మట్టి పోగు - పుస్తక సమీక్ష - అఖిలాశ

Matti Pogu Book Review

మునుపు మట్టి, మన్ను అనే పదాలను తిట్టడానికి ఉపయోగించేవారు. ఉదాహరణకు నువ్వు మట్టి కొట్టుకుపోతావు, నిన్ను మట్టిలో పూడుస్తా, నీ ముఖం మీద మన్ను పడ లాంటివి. ఆ తర్వాత మట్టి పదానికి కవిత్వ గౌరవం ఎక్కువగా లభిస్తూ వచ్చింది. నేల లోని మొక్కల పెరుగుదలకు ఉపయోగపడగల మెత్తటి పొడిని మట్టి అంటారు. మట్టితో కుండలను, మట్టి ఇటుకలను, మట్టి బొమ్మలను తయారుచేస్తారు. కొన్ని చోట్ల మట్టితో కోటలను నిర్మించారు. మట్టి మనుషులుగా రైతులను గౌరవిస్తున్నాము. మట్టిలో మాణిక్యం అనే పద బంధాలను వాడుతున్నాము. కవిత్వ పరంగా మట్టి, మన్ను, బురద లాంటి పదాలకు సముచిత స్థానాన్ని కల్పించింది మాత్రం కవులేనని చెప్పవచ్చు. వాస్తవానికి మట్టి లేకపోతే మానవ మనుగడ కొనసాగలేదు. మట్టి మానవ పురోగాభివ్రుద్ధికి కారకం.

మట్టి కాలుష్యం లేదా నేల కాలుష్యం జీనోబైయాటిక్ రసాయన లేదా సహజ నేల వాతావరణంలో మార్పులు కలగటం వల్ల కలుగుతుంది. సాధారణంగా పారిశ్రామిక, వ్యవసాయ రసాయనాలు, లేదా వ్యర్ధాల యొక్క సరికాని ప్రదేశాలలో పారవేయడం వలన కలుగుతుంది. వీటిలో అత్యంత సాధారణ రసాయనాలు పెట్రోలియమ్, హైడ్రోకార్బన్, పాలీ అణు ఆరోమ్యాటిక్ హైడ్రోకార్బన్స్, సల్వెంట్స్, పురుగు మందులు, సీసం మరియు ఇతర భారీ ఖనిజాలు.

మట్టి కాలుష్యం సహజంగా కలుషితమైన మట్టి, కలుషితాల యొక్క ఆవిర్ల నుండి మరియు నేల అంతర్లీన ప్రత్యక్ష సంబంధం నీటిసరఫరాల నుండి ప్రధానంగా ఆరోగ్య సమస్యలు వస్తాయి. కలుషితమైన మట్టి సైట్లు మరియు ఫలితాలు క్లీనప్ యొక్క మ్యాపింగా జియాలజీ, హైడ్రాలజీ, కెమిస్ట్రీ, కంప్యూటర్ మోడలింగ్ నైపుణ్యాలు, మరియు పర్యావరణ కాలుష్యానికి GIS, మరియు పారిశ్రామిక రసాయన శాస్త్రం విస్తృతంగా అవసరం. ఉత్తర అమెరికా మరియు పాశ్చాత్య ఐరోపాలో కలుషితమైన భూమి ఎక్కువ మేరకు ఉన్నట్టు గమనించారు. ఈ పర్యావరణం సమస్య పరిష్కరించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. దీనిని తగ్గించేందుకు చాలా దేశాలు సహకరిస్తున్నాయి.

కవులు, రచయితలు మట్టి కాలుష్యంపై పోరాడాల్సిన సమయం వచ్చింది. మట్టి గురించి ఆలోచించాలి. మట్టి లేకపోతే అనేక జీవ, అజీవరాశులు ముందుకు కొనసాగే పరిస్థితి లేదు. మట్టి అనగానే కరువు, రైతులు, పంటలు గురించి మాత్రమే కాకుండా మట్టి కాలుష్యం గురించి కూడా సాహిత్యవేత్తలు ఆలోచించాలి. ఈ క్రమంలో పిళ్లా కుమారస్వామి గారు మట్టి పోగు శీర్షికతో 92 పుటలతో, 54 కవితలను పుస్తకంగా ముద్రించారు. ఇందులో కరువు, వ్యవసాయం, రైతులతో పాటు మరికొన్ని సామాజిక సమస్యలపై కవిత్వాన్ని రాసి తెలుగు సాహిత్యానికి అందించారు.

08.07.1964న జన్మించిన వీరు m.sc(math’s), MBA, ma(telugu) చదివిన వీరు భారతీయ జీవిత భీమ సంస్థలో అభివృద్ది అధికారిగా పనిచేస్తున్నారు. సాహిత్యాన్ని అమితంగా ఇష్టపడే వీరు అనేక సాహిత్య కార్యక్రమాలు నిర్వహించడమే కాకుండా మెరుగైన సమాజం కోసం కవిత్వాన్ని రాస్తూ ఉంటారు. ఆ కోవలోనే మట్టి పోగు అనే శీర్షికతో కవితా సంపుటి మన ముందుకు తెచ్చారు.

కుమారస్వామి గారికి తాను కవిత్వం ఎందుకు రాస్తున్నానో, కవిత్వం ద్వారా ఏమి సాధించాలనుకుంటున్నారో బాగా తెలుసు. ఆ అవగాహనతోనే కవిత్వాన్ని రాస్తున్నారు. అంతే కాకుండా సమాజాన్ని మార్చాలంటే ముందు తాను మారాలని ఆ తర్వాతే సమాజం మారుతుందని స్పష్టమైన అవగాహనా ఉన్న కవి.
 

“నేను మారకుండా నా జీవన ప్రపంచాన్ని

మార్చుకోలేనని తెలిసింది” (కొత్త రూపం)


సమాజాన్ని మార్చాలంటే ముందు మనం మారాలి. మార్పు మన నుండి, మన ఇంటి నుండి మొదలవ్వాలి అనే అవగాహన మాత్రమే కాదు మారడానికి పుస్తకాలను తవ్వుతూ కొత్త భావాల కోసం అన్వేషిస్తున్నానని ప్రకటించుకున్నారు. మనిషి మారాలంటే తన తప్పులు తెలుసుకోవాలి, తప్పులు తెలుసుకోడానికి విషయాలపై, సమాజంపై అవగాహన ఉండాలి. అవగాహన మాత్రమే కాదు మంచి జ్ఞానం కూడా పుస్తకాల నుండే వస్తుంది. అందుకే అలాంటి పుస్తకాలను చదవాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది.

దేశంలోనే అత్యంత కరువు ప్రాంతంగా గుర్తించబడిన ప్రాంతం రాయలసీమ. అందులో అనంతపురం జిల్లాలో కరువు అధికంగా ఉంటుంది. అలాంటి అనంతపురం గురించి కవిత రాసిన కుమారస్వామి గారు అనంతపురంలో కరువు మాత్రమే కాదు కాలుష్యం కూడా పెరిగిపోతోందని మదన పడ్డారు.
 

“వడివడిగా పరుగులు తీసే వాహనాల వెంబడి

ఆవు వెంట నడిచే దూడ లాగా

దుమ్ము ధూళి నగరమంతా పరచుకుంటోంది”


కరువుకు కారణం పచ్చదనమే కాదు కాలుష్యం కూడా. అదే విషయాన్నీ ఆలోచనాత్మక ప్రతీకతో మన ముందు ఉంచే ప్రయత్నం చేశారు. నగరీకరణ జరిగే కొద్దీ వాహనాలు పెరిగిపోతున్నాయి. మనిషి నడవడమే గగనమైంది. ప్రతి ఇంటికి రెండు నుండి మూడు వాహనాలు ఉంటున్నాయి. వాటి నుండి వెలువడే కాలుష్యం వల్ల మహా నగరాలూ కాలుష్యంతో కలుషితం అవుతున్నాయి. కాలుష్యం వల్ల ప్రజల ఆరోగ్యం దెబ్బతినడం, వాతావరణంలో మార్పులు రావడం జరుగుతోంది. కాలుష్య సమస్య మహానగరాలు మాత్రమే కాదు జిల్లా కేంద్రాల్లో కూడా అధికమతోందని కుమారస్వామి గారు గుర్తించారు.
 

“మట్టిలోని ఒక్కో రేణువు ఎదురుగా నిలిచి

దాహంతో

నన్ను దీనంగా అర్దిస్తుంటే

కన్నీళ్లను దోసిట్లో తీసుకొని నెర్రెలలో పోసినాను.” (తడిలేని నేల)


కరువుతో కటకటలాడుతున్న నేలమ్మ దుస్థితిని హృదయవిదారకంగా చిత్రించిన దృశ్యం ఇది. ఆ వాక్యాలను మనసులో మననం చేసుకుంటూ కళ్ళు మూసుకొని దృశ్యాన్ని ఊహించుకుంటే మనసు చితికిపోతుంది. ఇదే కవి మరో కవితలో “భాష ఒకరిని మరో కరిలోకి ప్రవహింపజేస్తుంది” అన్నారు. (పలుగుల శిల్పం) కవి కేవలం చెప్పడమే కాదు వారి కవిత్వంతో చేసి చూపిస్తున్నారు కూడా. తడిలేని నేల కవితలో చేసిందదే. విశేషమైన, అందరికీ అర్థమయ్యే ప్రతీకలతో పాఠకుల హృదయంలోకి ప్రవేశిస్తారు.

కుమారస్వామి గారు సామాజిక చింతనతో, సమాజం కోసం కవిత్వాన్ని రాస్తున్నారు. అభ్యుదయ భావాలతో తనదైన శైలితో, బలమైన వాక్య నిర్మాణంతో, అందమైన భావాలతో, సున్నిత హెచ్చరికలతో కవిత్వాన్ని రాస్తున్నారు. అందులో ఎలాంటి సందేహం లేదు. కానీ వారు అక్కడక్కడ భావ వాదం వైపు ఉన్నారేమో అనిపిస్తోంది. దేవతలు నృత్యం చేస్తున్నారు, బ్రహ్మం చెప్పిన తత్త్వం శ్రుతి కోల్పోతూ ఉంటుంది. కర్మను నమ్మిన మనిషి లాంటి వాక్యాలు వారిలోని భావవాద కవికి నిదర్శనాలు.

తక్కువ వాక్యాల్లో మంచి కవిత్వం అందించడం, అర్థంలేని ఊహలు, ప్రతీకలు వాడటం ఉండదు. వారి కవితలను పరిశీలిస్తే ప్రతి కవిత ఇరవై వాక్యాలకు మించి ఉండదు. నేడు అనేక మంది కవులు వాక్యాలు ఎక్కువ కవిత్వం తక్కువగా రాస్తున్నారు. అలాంటి కవుల వరుసలో కుమారస్వామి గారు ఉండరు. కానీ కొన్ని కవితల్లో శిల్పం తేలిపోవడం గమనించవచ్చు ఉదాహరణకు జీవన వాహిని కవిత స్త్రీ చేసే అనేక శ్రమలను గుర్తిస్తూ రాసిన కవిత. వస్తువు గొప్పదైనప్పటికి శిల్పం విషయంలో కవిత తేలిపోయింది. ఇదే వరసలో అక్షరం, భాషా సౌందర్యం, మంజీరా ధ్వనులు లాంటి మరికొన్ని కవితలు కాస్త నిరాశ పరిచాయి.

కవి పెరిగిన ప్రాంత తాలూకు ప్రభావం కవిత్వంపై తప్పకుండా ఉంటుంది. అందుకే పుస్తకంలో కరువు, రైతు, మట్టి లాంటివి ఎక్కువగా కవితలు ఉన్నాయి. దళితులు ఇప్పటికి వివక్షకు గురౌతున్నారు. ఆ తరుణంలో కొన్ని చోట్ల దళితులను ఆలయాలలోకి అనుమతి ఇవ్వడం లేదు. ఆ విషయాన్నీ చెప్తూ
 

“నా పాదాలు ఆలయాన్ని అపవిత్రం చేశాయన్నపుడు

నా కన్నీరు సమాజాన్ని కడగడానికి ఏరులై పారుతుంది” (నగారా)


లాంటి వాక్యాలు ప్రస్తుత సమాజ దుస్థితిని చిత్రించడమే. సమాజం ఎంతో మార్పు జరిగింది, జరుగుతోంది. అయినా దళితులు, బహు జనులపై వివక్ష ఇంకా కొనసాగుతూనే ఉన్నది. సమాజాన్ని మార్చాల్సిన అవసరాన్ని నొక్కి చెప్పారు.
 

“నేను సమాజాన్ని

ఆందోళన నా ఆయుధం”(ఆఖరీ రాస్తా)


కవులు తన కోసం కవిత్వం రాయరు. సమాజం కోసం, సమాజంలో ఒక్కరిగా నిలిచి కవిత్వాన్ని రాస్తారు. సమాజాన్ని మార్చడమే వారి లక్ష్యం. అందుకే కుమారస్వామి గారు నేను సమాజాన్ని అన్నారు. మేము మా సంతృప్తి కోసం కవిత్వాన్ని రాస్తున్నారు. మా కవిత్వం ఎవరిని మార్చగలదు అనే భావాలున్న వారు కవిత్వాన్ని రాయకపోవడం మంచిది. ఒకవేళ రాస్తుంటే మీ పుస్తకాల్లో మాత్రమే పొందుపరుచుకోవాలి. పత్రికల్లో, సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేయడం ఎందుకు? కవిత్వాన్ని వ్యక్తిగతం కాదు, కవిత్వం సమాజం, కవులు సమాజం కోసమే పని చేస్తారు. అలా చేసేవారే కవులుగా గుర్తించబడతారు. అలా కాకపోతే మీ పేర్ల పక్కన కవి అని రాసుకోవడం మంచిది కాదు.

ఆందోళన నా ఆయుధం అంటే కవి నిరంతర ప్రతిపక్ష వాది. ప్రజల కోసం పోరాటం చేసే వారే కవులు. కుమారస్వామి గారి ఆందోళన వ్యక్తిగతమైనది కాదు, మట్టి కోసం, రైతు కోసం, సమాజం కోసం, దళితులపై జరిగే అన్యాయాల ప్రతిఘటించడం కోసం, మహిళల సమస్యలపై స్పందించడం కోసం, కాలుష్య నివారణ కోసం ఇదే వారి ఆందోళన. అందుకే వారు కవిత్వాన్ని రాస్తున్నారు. సమాజంలో మార్పును కోరుతున్నారు. వస్తు విస్తృతి పెంచుకొని మరింత గాఢమైన శిల్పంతో మరిన్ని కవితా సంపుటాలు సాహిత్య లోకానికి అందివ్వాలని కోరుతూ…

మరిన్ని వ్యాసాలు

కల్పవృక్ష వినాయక స్వరూపం శిల్పి
కల్పవృక్ష వినాయక స్వరూపం శిల్పి
- కుందుర్తి నాగబ్రహ్మాచార్యులు
సంత్ నరహరి సోనార్
సంత్ నరహరి సోనార్
- కుందుర్తి నాగబ్రహ్మాచార్యులు
మా చార్ధామ్ యాత్ర
మా చార్ధామ్ యాత్ర
- కర్రా నాగలక్ష్మి
Viswakarma
విశ్వకర్మ
- శ్రీ కుందుర్తి నాగబ్రహ్మచార్యులు అద్దంకి
తొలి వలపు తొందరలు...
తొలి వలపు తొందరలు...
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు