జవహర్ బాలభవన్
నా పన్నెండవ ఏట హైదరాబాద్ పబ్లిక్ గార్డెన్‌లో ఉన్న జవహర్ బాలభవన్‌లో చేర్పించారు మా నాన్న గారు.
అక్కడ పిల్లల్లకు అనేక విభాగాలలో శిక్షణ ఇచ్చేవారు, అయితే ఒక్కొక్కరు మూడు విభాగాలలో మాత్రమే పాల్గొనాలి.
సెలవు రోజుల్లో అయితే ఉదయం తొమ్మిది గంటలకు వెళ్లి మధ్యాహ్నం వరకు బంకమన్నుతో బొమ్మలు తయారు చేయడం, తబలా నేర్చుకోవడం ఇంటికి వెళ్ళి భోజనం చేసి విశ్రాంతి తీసుకుని మళ్లీ సాయంత్రం నాలుగు గంటలకల్లా బాలభవన్‌కు హాజరు అయ్యేవాడిని.మా ఇల్లు చాలా దగ్గరలో వుండేది.
సాయంత్రం స్విమ్మింగ్ నేర్చుకునే వాడిని.
సమయం చిక్కినప్పుడు బాలభవన్ బయట పిల్లలమంతా రకరకాల ఆటలను ఆడుకునేవాళ్లం.
ఒక రోజు కొంతమందితో బాలభవన్ వెనుక వైపు కాళీ స్థలంలో క్రికెట్ ఆడుతున్నాము. ఆట బాగా సాగుతోంది. మొదటి జట్టు ఆట అయిపోయింది. రెండవ జట్టు ఆటలో నేనున్నాను. అవతలి జట్టు పిల్లాడు వేసిన బంతిని బ్యాట్‌తో గట్టిగా బాదాను ఇంకేముంది ఆ బంతి వెళ్లి మా బాలభవన్ డైరెక్టర్ కూర్చున్న గది కిటికీకి తగిలి అద్దం పగిలిపోయింది.
ఆ చప్పుడుకు వాచ్‌మాన్ పరుగెత్తుకొచ్చాడు. కొందరు పారిపోయారు నాతో పాటు ముగ్గురు మిగిలారు మమ్మల్ని అతను మేడమ్ వద్దకు తీసుకెళ్లాడు.
“ఎవరు చేశారు ఈ పని?” గద్దించారు మేడమ్ గారు.
“నేను కొట్టిన బంతికే కిటికీ అద్దం పగిలింది మేడమ్!” అన్నాను వినయంగా.
“రేపు మీ నాన్న గారిని రమ్మని చెప్పు అద్దం ఖరీదు చాలా ఎక్కువ అది కట్టాల్సి ఉంటుంది” అన్నారు మేడం.
“మాతో పాటు క్రికెట్ ఆడిన వాళ్ళలో మీ తమ్ముడు కూడా ఉన్నాడు... అతను బంతి వేశాడు నేను కొట్టాను మేడమ్” అన్నాను ఎంతో ధైర్యంగా.
“వాడేడీ?” అన్నారు.
“పారిపోయాడు” అన్నాను.
“సరే మీరు వెళ్ళండి... రేపు మాట్లాడదాము” అన్నారు మేడమ్.
మరుసటి రోజు మమ్ములను పిలిచారు మేడమ్ గారు. అప్పుడు మేడమ్ గారి తమ్ముడు కూడా వచ్చాడు.
“ఏం జరిగింది చెప్పు?” అన్నారు మేడమ్ గారు ఆమె తమ్ముడితో.
“అవును అక్కా! నేను బంతి వేశాను వీడు కొట్టాడు” అని చెప్పాడు.
మేడమ్ గారి ముఖంలో రంగులు మారాయి.
“ఇది మొదటి తప్పుగా భావించి మీ అందరినీ వదిలేస్తున్నాను... ఇంకోసారి ఇలా జరగకూడదు” అని వార్నింగ్ ఇచ్చారు మేడమ్.
అలాగే అని చెప్పి మేమంతా నవ్వుతూ ఆ గది నుండి బయటకు వచ్చాము.