
చిటికెన కిరణ్ కుమార్ Cell...9490 84 1284 *నేడు జాతీయ వృద్ధుల దినోత్సవం** *జీవిత చక్రంలో బాల్యం, యవ్వనం, వృద్ధాప్యం సహజం. ప్రతి దశలోనూ ఆనందంగా గడపాలని అభిలషిస్తారు.* పుట్టి, పెరిగి, బాధ్యతలు మోస్తూ చివరి దశకు చేరుకుంటారు. కుమారులు, కూతుళ్లకు ఓ బాట చూపించి.. మనవళ్లు, మనవరాళ్లతో కబుర్లు చెబుతూ గడిపే సమయం ఇది. ఆ వయసులోనూ వారి ఆలోచనలు వారసుల గురించే. వారికి ఏ కష్టం రాకూడదని, జీవితాంతం హాయిగా ఉండాలని పరితపిస్తుంటారు. ఆ ఆరాటంలో కొన్ని విషయాల్లో తలదూరుస్తుంటారు. అనుకున్నది చెప్పేస్తుంటారు. *చాలా మందికి వృద్ధాప్య దశలో ఉన్న తల్లిదండ్రుల సలహాలు నచ్చవు. వారిని ఇంట్లో నిరుపయోగంగా ఉన్న ఒక వస్తువులా భావిస్తుంటారు. ఇది వృద్ధులకు శాపం లాంటిది. పిల్లలు తమను పలకరించాలని, తమతో కొంత సమయం గడపాలని వృద్ధులు కోరుకుంటారు. కానీ మారుతున్న కాలం, వేగవంతమైన జీవన విధానం వారిని తెరచాటుకు నెట్టేస్తున్నాయి.* వారి త్యాగాలపై నిర్మించుకున్న జీవితాల్లో వారికే చోటు దొరకడం లేదు. ఊతకర్రల సాయంతో నడివీధుల్లోకి ఉన్న అభాగ్యులు ఎందరో..! ఒక్కపూట అన్నం పెట్టలేక, ఆలనా పాలన చూడలేక కొందరిని ఆశ్రమాల్లో వదిలేస్తున్నారు. ఈ నేపథ్యంలో వృద్ధుల పట్ల నిరాదరణ తగ్గించేందుకు, *వారి సంరక్షణ కోసం కేంద్ర ప్రభుత్వం ఆగస్టు 21ని ‘జాతీయ వృద్ధుల దినోత్సవం’గా ప్రకటించింది. 2007లో తల్లిదండ్రులు, పెద్దల పోషణకు సంక్షేమ చట్టం చేసింది.*