సుశాస్త్రీయం: సినీ పాటల శాస్త్రి - శ్రీ మల్లాది రామకృష్ణ శాస్త్రి గారు - టీవీయస్. శాస్త్రి

sri malladi ramakrishna sastrybiography

అది పద్యమైనా లేక గద్యమైనా. కథ అయినా, కవిత అయినా, సినిమా పాటైనా -- తెలుగు భాషా సుగంధ పుష్పం యొక్క పరీమళం నలుదెసలా వ్యాపింప చేసిన 'కథా మేస్త్రి' శ్రీ మల్లాది రామకృష్ణ శాస్త్రి గారు. ఆయన చేసుకున్న పాపం వల్ల, మనం చేసుకున్న పుణ్యం వల్ల వీరు తెలుగు రచయితగా పుట్టారు. ఇటువంటి కవి, మరే భాషలో ఉన్నా అంతర్జాతీయ ఖ్యాతి పొంది ఉండేవాడు. ఆయన చేపట్టని సాహితీ ప్రక్రియ లేదు. చాలా సినిమా పాటలను కూడా వ్రాసారు. కానీ, కొన్ని మాత్రమే వీరు వ్రాసినట్లు ప్రచారంలోకి వచ్చాయి. వీరు శ్రీ సముద్రాల వారికి Ghost writer అని ప్రతీతి. సముద్రాల వారికి పేరు ప్రఖ్యాతులు కావాలి, వీరికి డబ్బు కావాలి. తన ఆర్ధిక దుస్థితి వల్ల తన సాహితీ సంపదను కుదువ పెట్టిన దీన రచయిత!

మద్రాసులోని పానగల్ పార్క్ చూసినప్పుడల్లా అందరికీ గుర్తుకు వచ్చే మొదటి వ్యక్తి శ్రీ రామకృష్ణ శాస్త్రి గారు. అటు తర్వాత గుర్తుకు వచ్చేది శ్రీ శ్రీ గారు. పానగల్ పార్క్ లోని సిమెంట్ బల్లలపై కూర్చుని, వేరు శనగ కాయలు తింటూ, ఎవరు 'కూలీ'కి పిలుస్తారా అని ఎదురు చూసే 'మేస్త్రీ' ఈయన. Ghost writer గా పనిచేసినా, సొంతగా పాటలు వ్రాసినా ఒకే రకంగా వ్రాసే సమదృష్టి గల రచయిత. ఆయన పేరు ప్రఖ్యాతుల కోసం ఎప్పుడూ పాకులాడలేదు. తనకు ఇచ్చిన ప్రతి రూపాయికి వరహాలవంటి పాటలు వ్రాసిన ఈ కవితా(కథా) సంపన్నుడికి తెలుగు వారెంతో ఋణపడి ఉన్నారు. 'సంతకం' అక్కరలేని పాటలు ఆయనవి. ఆయన వేసిన ముద్ర మన గుండెల్లో పదిలంగా ఉంది.

తెలుగు వారికి చిరకాలం గుర్తుండే పాట అయిన 'కుడి ఎడమైతే పొరపాటు లేదోయ్'(పాత దేవదాసు సినిమా లోనిది), సముద్రాల వారు వ్రాసినట్లు సినిమాలో ప్రకటించినప్పటికీ, ఆ పాట అసలు రచయిత శ్రీ రామకృష్ణ శాస్త్రి గారేనన్న విషయం సినీ పండితులందరికీ తెలుసు. తరువాత చాలా కాలానికి ఆ పాట అసలు, సిసలు రచయిత మల్లాది వారేనని అందరికీ తెలిసిపోయింది. ఆ పాటను గురించి అంతరార్ధాన్ని వేదాంత భాషలో ఎంత గొప్పగా చెప్పారో చూడండి. తెలుగు భాషలో 'కుడి' అంటే శరీరం అనే అర్ధం కూడా ఉంది. 'యోగం' మరియూ 'ధ్యానం' అంటే పూర్తి అవగాహన ఉన్నవారికి, ఆ'కుడి' యే ఒక గుడి. (దేవులపల్లి వారు వ్రాసిన. అడుగడున గుడి ఉంది, అందరిలో గుడి ఉంది... అనే పాట గుర్తుకు వచ్చింది). ఇక 'ఎడం' అంటే దూరం. శరీరం విడిపోయినంత మాత్రాన ఓడిపోయినట్లు కాదు. శరీరం పోయినా ప్రేమ మాత్రం ఎన్నటికీ ఓడదు. దేవదాసు తన్ను తాను ఓదార్చుకుంటూ పాడిన గొప్ప వేదనాభరితమైన గీతమది. పెళ్లి అనేది ప్రేమకు ముగింపు కాదు, కానేరదు! పార్వతిని పెళ్లి చేసుకోనంత మాత్రాన 'ప్రేమ యుద్ధం' లో తాను ఓడిపోలేదని, తన్ను తాను సముదాయించుకుంటాడు. మనం చాలా ప్రేమ కథా సినిమాలను చూసి ఉంటాం. తాదాత్మ్యం చెందుతామేమో గాని, దేవదాసు సినిమా మాత్రం మన గుండెల్ని పిండి కన్నీరు తెప్పిస్తుంది. ఇంత వేదాంతపరమైన పాటను వ్రాసిన ధన్యుడు శ్రీ మల్లాది. వీరి ప్రతి పాటకూ ఇంత అర్ధం చెప్పవలసినదే! అంత గొప్పపాటలు అవి.

చక్కని తెలుగు జాతీయాలను సందర్భానుసారంగా వాడుకోవటంలో దిట్ట ఈయన. ఇక వారు వ్రాసిన కథలను గురించి ఎవరైనా పరిశోధన చేసి Doctorate తెచ్చుకుంటే ఎంత బాగుండు! పామరులకు ఆయన సినీ గీతాలు అర్ధం కావని ఒక విమర్శ కూడా ఉండేది. అది నిజం కూడా! ఆ విమర్శను గురించి వారి మాటల్లోనే విందాం --- చదివిన వెంటనే అర్ధమయ్యేవి, చాలా త్వరలోనే మరచిపోతారు. చదువరిని ఆలోచింపచేసేవి వారి గుండెల్లో చిరకాలం నిలిచిపోతాయి. ఆయన పాటలే కాదు వాక్యాలు కూడా గీతాల లాగా గుబాళిస్తాయి. సినిమాలో, మాటలు, పాటలు రాయడానికి ముందు, పలు పత్రికల్లో వ్యాసాలు, కథలు రాసారు. నవలలు, నాటకాలు రాసి పేరు తెచ్చుకున్నారు. దర్శకులు గూడవల్లి రామబ్రహ్మం ‘పల్నాటియుద్ధం’ చిత్ర రచన విషయంలో సలహాల కోసం 1945లో మల్లాది వారిని మద్రాసుకు ఆహ్వానించారు. తొలిచిత్రం-పాట : చిన్నకోడలు (1952) - పిల్లనగ్రోవి పాటకాడ... ఆఖరిచిత్రం : వీరాంజనేయ (1968) (మల్లాదివారి కథల్లోంచి ఒక పాటను తీసుకొని అత్తగారు-కొత్తకోడలు (1968) చిత్రంలోవాడారు) పాటలు : 200 (39 చిత్రాలకు).

కృష్ణా జిల్లా మచిలీపట్నం సమీపంలో వీరు 17-06-1905 న జన్మించారు. తల్లిదండ్రులు -కనకవల్లి, నరసింహశాస్త్రి. తోబుట్టువులు-నలుగురు చెల్లెళ్లు (కృష్ణవేణి, మహాలక్ష్మి, వెంకటరమణ, మంగతాయారు), కృష్ణవేణి తర్వాత మగపిల్లలు కవలలు పుట్టి చనిపోయారు. మహాలక్ష్మి తర్వాత మరో మగశిశువు శ్రీనివాస్ ఏడాది పెరిగి చనిపోయారు. చదువు- ఎం. ఎ. ఆయనొక బాల మేధావి. వివాహం -1920, భార్య - వెంకటరమణ. సంతానం-ఇద్దరు కుమారులు (నరసింహశాస్త్రి, సూరిశాస్త్రి)ఇద్దరు కుమార్తెలు (రాజ్యలక్ష్మి, సర్వలక్ష్మి). తన పదహారవ ఏటనుండే ఆయన రచనలు చేయటం ప్రారంభించాడు. చాలా ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే, వీరికి పలు భాషలలో ప్రవేశమే గాక ప్రావీణ్యం కూడా ఉంది. సంస్కృతం, ప్రాకృతం, పాళీ, భాషలే కాకుండా, జర్మనీ, సింహళ, గ్రీకు భాషలలో కూడా వీరికి ప్రావీణ్యం ఉంది. ఆయన పాండిత్యాన్ని గురించి విన్న వారెవరికైనా ఆశ్చర్యం కలుగక మానదు. మల్లాది వారి పూర్వీకులు గూడూరు వాస్తవ్యులు. వీరి వంశానికి మూలపురుషుడు శ్రీ మల్లాది నారాయణశాస్త్రి గారు. వీరిది తరతరాలుగా పండిత వంశం. వీరి వంశంలో అయిదవ తరానికి చెందినవారు మల్లాది రామకృష్ణశాస్త్రి గారు. మల్లాదివారు ఏకసంతాగ్రాహి. కాలేజ్ లో చదువుకున్న రోజుల్లో ఆయనకు ‘విద్యాభూషణ‘ అనే బిరుదు ఉందనే విషయం చాలా మందికి తెలియదు.

మల్లాది వారి తొలికథ ‘భారతి‘లో ప్రచురించినప్పుడు వారి వయస్సు పదిహేనేళ్లు. అన్ని పత్రికలలో ఆయన కథలు, కథానికలు అచ్చవడం, వాటికి మంచిపేరు రావడం జరిగింది. వారు వేద విద్యను శ్రీ యడవల్లి సుబ్బావధాన్లు గారివద్ద, మహాభాష్యాన్ని శ్రీనోరి సుబ్రహ్మణ్యశాస్త్రి గారి వద్ద, బ్రహ్మసూత్రాలను శ్రీ శిష్ట్లా నరసింహశాస్త్రి గారి వద్ద నేర్చుకున్నారు. అలంకార, వ్యాకరణ తర్క శాస్త్రాలను పూర్తిగా అధ్యయనం చేసారు. అంతే కాదు ఖగోళ, జ్యోతిష్య శాస్త్రాలు కూడా వీరికి పూర్తిగా తెలుసు. నాట్యం, చిత్రలేఖనం, సంగీతం నందు కూడా ప్రవేశం కలదు. జీవితంలో ఇంకా నేర్చుకోవలసినవి ఎన్నో ఉన్నాయి, వాటినన్నిటినీ నేర్చుకోవాలనే తపన వీరికి తీవ్రంగా ఉండేది. కానీ, దుర్భరమైన బీదతనం ప్రతిబంధకం అయింది. ఉదర పోషణార్ధం, ఉద్యోగ అన్వేషణ ప్రారంభించారు. వారి అభిరుచికి తగినం వృత్తినే వారు ఎంచుకున్నారు. 'దేశాభిమాని' అనే పత్రికకు ఉపసంపాదకుడిగా కొన్నాళ్ళు పనిచేసారు. తరువాత కృష్ణాపత్రికలో చేరారు. అక్కడ- నా కవిమిత్రులు, చలవమిరియాలు లాంటి చక్కని విమర్శనా వ్యాసాలను, ఆనాటి కవులను, కవితారీతులను దృష్టిలో ఉంచుకొని వ్రాసారు. శీర్షికలకు -- నా కవిమిత్రులు, చలవమిరియాలు అనే పేర్లు పెట్టంటంలోనే వారి సహృదయత కనపడుతుంది. మిరియాలు కొద్దిగా ఘాటుగా ఉన్నప్పటికీ చలవచేస్తాయి.

తరువాత మద్రాసు వెళ్లి సముద్రాల వారిని కలిసారు. వారినుండి సినిమాలకు ఎలా రచనలు చేయాలో తెలుసుకున్నారు. ఆ రోజుల్లో శ్రీ సముద్రాల గారి పేరు చూస్తే చాలు జనం సినిమాలను విరగబడి చూసేవారు. వారికి ఒక్క క్షణం తీరిక ఉండేదికాదు. శ్రీ సముద్రాల వారికి చాలాకాలం Ghost Writer గా పనిచేసారు. ఒక సందర్భంలో శ్రీ ఆరుద్ర గారు వీరి మీద అభిమానంతో ఇలా అన్నారు --- ఎవరికో పేరు వచ్చేటట్లు పాటలు వ్రాయటంలో ఏమి తృప్తి ఉంది? నీకు పేరు ప్రఖ్యాతులు ఎప్పుడు వస్తాయి?, అని ప్రశ్నించారు. అందుకు రామకృష్ణశాస్త్రి గారు ఈ విధంగా చెప్పారు -- రచించటం నాకు వృత్తి కాదు. అది నా ప్రవృత్తి. పేరు ప్రఖ్యాతుల కోసం నేను వ్రాయను. నా తృప్తికోసం వ్రాస్తాను. ఎవరికి పేరు వస్తే ఏమి పోయింది? మంచి సాహిత్యం వెలుగులోకి వస్తే అంతకన్నా ఆనందం ఏముంది? నీవు 'ఆరుద్ర' అనే పేరుతో వ్రాస్తున్నావు కానీ, 'శివశంకర శాస్త్రి' అనే నీ అసలు పేరుతో వ్రాయటం లేదు కదా! (శ్రీ భాగవతుల శివశంకర శాస్త్రి గారి కలం పేరు'ఆరుద్ర') దేవదాసు సినిమాకే కాకుండా, పల్నాటియుద్ధం, బాలరాజు, చిన్నకోడలు, రేచుక్క, చిరంజీవులు, దొంగరాముడు, సువర్ణసుందరి, రాజనందిని, దేశద్రోహులు, జయభేరి, రహస్యం, వీరాంజనేయ లాంటి పెక్కు సినిమాలకు మాటలూ, పాటలూ వ్రాసి, తెలుగు సినిమా సాహిత్యానికి ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చారు. జయసింహ చిత్రంలో 'నడిరేయి గడిచేనే చెలియా' అనే పాట రాసారు. 'కన్యాశుల్కం' చిత్రానికి 'చిటారు కొమ్మన మిఠాయి పొట్లం', బికారి రాముడు చిత్రానికి 'వాడేనే చెలి వాడేనే', రంగేళి లీలల నా రాజా, టాక్సీరాముడు చిత్రం కోసం రావోయీ రావోయీ మనసైన రాజా - వంటి పాటలు రాసారు. ఏరు నవ్విందోయ్ ఊరు నవ్విందోయ్, భలే భలే పావురమా గడుసుపావురమా, నీ సరి నీవేనమ్మా, అల్లవాడే రేపల్లెవాడే, చికిలింత చిగురు సంపెంగి గుబురు, ఎందాక ఎందాక ఎందాక అందాక అందాక అందాక, ఏనాటికైనా నీదాననే, మనసు నీదే మమత నాదే, నాదానవే నే నీవాడనే, మిగిలింది నేనా బ్రతుకిందుకేనా, తెల్లవారవచ్చే తెలియక నా సామి మళ్ళీ పరుండేవు లేరా, కనుపాప కరువైన కనులెందుకు... వంటి ఎన్నెన్నో పాటలు మల్లాది రామకృష్ణ శాస్త్రి ప్రత్యేకతలను వివరిస్తాయి.

వీరు వ్రాసిన ప్రతి పాట ఒక రసగుళిక. వారి సాహితీ విశ్వరూపం గురించి పూర్తిగా తెలుసుకోవాలంటే, వారి ప్రఖ్యాత గ్రంధం 'కృష్ణాతీరం' చదవవలసినదే! అందులో వారి వ్యక్తిత్వపు ఛాయలు 'అప్పన్న' అనే ఒక వినయ శీలుడి పాత్రలో పూర్తిగా కనిపిస్తాయి. వారిలోని చతురత, విశాలభావాలు, అభ్యుదయ భావాలు, మానవీయ దృక్పథం, వీటినన్నిటినీ చూస్తే ' అప్పన్న' పాత్ర వారిదేనని అనిపిస్తుంది. ఆ పాత్ర ద్వారా, ఆయన భార్య భర్తల సంబంధం, తల్లి తండ్రుల ఎడల బిడ్డల బాధ్యత, పిల్లల ఎడల మన బాధ్యత చాలా చక్కగా విశదీకరించి చెప్పారు. కులతత్వాన్ని పూర్తిగా వ్యతిరేకించారు. అలానే వారు వ్రాసిన 'తేజో మూర్తులు' అనే గ్రంధం కూడా విశేషమైన పేరు ప్రఖ్యాతులు పొందింది. విమర్శకుల ప్రశంసలు పొందిన గొప్ప గ్రంధమది. వారు పూర్తి చేయలేకుండా వెళ్ళిపోయిన మరొక్క గొప్ప గ్రంధం 'క్షేత్రయ్య'. షుమారుగా 200 లకు పైగా కథలు వ్రాసిన ఘనుడీయన. ఆయన వ్రాసిన, 'డు, ము, వు, లు' అనే కథ షుమారు పదిహేను భారతీయ భాషల్లోకి అనువదించపడ్డది. ఆ కథను కుదించి చెప్పటం చాలా కష్టం! అయినప్పటికీ, వీలు చూసుకొని మీకందరికీ పరిచయంచేస్తాను. వారు వ్రాసిన కథలలో, సర్వమంగళ, ద్రౌపదీవస్త్రాపహరణం, ఆనందవల్లి, కూతఘనం, శిలువ లాంటి ఎన్ని కథలను గురించి చెప్పను? ఆయన కథలన్నీ కృష్ణా తీరాన్నే నేపధ్యంగా తీసుకొని వ్రాసినవే! ఆ కథలు చదువుతుంటే పవిత్ర కృష్ణా జలాలలో స్నానం చేసిన అనుభూతిని పొందుతాం. అదే ప్రేరణతో, తరువాత కొంతమంది గోదావరీ తీరాన్ని నేపధ్యంగా తీసుకొని, గోదావరి కథలు, మా పసలపూడి కథలు లాంటివి వ్రాసారు.

వారి కథాగమనం చాలా విశిష్టంగా ఉంటుంది. ఒక పాత్రనుండి మరొక పాత్రలోకి మనలను నెమ్మదిగా తనదైన శైలిలో తీసుకొని వెళ్లుతారు. బాల్యంలోనే వీరి మేధస్సును గుర్తించిన ఆ నాటి ధనవంతుడైన పండితుడు శ్రీ పురాణం సూరిశాస్త్రి గారు మల్లాది వారి పేదరికాన్ని చూడకుండా వారికి తన కూతురుని ఇచ్చి వివాహం చేసారు. అ రోజుల్లో పురాణం సూరిశాస్త్రి గారు విదేశాల నుండి ఏ పుస్తకాన్ని తెప్పించినా దాన్ని రెండు కాపీలను తెప్పించే వారు. ఒకటి తనకు, మరొకటి తన అల్లుడైన రామకృష్ణశాస్త్రి గారికి. మామగారైన పురాణం సూరిశాస్త్రి గారిని ఆయన జీవితమంతా గుర్తుంచుకున్నారు. వారిపట్ల కృతజ్ఞతా పూర్వకంగా ఒక కుమారునికి ఆయన పేరే పెట్టారు. పెళ్ళైన తరువాత మద్రాసుకు వెళ్ళారు. అయితే, అక్కడ కాపురం పెట్టలేదు. మల్లాది వారి కుమారుడు వారి నాన్నగారిని చూడటానికి మద్రాసు వస్తే, ఆయనను కలుసుకోవటం కొరకు సముద్రాల(జూనియర్)ను వెంట పెట్టుకొని మద్రాసు అంతా కారులో తిరిగేవాడు. అయితే, ఆయన ఎక్కడా దొరికేవాడు కాదు. "ఎక్కడెక్కడ తిరిగినా సాయంత్రానికి పానగల్ పార్కుకు వస్తారు"అని చాలామంది చెప్పగా, వారిని అక్కడే కలిసేవారు. అక్కడ వారు అనర్గళంగా ఏదో ఒక విషయం మీద మాట్లాడుతుండేవారు. జనమంతా రోడ్ మీద నిలబడి వినేవారు. ట్రాఫిక్ అంతా ఆగిపోయేది. వారికి క్రమం తప్పని శ్రోతలు ఆరుద్ర, వి. ఏ. కె. రంగారావు గార్లు. వీరివురూ మల్లాదివారిని గురుసమానులుగా చూసేవారు. ఫ్రెంచీ, జపానీ లాంటి అనేక భాషలు కూడా తెలుసు. ఆయన గొప్ప మానవతావాది. కాళ్లకు వేసుకునే చెప్పులు ఎంత పాతవి అయిపోయినా, ఊడిపోతూ ఉన్నా, వాటిని తిరిగి కుట్టించుకుంటూ, బాగు చేయించుకుంటూ అవే తొడుక్కునేవారు. ''ఎందుకు పాతవాటితో అవస్థ పడటం'' అని మహారథి ప్రశ్నిస్తే ''చెప్పులు కుట్టేవాడికి పని పెట్టాలి కదా! అతడికి దానం చేస్తే తీసుకోడు మనం ఇవ్వకూడదు. పని చేయించుకుని ఏదైనా ముట్ట చెప్పాలి. కొత్త చెప్పులు కొనుక్కుంటే అతడి బతుకెలా గడుస్తుంది? రిపేరు చేయటం నా వల్లకాదు అని అతగాడు అన్నప్పుడే కొత్తవి కొంటాను'' అనేవారట.

ప్రముఖ రచయిత్రి శ్రీమతి అబ్బూరి చాయాదేవి గారు, వీరిని గురించి ఇలా అంటారు --- శ్రీనాధ మహాకవే మళ్ళీ శ్రీ రామకృష్ణశాస్త్రిగా పుట్టారని అనుకుంటాను. స్త్రీల సమస్యలను గురించి వీరూ తమ రచనలలో చలం, శ్రీపాద వారి తరహాలోనే ప్రస్తావించారు. చాలా నాటకాలు కూడా వ్రాసారు. వాటిలో ముఖ్యమైనవి -- గోపీదేవి, కేళీగోపాలం, బాల, మున్నగునవి. వివిధ అంశాల మీద ఎన్నో వ్యాసాలు వ్రాసిన మేధావి ఆయన. యక్షగానాలను గురించి ఆయన పరిశోధనాత్మకంగా వ్రాసిన పెక్కు వ్యాసాలు మరుగునపడిపోయాయి.

శ్రీ శ్రీ గారు శ్రీ మల్లాది రామకృష్ణశాస్త్రి గారి గురించి చెప్పిన మాటలు(శ్రీ రామకృష్ణ శాస్త్రి గారి సంస్మరణ సంచిక నుండి) --- తనను చంపినవాడికి ఉరిశిక్ష వెయ్యకుండా వదిలివెయ్యమని గాంధీగారు కోరినప్పటికీ, గాడ్సేను ఉరితీయటం మనకు తెలిసినదే!అలాగే శ్రీ మల్లాది వారు తన మరణానంతరం స్మారక సంచికలు వెయ్యటానికి సుతరామూ ఇచ్చగించక పోయినా మన విధి మనం నిర్వహించక తప్పదు. ఈ సందర్భంలో ఒక ఆప్తమిత్రుడికి నా శ్రద్ధాంజలి సమర్పించటానికే ఈ రెండు ముక్కలు రాస్తున్నాను. మొదటి ముక్క ఏమిటంటే, నేను ఆ రోజుల్లో రాసే గేయాల్లో కొన్ని ముక్కలను శీర్షికలుగా స్వీకరించి చక్కని కథలుగా మలిచాడాయన. 'ఔను నిజం, లేదు విషం' ఇత్యాదులు. అప్పటికి మేము పత్రికాముఖంగానే గాని, ముఖాముఖి కలుసుకోలేదు. 30 ఏళ్ళకు పైమాటే అనుకుంటాను---నేను శ్రీ రామకృష్ణశాస్త్రి గారిని కలుసుకొని. అయితే, అది బందరులోని'నవ్య సాహిత్య పరిషత్' సభల్లోనో లేక బెజవాడలోముద్దుకృష్ణ 'జ్వాల' గోల మద్యనో అనేదో జ్ఞాపకం లేదు. తేదీ తెలియని కాలంలో, పేరు తెలియని పట్టణంలో మేము కలుసుకున్నాం. ఇంతకంటే స్పష్టతకోసం ప్రయత్నిస్తే, జ్ఞాపకాన్ని చిత్రవధ చేసినట్లే అవుతుంది. ఎటువంటి క్లిష్టమైన భావాన్నైనా తెలుగులో ఇట్టే సులువుగా చెప్పేయొచ్చునని, మా మారేపల్లి రామచంద్రశాస్త్రి గారు అంటూ ఉండేవారు. దానిని ఆచరణలో చూపించిన వారు శ్రీ రామకృష్ణశాస్త్రి గారు. ఎంతవరకు కృతకృత్యుణ్ణి అయ్యానో తెలియదు కానీ, కవిత్వంలో నేను లక్ష్యంగా పెట్టుకుంది ఇదే! 30 ఏళ్ళుగా ఇద్దరం మద్రాసులో ఉన్నా కలుసుకున్న సమయాలు కొద్ది. ఎప్పుడూ ఆయన నన్ను, 'మంచి కవిత్వం రాసావు' అని వెన్నుతట్టలేదు. 'ఆహా! ఏమి గొప్ప కథలండీ మీవి'అని నేనూ మాటవరసకైనా అనలేదు. ఆ అనకపోవటంలోనే అనటం ఉంది. మల్లాది వారి రచనలను మదింపువెయ్యటం నా ఉద్దేశ్యం కాదు. అలా చెయ్యబోవటం అవినయం.
మరో నూరేళ్ళ తర్వాత కూడా తరిగిపోని నైగనిగ్యం వారి రచనల్లో వుంది. ప్రత్యేకంగా కథా సాహిత్యంలో వారి కృషిని వర్ణించటానికి ఒకేఒక విశేషణం దానంతట అదే నా మనసుకు స్ఫురిస్తుంది. MONUMENTAL అన్నదే ఆ విశేషణం. కొన్ని పాలరాతి వాస్తు శిల్పాలు, కొన్ని చందనపు చెక్కలతో చేసినవి, మరికొన్ని కంచు విగ్రహాలు. కానీ, వాస్తు శిల్పకళాకారులకు సాధ్యంకాని పనిని ఈ సాహిత్య కళాకారుడు చేసాడు. అదేమిటంటే, నీళ్ళతోనూ, గాలితోనూ కూడా MONUMENTAL CREATIONS చేసాడాయన. అదే శ్రీ మల్లాది రామకృష్ణశాస్త్రి గారి విశిష్టత.

శ్రీ మల్లాదిని గురించి కొందరు ప్రముఖులు--

శ్రీ తాపీ ధర్మారావు -- సినిమా పాటకు కావ్య గౌరవం కల్పించిన మహాకవి శ్రీ మల్లాది.
శ్రీ పింగళి -- శ్రీ మల్లాది వారి లేఖిని నుండి వెలువడిన సంతత సారస్వత ధారావాహినికి జోహార్!ఆయన అనర్గళ వాక్చాతుర్య సౌశీల్యానికి కైమోడ్పు.
శ్రీ శ్రీ -- తెలుగు సినిమా పాటకి సాహిత్య ప్రశస్తి సంతరించిన ఆద్యులలో ప్రముఖుడు శ్రీ మల్లాది.
శ్రీ దాశరధి -- అతని శైలిలోన అమృతాలు తొణుకాడు, నతని పలుకులందు నలరులలరు.
శ్రీ నారాయణ రెడ్డి -- శ్రీ మల్లాది వారి ప్రతి పదబంధం మధు నిష్యందం.
శ్రీ వేటూరి -- ఆయన పలుకులోంచి అమృతం పుట్టింది. అది తెలుగు సినిమా పాటను చిరంజీవిని చేసింది.
శ్రీ వెన్నెలకంటి -- ఆంద్ర సాహిత్యానికి కవిత్రయం నన్నయ్య, తిక్కన, ఎర్రన అయితే, తెలుగు చలనచిత్ర సాహిత్యానికి కవిత్రయం సముద్రాల, పింగళి, మల్లాది.
బాపు-రమణలు -- వచన రచనకు మేస్త్రి రామకృష్ణ శాస్త్రి. తక్కువ సినిమాలకు రాసినా విశిష్ట రచనలే ఎక్కువ చేసారాయన.


****    ****    ****    ****

వారి వ్యక్తిగత జీవితం దుర్భరం అయినది. వారి భావాలు నచ్చకనో లేక వారికి కలిగిన వేదాంత ధోరణి వల్లో, భార్యా భర్తలు విడిపోయారు. ఆయన జీవితంలోని విషాదమంతా దేవదాసులోని పాటలో ప్రతిబింబిస్తుంది. అన్నిటినీ, అందరినీ పోగొట్టుకొని, 'తన వారు పరులైన' జీవితాన్ని అనుభవించిన ఈ దురదృష్టవంతుడు దుర్భర దారిద్ర్యం అనుభవించి 12-09-1965 న మరణించారు.

తెలుగు సినిమా పాటకు సాహితీ సొగసులు కూర్చిన ఈ మహనీయునికి నా శ్రద్ధాంజలి!!

 

మరిన్ని వ్యాసాలు

కల్పవృక్ష వినాయక స్వరూపం శిల్పి
కల్పవృక్ష వినాయక స్వరూపం శిల్పి
- కుందుర్తి నాగబ్రహ్మాచార్యులు
సంత్ నరహరి సోనార్
సంత్ నరహరి సోనార్
- కుందుర్తి నాగబ్రహ్మాచార్యులు
మా చార్ధామ్ యాత్ర
మా చార్ధామ్ యాత్ర
- కర్రా నాగలక్ష్మి
శివుడు నటరాజ మూర్తిగా మారడానికి ప్రేరకుడైన
మంకణ మహాముని కథ
- ambadipudi syamasundar rao
Viswakarma
విశ్వకర్మ
- శ్రీ కుందుర్తి నాగబ్రహ్మచార్యులు అద్దంకి
తొలి వలపు తొందరలు...
తొలి వలపు తొందరలు...
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు