బంధం విలువ తెలుసుకో..!
బంధం బరువుగా అనుకునే వారు, బంధాలు తెంచుకున్న వారు ఒక్క క్షణం ప్రశాంతంగా ఆలోచించి ఉంటే ఒంటరి జీవితం అనేదే ఉండదు.
అసలు ఓ బంధమైనా ఏర్పడటానికి ఎన్నోకారణాలు ఉంటాయి. విడిపోవటానికి మాత్రం ఒక్క కారణం చాలు. కానీ, విడిపోయే ముందు స్థిమితంగా ఒక నిమిషం ఆలోచిస్తే..పరిష్కారం విడిపోవడం కాదని బోధపడుతుంది.
నిజానికి మనిషి బ్రతకటానికి డబ్బుతో పాటు బంధం కూడా ఎంతో అవసరం.
కాలానికి అనుగుణంగా నేడు మనం మనతో ప్రేమగా ఉన్న వారితో గడిపిన క్షణాలను కూడా వదిలేసుకోవాల్సిన పరిస్థితి . కొన్ని వృత్తి రిత్యా అవ్వొచ్చు, లేక మాట పట్టింపుల వల్లనో కావచ్చు మౌనంగా దూరంగా ఉండాల్సొస్తోంది.
ఊపిరి పోసుకున్న దగ్గరి నుండి ఊపిరి ఆగేదాక అమ్మ అని, నాన్న అని, అక్క అన్న అని ఎన్నో బంధాలు పెనవేసుకుంటాయి. స్నేహం-ప్రేమ అనే కారణాల వల్ల గట్టిగా అనుబంధాలకు అల్లికగా సాగిపోతున్నాం. కానీ ద్వేషం, అపార్థం, కోపం, మోసం, స్వార్థం అనే వాటికి చోటు ఇవ్వటం వలన ఎన్నో బంధాలు గత కాల ఙ్ఞాపకంలా మిగిలిపోతున్నాయి. దీనికి కారణం అవగాహనా లోపమే! ప్రేమ లేకుండా ద్వేషం, ద్వేషం రాకుండా అసహ్యం ఏర్పడవు. ప్రేమంటే నమ్మకం. . మనం పెంచుకొన్న నమ్మకమే బంధాలకు పునాది. అప్యాయత లేనిదే బంధం చిగురించదు. అలాంటి ఓ అద్భుతమైన భావానికి అహం అనే అడ్డుగోడలు కట్టి సమాధి చేసుకోవడం తెలివి తక్కువతనం. ఎదుటివారి లోపాన్ని కూడా ప్రేమతో సరిచేసుకోవచ్చు. ప్రేమతో కూడిన బంధం మరింత బలాన్నిస్తుంది
గొడవ పడ్డ సంఘటనలను మనసులో దాచుకోవటం వలన ఉపయోగం లేదు. తప్పు తెలుసుకొని కలవటానికి మనసుతో ప్రయత్నం చేస్తే బంధం నిలుస్తుంది. తప్పు ఎవరిదని లెక్కలేసుకోకుండా, ఈగోలకి పోకుండా బంధం విలువ తెలుసుకుని ప్రవర్తిస్తే అంతకన్నా జీవితానికి కావల్సిందేముంది!? ఏమంటారు!!?