మన వ్యక్తిత్వం మనం చేసే ప్రతి పనిలోనూ కనపడుతుంది. మాటలో, చేతలో, నడకలో ఇలా మన ప్రతి కదలిక మన వ్యక్తిత్వాన్ని ప్రతిబింబిస్తుంది. దీనిని గురించి వివరణనే 'Body Language' అని అంటుంటారు. అనటమే కాకుండా, దాని మీద అనేకమంది పుస్తకాలు కూడా వ్రాసారు. కాల్పనిక నేర పరిశోధనా రచయిత, Sherlock Holmes సృష్టికర్త అయిన Sir Arthur Conan Doyle ను గురించి మీరు వినే ఉంటారు. వీరు స్కాట్లాండ్ కు చెందినవారు. ఈయన May22, 1859న జన్మించారు. July7,1930న మరణించారు. వీరు అనేక నేర పరిశోధక నవలల సృష్టికర్త. Detective నవలా ప్రపంచానికి ఆరాధ్యుడు. చాల సునిశిత దృష్టి కలవారు. ఒక మనిషిని చూస్తే అతని వృత్తి, ప్రవృత్తి ఇట్టే చెప్పగల సమర్ధుడు.
ఒకరోజున, వారు తన స్నేహితుడి ఇంటికి వెళ్ళారు. స్నేహితుడు ఒక్కడే ఉన్నాడు. కుశల ప్రశ్నల అనంతరం, ఇద్దరూ పోర్టికోలో కూచొని కాఫీ త్రాగుతూ పిచ్చాపాటి మాట్లాడుకుంటున్నారు. ఆ సందర్భంలో స్నేహితుడు, Arthur Conan Doyle ను ఒక ప్రశ్న వేసాడు.అదేమిటంటే! "నీవు ఒక ప్రఖ్యాత Detective నవలా రచయితవు. ఎన్నో అపరాధ పరిశోధనలను, చిటికెలో పరిష్కరించే సమర్ధత కలవాడవు.అందులో ఏ మాత్రం సందేహం లేదు. నీ సునిశితమైన బుద్ధిని నేను ప్రత్యక్షంగా చూడాలనుకుంటున్నాను. నేనొక విషయాన్ని గురించి వివరణ అడుగుతాను, వెంటనే సమాధానం చెప్పాలి " అని అన్నాడు.
Arthur Conan Doyle చిరునవ్వుతో అందుకు అంగీకరించాడు. స్నేహితుడు రోడ్డు మీద నడచి వెళ్ళుతున్న ఒక మనిషిని చూపించి --"అతను ఎవరు? అతని వృత్తి,ప్రవృత్తి, జీవన విధానం గురించి క్లుప్తంగా చెప్పు!" అని Arthur Conan Doyle ని ఒక చిక్కు ప్రశ్న వేసాడు. Arthur Conan Doyle రోడ్డు మీద నడచి వెళ్ళుతున్న ఆ మనిషిని ఒకసారి నిశితంగా పరిశీలించి, వెంటనే ఇలా చెప్పాడు "అతను ఒక Ex-Serviceman, మిలటరీలో కొంతకాలం పనిచేసాడు, భార్య లేదు,పిల్లలున్నారు.కుటుంబ భారమంతా అతనే చూసుకుంటాడు.నేను చెప్పినది నిజమో కాదో, పరిశీలించదలిస్తే, వెంటనే వెళ్లి అతనినే వివరణ అడుగు" అని Doyle చెప్పాడు.స్నేహితుడు, రివ్వున వెళ్లి, ఆ వ్యక్తి వివరాలు తెలుసుకొని వచ్చి ఆశ్చర్యంతో Doyle ను"నీవు చెప్పినది అంతా నిజమే! అంత కచ్చితంగా ఎలా చెప్పకలిగావు?" అని Doyle ని అడిగాడు. అప్పుడు Doyle ఈ విధంగా చెప్పాడు" అతని దేహం బలిష్టంగా ఉంది.మంచి క్రమశిక్షణతో నడుస్తున్నాడు. అతను వేసే ప్రతి అడుగు అతని నిర్భయత్వాన్ని సూచిస్తుంది. దాన్ని బట్టి అతను ఒక Ex-Serviceman గా గుర్తించాను.
గడ్డం మాసిపోయి ఉంది, ముఖంలో కొంత నిరాశ కనపడుతుంది. చేతిలో పుస్తకాలు, కారేజీలు తీసుకొని వెళ్ళుతున్నాడు. ఈ పనులు మనదేశంలో భార్యలు చేస్తుంటారు. ఆ పని ఇతను చేస్తున్నాడంటే,అతనికి భార్య లేదన్న మాట.ఇక చేతిలోని పుస్తకాలు, కారేజీలు తీసుకొని వెళ్ళుతున్నాడంటే పిల్లలు ఉన్నారన్న మాట!" Doyle చెప్పినవన్నీ నిజం కావటంతో ఆశ్చర్యపోవటం స్నేహితుని వంతు అయింది. వెంటనే స్నేహితుడు "అలా చెప్పటం పెద్ద గొప్ప విషయం మేమీ కాదు.నేను కూడా చెప్పగలను.కావాలంటే రోడ్డు మీద గొడుగు వేసుకొని విచారంగా వెళ్ళుతున్న ఒక స్త్రీని చూపించి.ఆమె ఎవరో, నేనూ చెప్పగలను, కావాలంటే విను!" ఆవిడ ఒక వివాహిత స్త్రీ.ఉపాధ్యాయురాలిగా పనిచేస్తుంది. కుటుంబ భారమంతా తనే భరిస్తుంది. భర్త ఒక చవట!"అని చెప్పి, కావాలంటే వెళ్లి విచారించు అని Doyle తో చెప్పాడు.
Doyle రివ్వున వెళ్లి ఆమెను వివరాలన్నీఅడిగి తెలుసుకొని వచ్చి ఆశ్చర్యంతో స్నేహితుణ్ణి ఇలా అడిగాడు "నీవు కూడా అంత కచ్చితంగా ఎలా చెప్పకలిగావు?" అని. అందుకు స్నేహితుడు ఇలా చెప్పాడు "ఆ చవట భర్తను నేనే! ఆవిడ,మా ఆవిడే!" అని. స్నేహితులు ఇద్దరూ మనసారా నవ్వుకున్నారు.
Sir Arthur Conan Doyle ను స్మరించుకుంటూ.ఇప్పటికి ఇంతే!
టీవీయస్.శాస్త్రి