ఏదీ కూడా గుడ్డిగా, ఎప్పుడో ఎవరో చెప్పారు కదా అని ఆచరణ అన్నది అస్సలు పనికిరాదు. కానీ అలా అని అసలు వాటి గురించి ఆలోచించడం మానేయడం అసలు మంచిది కాదు. 'అబ్బే..మేం అసలు అలాంటివి పట్టించుకోమండీ' అని చాలా మంది అంటుంటారు. అది కూడా సరికాదు. పెద్దలు చెప్పినవి, అనూచానంగా వస్తున్నవి, సంప్రదాయాలు, పద్దతులు తెలుసుకోవాలి. వాటి గురించి కొంతవరకైనా తర్కించాలి. ఆపై మంచివి, లేదా అందులో కాస్తయినా లాజిక్ వుంది అనిపిస్తే ఆచరించాలి. అయితే మన ప్రారబ్ధం ఏమిటంటే, ఇక్కడ రెండే రకాలుగా మాట్లాడేవారు పెరిగిపోవడం. ఇది ఇంతే, ఇలాగే చేయాలి అని చె్ప్పేవారు. లేదూ ఇలా చేస్తే మీకు మంచిది అని మాత్రమే చెప్పేవారు. అంతే కానీ ఎందుకు చేయాలి అన్నది చెప్పరు. పొరపాటున చెప్పినా తప్పుడు మార్గంలోకి బలవంతంగా మళ్లించడానికి తప్ప వేరు కాదు. గీతలో భగవానుడు చెప్పింది గుర్తుకు తెచ్చుకోండి..మంచిదైనా పరధర్మం కన్నా, కాస్త తక్కువ మంచిదైనా స్వధర్మమే మేలు అని భావించి, కాస్త తర్కం అలవర్చుకోండి. అయితే ఇక్కడా మళ్లీ ఓ రకం జనాలు మనకు కనిపిస్తారు. తర్కానికి బదులు మరీ వితండవాదం చేసే వారు. ఇక వీరిని మార్చడం మన వల్ల కాదు.
నాకు తెలిసి చాలా మంది పిల్లో, పిల్లాడో పుట్టిన తరువాత, పేరు పెట్టే సమయం వచ్చేసరికి, ఏ అక్షరంతో పెట్టాలి అన్నది ఎవరో చెబుతారు. అంతే ఇంక వారికి మనసులో మంచి పేరు పెట్టాలని వున్నా, ఆ అక్షరం తో వచ్చే పేర్ల కోసం కుస్తీ ప్రారంభించేస్తారు. అసలు ఎందుకు ఆ అక్షరంతోటే పేరు పెట్టాలి అని ఆలోచించరు. పొరపాటున ఆలోచించి అడిగినా సదరు విషయం చెప్పిన పెద్దాయిన, జన్మనక్షత్రానికి అదే సూటవుతుందండీ అనో, నక్షత్రనామం మంచిది అనో చెప్పేస్తాడు.
నిజానికి ఇది పెద్ద అపోహ. కానీ ఇది అపోహగా పుట్టలేదు. మారింది. కాలానుగుణంగా మారుతున్న వైనాలు విస్మరించి, ఇంకా మూడంగా అదే పట్టుకు వేలాడుతున్నాం. అసలు ఈ నక్షత్ర నామాలు ఎందుకు వచ్చాయంటే..
పూర్వం, చదువుసంధ్యలు (ఇక్కడ సంధ్య అంటే సంధ్యార్చన..ఉదయసంధ్య, మధ్యాహ్న సంధ్య, సాయం సంధ్య వేళ సూర్యుడికి అర్ఘపాద్యాలు సమర్పించే క్రియ. ఒకప్పుడు జనం సూర్యుడుకి తీవ్ర ప్రాధాన్యత ఇచ్చేవారు. ఎందుకంటే మానవ జీవన వికాసం సూర్యుడిపై ఆధారపడి వుందని ఆనాడే జనం గ్రహించారు కాబట్టి. కనిపించే దైవంగా భావించేవారు. నీళ్లు భూమి మీదకు రావడానికి ఆయనే కారణం అన్నది తెలుసుకున్నారు. అందుకే భూమ్మీద నీళ్లు ఆవిరై మీదకు వెళ్తే, మళ్లీ అంతకు అంతా కిందకు వస్తాయని భావించేవారు. ఆ క్రియకు కృతజ్ఞతా సూచకంగా, నదులు, సరస్సులు, చెరువుల్లో నిల్చుని, కాసిన్ని నీళ్లు దోసిట్లోకి తీసుకుని సూర్యుడికి చూపిస్తూ వదలడం అలవాటు చేసుకున్నారు. ఇది కేవలం ఓ కృతజ్ఞతా ధర్మం. ఇలాంటి వాటిలో లాజిక్ లేకపోయినా పాటించాలి. ఎందుకంటే మనిషి జీవితంలో కృతజ్ఞత అన్నది ఓ భాగంగా వుండాలి.
భోజనం చేసేటపుడు పెద్దలను మనసులో తలుచుకుని ఓ ముద్ద పక్కన పెట్టడం అన్నది కూడా ఇలాంటిదే. వాళ్ల ఆత్మలు స్వీకరిస్తాయని కాదు. వారిని మనం మరిచిపోలేదని, సదా గుర్తు చేసుకుంటున్నామని అర్థం. ముందే చెప్పినట్లు ఇలాంటివి పాటించడం ఉత్తమ జీవన విధానం. ఎందుకంటే కనిపించని భగవంతుడిని తలచుకుని, గుండెలపై చేయి వుంచుకుంటాం. మరి అది సబబైనపుడు పెద్దలను తలచుకుని ఓ ముద్ద పక్కన పెట్టడం, సంధ్యార్చన కూడా సబబే..ఇదంతా వేరే సంగతి..మళ్లీ మన విషయంలోకి వస్తే) పూర్వం చదువు సంధ్యలు అంతగా లేని రోజుల్లో, పుట్టిన తేదీలు, నక్షత్రాలు, గుర్తు పెట్టకోవడం అన్నది అంతగా సాధ్యమయ్యేది కాదు. దీని వల్ల ఏ శుభ కార్యక్రమం వచ్చినా మంచి చెడ్డా చెప్పడం అన్నది పుర హితులకు కష్టం అయ్యేది. 'నీ నక్షత్రం ఏమిటి అడిగితే తెల్ల మొహం వేసే వారు. దాంతో ఇలా కాదు అని కనిపెట్టిన కోడింగ్ - డీ కోడింగ్ పద్దతి ఇది. పుట్టినపుడే నక్షత్రం ప్రకారం పేరు పెట్టేస్తే, రేపు భవిష్యత్ లో పేరు అడగక్కరేలేదు. పేరు చెప్పగానే నక్షత్రం తెలుసుకుని, ఆపై మంచి చెడ్డా చెప్పేయడం. పైగా ఆ రోజుల్లో అందరికి జ్యోతిష్యం మీద అవగాహన, ఆసక్తి అంతగా వుండేవి కాదు కాబట్టి, పుట్టినతేదీ సంగతి పట్టించుకోలేదు.
కానీ ఇప్పుడు జ్యోతిష్యం అన్నిది కీలకం అయిపోయింది. అదో పెద్ద భయంకరమైన వ్యవసమైపోతోంది. దీన్ని ఆసరాగా చేసుకుని, ఎందరో మిడిమిడి జ్ఞానంతో తమకు తోచినది చెప్పడం పరిపాటి అయింది. పైగా జనం కూడా ఉన్నది ఉన్నట్లు చెబితే నమ్మరు. కాస్త ఆశాజనకంగా చెప్పాలి. దాంతో పాటు తాయత్తో, రక్షో, ఇంకోటో చేతిలో పెట్టి, కాసిన్ని డబ్బులు గుంజాలి. వారినే నమ్ముతారు. ఫలానా తేదీ నుంచి బాగుంటుంది అంటారు. ఎందుకు బాగుంటుంది అని అడిగితే, గ్రహస్థితి మారుతోంది అంటారు. మారే గ్రహం అనుకూలమ? ప్రతికూలమా? ఉచ్ఛమా..నీచమా..దశాంతర్దశల వ్యవహారం వివరించరు. కానీ దీని వల్ల జ్యోతిష్యం లాంటి అద్భుత శాస్త్రం కూడా మూఢ నమ్మకం అని ముద్రపడిపోయే ప్రమాదం కనిపిస్తోంది. సరే మళ్లీ ఈ సంగతి పక్కనపెట్టి, అసలు విషయానికి వస్తే, ఎవరికి వారు చక్కటి పేరు తమ తప పిల్లలకు పెట్జుకోవచ్చు. నక్షత్రం గుర్తు పెట్టుకోలేము అనుకున్న వారు మాత్రం నక్షత్రనామం పెట్టుకోవచ్చు. అంతే కానీ ఇందుకోసం తమ తమ అభిరుచులను పక్కన పెట్టనక్కరలేదు. నక్షత్రనామం పెట్టాలని చెప్పే సిద్ధాంతులు కూడా ఈ మర్మం చెప్పి, సూచనలు ఇస్తే మంచిది.
విఎస్ఎన్ మూర్తి