మా భూమి సినిమా కు 40 ఏళ్లు - దుర్గమ్ భైతి

40 years for the film maa bhoomi

ప్రపంచ చరిత్రలకే పాఠాలు బోధించిన   తెలంగాణ సాయుధ పోరాట నేపథ్యమును ఆధారము చేసుకుని అపురూప దృశ్య కావ్యంగా నిర్మితమై సంచలన విజయం నమోదు చేసిన అత్యుత్తమ తెలుగు సినిమా "మా భూమి " విడుదలై  మార్చ్ 23 నాటికి 40 సంవత్సరాలు పూర్తి అయ్యాయి. తెలంగాణ గర్వించదగ్గ సినీ దిగ్గజం బి.నరసింగరావు,రవీంద్రనాథ్ తో కలిసి గౌతమ్ ఘోష్ దర్శకత్వంలో త్రిపురనేని సాయిచంద్, హంస,భూపాల్  రెడ్డి, కాకరాల,ప్రదీప్ శక్తి,ప్రసాదరావు,గద్దర్,నరసింగరావు లు ప్రధాన తారాగణంగా రూపొందించిన తెలంగాణ మొదటి చారిత్రక చిత్రం మా భూమి  23,మార్చి 1980 న విడుదలై జాతీయ స్థాయిలో మంచి పేరు ప్రతిష్టలు సంపాదించిపెట్టింది. ఈ చిత్ర నిర్మాణంలో భాగస్వామ్యం గల ప్రతి ఒక్కరికి మా భూమి ఇప్పటికి ప్రత్యేకమైనది.బండి యాదగిరి రాసిన "బండినక బండి కట్టి" పాటని గద్దర్ పాడిన తీరు ఇప్పటికి ప్రజాదరణ గీతమని చెప్పవచ్చు.

దర్శకునికి తొలి చిత్రం,నటీ నటులు అంతా కొత్తవారే.చిత్రీకరణ జరుగుతున్న గ్రామాల్లోని సాధారణ ప్రజలు కూడా ఈ చిత్రంలో నటించారు. అయినా వారినుండి అద్భుతమైన నటన ను దర్శకుడు రాబట్టిన విధానం అద్భుతమైనది. దొరల గడీల క్రింద నలిగిన సామాన్య ప్రజల బతుకులు,భూమి కోసం భూస్వామ్య,పెత్తందారీ వ్యవస్థ పై తిరుగుబాటు చేయడంవంటి కథా రచన,కథనాలు, ఆ కాలం నాటి పాత్రల వస్త్ర ధారణ, సహజత్వం ఉట్టిపడేలా చిత్రీకరణ ప్రదేశాల ఎంపిక,,సహజ సిద్ద సంభాషణలు, చైతన్య స్ఫూర్తి ని రగిలించే పాటలు చిత్ర విజయానికి దోహదపడినవి.

పాటలు,ఫైట్లు, డ్యాన్స్ లతో అభిమానులను కనువిందు చేయడానికి అగ్రహీరోలు పోటీ పడి నటిస్తున్న ఆ సమయంలో ఇలాంటి ప్రయోగాత్మక చిత్రాన్ని తీయాలనే నిర్మాతల సాహసం చాలా గొప్పది.ఆస్తులు, ఇండ్లు, నగలు కుదువ బెట్టి చిత్రా నిర్మాణం ను ఎన్నో వ్యయ ప్రయాసలకు ఓర్చి కొన సాగించడం మామూలు విషయం కాదు.నిర్మాతల శ్రమను తెలుగు ప్రేక్షకులు వృధా కానివ్వలేదు.రవీంద్ర నాథ్-నరసింగరావు ల మరో ప్రయోగం బెంగాల్ దర్శకుడిని ఇటువంటి చారిత్రాత్మక చిత్రానికి ఎంచుకోవడం.గౌతంఘోష్ కు మొదటి చిత్రము కావడం,అంతా కొత్త వారితో నటన తీసుకోవడం ఆయన అత్యున్నత ప్రతిభ కు నిదర్శనం.

తెలుగు సినిమా చరిత్రలో మాభూమి కి ముందు ,తర్వాత వందల సినిమాలు విడుదలయ్యాయి.అద్భుత కళా ఖండాలు అని కొందరు సినీ పెద్దలు  కొన్ని చిత్రాలను పేర్కొన్నారు.మా భూమి లాంటి గొప్ప చిత్రము మళ్ళీ రాదు. తెలంగాణ ఆత్మాభిమానానికి, పౌరుషానికి ,సాంకేతిక ప్రతిభకు ప్రతీక మా భూమి. ఈనాటి రంగుల చిత్రాల ప్రభంజనం లో కూడ మాభూమి ఎప్పటికీ మణి రత్నమే! తప్పనిసరిగా చూడవలసిన సినిమా.ఒకసారి చూడండి.

మరిన్ని వ్యాసాలు