తెలివైన పిల్ల ఏనుగు - కృష్ణ చైతన్య ధర్మాన

smart elephant kid

రామాపురం అనే గ్రామంలో ఒక పెద్ద విష్ణు ఆలయం ఉండేది. దేవుని సన్నిధిలో రెండు ఆలయ ఏనుగులు ఉండేవి. అవి భార్యాభర్తలు. మగ ఏనుగు తాతలు ముత్తతల కాలం నుంచి కూడా వారు ఆలయ ఏనుగులుగా ఉండటం అనేది ఆనవాయితీ.
ఆ రెండు ఏనుగులకు కిట్టు అనే కొడుకు ఉన్నాడు. కిట్టు చాలా చురుకైన ఏనుగు పిల్ల. తనకి ఎప్పుడూ అడవికి వెళ్లి ఆడుకుంటూ, అడవంతా తిరుగుతూ అక్కడే ఉండి పోవాలని కోరిక. నిజానికి ఏనుగుల ఇల్లు అదేనని కిట్టు భావన.
"అమ్మా, నాకు అడవికి వెళ్లాలని ఉంది!" అని తన అమ్మతో చెప్పాడు కిట్టు.
"ఉండుండి ఇదేమి ఆలోచన!" అడిగింది అమ్మ ఆశ్చర్యపోతూ. "మీ నాన్నకి తెలిస్తే చంపేస్తారు. తెలుసు కదా వారి తాతల ముత్తాతల నుంచి ఇక్కడ సేవకులని. తరువాతి వారసుడివి నువ్వేనని ఆయన అన్నారు. ఇంకొన్ని ఏళ్లలో నిన్ను ఆలయ ఏనుగుగా స్వీకరిస్తారు. ఇప్పుడు నువ్వు అడవి గడవి అంటే ఎలా?"
"అదేంటమ్మా! అడవే కదా మన అసలైన ఇల్లు?" అన్నాడు కిట్టు. "ఇక్కడేముంది చెప్పు? దరిద్రగొట్టు మనుషులు; ఎప్పటికీ చలించని రాయి(దేవుడు)."
"నోర్ముయ్! ఏంటా మాటలు?" అరిచింది తల్లి ఏనుగు. "పో! పోయి ఆడుకో వరండాలో. ఇదే మనిల్లు. ఇంకోసారి అడవి అంటే రెండు కాళ్లు విరగ్గొడతా! అయినా ఎదో తెలీక అలా అంటున్నావు కానీ, నిజానికి ఇక్కడ ఉండటమే మనకి చాలా శ్రేయస్కరం. సమయానికి వారే భోజనం ఏర్పాటు చేస్తారు. మనల్ని చక్కగా అలంకరిస్తారు. మనకి భద్రత కల్పిస్తారు. అదే అడవిలో ఉంటే మనల్ని ఏ క్రూర మృగం ఎప్పుడు వేటాడుతుందో మనకే తెలీదు!"
ఆ సాయంత్రం కిట్టు ఎలాంటి జంకు లేకుండా తన తల్లితో చెప్పిన మాటలనే తండ్రితో కూడా చెప్పాడు. తండ్రి కూడా తల్లి వలే మాట్లాడే సరికి కిట్టుకి కోపం వచ్చి ఆ రాత్రి అన్నం తినకుండా అలిగాడు.
మరుసటి రోజు ఉదయం గుడి వెనుక పెరట్లో ఆడుకుంటుండగా, గుడి అర్చకుడు మరియు అతని కుమారునికి మధ్య జరుగుతున్న సంభాషనిని విని, కిట్టు తన తల్లిదండ్రులనిద్దరినీ పిలుచుకొచ్చి కొంచం దూరంలో ఉంచాడు. ఆ మనుషులిద్దరి సంభాషనను గుడి చాటుగా వారు ముగ్గురూ వినసాగారు.
"అయితే ఇప్పుడేమంటావ్?" అడిగాడు అర్చకుడు తన ఇరవయేళ్ళ కొడుకుని.
"నేను గుడి అర్చకుడిగా ఉండలేను నాన్న. నా పాషన్ వేరు. నేను సివిల్స్ రాసి కలెక్టర్ అవుతా!" అని ముక్కుసూటిగా అన్నాడు కొడుకు.
"అదేంట్రా! మన తాతల ముత్తాతల కాలం నుంచి ఈ గుడి అర్చకులం మనమే. ఇప్పుడు నువ్వు అలా అంటే ఎలా? నువ్వు చెప్పే ఆ కలెక్టర్ ఉద్యోగం కంటే ఇది చాలా సులువు. ఇంకా నువ్వు అక్కడ ఎంత చాకిరీ చేసినా నిన్ను గుర్తించే వారు తక్కువ. అక్కడ నువ్వు ఎన్ని మంచి పనులు చేస్తే నీకు అంత ప్రమాదం. కానీ ఇక్కడ నువ్వు కొన్ని పూజా పునస్కారాలు చేసినా చాలు మంచి పేరు, మర్యాదా వస్తాయి! ఇది చాలా భద్రతతో కూడిన ఉద్యోగం."
"నాన్నా! నాకు అలా ఇష్టం లేదు. దేవుడు చేస్తాడు అని జనానికి చెప్పే ఉద్యోగం కంటే నేనే వీలైనంత చేసే ఉద్యోగం నాకు ఇష్టం. అది ఎంత కఠినమైనా, ఎన్ని సవాళ్ళ కలిగినా సరే! అడవిలో ఉండాల్సిన ఏనుగులు మన ఆలయంలో మనసులు చంపుకుని ఉంటూ వాటి సహజత్వాన్ని కోల్పోయినట్టు, నేను నా మనసుని చంపుకుని నాకు నచ్చని, చేతకాని పనిని నేను చెయ్యలేను!" అని గుక్క తిప్పకుండా గట్టిగా చెప్పాడు కొడుకు. ఆఖరుకు కొడుకుని అర్థం చేసుకున్నాడు ఆ ఆలయ అర్చకుడు.
అదంతా విన్న కిట్టు తల్లిదండ్రులు వారి పొరపాటుని గ్రహించి, అదే రాత్రి కిట్టుని తీసుకుని దగ్గరలో ఉన్న అడవికి వెళ్లి పోయారు. అక్కడే మిగతా ఏనుగులతో జీవితాన్ని ఎంతో సంతోషంగా గడిపారు. కిట్టు తాను అనుకున్నది సాధించాడు!

మరిన్ని వ్యాసాలు

మా చార్ధామ్ యాత్ర-4
మా చార్ధామ్ యాత్ర-4
- కర్రా నాగలక్ష్మి
Maa chardham yatra
మా చార్ధామ్ యాత్ర
- కర్రా నాగలక్ష్మి
సినీ అప్సరస గీతాలు .
సినీ అప్సరస గీతాలు .
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
వివేకానంద రాక్ మెమోరియల్ స్థపతిశ్రీ.ఎస్.కె ఆచార్య
స్థపతిశ్రీ.ఎస్.కె ఆచార్య
- కుందుర్తి నాగబ్రహ్మాచార్యులు
రాజస్తాన్ ప్రాంత నిర్మాణ విశేషాలు
రాజస్తాన్ ప్రాంత నిర్మాణ విశేషాలు
- కుందుర్తి నాగబ్రహ్మచార్యులు