ముగ్గురాళ్ల మిట్ట - PETA YUGANDHAR

mugguralla mitta book review

పల్లె ప్రజల జీవన చిత్రం

ముగ్గురాళ్ల మిట్ట

“ముగ్గురాళ్ల మిట్ట” కథాసంపుటిలో మొత్తం పదహారు కథలున్నాయి. అన్నీ అచ్చమైన పల్లె సంస్కృతిని పరిమళింపజేసే కథలే. కథలు చదువుతున్న పాఠకుడు పల్లెతల్లి ఒడిలో సేదదీరుతున్నట్టు, పొలంగట్లపై నడుస్తున్నట్టు అనుభూతి పొందుతాడు. పల్లె ప్రజల అమాయకత్వానికి నవ్వుకొంటాడు. వారి ఐక్యమత్యానికి ఆశ్చర్యపోతాడు. వారి కష్టాలు చూసి చలించిపోతాడు.

సంపుటిలోని మొదటి కథ ‘ముగ్గురాళ్ల మిట్ట’ లో పల్లెల మధ్య అభివృద్దికి నోచుకోని రవాణా వ్యవస్థను ప్రశ్నిస్తూనే, తోటివారి పట్ల పల్లెవాసులు చూపే ప్రేమాభిమానాలను వివరిస్తారు రచయిత. ఈ కథలో పదవతరగతి పరీక్షలు రాసే ప్రమీల, పరీక్ష హాలుకు వెళ్లడానికి ఆటోలో బయలుదేరుతుంది. బస్సు సౌకర్యం లేని ఆ ప్రాంతంలో ఎక్కడికెళ్ళాలన్నా ఆటోలే  ప్రత్యామ్నాయం. అకస్మాత్తుగా ఆటో టైరు పంచరవుతుంది. ఆ సమయంలో ప్రమీలను పరీక్షహాలుకు పంపడానికి గ్రామస్తులు చూపిన చొరవ పాఠకులను ఆకట్టుకొంటుంది.

“గంప కింద కోళ్లు’ కథలో ఇంటరు పాసై పట్నంలో డిగ్రీ చేరడానికి బయలుదేరుతుంది బిందు. బస్సు ఎక్కినప్పటినుండీ ప్రతి పదినిముషాలకొక సారి  ఆమె మొబైల్ కు ఫోన్ చేస్తుంది తల్లి రమణమ్మ. బస్సులో మగాళ్ల పక్కన కూర్చోవద్దని, కాలేజీలో కుర్రాళ్లతో మాట్లాడవద్దని జాగ్రత్తలు చెబుతుంది. సమాజపు తీరును, ఆడపిల్లను ఒంటరిగా పంపేటప్పుడు తల్లిదండ్రులు పడే మానసిక సంఘర్షణను ఈ కథలో కళ్ళకు కట్టినట్టు చూపించారు రచయిత. ‘ఊరిఉప్పు’  కథలో సొంతలాభం కొంత మానుకొని, పుట్టిపెరిగిన ఊరి అభివృద్దికోసం పాటుపడమని యువతకు సలహా ఇస్తారు. ‘మరాఠీగేటు’,  ‘వీధిపొరికి’ కథలలో ఇప్పటికీ పల్లెల్లో కొనసాగుతున్న కులం కట్టుబాట్లను సూటిగా ప్రశ్నిస్తారు. ‘రామక్కవ్వ’ కథలో వర్షాలకోసం పల్లెప్రజల నిరీక్షణను వివరిస్తూనే, కప్పలకు పెళ్లి చేస్తే వర్షాలు కురుస్తాయని నమ్మే పల్లెవాసుల అమాయకత్వాన్ని ఆమోదయోగ్యంగా చెప్పుకొస్తారు రచయిత. ‘బడి బియ్యం’ కథలో పేదరికాన్ని , పల్లెలో పుట్టిపెరుగుతున్న  పిల్లల ఆకలిబాధలను ఎత్తిచూపుతారు. ‘గురుదేవోభవ’   కథలో వృత్తిపట్ల ఉపాధ్యాయులకు ఉన్న అంకితభావం, విధ్యార్ధుల భవిష్యత్తు పట్ల వారు చూపే బాధ్యత వారిని మరోమెట్టుపై  నిలబెడుతాయి. కథ చివరలో కన్నీళ్లు తెప్పిస్తాయి.  ‘బామ్మా-బొచ్చుకుక్క’, ‘గొర్రెదాటు’ కథలలో మనుషులకు, పెంపుడు జంతువులకు మధ్య ఉన్న అనుబంధం ఆకట్టుకొంటుంది.

సంపుటిలోని పదహారు కథలూ ఆణిముత్యాలే. వేటికవి ప్రత్యేకమైన కథావస్తువులే. రాయలసీమ మాండలీకంలో, చిత్తూరుజిల్లా యాసలో సాగిపోయే కథలన్నీ యావత్ తెలుగు పాఠకులను రంజింపజేస్తాయి. రచయిత ఆర్.సి.కృష్ణస్వామిరాజు ఎంచుకొన్న యాస, ఉపయోగించిన భాష వారిని విలక్షణమైన రచయితల జాబితాలో చేరుస్తుంది. సాధారణంగా కథకులు కథావస్తువును ఎంచుకొన్న తర్వాత బలమైన పాత్రలను సృష్టిస్తారు. ఆ పాత్రల చుట్టూ సంఘటనలు అల్లుతారు. కానీ, కృష్ణస్వామిరాజు తన రచనల్లో పాత్రలకు మించి, సంఘటనలకు ప్రాధాన్యతనివ్వడం ఆశ్చర్యపరుస్తుంది. సంఘటనల కోసం మాత్రమే పాత్రలను వాడుకొంటారు. అలాగని పాత్రలు పాఠకులకు గుర్తుండవని అనుకొంటే  పొరబాటే!  గమ్మత్తైన పేర్లతో పాత్రలు పాఠకుడిపై చెరగని ముద్రవేస్తాయి. వీరి కథలలో పాత్రల సంఖ్య పరిమితికి మించి ఉన్నట్టు కనబడుతుంది. కొన్ని కథల్లో అరవై నుండి ఎనభై పాత్రలు కూడా దర్శనమిస్తాయి. అయినప్పటికీ కథ చదువుతున్న పాఠకుడికి పాత్రల పట్ల గురి, కథ పట్ల స్పష్టత ఉంటుంది.

తెలుగు సామెతలు, జాతీయాలు, పాత పాటలు మధ్యమధ్యలో వస్తుంటాయి. భోజనం చేసేటప్పుడు మధ్యమధ్యలో తాలింపు నంజుకొని తిన్నట్టు, కథలు చదివేటప్పుడు ఈ సామెతలు, జాతీయాలు, పాటలు కథల రుచిని మరింత పెంచుతాయి. పాఠకులను ఆకట్టుకొంటాయి. కథలు చదువుతున్నంత సేపూ కథల తాలూకూ సంఘటనలు మన చుట్టూ జరుగుతున్నట్టు, కథలోని పాత్రలు మనతో సంభాషిస్తున్నట్టు అనుభూతి కలుగుతుంది.

చిత్తూరు జిల్లా పుత్తూరు వాసి అయిన రచయిత ఆర్.సి. కృష్ణస్వామిరాజుగారు తన జీవితానుభావాలను, తనకు ఎదురైన సంఘటనలను కథలుగా మలిచారన్నది సుస్పష్టం. వారు కథలలో ప్రాంతీయ యాసను, భాషను ఉపయోగించినప్పటికీ ఇందులోని కథలన్నీ అచ్చమైన తెలుగు కథలు. తెలుగువారందరూ తప్పక చదవాల్సిన కథలు. ఇవి పల్లె కథలు, పల్లెప్రజల వ్యధలు. కృష్ణస్వామిరాజు గారు మరిన్ని మంచి కథలు రాయాలని, తెలుగు సాహిత్యంలో వారి కథలు చిరస్థాయిగా నిలచిపోవాలని మనస్పూర్తిగా కోరుకొంటున్నాను.

పుస్తకం వివరాలు
పుస్తకం : ముగ్గురాళ్ల మిట్ట
రచన: ఆర్.సి.కృష్ణస్వామిరాజు
ప్రచురణ: అచ్చంగా తెలుగు
పేజీలు: 112
వెల: 100/-
ప్రతులకు: 9393662821.

మరిన్ని వ్యాసాలు

Guru geetha prasasthyam
గురు గీత ప్రాశస్త్యం
- సి.హెచ్.ప్రతాప్
కల్పవృక్ష వినాయక స్వరూపం శిల్పి
కల్పవృక్ష వినాయక స్వరూపం శిల్పి
- కుందుర్తి నాగబ్రహ్మాచార్యులు
సంత్ నరహరి సోనార్
సంత్ నరహరి సోనార్
- కుందుర్తి నాగబ్రహ్మాచార్యులు
మా చార్ధామ్ యాత్ర
మా చార్ధామ్ యాత్ర
- కర్రా నాగలక్ష్మి
శివుడు నటరాజ మూర్తిగా మారడానికి ప్రేరకుడైన
మంకణ మహాముని కథ
- ambadipudi syamasundar rao
Viswakarma
విశ్వకర్మ
- శ్రీ కుందుర్తి నాగబ్రహ్మచార్యులు అద్దంకి