పర్యాటకం—1, “ లాహిరి లాహిరి లాహిరి లో” - కర్రా నాగలక్ష్మి

పర్యాటకం—1, “ లాహిరి లాహిరి లాహిరి లో”

"లాహిరి లాహిరి లాహిరిలో "
సరస్సులలో బోటు షికారు చేస్తున్నప్పుడు ఎంతసరదాగావుండేదో, ఎప్పుడు పడవ షికారన్నా ఏదో ఆనందం, అరగంటో గంటో నీటిమీద ప్రయాణం అంటే చేసేం కాని, అట్లాంటిక్ సముద్రం మీద 7 రాత్రులు గడపడం నాకోకలలాంటిదే. ఆ కల తీరిన వేళ ఆ అనుభవాలు మీతో పంచుకోవాలనే కోరికే ఈ వ్యాసానికి నాంది.

చిన్నప్పుడు మాయాబజారు సినిమాలో “లాహిరి లాహిరి లాహిరిలో “ పాటవిన్నప్పుడల్లా పడవ ప్రయాణం చెయ్యాలనే కోరిక కలిగేది, ఆ కోరిక అలా నాతో పాటు పెరిగి పెద్దదయిందిగాని కోరిక మాత్రం తీరలేదు. పిల్లల పెళ్లిళ్లయేయి, మనుమలు పుట్టేరు, అమ్మనుంచి నానమ్మనయేను కాని నా కోరిక అలానే ఉండిపోయింది, చూస్తూ ఉండగానే అరవయ్యేళ్ల పుట్టిన రోజు వచ్చింది. పుట్టిన రోజు కానుకగా మా అబ్బాయి ( అమెరికాలో ఉన్నాడు లెండి ) మాకు సముద్రయానానికి ప్రయాణం పెట్టేడు. మా కుంటుంబం కాక మరో మూడు కుటుంబాలు కలసి వెళ్లేం. సముద్రయానం అంటే క్రూజ్ ట్రిప్ మీకర్దమయే వుంటుంది.

మేం ఉండేది అమెరికాలోని టెక్సాస్ కి చెందిన డల్లాస్ లో మా ప్రయాణం “ఫ్లోరిడ” కి చెందిన “మియామి” నగరం నుంచి బయలుదేరి 7 రాత్రులు 8 పగళ్లు ప్రయాణం తరువాత తిరిగి “మియామి” చేరుతాం. మియామి వరకు విమానయానం, ముందురోజే అందరం మియామి చేరుకున్నాం, సముద్రానికి దగ్గరగా ఉన్న హోటలు, రాత్రి మేం చేరేసరికి పదిదాటటంతో హోటలు పరిసరాలు పరికించలేదు. ప్రొద్దుట చూస్తే ఎదురుగా అంతా సముద్రమే. మద్యాహ్నం ఒంటిగంటకి బోర్డింగ్ టైమిచ్చేరు క్రూజ్ వారు.

8 గంటల నుంచి ఒక్కో ఓడా తీరం చేరుకోసాగేయి, మొత్తం 8 ఓడలు తీరం దగ్గర బారులు కట్టేయి. హోటలు కిటికీ లోంచి ఆ నావలు చూస్తూఉంటేనే ఏదో వుత్సాహం, అంతపెద్ద ఓడలో 7 రాత్రులుంటామా? అనే ఆలోచనే నాలో ఏదో కుతూహలాన్ని నింపుతోంది.

టాక్సీ లో డాక్ చేరుకోగానే నా ఆనందం రెట్టింపయింది, పది కిలోమీటర్ల దూరం నుంచి చూసిన ఓడకి ప్రత్యక్షంగా చూస్తున్న ఓడకి పోలికే లేదు. ప్రత్యక్షంగా చూస్తున్న ఓడ ఓ పెద్ద భవనాన్ని పోలివుంది, ఓ రెండు, మూడు పెద్ద మాల్స్ ని కలిపినంత ఉంది, ఇది ఓడా?, ఇంతపెద్దది అసలు కదులుతుందా? అనే సందేహాలు కలిగేయి. ఇంతపెద్ద కదిలే ఓడ లో ప్రయాణమా?, కుదుపులుంటాయా?, నిద్రపోగలమా?, పానీయాలు, ఆహారం తినేటప్పుడు కిందపడిపోకుండా ఉంటాయా?, లాంటి ఎన్నో సందేహాలతో,ఎంతో నడక, చెకింగుల తరువాత ఓడలో అడుగు పెట్టేం. మా సామానులను రూమునంబర్లు వేసి టాక్సీ దిగగానే ఓడసిబ్బందికి ఒప్పజెప్పేం. ఓడ లంగరు ఎత్తిన తరువాత మా రూములలో ఇవ్వబడతాయని చెప్పేరు.

పాస్ పోర్టులు చెక్ చేసేక మాకు తలా ఓరూము తాళం కార్డు ఇచ్చేరు, ఏడునెలల మా మనుమడికి కూడా ఓ కార్డిచ్చేర . దాని మీద మన పేరు ప్రింటయిఉంటుంది.

ఓడలో నాలుగో డెక్క్( అంతస్థు) నుంచి ప్రవేశించేం. పై అంతస్థులకి చేరడానికి ఆరు విశాలమైన లిఫ్టులున్నాయి. పన్నెండుకి క్యూ లో ఉంటే అన్ని ఫార్మాలటీస్ పూర్తి చేసుకొని ఓడలోకి ప్రవేశించే సరికి మూడు దాటింది, తిన్నగా 15 వ అంతస్థులోవున్న డైనింగ్ హాలుకు వెళ్లేం, 15 వ అంతస్థులో మధ్యభాగం డైనింగ్ హాలు ముందు వెనుక భాగాలు స్విమ్మింగు పూలు, హాట్వాటరు టబ్, షవర్ పూల్స్ మొదలయినవివున్నాయి.

డైనింగ్ హాలు మధ్యలో అన్ని దేశాలకు చెందిన వంటలుకాలున్నాయి, నానారకాల నాన్ వెజ్ వంటకాలు, పిజ్జా, బర్గరు, నూడిల్స్, స్పెగెటి ఇలా ఎన్నో రకాలు, రైస్, దాల్, ఓ వెజిటబుల్ కూర, పళ్లు, సలాడ్ లు ఒకటేమిటి? ప్రపంచంలో అన్ని రకాల వండిన పదార్ధాలు, వండని పదార్దాలు, ఐస్ క్రీములు, కేక్స్, పేస్ట్రీస్ అలాగే పానీయాలు అన్నీ ఉన్నాయి.

వెజ్ పిజ్జా తిని వేడిపాలు తాగి నాలుగు గంటలకి 6 వ అంతస్థులో డ్రిల్లు కి వెళ్లేం. డ్రిల్లు అంటే మరేం లేదు ఎమర్జన్సీలో ఏం చెయ్యాలో, లైఫ్ జాకెట్లు రూములో ఎక్కడుంటాయో, వాటిని ఎలా వాడాలో సిబ్బంది చూపించేరు. పదినిముషాల తరువాత మా రూముకి వెళ్లేం.

రూములు బాగా చిన్నగా ఉంటాయనుకున్నాను, ఓ డబుల్ బెడ్, ఓ మూడు తలుపుల బీరువ, కాఫీ టేబులు, దానిమీద కాఫీ మేకరు, ఫోను కింద సామాను పెట్టుకోడానికి వీలుగా షెల్ఫ్ లు, ఓ బుజ్జి ఫ్రిడ్జ్, కాఫీ టేబుల్ కి ఎదురుగా ఓ సోఫా, గాజు తలుపుల వెనుక బాల్కని, బాల్కని లో రెండు కుర్చీలు, ఓ టేబులు ఉన్నాయి. సమయం నాలుగున్నర అయింది, అంటే ఓడ బయలుదేరే సమయం దగ్గర పడిందన్నమాట. అంత పెద్ద ఓడ కదులుతూవుంటే ఆ అనుభూతిని పూర్తిగా పొందాలనే నేను బాల్కనీలో కూర్చున్నాను.

కదులుతున్నట్లు తెలియనేలేదు కాని ఎదురుగా ఉన్న కట్టడాలు వెనుకక పోతూవుంటే తెలిసింది, ఓడ కదులుతోందని , ఎలాటి కుదుపులూ లేవు, మియామి దగ్గర వున్న చిన్నచిన్న ద్వీపాలు దాటుతూ పోతున్నాం, అంతపెద్ద ఓడ వయ్యారంగా కదులుతూ “అట్లాంటిక్ “ మహాసముద్రంలో కి ప్రవేశించింది. అప్పుడప్పుడు అతి చిన్నకుదుపు తో ప్రయాణం చాలా అహ్లాదంగావుంది. చుట్టూరా అనంతమైన జలరాశి, చాలా స్వఛ్చంగా గంభీరంగావుంది . ఓడ చేసే శబ్దం తప్ప అంతా గంభీరమైన నిశ్సబ్దం.

అయిదు గంటలకు సూర్యుడు సముద్ర గర్భంలోకి చేరిపోయేడు, అదొక అధ్భుతమైన దృశ్యం, వర్ణించడానికి నేను కాళిదాసును కాను.

కుదుపన్నది లేదు, తుఫానులు అవీ వస్తే కుదుపులుంటాయేమో?.

ఇంతపెద్ద ఓడలో ఏమేమున్నాయో చూడాలికదా? మా సామానులు ఇంకారాలేదు.

నాలుగు కుటుంబాలవారం స్విమ్మింగ్ పూల్ కి వెళ్లేం. స్విమ్మింగ్ పూల్, హాట్ వాటర్ టబ్బులు చిన్నపిల్లలు ఆడుకొనే వాటర్ గేమ్స్ ఉన్నాయి, ఆపై అంతస్ధులో రాక్ క్లైంబింగ్, స్కై వాకింగ్, వాలి బాల్, సోకర్ లాంటి ఆటలున్నాయి. ఎందుకో నాకు స్కైవాక్ చెయ్యాలని అనిపించింది. పిల్లలంతా వాళ్లకి కావలసిన ఆటలలో పడ్డారు, పెద్దవాళ్లు కబుర్లలో పడ్డారు.

మర్నాడు అంతా కూడా ఓడ ప్రయాణమే, మూడోనాడు 10 గంటలకి లంగరు వేస్తారు, ఊర్లోకి వెళ్లి తిరిగి సాయంత్రం నాలుగు గంటల లోపున ఓడ చేరుకోవాలి.

ఆ మాటలలో మేం ప్రయాణిస్తున్న ఓడ ప్రపంచంలోని అతిపెద్ద ఓడలలో ఒకటని తెలిసింది. ఓడ లో మొత్తం 2 వేల గదులున్నాయి, అందులో 2 వందల గదులు “హెవెన్ ( ఫస్టు క్లాసు )” కి చెందినవి. హెవెన్ గదులు ముందు కూర్చొనే గది అంటే హాలు వేరుగా, బెడ్ రూము పెద్దదిగా ఉంటుంది, అలగే వారికోసం భోజనాలశాల, వంటశాల అన్నీ వేరు, అలాగే స్విమ్మింగు పూలు, సినిమా ధియేటర్లు అన్నీ వేరు, అంటే వాళ్లదో ప్రపంచం, మాదో ప్రపంచం, వాళ్లకీ మాకూ సంబంధం లేదు.

అంటే ఓడలో సుమారుగ 4 వేలమంది పై బడి ప్రయాణం చెయ్యొచ్చు. కొన్ని రూములలో ముగ్గురు పెద్ద వాళ్లని ఉండనిస్తారు. తల్లి తండ్రితో పాటు పద్దెనిమిదేళ్ల లోపు పిల్లలు ఇద్దరు ఉండొచ్చు. ఓడ లో సిబ్బంది కేప్టెన్ తో కలుపుకొని సుమారు 18 వందల మంది పనిచేస్తున్నారు. ప్రపంచంలో కెల్ల పెద్ద ఓడ లో సుమారు 6 వేల మంది ప్రయాణించవచ్చట.

రాత్రయేక చిన్నకుదుపు తెలిసింది, మరి సముద్రంలో అలలు ఎక్కువయేయో లేక ఓడ వేగం పెరిగిందో తెలీదు.

రాత్రి ఒంటిగంట వరకు అటూ యిటూ తిరుగుతూనే ఉన్నాం, భోజనాలు అలా వండి వడ్డిస్తూనే ఉన్నారు, పిల్లలూ పెద్దలూ అలా తింటూనే వున్నారు, ఆరు రకాల ఐస్ క్రీములు, రెండు రకాల స్మూదీలు. పిల్లా పెద్దా అందరి చేతుల్లోనూ ఇవే. ఒంటిగంటకి రూములు చేరేం. మరునాటి ప్రోగ్రామ్ పట్టిక రాత్రి 8 గంటలకి అందజేసేవారు. వాటిలో ఓడలో జరిగే వినోద కార్యక్రమాల వివరాలుఉంటాయి.

మరునాడు ఓడ ప్రయాణమే కాబట్టి సావకాశంగా లేచినా ఫరవాలేదు, పది తరువాత బ్రేక్ ఫాస్ట్ దగ్గర కలుద్దామని మా రూములు చేరేం. బయట అలా పెద్దా చిన్నా పరుగులు తీస్తున్నా గదిలోపలకి చిన్న శబ్దం కూడా ప్రవేశించటం లేదు. ఆరింటికల్లా సూర్యుడు పైకొచ్చేడు, ఎండ ఫెళ్ళు మంటోంది. కర్టెన్లు వేసుకుంటే ఎండ లోపలకి రావడం లేదు, మరో అరగంట ఎలాగో పక్కమీద గడిపి సముద్రం చూడాలని బాల్కనీలోకి వచ్చేం. ఎండ చురచుర భరించలేక గది తలుపులోంచే సముద్రాన్ని చూడసాగేం. నీలి జలాలలో ఏం ఆకర్షణో ఎంతసేపు చూసినా తనివి తీరలేదు, పది అయేసరికి ఆకాశమంతా మబ్బులు కమ్మేశాయి. వాతావరణం చల్లగా అయింది, బాల్కనీలో కుర్చీలో కూర్చొని సముద్రాన్ని ఆశ్వాదించసాగేను. ఓడ సముద్రాన్ని చీల్చుకు వెళుతున్న దారి తప్ప సముద్రంలో ఎలాంటి కలకలం లేదు, సముద్రపు నీరు ఉప్పువాసన కొడుతోంది, సముద్రపు నీరు తుళ్లి బాల్కనీ కుర్చీలు బంకగా, ఉప్పు తేలి ఉన్నాయి. సముద్రం మధ్యలో వాన పడితే ఎలా ఉంటుందో అనిపించింది, కనుచూపు మేరలో ఎక్కడా నేల కనిపించలేదు.

బ్రేక్ ఫాస్ట్ తరువాత అంతా పదిహేడవ అంతస్థులో ఉన్న స్పోర్ట్స్ కాంప్లెక్స్ కి వెళ్లేం. పిల్లలు వాలి బాల్ ఆడుతున్నారు. చిన్నా పెద్దా స్కై వాక్ చేస్తున్నారు. ఎందుకో నాకూ చెయ్యాలనిపించింది. నాకు హైట్స్ అంటే భయం, కాని చేద్దామని నిర్ణయించుకున్నాను. మొత్తం పూర్తి చెయ్యటానికి సుమారు అరగంట పడుతుంది, తాళ్ల మీద నడవటం, వుయ్యాలలా వూగుతున్న పలకల మీద నడవటం అలా వాటిమీద నడుస్తూ సముద్రం మీదకూడ కొన్ని అడుగులు నడవటానికి ఉంటుంది. ఓ రెండు రకాలమీద నడిచేసరికి నాకు కళ్లు తిరగటం మొదలయింది, అక్కడనుంచి వచ్చేసేను. కాని యేదో సాధించాననే ఆనందం కలిగింది.

ఓడ లో డైనింగ్ హాలులోనేకాక ఓ పది వరకు రెస్టొరాంట్స్ వున్నాయి అందులో నాలుగు ప్రయాణీకులకు ఉచిత భోజనం అందిస్తాయి, కాని వడ్డించినందుకు ప్రతీ ప్రయాణీకుడి దగ్గరా 15 $ తీసుకుంటారు. ఆరోజు అలాంటి రెస్టొరాంట్ లో తినటానికి వెళ్లేం, అది ఆరవఅంతస్థులఉంది. ఆరో అంతస్థు ఓ రంగుల ప్రపంచంలా ఉంది. అక్కడ ఖరీదైన బ్రాండెడ్ వస్తువులు అమ్మే షాపులు, ఆర్ట్ గేలరి, జెమ్స్ గేలరి, ఫొటో గేలరి ఉన్నాయి. మధ్యలో మ్యూజికల్ షో జరుగుతోంది. అక్కడే సినిమా థియేటర్లు ఉన్నాయి. సినిమాలకి, షో లకి మనం వేరేగా సొమ్ము చెల్లించక్కరలేదు. ఓపక్క గేమ్స్ షో, క్విజ్ జరుగుతున్నాయి. మధ్యాహ్నం డాన్స్, మ్యూజిక్, ఆర్ట్ క్లాసులు కూడా జరుగుతూవుంటాయి. ఆరవ అంతస్థు మధ్యలోంచి ఏడవ అంతస్థుకి మెట్ల ఉన్నాయి, ఏడవ అంతస్థంతా కేసినోలు, బార్లు, థియేటర్లు ఉన్నాయి, ఎనిమిది అంతస్థులో మళ్లా బార్లు, రెస్టొరాంట్స్, బ్రాండెడ్ షాపులు, ఫొటో షాపులు ఉన్నాయి. మనం ఓడ ఎక్కేటప్పుడు, తర్వాత చాలా చోట్ల ఫొటోలు తీసుకోవచ్చు, అవన్నీ మనకిచ్చిన కార్డ్ పై ఉన్న నెంబరు ప్రకారం జాగ్రత్త చేస్తారు, అందులో మనకి కావలసినవి మనం కొనుక్కోవచ్చ . ప్రతీరోజూ రాత్రి ఓడ కేప్టెన్ తో ఫొటోలు తీయించుకోవచ్చు.

ఆ రోజు లంచ్ ఆరో అంతస్థులో ఉన్న ఓ ఇటాలియన్ రెస్టారెంట్ లో తిన్నాం, నాకు అక్కడ కన్నా 15 అంతస్థులో భోజనమే బాగుంది.

ఓడ సిబ్బందిలో సుమారు 15 దేశాలకు చెందిన వారున్నారు, వీరిలో ఎక్కువగ మనదేశం లో గోవాకి చెందిన వారు, ఫిలిప్పైన్సువారు వున్నారు. ప్రతీ రోజూ బ్రేక్ ఫాస్టులో ఓ భారతదేశపు వంటకం ఉండేది. దాంతోపాటు మసాలా టీ కూడా.

మూడోనాడ మేం తొమ్మదింటికల్లా తయారయి లంగరు ఎప్పుడు వేస్తారా అని ఎదురు చూడసాగేం. లంగరు పడగానే పాస్ పోర్టు, మా ఓడ వాళ్లిచ్చిన కార్డు తీసుకొని బయలుదేరేం. మా ప్రోగ్రామ్ ప్రకారం దిగవలసిన ద్వీపం హోండూరస్ లోని “రోటాన్ “, కాని అక్కడ వర్షం పడుతూ ఉండటంతో మా ఓడ నాలుగోరోజు వెళ్లవలసిన ద్వీపం “బెలిజ్ “ అనే చిన్న ద్వీపానికి వెళ్లేం. ఇది ప్రైవేటు ద్వీపం. మా ఓడ సంస్థ వారే ఆ చిన్న ద్వీపాన్ని కొనుక్కొని పర్యాటకులకు కావలసిన అన్ని హంగులూ ఏర్పాటు చేసేరు. అందుకని అక్కడ మా ఓడ లోని వారు తప్ప పై వారు లేరు. పెద్ద వాటరు పార్కు , బీచ్, స్పీడు బోటు లాంటి వన్నీ ఉన్నాయి, సముద్రం పైనుంచి వెళ్లే “జిప్ లైను”ఉంది. అందులో వెళ్లేవారు నీటి వైపు ముఖం ఉండేలా వ్రేలాడుతూ వెడుతున్నారు. ఒకరిద్దరు కూర్చున్నట్లుగా వ్రేలాడుతూ వెళుతున్నారు.

బయటకు వెళ్ల దలచుకోనివారు ఓడలోనే ఉండొచ్చు. నాలుగింటికల్లా తిరిగి ఓడ చేరుకున్నాం. ఆరింటిక వరకు లంగరు ఎత్తలేదు.

ఇవాళకి ఇంతే, మిగతాది మరోసారి చదువుదాం, అంత వరకు వేచి ఉండండి..

మరిన్ని వ్యాసాలు

Maa chardham yatra
మా చార్ధామ్ యాత్ర
- కర్రా నాగలక్ష్మి
సినీ అప్సరస గీతాలు .
సినీ అప్సరస గీతాలు .
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
వివేకానంద రాక్ మెమోరియల్ స్థపతిశ్రీ.ఎస్.కె ఆచార్య
స్థపతిశ్రీ.ఎస్.కె ఆచార్య
- కుందుర్తి నాగబ్రహ్మాచార్యులు
రాజస్తాన్ ప్రాంత నిర్మాణ విశేషాలు
రాజస్తాన్ ప్రాంత నిర్మాణ విశేషాలు
- కుందుర్తి నాగబ్రహ్మచార్యులు
Kanyakumarilo vunna tiruvalluvar vigraham nirmana charitra
తిరువళ్లువర్ విగ్రహం నిర్మాణ చరిత్ర
- కుందుర్తి నాగబ్రహ్మాచార్యులు