సుశాస్త్రీయం: పరవస్తు చిన్నయసూరి - టీవీయస్. శాస్త్రి

Paravastu Chinnayasuri

తెలుగు సాహిత్యంతో పరిచయం ఉన్న ప్రతివారికీ సుపరిచితమైన పేరు పరవస్తు చిన్నయసూరి.వీరు 19 వ శతాబ్దానికి చెందిన మహా పండితుడు.పరవస్తు చిన్నయసూరి ప్రసిద్ధ తెలుగు రచయిత,గొప్ప పండితుడు. ఇతడు తమిళనాడులోని చెంగల్‌పట్టు జిల్లాలోని పెరంబూరులో జన్మించాడు. మద్రాసు ప్రభుత్వ (ప్రెసిడెన్సీ) కళాశాలలో తెలుగు బోధకుడు. తను జీవితాంతం తెలుగు భాషాభ్యుదయానికి, తెలుగు సాహిత్యానికి పాటుబడ్డారు."పద్యమునకు నన్నయ, గద్యమునకు చిన్నయ"అనే లోకోక్తి ఉంది. అప్పటి విశ్వవిద్యాలయ కార్యదర్శి ఎ. జె. ఆర్బత్నాట్ కాశీ నుండి తర్కమీమాంస పండితులను రప్పించి,చిన్నయను పరీ‍క్ష చేయించి,  సమర్థుడని గుర్తించి,"చిన్నయసూరి" అనే అక్షరాలతో స్వర్ణకంకణాన్ని సీమ నుండి తెప్పించి బహుమతిగా ఇచ్చాడు.

సూరి అనగా పండితుడు అని అర్థం.చిన్నయ చాలా తరాలకు పూర్వం ఉత్తర ఆంధ్రప్రదేశ్ నుండి మద్రాసు వలసవెళ్ళిన వైష్ణవ కుటుంబములో జన్మించారు.వీరి పూర్వీకులు పరవస్తు మఠం శిష్యులు.వీరు సాతాని కులానికి చెందినా, బ్రాహ్మణ ఆచారవ్యవహారాలు పాటించేవారు. తాము ఆపస్తంబ సూత్రానికి,గార్గేయ గోత్రానికి చెందిన యజుశ్శాఖాధ్యాయులమని చెప్పుకున్నారు.చిన్నయ1809 (ప్రభవ)లో జన్మించారు. కానీ కొందరు పండితులు ఈయన 1806లో జన్మించాడని భావిస్తున్నారు.చిన్నయసూరి గారి తండ్రి వెంకటరంగ రామానుజాచార్యులు తిరువల్లిక్కేని (ట్రిప్లికేన్) లోని రామానుజమఠంలో మతాధికారి.

వెంకటరంగ రామానుజాచార్యులు గారు సంస్కృత,ప్రాకృత,తెలుగు మరియు తమిళాలలో మంచి పండితుడు. అక్కడే ఈయన్ను ప్రతివాదభయంకరం శ్రీనివాసాచార్యులనే వైష్ణవ పండితుడు చూసి రామానుజాచార్యుల జన్మస్థానమైన శ్రీపెరంబుదూరులోని ఆలయంలో వైష్ణవ తత్వాన్ని ప్రచారం చేసేందుకు ఆహ్వానించాడు.పండు ముదుసలి వయసు వరకు ద్రవిడవేదాన్ని పారాయణం చేస్తూ, మతాధికారిగా కార్యాలు నిర్వహిస్తూ ఇక్కడే నివసించారు. ఈయన 1836లో నూటపదేళ్ళ వయసులో మరణించారు. వెంకటరంగ రామానుజాచార్యులుకు ఇరువురు సంతానము---బాల వితంతువైన ఒక కూతురు, ఆమె కంటే చిన్నవాడైన చిన్నయ. చిన్నయను గారాబంగా పెంచటం వలన 16 ఏళ్ళ వయసు వరకు చదువుసంధ్యలను పట్టించుకోలేదు.శ్రీ చిన్నయ సూరిగారు సరళమైన భాషలో,సులభ గ్రాహ్యంగా ఉండేవిధంగా 'బాలవ్యాకరణం'ను వ్రాసారు. దీనిని, చిన్నప్పుడు మనలో ఎందరో చదువుకున్నారు. తెలుగు భాషను పరిశోధించి, 'ఆంద్ర శబ్ద చింతామణి' ని పరిశీలించి,వినూత్న రీతిలో వ్రాసినదే 'బాల వ్యాకరణం'.ఈ గ్రంధం తెలుగు వారికి ఒక వరప్రసాదం అని చెప్పటంలో అతిశయోక్తి లేదు.గత తరంలో,దీనిని చదువనివారు తెలుగుగడ్డపై లేరని చెప్పవచ్చును. శ్రీ చిన్నయసూరి గారు మరెన్నోవిశిష్ఠ గ్రంధాలను తెలుగు వారికి అందించారు.వాటిలో ప్రఖ్యాతి గాంచినవి--నీతిచంద్రిక,సూత్రాంధ్ర వ్యాకరణం, ఆంధ్ర ధాతుమూల,నీతి సంగ్రహము...మొదలైనవి.

చిన్నయసూరి గారు, సంస్కృతంలోనున్న పంచతంత్ర కథలలోని, మిత్రలాభం, మిత్రబేధంలను తెలుగులోకి 'నీతిచంద్రిక' పేర అనువదించారు. అనువదించటమే కాకుండా, ఆ గ్రంధానికి చక్కని తెలుగు పేరైన 'నీతిచంద్రిక' అని పేరు పెట్టారు. నీతికథలను తెలుసుకునాలనుకునే వారికి అది నిజంగా ఒక పున్నమి వెన్నెల. తరువాతి రోజుల్లో, శ్రీ వీరేశలింగం గారు, 'సంధి'మరియు 'విగ్రహం'ను సంస్కృతం నుండి అనువదించారు. అలా సంస్కృతం నుండి, కేవలం నాలుగు తంత్రములే తెలుగులోకి అనువదించబడ్డాయి. అయిదవదైన, 'కాకోలుకేయం' అనే దాన్ని  తెలుగులోకి ఎవ్వరూ అనువదించినట్లుగా తెలియదు.నాకు తెలిసినంతవరకూ, అది తెలుగులోకి అనువదించ బడలేదు. చిన్నయసూరి గారి రచనాశైలి అత్యద్భుతంగా ఉంటుంది.ఆయనశైలిని అనుకరించి, అనుసరించాలని చాలామంది ప్రయత్నించి ఘోరంగా వైఫల్యం చెందారు. చిన్నయగారి సుమధురమైన వచనరచనాశైలి లాంటి దానిని నేటివరకూ మనం గమనించలేము. శ్రీ వీరేశలింగం గారు, శ్రీ కొక్కొండ వెంకటరత్నంగారు అదే శైలిలో విగ్రహము, సంధిని వ్రాయాలనుకున్నారు కానీ, అలా వీలుపడకలేకేమో వారి బాణిలోనే నూతన వరవడిలో వ్రాసారు. కానీ, చిన్నయసూరి గారి మిత్రలాభం, మిత్రబేధంకు ఉన్నంత ఆదరణను సంధి,విగ్రహంలు నోచుకోలేదని చెప్పవచ్చును. గత తరం వారందరూ మాధ్యమిక విద్యాస్థాయిలో నీతిచంద్రికను చదివి ఉంటారు. సందేహంలేదు. తెలుగు భాషమీద పట్టు, సాహిత్యం పట్ల అభిమానం పెంచుకోవాలనుకునే వారు తప్పక చదవవలసిసిన గ్రంధం 'నీతిచంద్రిక'.

'నీతి చంద్రక'ను తెలుగులోకి అనువదించటానికి, చిన్నయసూరి గారి ముఖ్య ఉద్దేశ్యం --తేనెలూరే తెలుగు భాషలో నీతి కథలను చెప్పటమే కాదు, చల్లని వెన్నెల ప్రసరించే తెలుగు భాషాకిరణాలను తెలుగు వారిపైన ప్రసరింప చేయటం కూడా! తమిళ దేశానికే చెందిన శ్రీ T.బాలనాగయ్య సెట్టిగారు వీరి 'నీతి చంద్రిక' ను ప్రచురించిన ధన్యజీవి. వారు ప్రచురించటం వల్లనే, మనకు 'నీతిచంద్రిక'ను చదువుకునే అదృష్టం దక్కింది. శ్రీ చిన్నయసూరి గారి జీవిత చరిత్రను సమగ్రంగా శ్రీ నిడదవోలు వెంకటరావుగారు రచించారు. పరవస్తు చిన్నయసూరిగారి ఐదవతరం మనవడు పరవస్తు ఫణిశయన సూరిగారు ప్రస్తుతం విశాఖపట్నంలో ఉంటున్నారు. మధ్యతరాల్లో ఎవరికీ పద్య వాసనలు అంటలేదు. కానీ ఫణిశయన సూరిగారు చక్కగా పద్యాలను ఆలపిస్తూ పిల్లలకు శతక, ప్రబంధ, పౌరాణిక పద్యాలను నేర్పుతున్నారు. బాగా పాడుతున్న పిల్లలకు పద్యానికి పదిరూపాయల చొప్పున ప్రోత్సాహకంగా ఇస్తున్నారు. ఇందుకోసం వారు ఇప్పటికే తన సొంత డబ్బును సుమారు 5 లక్షల దాకా ఖర్చు చేసారు. వారు ఈ మధ్యనే 'పరవస్తు పద్యపీఠం' అనే సంస్థను ఆరంభించారు. తెలుగు భాషపై మరెంతో కృషి చేసిన శ్రీ చిన్నయసూరి గారు 1861 లో స్వర్గస్తులైనారు.ఆ మహనీయునికి, మనమందరమూ ఋణపడి ఉన్నాం! ఆ మహనీయునికి ఘనమైన నివాళిని సమర్పించుదాం !!
 

మరిన్ని వ్యాసాలు

పాలెగాళ్ళు.
పాలెగాళ్ళు.
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
పురాణాలలో ఒకే పేరు ఉన్నవారు.4.
పురాణాలలో ఒకే పేరు ఉన్నవారు.4.
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
సినిమా గీతాలలో  షెహనాయ్ వాద్యం.
సినిమా గీతాలలో షెహనాయ్ వాద్యం.
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
పురాణాలలో ఒకే పేరు పలువురికి -3
పురాణాలలో ఒకే పేరు పలువురికి-3
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
108
108
- శ్రీరామ్ లక్ష్మీనారాయణ మూర్తి