పైసా ఖర్చులేని పని... - భమిడిపాటి ఫణిబాబు

paisa kharchuleni pani

ప్రపంచంలో ఏపని చేయాలన్నా, ఏదో ఒకటి ఎంతో కొంత ఖర్చుపెడుతూండాల్సొస్తుంది. ఓ వస్తువు కొనాలంటే డబ్బులుండాలి. ఓ పని చేయాలంటే కాస్తోకూస్తో ఓపిక ఉండాలి. వయసు మీదపడ్డ తరువాత  కొన్నేమిటిలెండి, చాలా పనులు చేయలేకపోతారు. నా ఉద్దేశ్యమేమిటంటే చేతిలో డబ్బైనా ఉండాలి, లేదా ఏదో ఒకటి చేయాలనే సంకల్పమైనా ఉండాలి. సంకల్పమంటూ ఉంటే, ఏదో తిప్పలు పడో, లేదా ఇంకోరి సహాయం తీసికునో మొత్తానికి ఎలాగోలా పని పూర్తిచేస్తారు.

పైన చెప్పిన రెండింటి అవసరమూ లేకుండా, ఒక్క పైసా అయినా ఖర్చుపెట్టకుండా, ఈ లోకంలో చేయగలిగిన ఏకైక మహత్తర కార్యం ఏమిటంటే, ప్రతీదానిమీదా విమర్శించేయడం. దానికో అర్ధం పర్ధం ఉండాల్సిన అవసరం లేదు. ఆ భగవంతుడిచ్చిన నోరొక్కటీ చాలు. ఆ మాట్టాడేది ఎవరైనా వింటున్నారా లేదా అన్నదానితో పనిలేదు. పోనీ ఈ మనిషి మాట్టాడేదానితో ఒక్కడైనా ఏకీభవిస్తున్నారా అన్నదానితో కూడా పనిలేదు. మాట్టాడ్డం ముఖ్యం. పైగా ఒక విషయమనుండదు, ఏ రంగం గురించైనా మాట్టాడగలరు. వీళ్ళనే Easy chair critics అంటారు. ఇదివరకటి రోజుల్లో ఇంటి అరుగుమీద ఓ పడక్కుర్చీలో కూర్చుని, రోడ్డుమీద వచ్చేపోయేవాడిదగ్గర ఏదో ఒకటి వాగేయడం. పాతరోజుల్లో రోడ్డూ, అరుగూ పక్కపక్కనే ఉండేవి, ఈ రోజుల్లో అంటే అవేవో గేటెడ్ కమ్యూనిటీలూ అవీ వచ్చేసి, అరుగులూ, మనుష్యులూ కనుమరుగైపోయారు. అయితేనేమిటిలెండి, నోరంటూ ఉంటే చాలదూ. వినడానికేముందీ, అదేదో జంధ్యాల గారి సినిమాలో లాగ, పాల పాకెట్లిచ్చేవాడితో చెప్పొచ్చు, రోడ్డు పక్కనుండే చెప్పులు కుట్టేవాడితో చెప్పొచ్చు. చెప్పడం ముఖ్యం కానీ, శ్రోతలెవరైతే ఏమిటీ? తెలుగేతర రాష్ట్రాల్లో అయితే, పరభాషలో మాట్టాడాల్సొస్తుంది, అదెవడు నేర్చుకుంటాడు మళ్ళీ? ఏదో మాతృభాషకే పరిమితం చేసికుంటాడు. అయినా ఈ వ్యాసం తెలుగులోనే వ్రాస్తున్నాను కాబట్టి, ఆ "మహామహుల" గురించే చెప్పుకుందాం. విమర్శించడానికి మనకేమైనా అర్హతనేది ఉందా లేదా అనే ప్రశ్నే లేదు. పోనీ, మనం మాట్టాడేదాంట్లో ఏదైనా పరిజ్ఞానం ఉందాలేదా కూడా పట్టించుకోనక్కర్లేదు. పైగా ఇంకో చిత్రం ఏమిటంటే , వీళ్ళకి ఒక టాపిక్కని లేదు. ఎక్కడ ఓ నలుగురు కలిసి మాట్టాడుకుంటున్నారో, అక్కడకి వెళ్ళిపోడం. అది ఓ బస్ స్టాండవొచ్చు, ఓ రైలు కంపార్టుమెంటవొచ్చు. ఏదైనా సరే. పోనీ ఎవరైనా వీరి అభిప్రాయం అడిగేరా లేదా అన్న ప్రశ్నే లేదు.

ఇంకో విషయం ఏమిటంటే, ఇంతలా "విజ్ఞాన ఖని" గా తయారవడానికి కూడా పైసా ఖర్చు ఉండదు. అదేమిటీ ఏదైనా విషయం గురించి మాట్టాడాలంటే కాస్తో కూస్తో చదవనైనా ఉండాలి, లేదా జన్మతహా వచ్చిన విషయపరిజ్ఞానమైనా ఉండాలేమో అనుకున్నారా పప్పులో కాలేసినట్టే. పైన చెప్పినట్టుగా పైసా ఖర్చు ఉండదని ఎందుకు విన్నవించుకున్నానంటే, ఇలాటివాళ్ళకి కావాల్సినన్ని మార్గాలు జ్ఞానం సంపాదించాలంటే. ఉదాహరణకి, ఏ క్షవరశాలకో ఏ శలవురోజో ప్రొద్దుటే వెళ్ళాడనుకోండి, అక్కడ అప్పటికే ఓ పేద్ద క్యూ ఉంటుంది. ఈ పెద్దమనిషిని చూడగానే "ఇదిగో అయిదునిముషాలు సార్.." అంటాడు కానీ, ఎలాగూ ఓ గంట పడుతుంది, ఈ లోపులో ఆ క్షవరశాలలో కాలక్షేపానికి పెట్టిన పాత పేపర్లూ, ఇక్ష్వాకులకాలంనాటి మాగజీన్లూ తిరగేయొచ్చు. కావాల్సినంత విజ్ఞానం, అవసరం వస్తే బట్టీకూడా పట్టేయొచ్చు, ఎక్కడో అక్కడ ఎవడో ఒకడిని తిట్టడానికి ఉపయోగిస్తుంది. ఇందులో ఒక చిన్న డేంజరుంది. వెళ్ళేది క్షవరం చేయించుకోడానికి కాదుగా, అదృష్టం బాగోక  ఆ కొట్టువాడు అంటకత్తెరేసేస్తే అదో గొడవ. అందువలన సమయం సందర్భం చూసుకుని క్షవరశాలలు మారుస్తూ ఉండాలి. ఈరోజుల్లో సందుకో డాక్టరూ, క్లినిక్కూనూ, అలాటి చోట్లకు వెళ్ళినప్పుడు కూడా పాత పత్రికలు చదివే సదుపాయం ఉంటుంది. కావాల్సినంత పరిజ్ఞానం.

ఈమాత్రం విజ్ఞానం ఉంటే చాలదూ? ఏదో కొట్టుముందర ఏ క్రికెట్ మాచ్చో చూస్తూ ఓ నలుగురు నుంచున్నారనుకోండి, జరుగుతున్న ఆటలో, ఏ ఆటగాడో క్యాచ్చిచ్చేసి అవుటయాడనుకుందాం, అంతే మన పెద్దమనిషి మొదలెట్టాడే. "అదేమిటండీ ఆ బాల్ అలాగా కొట్టడం, బ్యాక్ ఫుట్ మీదకి వెళ్ళి, డ్రైవు చేయాలికానీ, అలా అప్పనంగా క్యాచ్చిస్తారా... కవర్స్ లోకి కొట్టాలికానీ,ఇలా స్లిప్పులో ఆడతారా... ఏమిటో ప్రతీవాడూ టెస్టుల్లో ఆడేవాడే..." ఈయన మాట్టాడినది విని, మిగిలిన నలుగురూ ఆశ్చర్యపోతారు, ఈయనకి క్రికెట్టంటే ఎంతగా తెలుసో అని. కానీ మన మాస్టారికి బేస్ బాల్ కీ, క్రికెట్ కీ అంతగా తేడా తెలియదు. పైగా చాలా ఉదారంగా వాడేడే ఆ టెక్నికల్ పదాలు బ్యాక్ ఫుట్టు, కవర్, స్లిప్, డ్రైవు లాటివన్నీ ఆ క్షవరశాలలోనూ, డాక్టరుగారి వెయిటింగు రూమ్ములోనూ పాతపత్రికలు చదివి acquire చేసికున్న knowledge మాత్రమే అని గుర్తించాలి అధ్యక్షా...

ఏదో ఏ పెళ్ళిలోనో నలుగురైదుగురు కలిసి ఏదో చర్చించుకుంటున్నారనుకుందాం, వాళ్ళ మధ్యలో దూరుతాడు. వాళ్ళు ఏదైనా రోగం గురించో, కార్పొరేట్ ఆసుపత్రుల గురించో మాట్టాడుకుంటూంటే, వాటి గురించి-  "ఆ వెధవ ఆసుపత్రులండి, దోచేస్తున్నారు. మొన్నటికి మొన్న మా వాడొకడు గోరుచుట్టొచ్చిందని అదేదో (పేరెందుకులెండి, ఈయనకి మాత్రం తెలుసునా ఏమిటీ?) ఆసుపత్రికి వెళ్తే. గుండె ఆపరేషన్ దాకా తెచ్చారు. అదృష్టం బాగోబట్టికానీ, లేకపోతేనా..." కార్పొరేట్ ఆసుపత్రులకు వెళ్ళడమే పాపం అన్నంత లెవెల్ లో మాట్టాడేస్తాడు. ఇలాటివారికి ఊతపదాలు - నామొహం, వెధవదీ - అన్నవి. ఒక్కోప్పుడు దేన్నైనా విమర్శిస్తూన్నప్పుడు "నా మొహం" తో ప్రారంభించి "వెధవదీ" తో పూర్తిచేస్తాడు. మనకీ సందేహం వస్తుంది, ఏమిటీ ఈయన మొహం వెధవదా అని. ఆ విమర్శకుడికి ఇలాటి పట్టింపులు లేవనుకోండి అది వేరే విషయం.

ఇంక రైలుప్రయాణాల్లో అయితే ఈయనగారి నోటికి హద్దే ఉండదు. భారతదేశ పరిపాలనా విషయాలైతే ఈయనగారికి కొట్టిన పిండే. దేశ ప్రధాన మంత్రి దగ్గరనుండి, రాష్ట్ర ముఖ్యమంత్రిదాకా, ఎవరెవరు ఎన్నెన్ని wrong steps తీసికుంటున్నారో, దేశ ఆర్ధికవ్యవస్థ ఎందుకు భ్రష్టు పడిపోతోందో, రిజర్వు బ్యాంకుకి సంబంధించినంతవరకూ fiscal policy లో ఎన్నెన్ని లోపాలున్నాయో, ద్రవ్యోల్బణాన్ని ఎలా అరికట్టొచ్చో, 2014 ఎన్నికల్లో ఏ ఏ పార్టీలు అధికారంలోకి వస్తాయో, ఒకటేమిటి అసలు ఇలాటివారికి అధికారం ఇస్తే ఎంతబాగుండునో అనేటంతగా కబుర్లు చెప్పేస్తాడు.

ఈయన గోల భరించలేక ఎవరో టాపిక్కు మార్చి, ఫలానా పుస్తకం చదివేరా అనో, ఫలానా సినీమా చూశారా అనో అడిగేరే ఇంక చూసుకోండి, పేట్రేగిపోతాడు. "వాడి మొహం, వాడుకూడా పుస్తకాలు రాయడమే... నాతోటే చదివేడండీ, ఓ  పొట్టకోస్తే అక్షరమ్ముక్కుండేదికాదు, వాళ్ళ అమ్మానాన్నా ఎప్పుడూ నాతో చెప్పడమే, వీడినికూడా అప్పుడప్పుడు చూస్తూండమ్మా అని. అలాటివాడు ఇప్పుడు పుస్తకాలు రాస్తున్నాడుట, వాడే అచ్చేయించుకున్నట్టున్నాడు, లేకపోతే వీడి మొహం, వీడి పుస్తకాలు ఎవడచ్చేస్తాడండీ." అని తన ఖున్నస్సంతా కక్కుకుంటాడు. మరేం లేదూ, పుస్తక వితరణ కార్యక్రమంలో ఉచిత పుస్తకం దొరకలేదు అదీ ఈయనగారి దుగ్ధ.

ఇంక సినిమాలవిషయానికొస్తే , ఏదో శాపవశాత్తూ తనకి ఛాన్సు దొరకడంలేదు కానీ, దొరికితేనా ఈ ఇంటర్వ్యూలిస్తున్న దర్శకులేమూలకండీ, ఇంక నటనావకాశాలగురించైతే అడక్కండి.. "ఫలానా దర్శకుడైతే నాతోనే సినిమా తీయాలని ఒకటే గొడవ, నాకా పనులతో తీరికే ఉండడంలేదూ. ( ఎలా ఉంటుందీ, ఊళ్ళోవాళ్ళందరినీ తిట్టడంతోటే రోజులు గడిచిపోతున్నాయి!)"

ఇలా ఈ విశాలప్రపంచంలోని ఏవిషయం మీదైనా అనర్గళంగా తిట్టడానికి పెట్టుబడెందుకూ? హాయిగా ఆ భగవంతుడిచ్చిన నోరుంటే చాలదూ. కానీ ఈ Easy Chair Critics లాటివాళ్ళుండబట్టే కదండీ, మనకీ కాలక్షేపం, అదీ నయాపైసా ఖర్చుపెట్టక్కర్లేకుండా, సర్వేజనా సుఖినోభవంతూ...

మరిన్ని వ్యాసాలు

కల్పవృక్ష వినాయక స్వరూపం శిల్పి
కల్పవృక్ష వినాయక స్వరూపం శిల్పి
- కుందుర్తి నాగబ్రహ్మాచార్యులు
సంత్ నరహరి సోనార్
సంత్ నరహరి సోనార్
- కుందుర్తి నాగబ్రహ్మాచార్యులు
మా చార్ధామ్ యాత్ర
మా చార్ధామ్ యాత్ర
- కర్రా నాగలక్ష్మి
శివుడు నటరాజ మూర్తిగా మారడానికి ప్రేరకుడైన
మంకణ మహాముని కథ
- ambadipudi syamasundar rao
Viswakarma
విశ్వకర్మ
- శ్రీ కుందుర్తి నాగబ్రహ్మచార్యులు అద్దంకి
తొలి వలపు తొందరలు...
తొలి వలపు తొందరలు...
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు