మను చరిత్రము - పరిచయం - పుస్తక సమీక్ష - సిరాశ్రీ

Manu Charitram - Parichayam - Book review

తెలుగు సాహిత్యంలో ఎన్నో కావ్యప్రబంధాలు ఉన్నాయి. వాటిల్లో ఐదింటిని పంచమహాకావ్యాలు అన్నారు.

  1. అల్లసాని పెద్దన గారి "మనుచరిత్ర"
  2. తెనాలి రామకృష్ణ వ్రాసిన "పాండురంగ మహాత్మ్యం"
  3. శ్రీకృష్ణదేవరాయల "ఆముక్తమాల్యద"
  4. రామరాజ భూషణుడి "వసు చరిత్ర"
  5. నంది తిమ్మన్న రచించిన "పారిజాతాపహరణం"


తెలుగువారిగా పుట్టినందుకు ఆ ఐదు ఏమిటో, వాటిల్లో ఏముందో పూర్తిగా కాకపోయినా కనీసం తొంగైనా చూడాలి అని నా అభిప్రాయం.

భాషాభిమానులు పద్యం, ఛందస్సు, వర్ణన, ప్రయోగం మొదలైన అంశాల జోలిక వెళ్లినా తక్కిన వారు కనీసం ఈ పంచమహాకావ్యాల కథలైనా తెలుసుకోవాలి. అందుకే హై స్కూల్ నుంచీ తెలుగు సబ్జెక్టులోని పద్యభాగంలో ఈ కావ్యాల్లోంచి అన్నో ఇన్నో పద్యాలు పాఠాలుగా ఇచ్చి రుచి చూపించే ప్రయత్నం చేస్తున్నారు (ఇప్పటికీ చేస్తున్నారనే అనుకుంటున్నాను). నేను కూడా అలా రుచి చూసి తర్వాత కాలంలో మరింతగా చదివి ఇప్పటికీ ఆస్వాదిస్తున్నాను.

ఆ ఐదింటిలో అల్లసాని పెద్దన వ్రాసిన "మనుచరిత్రము" మొట్టమొదటిది.

"అట జని గాంచె భూమిసురుడు..." పద్యం ఇంగ్లీష్ మీడియమే అయినా తెలుగు సెకండ్ లాంగ్వేజ్ గా ఉన్న చాలా మందికి తెలిసే ఉంటుంది.

అలాగే "ఇందీవరాక్షుని వృత్తాంతం" అని 90 వ దశకంలో 9వ తరగతి పాఠంగా ఉండేది. అది కూడా మనుచరిత్రలోని భాగమే.

"ప్రవరాఖ్యుడు" అని జగపతి బాబు సినిమా ఒకటి వచ్చింది. కొంతమందికి గుర్తుండే ఉంటుంది. ఆ టైటిల్ ని ఈ కావ్యంలోంచి తీసుకున్నదే. మనుచరిత్రలో హీరో పేరు ప్రవరాఖ్యుడు. హీరోయిన్ పేరు వరూధిని.

"మనుచరిత్రము" పూర్తి ప్రబంధాన్ని అప్పట్లో వావిళ్ల వారు, ఇప్పట్లో ఎమెస్కో వాళ్లు ప్రింట్ చేసారు. దీనిపై ఎన్నో పరిశోధనలు, అనుబంధాలు వచ్చాయి. ఇప్పటి వరకు చాలానే చదివాను. అయితే అన్నింటిలోకెల్లా నాకు బాగా నచ్చినది బాలాంత్రపు వేంకట రమణ గారి "మనుచరిత్రము పరిచయము".

అసలు కథ ఫ్లో ఎక్కడా మిస్ అవకుండా హైలైట్ పద్యాలని, వచనాల్ని మాత్రమే వరుసగా పేర్చి వాటికి ప్రతిపదార్థ తాత్పర్యాలు చెబుతూ చక్కగా రాసారు. ప్రతి పద్యంలోని సొగసును, భాషా ప్రయోగాలను కూడా వివరించారు.

పద్యాలన్నీ ఎందుకులే అనుకునే వారికి మొత్తం మనుచరిత్ర కథని "అనగ అనగా ఒక ఊరు..." అంటూ మొదలుపెట్టి 8 పేజీల్లో మామూలు భాషలో కథంతా చెప్పేసారు.

అంటే ఎంత బద్ధకిష్టుకైనా "మనుచరిత్ర" గురించి తెలియజెప్పాలనే తాపత్రయం వేంకట రమణ గారిలో కనిపిస్తుంది. పెద్దన మీద భక్తి, మనుచరిత్ర మీద అనురక్తి, భాష మీద ఆసక్తి, వివరించగలిగే శక్తి పుష్కలంగా ఉంటే తప్ప ఇంత రక్తి కట్టించే విధంగా ఈ పుస్తకం రాయడం సాధ్యం కాదు.

ఇదంతా ఒక ఎత్తైతే రాయలవారి ఆస్థానంలో పెద్దనగారు ఆశువుగా చెప్పిన సుప్రసిద్ధమైన 30 పాదాల సుదీర్ఘ ఉత్పలమాలికని కూడా ఈ పుస్తకంలో పొందుపరిచారు. అంతే కాదు ఈ మాలిక అర్థం చాలా పుస్తకాల్లో దొరకదు. కానీ ఇక్కడ ప్రతి పాదానికి పూర్తిగా అర్థాన్ని వివరించారు వేంకట రమణగారు.

ఈ మాలిక సగం అచ్చతెలుగు పదాలతోనూ, సగం సంస్కృత సమాసాలతోనూ తులతూగుతూ ఉంటుంది.

చాలా ఏళ్ల క్రితం తనికెళ్ల భరణిగారు ఈ 30 పాదాల పద్యమాలిక మొత్తాన్ని ఏకధాటిగా అప్పజెబితే విని నోరెళ్లబెట్టాను. తర్వాత నేను కూడా కంఠస్థం చేయడానికి ప్రయత్నించాను కానీ నా వల్ల కాలేదు. కొంత వరకు వెళ్లి ఆగిపోతూనే ఉంది. మీలో ఎవరైనా ట్రై చేయొచ్చు.

అంతే కాదు.. అర్థాలు, తాత్పర్యాలు మాత్రమే చెప్పుకుంటూ పోకుండా అవసరమైన చోట విలువైన సమాచారాన్ని కూడా అందించారు ఈ పుస్తకంలో. ఉదాహరణకి "అకటకటక వికట కూట కోటి విశంకట శృంగాట..." అనే పద్యాన్ని వివరిస్తూ అందులో "అంజన" అనే పదం వచ్చిందని "అష్టదిగ్గజాల" గురించి ఇలా వ్రాసారు రమణగారు: "...ఎనిమిది దిక్కులా ఎనిమిది ఏనుగులు ఉండి భూగోళాన్ని మోస్తున్నాయని ప్రాచీనుల విశ్వాసం. వీటినే "అష్టదిగ్గజాలు" అంటారు. పశ్చిమాన ఉండే దిగ్గజానికి "అంజనం" అని పేరు. ....ఆధునిక విజ్ఞాన శాస్త్రం ఎనిమిది "మేజర్ టెక్టానిక్ ప్లేట్స్" ని నిర్ధారించింది. అవి ఆఫ్రికన్, అంటార్కటిక్, ఆస్ట్రేలియన్, యూరేశియా, ఇండియన్, నార్త్ అమెరికన్, పసిఫిక్, సౌత్ అమెరికన్...హిందూపురాణాలలో భూగోళాన్ని ఎనిమిది దిక్కులా మోస్తున్న దిగ్గజాలు కదిలినపుడు భూకంపాలు వస్తాయని చెప్పబడింది. ఆధునిక విజ్ఞానశాస్త్రం ప్రకారం భూకంపాలు రావడానికి ఈ ముఖ్యమైన 8 ప్లేట్స్ కదలడం కూడా ఒక కారణం...టెక్టానిక్ ప్లేట్స్ నే మన పూర్వీకులు "అష్టదిగ్గజాలు" అని భావించారా? ఇలాంటి విషయాలు వైజ్ఞానికులు, పురాణపండితులు కలిసి పరిశోధిస్తే బాగుంటుంది".

ఇలా కాసేపు ఆలోచనలు రేకిత్తించే సమాచారాన్ని అందించారు చాలా చోట్ల.

ఇక నాకు ఇప్పటికీ నోటికి వచ్చిన వచనం ఒకటి ఉంది ఈ "మనుచరిత్ర"లో. "జటిలుండు కిటకిటం పండ్లు కొరికి..." అని మొదలువుతుంది. దానికి నేను మొదటిసారి ఇష్టంగా చదుకున్నప్పుడు కూడా వేంకటరమణగారు చేసినంత అర్థవంతంతమైన వివరణ లభించలేదు. ఆయన దృష్టినుంచి ఒక్క పదం కూడా తప్పించుకుపోదు. దేనినీ ఆయన్ స్కిప్ చేసినట్టు కనపడలేదు. అలాగే ఈ వచనం ముందున్న పద్యం "అనినన్ గన్నులు జేవురింప...". ఇది కూడా చాలా పాపులర్ పద్యం.

అనినన్ గన్నులు జేవురింప నధరం బల్లాడ వేల్లత్పునః
పునరుద్యద్భ్రుకుటీ భుజంగ యుగళీ ఫూత్కార ఘోరానిలం
బన నూర్పుల్ నిగుడన్, లలాట ఫలకం బందంద ఘర్మాంబువుల్
చినుకన్, గంతు దిదృక్షు రూక్షనయన క్ష్వేళాకరాళ ధ్వనిన్

దీనిని రమణగారు వివరించిన తీరు : "...కన్నులు ఎర్రబడ్డాయి (కన్నుల్ జేవురింపన్), పెదవులు కంపించాయి (అల్లాడన్), గుబురుగా పెరిగి వ్రేళ్లాడుతున్న (వేల్లత్), బాగా పెరిగిన వెంట్రుకలతో పెనవేసుకుపోయిన రెండు కనుబొమ్మలు (భ్రుకుటి), రెండు మహాసర్పాలు (భుజంగ యుగళి)...." ఇలా సాగుతుంది.

ప్రతి అక్షరాన్ని, ప్రతి పదాన్ని పూర్తిగా ప్రేమించి వ్రాసిన పుస్తకం ఇది. ఇప్పటి తరానికి తగ్గట్టుగా చక్కని సులభ శైలిలో "మనుచరిత్రము-పరిచయము" అందించిన వేంకట రమణ గారికి తెలుగు భాషాభిమానుల పక్షాన ధన్యవాదాలు తెలుపుతున్నాను. మిగిలిన నాలుగు మహాకావ్యాల పరిచయం కూడా ఇదే పద్ధతిలో వారు చేసేస్తే బాగుంటుందని అనుకుంటున్నాను.

మరిన్ని వ్యాసాలు

సినీ అప్సరస గీతాలు .
సినీ అప్సరస గీతాలు .
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
వివేకానంద రాక్ మెమోరియల్ స్థపతిశ్రీ.ఎస్.కె ఆచార్య
స్థపతిశ్రీ.ఎస్.కె ఆచార్య
- కుందుర్తి నాగబ్రహ్మాచార్యులు
రాజస్తాన్ ప్రాంత నిర్మాణ విశేషాలు
రాజస్తాన్ ప్రాంత నిర్మాణ విశేషాలు
- కుందుర్తి నాగబ్రహ్మచార్యులు
Kanyakumarilo vunna tiruvalluvar vigraham nirmana charitra
తిరువళ్లువర్ విగ్రహం నిర్మాణ చరిత్ర
- కుందుర్తి నాగబ్రహ్మాచార్యులు