తిమిరంతో సమరం - పుస్తక సమీక్ష - అఖిలాశ

Timiramtho Samaram Book Review

దాశరథి కృష్ణమాచార్య 1925 జూలై 22 న వరంగల్ జిల్లా చిన్న గూడూరు గ్రామంలో జన్మించారు. బాల్యం ఖమ్మం జిల్లా మధిరలో గడిచింది. ఉర్దూలో మెట్రిక్యులేషన్, భోపాల్ విశ్వవిద్యాలయం నుండి ఇంటర్మీడియెట్, ఉస్మానియా విశ్వవిద్యాలయం నుండి ఇంగ్లీషు సాహిత్యంలో బి. ఏ చదివారు. సంస్కృతం, ఆంగ్లం, ఉర్దూ భాషల్లో మంచి పండితులు. చిన్నతనంలోనే పద్యం అల్లటంలో ప్రావీణ్యం సంపాదించారు. ప్రారంభంలో కమ్యూనిస్టు పార్టీ సభ్యుడిగా ఉండి రెండో ప్రపంచ యుద్ధం సమయంలో ఆ పార్టీ వైఖరి నచ్చక ఆ పార్టీ నుంచి బయటకు వచ్చి హైదరాబాదు సంస్థానంలో నిజాం అరాచక ప్రభుత్వానికి వ్యతిరేకంగా జరుగుతున్న ఉద్యమంలో పాలుపంచుకున్నారు. అగ్నిధార, మహాంధ్రోదయం, రుద్రవీణ, మార్పు నా తీర్పు, ఆలోచనా లోచనాలు, ధ్వజ మెత్తిన ప్రజ కవితా సంపుటాలు తెలుగు సాహిత్య లోకానికి అందించారు. అనేక సినిమా పాటలు రాశారు. కవితా పుష్పకం సంపుటికి ఆంధ్ర ప్రదేశ్ సాహిత్య అకాడమీ పురస్కారం, తిమిరంతో సమరం కవితా సంపుటికి కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారం అందుకున్నారు. తిలక్ గారి పేరు చెప్పగానే “ నా అక్షరాలు వెన్నెల్లో ఆడుకునే అందమైన ఆడపిల్లలు” అనే వాక్యం ఎలా గుర్తు వస్తుందో. దాశరథి గారి పేరు చెప్పగానే “నా తెలంగాణ కోటి రతనాల వీణ” అనే వాక్యం గుర్తు వస్తుంది.

తిమిరంతో సమరం కవితా సంపుటి 1973లో పుస్తకంగా వచ్చింది. 120 పుటలు ఉన్న పుస్తకంలో 47కవితలు ఉన్నాయి. తిమిరం మూఢత్వానికి, మూర్ఖత్వానికి, తిరోగమనానికి ప్రతీక అందుకే కవి తిమిరంతో సమరాన్ని ప్రకటించారు. బంగ్లా ప్రజల స్వతంత్ర పోరాటానికి మద్దతు తెలుపుతూ వారి శత్రువే తన శత్రువని ప్రకటించారు. ఇరవయ్యో శతాబ్దంలోకి వచ్చిన ఇంకా కులాల కుమ్ములాటలు, మతాల మరణ హోమాలను దాశరథి గారు తట్టుకోలేకపోయారు. అందుకే రావమ్మా శాంతమ్మ అంటూ కవితను అల్లారు. శాంతి ఎక్కడ ఉన్నది, ఎక్కడ దాక్కుంది. బంగ్లాదేశ్ కి శాంతి కావాలి, వియత్నాంకు శాంతి కావాలి, నీ కోసం విశ్వం అంత ఎదురుచూస్తోంది. ఏ కవి అయినా సంఘటనలకు, పరిస్థితులకు స్పందిస్తూ కవిత్వాన్ని రాస్తారు. దాశరథి గారు కూడా చేసింది అదే. నాటు బంగ్లాదేశ్ స్వతంత్రం కోసం పోరాటం చేస్తోంది. వియత్నాంలో అలజడి ప్రజలను అశాంతికి గురి చేశాయి. ప్రజల క్షేమాన్ని కోరే ఏ కవి అయినా యుద్ధ వ్యతిరేకిగా ఉంటారు. శాంతిని కోరుకుంటారు. దాశరథి గారు కూడా శాంతినే కోరుకున్నారు. అందుకే అనేక సందర్భాల్లో శాంతి కోసం కవిత్వాన్ని రాశారు.

కవికి దూర చూపు ఉంటుంది. గత సమాజం కంటే రాబోయే సమాజం అందంగా ఉండాలని ఆశిస్తూనే కవిత్వాన్ని రాస్తారు. నాగార్జున సాగర్ నిర్మాణంపై క్షీరసాగరం శీర్షికతో రాసిన కవితలో దాశరథి గారు ఇలా అన్నారు.

“తిండి లేని వాడెవ్వడు

ఉండబోడు ఏనాడు,

చదువురాని వాడెవ్వడు

వెతికినను కానరాడు” (పుట 27)

దాశరథి గారు ఆనాడు ఆశించిన రెండు విషయాల్లో మార్పు వచ్చినప్పటికీ ఇంకా మన దేశంలో ఆకలి చావులు జరుగుతూనే ఉన్నాయి. రైతు పరిస్థితి అంతకంతకూ దిగజారిపోయింది. మానవుడు ప్రకృతిని ద్వంశం చేస్తున్నాడు. దాని ప్రభావంతో అతివృష్టి, అనావృష్టి రాజ్యమేలుతున్నాయి. గతంతో పోల్చుకుంటే అక్షరాస్యత పెరుగుతోంది కానీ చదువును వ్యాపారం చేస్తున్నారు. లక్షల్లో ఫీజులు, అధిక ఒత్తిడి విద్యార్థులను ఆత్మహత్యలకు ప్రేరేపిస్తున్నాయి. చదువు వ్యాపారం కావడంతో నాణ్యమైన విద్య పేద, మధ్యతరగతి వారికి దూరం అవుతోంది. తిండి, చదువు విషయంలో అనేక సమస్యలు ఉన్నాయి. సంపూర్ణంగా పరిష్కారం అయ్యే వరకు దాశరథి గారి కవిత్వం కాలానికి నిలబడుతూనే ఉంటుంది.

తెలుగు భాషపై రెండు కవితలు రాసిన దాశరథి గారు అక్షర నక్షత్రమాల కవితలో తెలుగు పరువు నిలబడాలని నినదించారు. మరో సందర్భంలో తెలుగు ప్రజలు విడిపోరాదని అందరూ కలిసి మెలసి ఉండాలని కోరుతూనే తెల్లవాడు మన భాషను గుల్ల చేశాడు. నిజాం రాజు మన భాషకు నిప్పు పెట్టాడని రాశారు. దీని అర్థం బ్రిటిష్ వారు ఆంగ్లం ప్రవేశ పెట్టడం, నిజాం రాజు ఉర్దూను అధికారిక భాషగా చేయడం వల్లే తెలుగు వాడిపోతోందని దాశరథి గారు వాపోయారు. అదే సందర్భంలో “ఒక దేహం, ఒక గేహం, ఒక దేశం మనది” అందరూ కలిసే ఉండాలని ఆకాంక్షించారు. ఉర్దూ పక్కన పెడితే ఆంగ్ల మోజులో పడి మన భాషను విస్మరిస్తున్నారు. దాశరథి గారు ఆ విషయాన్ని అప్పటికే గ్రహించారు. దాశరథి గారు ఆంగ్లానికి, ఉర్దూకు వ్యతిరేకి కాదు కానీ ఆ భాషల ప్రభావం తెలుగుపై చూపుతుందని బాధ పడ్డారు. ఏ భాషను నేర్చుకున్న తప్పు లేదు కానీ మాతృ భాషను చులకన చేయడం, నిర్లక్ష్యం చేయడమే భరించలేని విషయం.

దాశరథి గారు ప్రపంచ సమస్యలను తన సమస్యలు అనుకున్నారు. బంగ్లా ప్రజల పోరాటం తన పోరాటం అనుకున్నారు. బంగ్లా ప్రజల శత్రువు తన శత్రువుగా భావించారు. అనేక సమస్యలై వారి కవితా బాణాలను వదిలారు. తెలంగాణ నిజాం వ్యతిరేక ఉద్యమ సమయం ఏ విధంగా పోరాడాలో బంగ్లా ప్రజల స్వాతంత్రానికి అదే స్థాయిలో మద్దతు ప్రకటించారు. పోరాటాల్లో ప్రజలు మరణించడం, అశాంతికి గురి కావడాన్ని దాశరథి తట్టుకోలేకపోయారు. అందుకే అడుగడుగునా శాంతిని ఆహ్వానించారు. శాంతి కపోతాన్ని ఎగురవేశారు.

తిమిరంతో సమరం కవితా సంపుటిలోని కవిత్వాన్ని పరిశీలిస్తే దాశరథి గారు భావ వాది కవి అని తెలిసిపోతుంది.

“కాత్యాయని నా భవిష్యత్తు

ఆ కాత్యాయనిని వరించే

కాలకంఠుణ్ణి నేను ; (పుట 46)

అన్న కవి భావ వాది కాకుండా ఇంకేం అవుతారు.

“యముణ్ణి ఒడిస్తాను” (పుట 57)

“బ్రతకమని భగవంతుడు

వసుదపైకి పంపాడు” (పుట 63) 

“నేను రావణాసురునికి రాముణ్ణి

నేను త్రిపురాసునికి శివుణ్ణి” (పుట 85)

“బ్రహ్మ చేతి తొలి గీతను

మనిషి నొసట గల రాతను” (పుట 88)

“భగవంతుని తలపించే

పరమోత్తమైన మతం

యమునింటికి పంపించే

అతిహీన మతం అయ్యింది” (పుట 94)

పుస్తకంలో అనేక చోట్ల ఇలాంటి వాక్యాలు చేసిన దాశరథి అచ్చమైన భావ వాది కవి. నాటి కవులు ఎక్కువగా భావ వాదులుగా ఉంటూనే సమాజంలోని అసమానతలపై పోరాటాల్ని సాగించారు. దాశరథి గారు భావ వాదం వైపు ఉంటూనే భావ వాదంలో ఉండే తప్పులను ఎత్తి చూపారు. కానీ ఈ పుస్తకంలో కొన్ని వాక్యాలు నేడు అంగీకరించలేనివి. మతాన్ని భగవంతుడితో పోల్చడం సరైనది కాదు. మతం ప్రజలను విడగొట్టింది. ఒక వర్గాన్ని అందలం ఎక్కించి మరో వర్గాన్ని పాతాళానికి కూల దోసింది. వివక్ష, అన్యాయం, శ్రమ దోపిడీ, అంటరానితనం లాంటి ఎన్నో సమస్యలకు మూలం మతం, కులం. ఇప్పటికి దాని ఆధిపత్యాన్ని చలాయిస్తూనే ఉన్నది. అలాంటి మతాన్ని ఉత్తమమైనది అనడం ఎంతమాత్రం ఆహ్వానించలేము. ఈ లోకంలో కొన్ని వ్యవస్థలు బానిసత్వానికి ప్రతీకలు. అలాంటి బానిసత్వంపై నేటి ప్రజలు పోరాడుతున్నారు కనుక బ్రహ్మ గీతాలను, రాతలను నమ్మే పరిస్థితి నేడు లేదు. భావ వాదం సమాజాన్ని తిరోగమనం వైపు తీసుకెళ్తుంది. కావున నేటి ప్రజలు దానికి వ్యతిరేకంగానే ఉండాలి.

మనిషీ – మనీ – పనీ అను శీర్షికతో కవిత రాసిన దాశరథి గారు రైతు ఉద్దేశిస్తూ వ్యవసాయ కార్మికుడా అంటూ

“నీ కన్నీరే కృష్ణ కాలువ

ఈ లోకం ఎరుగడు నీ విలువ”

 అని పేర్కొన్నారు. ఇది అక్షర సత్యం ఒక నాడు రైతే దేశానికి రాజు. నేడు రైతు అంటే ఒక కూలి వాడు. బీదవాడు, చేతకాని వాడు అనేలా చేసేశారు. దేశ రక్షణ కొరకు సైనికుడు పోరాడుతుంటే దేశం పొట్ట నింపడానికి రైతు వ్యవసాయం చేస్తాడు. అలాంటి రైతు పరిస్థితి దయనీయంగా మారిపోయింది.

“డబ్బులేని నీ పాలిటి

బెబ్బులి ఈ లోకం

ధనవంతుల ఇళ్ళ ముందు

శునకం ఈ లోకం”

అంటూ దాశరథి గారు తన ఆగ్రహాన్ని వ్యక్త పరిచారు.  అదే సమయంలో డబ్బుకు విలువ తగ్గిపోయి మనిషికి, పనికి విలువ పెరగాలని ఆకాంక్షించారు. వారి ఆకాంక్ష నేడు జరగడం లేదు. డబ్బులు విలువ పెరిగిపోతూ మనిషి విలువ తగ్గిపోతోంది. తల్లి బిడ్డను, భార్య భర్తను, అన్న తమ్ముడిని, అక్క చెల్లెలిని ఇలా ప్రతి బంధంలోకి డబ్బు రక్కసి చేరిపోయి విడదీస్తోంది.

అన్యాయాలపై, అసమానతలపై, వివక్షపై, అజ్ఞానంపై, అశాంతిపై, అక్రమాలపై సమరమే ఈ తిమిరంతో సమరం. కవి ఎప్పుడు సమరం చేస్తూనే ఉంటాడు. ఒకటి తన లోలోన జరిగే సమరం. రెండు సమాజంపై తన అక్షరాలు చేసే సమరం. ఎప్పటికైనా, ఏ నాటికైనా కవిదే అంతిమ విజయం.

మరిన్ని వ్యాసాలు

కల్పవృక్ష వినాయక స్వరూపం శిల్పి
కల్పవృక్ష వినాయక స్వరూపం శిల్పి
- కుందుర్తి నాగబ్రహ్మాచార్యులు
సంత్ నరహరి సోనార్
సంత్ నరహరి సోనార్
- కుందుర్తి నాగబ్రహ్మాచార్యులు
మా చార్ధామ్ యాత్ర
మా చార్ధామ్ యాత్ర
- కర్రా నాగలక్ష్మి
Viswakarma
విశ్వకర్మ
- శ్రీ కుందుర్తి నాగబ్రహ్మచార్యులు అద్దంకి
తొలి వలపు తొందరలు...
తొలి వలపు తొందరలు...
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు