మేకపిల్ల..!
(మధుర జ్ఞాపకాలు)
అప్పుడు నేను నాల్గవ తరగతి చదువుతున్నాను. మేము వరంగల్ ఆజంజాహీ మిల్స్ కాలనీకి ఎదురుగా లక్ష్మీపురంలో ఉండే వాళ్ళం.
‘లక్ష్మీ సినిమా టాకీసు’ వెనుకాల వాటర్ ట్యాంక్ కు ఎదురుగా ఉండే పాఠశాలలో చదివే వాణ్ణి. దానిని అంతా ‘నీళ్ళటాకీ బడి’ అనే వారు. మా ఇంటి నుండి బడికి పోనూ, రానూ దాదాపు నాలుగు కిలో మీటర్ల దూరం నడవాల్సి వచ్చేది. వివిధ తరగతుల్లో చదివే స్నేహితులతో కలిసి నడవడం సరదాగా ఉండేది. నాకు నడిచిన అలసట తెలిసేది కాదు.
అప్పటి మన ప్రధానమంత్రి జవహర్లాల్ నెహ్రూ గారు వరంగల్ కు వస్తున్న సందర్భంలో.. ఆ రోజు వరంగల్ పట్టణం సాంతం సెలవు దినంగా ప్రకటించారు.
బహిరంగసభ సాయంత్రం ఐదు గంటలకు ఆజంజాహీ మిల్స్ మైదానంలో ఏర్పాటు చేశారు. స్నేహితులమంతా కలిసి మాకు ఫర్లాంగు దూరంలో ఉన్న, నెహ్రూ గారు వచ్చే దారిలో మధ్యాహ్నం రెండు గంటలకే వెళ్ళి నిలబడ్డాం. అందరిలో ఉత్సాహం పెల్లుబికి పోతోంది. వారి రాక కోసం ఒళ్ళంతా కళ్ళు చేసుకుని చూడసాగాం.. సమయం నాలుగున్నర దాటింది.. పోలీసులు హడావుడి మొదలయ్యే సరికి సముద్రపు అలల్లా.. ప్రజల ప్రవాహపు తరంగాలు ఉవ్వెత్తున ఎగిసి పడ్తున్నాయి. నెహ్రూ గారు వస్తున్నట్లు సంకేతంగా..
ఆ జనసంద్రాన్ని చూసి నాలో ఆందోళన మొదలయ్యింది. నేను నెహ్రూ గారిని చూడగలుగుతానో! లేదోనని బిక్కముఖమేశాను. ఇంతలో ఓపెన్ టాప్ జీపులో నెహ్రూ గారు తెల్లని దుస్తుల్లో మెరుస్తూ.. నిలబడి అందరికీ రెండు చేతులా నమస్కరిస్తూ.. వస్తున్నారు. నాకు ఎక్కడలేని సంతోషం కలిగింది.. ఎగిరి గంతులు వేస్తూ.. వారిని తదేకంగా చూస్తూ.. జీపు కనుమరుగయ్యేంత వరకు రోడ్డు ప్రక్కన పరుగెత్తాను.
నెమ్మదిగా నడచుకుంటూ.. స్నేహితులమంతా సభాప్రాంగణానికి చేరుకున్నాము. అది నాజీవితములో మర్చి పోలేని రోజు.. ఆదృశ్యం ఇంకా నాకళ్ళల్లో మెదులుతూనే ఉంది.
***
ఆ ఆతరువాత వచ్చిన వేసవి సెలవులవి. మిట్టమధ్యాహ్నం.. నా స్నేహితులెవరూ బయట కనబడ్డం లేదు. సాయంత్రానికి గాని మా ఆట పాటలు ఆరంభంకావు. మా అమ్మ భోజనం చేసి పడుకుంది. నాకు ఎటూ తోచడం లేదు..
మా వీధికి వెనుకాల ‘ఫుడ్ కార్పోరేషన్ ఆఫ్ ఇండియా’ వారి ధాన్యం నిలువ చేసే పెద్ద, పెద్ద గోదాములు నాలుగు ఉన్నాయి. అందులో ఎక్కువగా బియ్యం, గోధుమలు, జొన్నలు నిలువ చేస్తుంటారు. అప్పుడే రెండు లారీలు రావడం గమనించి గోదాములవైపు పరుగు తీశాను.
నేను వెళ్ళే సరికి హమాలీలు హుషారుగా పాటలు పాడుకుంటూ.. బస్తాలను గోదాములోకి చేరుస్తున్నారు. బస్తాలు కదిలిస్తూ.. ఎత్తుకున్నప్పుడల్లా, పచ్చజొన్న గింజలు కొన్ని రాలుతున్నాయి. వానిని తినడానికి కొన్ని మేకపిల్లల ఒకదానిని మరొకటి తోసుకుంటూ వచ్చి పోటీ పడ్తున్నాయి. అదృశ్యం చూస్తూ.. నేనెంతగానో మురిసి పోతున్నాను. ఇంతలో ఒక హమాలీ..
“బాబూ! మేక పిల్లలను తరిమెయ్యి “ అంటూ నాకు హుకుం జారీ చేశాడు.
నేను అత్యుత్సాహంగా ఒక రాయి తీసుకుని బలంగా పైకి విసిరాను. అది కింద పడ్డ శబ్దానికి మేకలు భయపడి పారి పోతాయని నా ఐడియా.. వానిని నేరుగా కొట్టాలంటే నాకు మనస్కరించ లేదు. కాని నేనూహించినట్టుగా రాయి నేల మీద పడకుండా.. ఒక చిన్న మేకపిల్ల తల మీద పడింది. అది వెంటనే కింద పడి గిల, గిలా కొట్టుకోసాగింది. నాకు విపరీతమైన భయమేసింది. ఉన్నఫళంగా కాళ్ళకు బుద్ధి చెప్పాను.
నేరుగా మా ఇంటికి వెళ్ళితే.. నా అడుగు జాడలు పసిగట్టి ఎవరైనా హమాలీ మా ఇంటికి వస్తాడని.. పెద్ద గొడవ అవుతుందనే ఆలోచన రాగానే.. సందులు, గొందులు తిరుక్కుంటూ.. ఒక ఇంటి వెనుకాల దూరాను. అది నా స్నేహితుడు లక్ష్మీపతి ఇల్లు. వాళ్ళింట్లోని ముందు గదిలో కొందరు కూర్చోని వాళ్ళ అరచేతులలో ఉన్న ఆకు పసరును తీక్షణంగా చూస్తున్నారు. నాకేమీ అర్థంగాలేదు. నెమ్మదిగా పిల్లిలా వెళ్ళి లక్ష్మీ పతి వెనుకాల కూర్చున్నాను. లక్ష్మీపతి నాన్నగారు ‘అదుగో దొంగ.. మా ఇంట్లో నుండి సంచి పట్టుకు పోతున్నాడు” అంటూ అరచేతిలో అగుపడ్తున్నట్టు చెప్పసాగాడు.
లక్ష్మీ పతి నన్ను పక్కకు తీసుకు వెళ్ళి విషయం చెప్పాడు. వాళ్ళింట్లో వారం రోజుల క్రితం దొంగతనం జరిగిందట, దొంగను పట్టుకోవాలని ‘అంజనం’ వేసి చూస్తున్నారట. ఆకుపసరు మహత్యమది అని చెబ్తుంటే.. నాకింకా భయ మేసింది. నన్నూ అలాగే పట్టుకుంటారేమో..! ఎలా..! అని భయం, భయంగా మా ఇంటికి వెళ్లాను. అప్పటికే మా నాన్న గారు వచ్చి భోజనం చేసి కుర్చీలో కూర్చున్నాడు. నా వాలకం గమనించి..
“ఏమయ్యిందిరా?.. ఎండలో ఎక్కడికి వెళ్లావు? భయపడ్తున్నట్లు కనబడుతున్నావ్!” అంటూ ప్రశ్నల వర్షం కురిపించాడు. నా గుండె ఝల్లు మంది.
మా నాన్న పోలీసు కానిస్టేబుల్. ఆ తీక్షణ చూపులు చూసి నాకు ఇంకా భయమేసింది.
“నిజం చెప్పు బాబూ.. ఏమయ్యింది” అంటూ బుజ్జగించి అడిగేసరికి నాకు కాస్త ధైర్యం వచ్చింది. మేకపిల్ల విషయం చెబుతూ బిగ్గరగా ఏడ్చేశాను. నా కాళ్ళూ, చేతులు వణకసాగాయి.
“మేకపిల్ల చచ్చిపోయిందేమో! నాన్నా..” అంటూ.. వెక్కి, వెక్కి ఏడ్వసాగాను.
నాన్న వెంటనే.. పోలీసు డ్రెస్ వేసుకుని.. నన్ను ఓదార్చుతూ..
“చూద్దాం పద “ అంటూ సైకిలు బయటకు తీశాడు.
నన్ను సైకిలు మీద ఎక్కించుకుని గోదాము దగ్గరికి తీసుకెళ్లాడు. హమాలీలను చూస్తూనే..
“ఎవర్రా నా కొడుకును మేకలను కొట్టుమన్నది..” అంటూ పోలీసు గర్జన చేసే సరికి ఒక హమాలీ ముందుకు పరుగెత్తుకుంటూ వచ్చాడు.
“సార్.. మేకపిల్లకు ఏమీ కాలేదు. కాసిన్ని నీళ్ళు తల మీద చల్లి మరి కొన్ని తాగించాను. ఇప్పుడు బాగానే ఉంది” అంటూ గోదాము లోనికి వెళ్ళి మేకపిల్లను పట్టుకొచ్చాడు.
దాన్ని చూడగానే.. నా ముఖం విప్పారింది. చటుక్కున వెళ్ళి దాన్ని ఎత్తుకుని ముద్దాడాను.
“మా బాబు ఇంటికి వచ్చి ఏడుస్తున్నాడు.. చిన్న పిల్లలకు అలాంటి పనులు చెప్పొద్దు” అంటూ నాన్న హమీలీని చివాట్లు పెడ్తున్నాడు.
అలా నేను రాయిని పైకి విసిరాల్సింది కాదు. మామూలుగా చేతితో తోలితే సరిపోయేది. అంతా నాతప్పే.. ఇక ముందు ఇలాంటి చెడుగు పనులు చెయ్యొద్దని మనసులో గట్టి నిర్ణయం తీసుకున్నాను. *
-చెన్నూరి సుదర్శన్,
చరవాణి: 9440558748