
కణమై పుట్టి
అణువణువూ పెరిగి
ఆకాశాన్నందుకుని
విశ్వ రహస్యాలు
ఛేదింప పూనుకుని
ప్రకృతి రహస్యాలను
అవపోశన పట్టి
సకల శాస్త్రాలను పుక్కిట పట్టి
సమస్త ఆయుధాలనూ చేతబట్టి
మేధస్సనే పంచకళ్యాణి నధిరోహించి
స్వైరవిహారానికి
కాలూనితివా మానవా?
ముందుకురుకుతున్న
నీచూపులకి
నీ వెనుక పరచుకుంటున్న
నీలి నీడలు కాన రాలేదా?
నేడు మానవ జాతి అనుభవిస్తున్న
సకల బాధల పరంపరకూ
మానవ తప్పిదమే కారణమని
గ్రహించితివా?
ఇకనైనా కళ్ళు తెరవాలి
చరిత్రపుటలు తిరగ రాయాలి
లేకుంటే చరిత్రలో కలిసిపోగలవ్
బహు పరాక్ బహు పరాక్
----అనంతాభిరుచి