన్ ప్రాంత నిర్మాణ విశేషాలు
- కుందుర్తి నాగబ్రహ్మచార్యులు