నాన్న పచ్చి అబద్ధాలకోరు - పుస్తక సమీక్ష - నరెద్దుల రాజారెడ్డి

Naanna Pachi Abaddala Koru Book Review

సమకాలీన రచయిత సురేంద్ర రొడ్డ గారు రచించిన 'నాన్న పచ్చి అబద్ధాలకోరు' కవితా సంపుటి సందేశాత్మకంగా వుంది, చక్కటి పదావిష్కరణతో నిష్క్రమణం లేకుండా శ్రమించి ఆవిష్కరించిన సంపుటి ఇది. తల్లిదండ్రులకు తనయుల మధ్య వున్నటువంటి సంబంధ బాంధవ్యాలను చాలా విపులంగా తెలియపరిచారు సురేంద్ర రొడ్డ గారు, అంతే కాకుండా ఇందులో సామాజిక అంశాలను కూడా మిళితం చేసి అన్ని రకాలుగా ఈ పుస్తకానికి న్యాయం చేసారు.

నాన్న పచ్చి అపద్ధాలకోరు నిజం.. తనకు ఆకలి అవుతున్న.. నేను ఇప్పుడే తినేసాను అంటూ తన ఆకలి చంపుకుని బిడ్డ ఆకలి తీర్చే అబద్ధాలకోరు.. జీవితంలో తన బిడ్డ బాగా రానించాలని, తను ఒక పూట పస్తులుండి కూలీ నాలి చేసి ఫీజులు కట్టి బిడ్డ ఎదిగిపోవాలని తలచి తను మాత్రం ఏదో ఒక మూల ఒదిగిపోతాడు. ప్రతి విషయంలోను బిడ్డ క్షేమం కోరే ప్రతి నాన్న తను క్షేమంగా లేకపోయినా.. వున్నాను అన్నట్టు నటిస్తాడు, రచయిత రాసిన ప్రతి కవనం మనసును కదిలించే విధంగా మలిచారు. నిజ జీవితంలో తల్లిదండ్రులకు తనయులకు అంతర్గతంగా గాని బహిర్గతంగా గాని జరుగుతున్న పరిణామాలను ఇందులో చక్కగా పొందుపరిచారు.

సామాన్య పాఠకున్ని సైతం ఆసాంతం చదివింపజేసే సరళమైన కవిత్వానికి జీవం పోసారు, వాక్య నిర్మాణంలో గానీ మెళకువలో గాని సందేశాత్మక భావంలో గాని ఎక్కడ తూచా తప్పకుండా కవనాలను నడిపించారు, నేటి సమాజ స్థితి గతులను, నేటి యువత తీరుతెన్నులను, చక్కగా విడమరచి నిర్మొహమాటంగా తెలియజేసారు రచయిత, నాన్న పచ్చి అబద్ధాలకోరు కవితలో రాసిన ప్రతి వాక్యం ఒక స్పూర్తినిస్తుంది.

బట్టల కొట్టులో నాకు పట్టు బట్టలు కొని
తనకు పడని నూలు బట్టలు కొన్నప్పుడు
నాకు తెలియదు
నాన్న అబద్ధమాడుతున్నాడని

అంటూ నాన్న యొక్క లోలోపలి ప్రేమ నిజస్వరూపాన్ని కవితలో తేటతెల్లం చేసారు. అదే కోవలోనే

నాకు కొత్త చెప్పులు కొని
నా పాత చెప్పులు తను వేసుకుంటూ
కొత్త చెప్పులు తనను కొరుకుతాయన్నప్పుడు
నాకు తెలియదు
నాన్న అబద్ధమాడుతున్నాడని

అంటూ నాన్న అంతరంగిక భావాన్ని బాగా వెల్లడించారు ఈ కవితలో..

ప్రతి కవనంలోను సందేశాన్ని ఇస్తూ చక్కటి రచన చేసారు, సామాన్య కుటుంబంలో జన్మించి, మధ్యతరగతి జీవితాలు ఎలా వుంటాయో కళ్ళారా చూసి, తన కోసం తల్లిదండ్రులు ఏ విధంగా తపన పడ్డారు, నా కడుపు నింపడం కోసం ఎన్ని అబద్ధాలు కుమ్మరించి వారి కడుపులు ఎండగట్టుకున్నారో అనుభవ పాఠాలనే కవనాలుగా మలచి సమాజానికి పరిచయం చేసారు, ఇందులో జీవితం.. జీవనం ఒకటే కాదు వ్యవస్థలోని అంశాలను విద్యార్థి దశలోని కష్టాలను, అన్నింటినీ మేళవించి సాహిత్యాన్ని అందించారు, అనాధలుగా మారిన తల్లిదండ్రుల ఆవేదన, వారు పడిన బాధను కళ్ళకు కట్టినట్లు వచన కవిత్వం ద్వారా తెలిపారు, సమకాలీన అంశాలనే కవనాలుగా అల్లుకొని నేటితరం పాఠకులకు అందివ్వడంలో సురేంద్ర రొడ్డ గారిది అందె వేసిన చెయ్యి అని చెప్పవచ్చు, ఆ కోవనుంచి పుట్టుకొచ్చినదే నాన్న పచ్చి అబద్ధాలకోరు కవితా సంపుటి,

"బాలికలను బతకనిద్దాం" శీర్షికతో రాయబడిన కవితలో
గర్భంలోని పిండాన్ని స్కాన్ చేసి
ఆడపిల్లని తెలియగానే చంపేయకు
పుట్టనివ్వు ఆడపిల్లను
ఆ పిల్లే
కిరణంలా వెలిగిన కిరణ్ బేడీ కావచ్చు
ఆకాశంలో ఎగిరిన కల్పనా చావ్లా కావచ్చు

అంటూ ఆడపిల్లలు ఎలా ఎదిగారో దిగ్గజాలై ఎలా రానించారో ఈ కవితలో చెప్పారు, ఆడపిల్లని తక్కువ అంచనా వేయకూడదు అంటూ తల్లిదండ్రులకు సూచకంగా ఈ కవనంలో సందేశాత్మక భావాన్ని పెట్టారు.

అలా అని చెప్పి ఓనమాలు నేర్పిన గురువుని విడిచిపెట్టలేదు, నడకలు నేర్పింది తల్లిదండ్రులు అయితే నడవడికలు నేర్పింది గురువుగారు, కన్నవారితో ఏమాత్రం తీసిపోని గురువుని ప్రశంసించడంలో కొన్ని కవితలను మహాద్భుతంగా వర్ణించి రాశారు కవిగారు. "గురువుగారికి ఎన్ని రూపాలో" అంటూ వినూత్నమైన శీర్షిక ఎంచుకొని

ఓనమాలు నేర్పించువేళ
అమ్మలా లాలించి
నడవడిక నేర్పించు వేళ
నాన్నలా బుజ్జగించి
మాత పిత లైనారు
భారత రామాయణ గాథలను వినిపించి
అవ్వతాతలైనారు
ఆటపాటలతో ప్రియనేస్తాలైనారు

అంటూ తనకు చదువు నేర్పిన గురువులను ఈ విధంగా సంబోధిస్తూ ప్రశంసించారు, గురుతర బాధ్యత అంటే ఏమిటి అనే విషయాన్ని ఇందులో చక్కగా వివరించారు.

ఇందులోనే మనిషియొక్క నటనా చమత్కారాన్ని, అవసరాలకు అనుగుణంగా నడిచే విధి విధానాలను వదలలేదు, నేటి మనిషి యొక్క తీరు తెన్నులను ఎండగడుతూనే అందులో ఒక సందేశాన్ని కూడా సూక్ష్మంగా కలబోసారు, "అందరూ మహానటులే" అనే కవనంలో

గుండెల్లో బాధను దిగమింగుకొని
జీవం లేని నవ్వును పెదాలకు తగిలించుకొని
నిర్జీవమైన కళ్ళల్లో ఆశల వెలుగులు నింపుకొని
ఏడుపును అహంకారపు పొరలలో దాచుకొని
కొట్టలేని ఆశక్తతకు అహింస పేరును అద్దుకొని
అధికార దర్పానికి సలాము కొడుతూ

అంటూనే చివరిలో ' ఈ జీవిత రంగస్థలంలో అందరూ మహానటులే ' అంటూ తనదైన శైలిలో ముగించారు, అణువణువును వదలకుండా ప్రతి సంఘటన మనసున దాచి కవితల రూపంలో వ్యక్తపరిచారు రచయిత.

నాన్న పచ్చి అబద్ధాలకోరు అంటూనే అన్ని సమస్యలను అద్దంలో చూపెట్టి వెనువెంటనే వాటికి పరిష్కారం మార్గం చూపించి. అన్ని కోణాలను బాగా రంగరించి పుస్తకానికి రూపం ఇచ్చారు. బాల్యం నుండి వృద్ధాప్యం వరకు తల్లిదండ్రుల యొక్క పాత్ర ఎలా నడుస్తుంది. వారి యొక్క ఆవేదన, ఆశ, భవిష్యత్తు నిర్మాణానికి చేసే కృషి, పట్టుదల వెనుక ఎంత కష్టం దాగివుంది అనేది ప్రతి కవనంలోను చాలా చక్కగా రాశారు, కవిత చదువుతుంటే ఆ క్షణమే దృశ్యం మనసులో కదిలేలా సరళమైన సాహిత్యానికి జీవం పోసారు.

ఇందులోనే " అమ్మ మనసు " అనే కవనంలో ప్రతి హృదయాన్ని ద్రవించే విధంగా భావాన్ని నింపారు
ఊపిరాడని ఆయాసంతో
ఉక్కిరిబిక్కిరౌతూ రేయంతా
దగ్గుతుంటె నిదుర చెడిన కోడలు
దగ్గుకుండా చావలేవా అంటూ
చెడుమాట అన్నది
మీ అయ్య పొయ్యాక
విధవనయ్యాను కానీ
వెధవనవ్వలేదు కన్నా

అంటూ అత్త కోడళ్ళ మధ్య జరిగే పరిణామాలు ఇందులో సవివరంగా తెలియపరిచారు, తల్లిదండ్రులకు వృద్ధాప్యం వచ్చిన తరువాత ఎన్ని భరించాలో ఎంత ఓపికగా మసలుకోవాలో అనే అంశాలు ఇందులో వున్నాయి,

సమాజంలో జరిగే కుటుంబ పరిణామాలను. బంధాలు అనుబంధాలకు గల బేధాభిప్రాయాలను.. మొత్తంగా జీవిత అర్థ పరమార్థాన్ని ఈ పుస్తకంలో నింపడం విశేషం.. ఒక్కో కవిత ఒక్కో ఆణిముత్యంగా నిలిచింది. నిజ జీవితంలో జరిగిన కొన్ని సంఘటనలు ఆధారభూతమై నిలిచింది, సమాజాన్ని బాగా తిప్పేసి నేటి ఆధునిక యుగంలో తల్లిదండ్రుల యొక్క పాత్ర కుటుంబ వ్యవస్థ ఏ తీరుగా నడుస్తోంది అనే అంశాలను కవనాలుగా మలుచుకొని " నాన్న పచ్చి అబద్ధాలకోరు " అనే సంపుటిని రచయిత సురేంద్ర రొడ్డ గారు ఆవిష్కరించారు.

మరిన్ని వ్యాసాలు

సినీ అప్సరస గీతాలు .
సినీ అప్సరస గీతాలు .
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
వివేకానంద రాక్ మెమోరియల్ స్థపతిశ్రీ.ఎస్.కె ఆచార్య
స్థపతిశ్రీ.ఎస్.కె ఆచార్య
- కుందుర్తి నాగబ్రహ్మాచార్యులు
రాజస్తాన్ ప్రాంత నిర్మాణ విశేషాలు
రాజస్తాన్ ప్రాంత నిర్మాణ విశేషాలు
- కుందుర్తి నాగబ్రహ్మచార్యులు
Kanyakumarilo vunna tiruvalluvar vigraham nirmana charitra
తిరువళ్లువర్ విగ్రహం నిర్మాణ చరిత్ర
- కుందుర్తి నాగబ్రహ్మాచార్యులు