మా తమ్ముడు కార్టూనిస్టు - డా. ఎస్. జయదేవ్ బాబు

our dear brother cartoonist

బాపట్ల తో నాకు చాలా పెద్ద అనుబంధం వుంది. కానీ, మునిసిపల్ హైస్కూల్లో నా చదువుకు, పక్కనే ఆంజనేయ స్వామి గుడిలో వేప చెట్టు కు, సూర్య లంక దారిలో టవున్ హాలు కు, రైల్వే స్తేషను కు, క్రిమికాంత చోళుడు నిర్మించిన భావనారాయణ స్వామి దేవాలయానికీ, నేరేడు చెట్ల కింద రాలిన పళ్ళకీ మించి , ఆ వూళ్ళో పుట్టిన నా నాలుగో తమ్ముడు తో మరింత గట్టి ప్రేమాను బంధం వుంది. 

మద్రాసు నుంచి అప్పుడప్పుడు బాపట్ల కి వచ్చే మానాయనమ్మ వారానికి మూడు సార్లు కచ్చితంగా భావనారాయణ దేముడిని దర్శించు కోవాల్సిందే. క్రిష్నా రామా అనుకునే రోజుల్లో , ఆ పరమాత్మ దర్శనానికి మించిన పరమావధి మరొకటేది అనుకునే ఆమె, మా తమ్ముడికి రామక్రిష్ణ అని నామకరణం చేసింది. ముద్దుగా క్రిష్ణ అని పిలుచుకుంది. 

మా అన్నదమ్ములందరిలో క్రిష్ణ అద్రుష్టవంతుడు. మా నాన్న, మేమందరం కలలు గని నోచుకోలేని మూడు చక్రాల సైకిలు క్రిష్ణ కి కొనిచ్చారు. ఆ పాటికి , నాన్న కి బెజవాడ కి బదిలీ అయింది. సత్యనారాయణ పురంలో రామారావు గారి కాంపౌండులో ఇల్లు. కాంపౌండు గేటుకీ , ఇంటి వాకిలీకి మధ్య బోల్డంత ఖాళీ స్థలం. మూడు చక్రాల సైకిలు దర్పంగా , స్టైలు గా బెల్లు నొక్కుతూ తొక్కాలనుకుంటే అదే సరైన ప్రదేశం. శెలవుల్లో నేను బెజవాడకి వస్తే నాకు చాలా హోం వర్కు వుండేది. రెండొ, మూడొ తమ్ముళ్ళతో కలిసి ఇంజెక్షన్ బాటిల్ (వయల్స్) రబ్బరు మూతల చక్రాలతో చిన్న కార్లూ , లారీలూ , ట్రక్కులూ అట్ట ముక్కలతో చేసి కాంపౌండు లో తిప్పడం ఒక పని. అది భలే సరదాగా వుండేది. సాయంత్రం పూట క్రిష్నకి స్నానం చేయించి , చొక్కా లాగు తొడిగి , తలదువ్వి మొహానికి పవుడరద్ది సైకిలు తొక్కించడం మరొక పని. ఒక్కో సారి ఇల్లుగల్లాయన పిల్లల తొ కలిసి సైకిళ్ళేసుకుని బ్యారేజీ దాకా వెళ్ళడం అడ్వెంచర్ అనిపించేది. మా నాన్న సైకిలు , రాలీ. ట్రిమ్ముగా తళతళ లాడుతూ వుండేది. దాన్ని తొక్కడం అంటే బ్యూకు కారు ఎక్కినట్లే. ముందు ఫ్రేం మీద తమ్ముడు క్రిష్ణ ని ఎక్కించి , సర్రుమని దూసుకు పోయే వాడిని. ఆ స్పీడు క్రిష్ణ కి భయం. ఆంజనేయా , చెప్పు, భయం పారిపోతుంది అనే వాడిని. ఒక సారేం, నాలుగు సార్లు ఆంజనేయా గట్టిగా పలికి, కళ్ళు పెద్దవి చేసి వెనక్కి గర్వంగా తిరిగి, భయం పోయింది అనే వాడు. 

ఏళ్ళు గడిచి ,నివాసం మద్రాసులో సెట్టిల్ అయ్యాక , క్రిష్ణ బుద్ధి గా చదువుకున్నాడు. మెడిసిన్ చదివించాలన్నది నా ఆశ. సర్ త్యాగరాయ కాలేజీ లో  పీయూసీ డిస్టింక్షన్ల తో పాసయ్యాడు. ఎంబీబీయెస్ సీటొచ్చి , స్టాన్లీ మెడికల్ కాలేజీ లో చేరాడు. మెడిసిన్ చదువు ఆషామాషీ కాదు. పట్టుదల వుండాలి. మా నాన్న కి సరైన సమయంలో సరైన చికిత్స అందక ఆయన అసువులు బాసిన రొద గుండెల్లో నాటుకు పోయి వుంది. కసి వుంది. మధ్యతరగతి కష్టాల దిగుడు బావి లోతుల్లో కూరుకుపోయినా , స్కాలర్ షిప్ డబ్బు కాలేజీ ఫీజు కు మాత్రం సరిపోయి , కాంటీన్ లో కప్పు టీ కి కూడా చిల్లర వెతుక్కోవాల్సి వచ్చినా, దీక్ష తో , తపస్సు లాంటి ఆరు సంవత్సరాల విద్య పూర్తి చేసి డాక్టర్ క్రిష్ణ గా ,మెడలో స్టెతస్కోపు అలంకరించుకున్నాడు. 

మా అన్న దమ్ములకి భగవంతుడు బొమ్మలు గీసే శక్తి ఇచ్చాడు. కొంత రాసే వరం కూడా ప్రసాదించాడు. చెల్లెలు నిర్మల , ఆమె కూడా బాపట్ల బిడ్డే, చందమామ లో కధలు రాసి పేరు తెచ్చుకుంది. క్రిష్ణ బొమ్మలు అలవోకగా గీసేస్తాడు. తన స్టడీ రూములో గోడల మీద మెడిసిన్ లెసన్స్ కు సంబంధించిన బొమ్మలు అతికించి పెట్టి విద్య కొన సాగించాడు. వాళ్ళ స్టాన్లీ మెడికల్ కాలేజీ మ్యాగజైనుకి తనే ఎడిటర్ కూడా.  నేను కార్టూన్లు గీయడం, నాకు మనీ ఆర్డర్లు రావడం క్రిష్ణ కి స్ఫూర్తి దాయకం అయింది. " కుమార్" అనే పేరుతో ప్రారంబించి "K" అనే పేరుతో స్ధిరపడి కొన్ని వందల కార్టూన్లు గీశాడు. ఆంధ్ర సచిత్ర వార పత్రిక కార్యాలయంలో శ్రీయుతులు వీరాజీ, మాధవ రావు, సికరాజు గార్ల ప్రొత్సాహం సంపాదించుకున్నాడు. డాక్టర్ చదువులు చదువుతూ కార్టూన్లు గీసే కార్టునిస్టులు చాలా అరుదు కదా.  తెలుగు పత్రికాలోకం కార్టున్ స్వర్ణ యుగం లో తనూ ఒక ప్రత్యేక బాణీ కార్టూన్ కళా కారుడు గా పేరు సంపాదించుకున్నాడు. 

ఉద్యోగానికి ,మనసు, కాలం , సుఖం అర్పణించి , జీవితం కొన సాగించే ప్రవ్రుత్తి బాట సారుల జాబితాలో క్రిష్ణ చేరడు. తను చేపట్టిన విద్య , వ్రుత్తి అటువంటివి. పైచదువులు చదవాల్సిన అవశ్యం ఏర్పడింది.  డర్మటాలజీ, వెనెరియాలజీ, సైకాలజీ, పబ్లిక్ హెల్త్ లకి సంబంధి పోస్ట్ గ్రాడ్యువేట్ డిప్లమాలు ఇంకా మరి కొన్ని తన క్లినిక్ లో దర్శన మిస్తాయి. చెన్నై కార్పరేషన్ లో ఉన్నత ఆరొగ్య వైద్య అధికారిగా ఉద్యోగం చేసి, పిమ్మట ఒక మల్టీ నేషనల్ కంపెనీ లో మెడికల్ కన్సల్టెంట్ గా కొనసాగుతూ తన క్లినిక్ లో వైద్యసేవ లందిస్తూ  మా కుటుంబ సభ్యులకి ( చెన్నై నగరంలొ  మాది చాలా పెద్ద సంఖ్య) వాళ్ళ రకరకాలైన నొప్పులూ, జ్వరాలు, జబ్బులకి మందులూ మాకులూ అడిగిన వెంటనే ఇస్తాడు. తన జ్ఞాపక శక్తి అపారం, పాత కొత్త మందులు ఎప్పటికప్పుడు అప్డేట్ అవుతూ , ఎవరికి ఏ మందు పనిచేస్తుందో తెలిసిన వాడు. మా నాయనమ్మ చివరిరోజుల్లో జారిపడి నడ్డి వెముక విరుచుకుంది, ఆమెను ఇంట్లోనే పడుకోపెట్టి , కాలు కదలకుండా ఒక ఫ్రేము తయారు చేసి కట్లుకట్టి చికిత్స అందించాడు . మాకందరికీ ఎప్పటికీ అండగా వుంటూ మమ్మల్నందరినీ కాపాడుతున్న ధన్వంతరీ పుత్రుడు క్రిష్ణ. 

క్రిష్ణ , పూర్ణిమ ను పెళ్ళి చేసుకున్నాడు. పెళ్ళి పత్రిక లో ఒక కార్టును గీశాను, పెళ్ళికొడుకు వధువు మెడలో మంగళసూత్రానికి  బదులు స్టెతస్కోపు కడతాడు. పత్రిక చూసి బాపూ గారు ముచ్చట పడ్డారు. ముహూర్తానికి వచ్చి నూతన వధూవరులను అశీర్వదించారు. నాకది , మరపురాని అనుభూతి. 

క్రిష్ణ మితభాషి, దైవచింతన, సహనశీలి, నలుగురికి సాయపడే ఉన్నత భావాలు కలిగిన వ్యక్తి. మా కుటుంబంలో ని పిల్లలందరికీ " కాయ్ బాబా " గా ప్రేమ పాత్రుడు. ఆదర్శ నీయుడు. క్రిష్ణ ని స్ఫూర్తి గా తీసుకుని డాక్టర్ చదువులు చేపట్టిన పిల్లలూ ఉన్నారు. క్రిష్ణ పూర్ణిమ దంపతులకు ముగ్గురు అమ్మాయిలు ,ఒక అబ్బాయి. పెద్దమ్మాయిలిద్దరూ అమెరికాలొ, మూడో అమ్మాయి బెంగళూరులో , అబ్బాయి ఇంటిపట్టునా ( చెన్నై తండైయార్ పేట) లో స్ధిరపడ్డారు. క్లినిక్ పేరు "శ్రుతి క్లినిక్" .

ఈ "K" కార్టూన్ సంకలనంలో కొన్ని మాత్రమే చోటు చేసుకున్నాయి. వాటిల్లో కొన్ని ఎప్పటికీ మరిచిపోలేనివి వున్నాయి. నాకు బాగా నచ్చిన కార్టూను ,  హాస్టల్ మేటులు పరాచికాలాడుతుంటారు. పోస్ట్ మాన్ మనీఆర్డర్ పట్టుకొస్తాడు. డబ్బుచ్చుకునే కుర్రాడంటాడు.. ఫ్రెండ్స్ తో వున్నప్పుడు మనీ ఆర్డర్లు పట్టుకు రాకని చెప్పానా లేదా .... అని.
 

--- బాబన్నయ్య. ( కార్టూనిస్ట్ జయదేవ్).  20-05-2020, చెన్నై 600051.

మరిన్ని వ్యాసాలు

Maa chardham yatra
మా చార్ధామ్ యాత్ర
- కర్రా నాగలక్ష్మి
సినీ అప్సరస గీతాలు .
సినీ అప్సరస గీతాలు .
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
వివేకానంద రాక్ మెమోరియల్ స్థపతిశ్రీ.ఎస్.కె ఆచార్య
స్థపతిశ్రీ.ఎస్.కె ఆచార్య
- కుందుర్తి నాగబ్రహ్మాచార్యులు
రాజస్తాన్ ప్రాంత నిర్మాణ విశేషాలు
రాజస్తాన్ ప్రాంత నిర్మాణ విశేషాలు
- కుందుర్తి నాగబ్రహ్మచార్యులు
Kanyakumarilo vunna tiruvalluvar vigraham nirmana charitra
తిరువళ్లువర్ విగ్రహం నిర్మాణ చరిత్ర
- కుందుర్తి నాగబ్రహ్మాచార్యులు