విశ్లేషణాత్మకమైన వ్యాస సంపుటి “విశద - కొండ్రెడ్డి వెంకటేశ్వరరెడ్డి

Vishada Book Review

తెలుగు సాహిత్య విమర్శ ఒక లక్ష్యంతో గమ్యాన్ని చేరే మార్గాన్ని పట్టుకోలేకపోతుంది. నడి సముద్రంలో నావలా బిక్కు బిక్కుమంటూ ఏ ప్రమాదం ఎటునుంచి తాకుతుందోననే భయంతో గాలివాటం కేసి సాగిపోతుంది కుల, మత, ప్రాంతీయ మోమాటలు, సాహిత్యేతర పరిచయాల వత్తిడులు ఇంకా ఎన్నెనో క్యాలుకులేషన్స్, ఈక్వేషన్స్, వ్యక్త, అవ్యక్త, గుప్త, ఉద్యమ భ్రమలు విమర్శకుని రాతలు మారుస్తున్నాయి. దైనందిన ఒత్తిళ్ల మధ్యన రొటీన్ రాతలతో రచయితను సంతృప్తి పరచే నీడన విమర్శ తలదాచుకుంటుంది. కాలం మారుతుంది కవిత్వం మారాలి. దానితో పాటు విమర్శ ఎదగాలి. కవిత్వం గాని కథ గాని కొత్త దారి వెతుక్కోవడంలో విఫలమౌతున్న తీరు తెన్నులను ఎత్తి చూపితే అంగీకరించే కవి గానీ రచయిత గానీ ఇవాళ లేదనే చెప్పాలి అరిగిపోయిన అభివ్యక్తులతో ప్రతి పత్రిక సాహిత్య పేజీల్లో సీనియర్ కవుల్ని, ప్రముఖ కవుల్ని పొగడ్తలతో ముంచెత్తే రాతలు రాస్తున్న విమర్శకులను చూస్తుంటే మన భాష విమర్శకు పట్టిన దౌర్భాగ్యం ఎప్పుడు పోతుందోననిపిస్తుంది. బాధ్యత రహిత సాహిత్య సృజనకు బాకా ఊదడం సమీక్షకులకు గానీ విమర్శకులకు గానీ తగదు. అది సాహిత్య ద్రోహమే అవుతుంది కవి, కథకుడు, విమర్శకుడైన “పిళ్ళా కుమార స్వామి" పై విషయాలన్నీ క్షుణ్ణంగా తెలిసే 'విశద' లోని సాహిత్య వ్యాసాలు రాశాడనేది నా భావన. ఎందుచేతనంటే ఈయన వ్యాసాల్లో కేవలం సమీక్షే కాకుండా దిశా నిర్దేశం చేసే విమర్శ కూడా ఉంది. నిశిత పరిశీలన నిర్మోహమాట అభిప్రాయాలను, నిక్కచ్చితమైన భావ ప్రకటనలు " పిళ్ళా" వారి వ్యాసాల్లో ద్యోతకమౌతాయి. సమీక్షల్లో ఇంత స్పష్టమైన సమీక్షకుని అభిప్రాయం చెప్పడం నేడు అరుదుగా కనిపిస్తుంది విశద'లో మొత్తం 25 వ్యాసాలున్నాయి. కవిత్వం మీద, కథల మీద, విమర్శనా గ్రంథాల మీద అనువాదాల మీద ఈ వ్యాసాలు నడిచాయి. ఈ సంపుటిలో ఓ ప్రత్యేకతను నేను గమనించాను. వ్యాసం పూర్తయి మిగిలిపోయిన స్థలాన్ని కూడా వృధా పోనీయకుండా ప్రఖ్యాత కవుల, విమర్శకుల వాక్యాలను సాహితీ సౌరభాలుగా ముద్రించాడు, 'విశద' వ్యాస సంపుటికి ముందు మాట రాసిన మేడిపల్లి రవికుమార్ విమర్శకులకు దిశా నిర్దేశం చేస్తున్న దిశలోనే ఆయన భావ ప్రకటనలు ఉన్నాయి తడారిన సీమ గొంతుకలు స్వర సీమ ఉద్యమం' అనే వ్యాసంలో నూక రాంప్రసాద్ రెడ్డి కవిత్వాన్ని విశ్లేషిస్తూ, కొంత మంది స్వార్ధపరులైన కవుల మనో గతాలను వ్యక్తం చేస్తూ 'కొంత మంది కవులు పాలకులను ప్రశ్నిస్తే తమకు అవార్డులు, రివార్డులు రావేమోనని భయపడి పాలకుల మాటే తమ కవితల్లో వ్యక్తం చేస్తున్నారు అంటే పాలకుల కొమ్ము కాస్తున్నారు' అంటూ నేటి కవుల బలహీసతలను బయట పెట్టాడు, వారి స్వార్థాన్ని ఎండగట్టాడు, పల్లె పచ్చదనం కోసం ఆరాటపడిన మన్నే మా తరం' వ్యాసంలో కవి యాములపల్లి నరిసిరెడ్డి కవిత్వాన్ని విశ్లేషిస్తూ కరువు కోరల్లో చిక్కి పల్లె "అప్పు కుప్ప కయ్యాల కొరవైంది / చేతి వృత్తులు గోతిన పడి జాతులు నాశనమై / కలగ పెరిగి తాలు గింజలేసిన తెల్ల జొన్న కంకిలా / పల్లె కుప్ప కూలుటకు దగ్గరైంది / ముగింపు దశలో మూలుగుతోంది” అంటారు ఈ వ్యాసంలో విమర్శకులు జనరల్ గా చెప్పే మాటల్ని గుర్తు చేసుకుంటూ 'రాయలసీమలో మంచి బలమైన కవిత్వం ఒక తాత్విక ధారగా వెలువడలేదు.కథలంత బలంగా తనదైన ముద్రను ఇంకా వేయాల్సి ఉంది' అంటారు. ఈ అభిప్రాయాన్ని గుర్తు చేయడంలో “రాయలసీమలో కవిత్వం ఇంకా సాంద్రతరం కావాలనే భావన చెప్పేందుకే". స్కై బాబా కవిత్వం మీద రాసిన వ్యాసం “నిద్రపోతున్న ప్రపంచాన్ని తట్టి లేపే జగ్నేకీ రాత్" లో గుజరాత్ మారణకాండ చేసింది భజరంగ్ దళ్ స్వయం సేవకులు, విశ్వహిందూ పరిషత్ కార్యకర్తలని తేలుస్తూ వారిని ప్రతిఘటించిన అధికార్లను మెచ్చుకోవడాన్ని ఎత్తిచూపుతూ మనిషిని మానవత్వమున్న మనిషిగా మారాలని కవి కోరుకుంటాడు" రచయిత. ముస్లిం వాడలు, హరిజన వాడలు ఒకే రకంగా ఉండడాన్ని ముఖ్యంగా వారి జీవితాలలో ఎలాంటి వెలుగు లేకపోవడాన్ని స్పష్టంగా కళ్ళకు కట్టినట్లు తన 'మర్ఫా' కవితలో ఆవిష్కరిస్తాడు. అయితే ఇలా ఉండడానికి కారణం ఎవరో కవి స్పష్టంగా గుర్తించలేకపోయారు. సామాజికంగా బలహీన వర్గాలకు అభివృద్ధి ఫలాలు అందనీయకుండా చేసిన పాలక వర్గాల కుట్రను బహిర్గతం చేయాలిసినంతగా చేయలేక పోయాడనే చురక అంటిస్తాడు. దువా చేసే ముస్లిం కన్నా హక్కుల కోసం పోరాడే వాడే నిజమైన ముస్లిం అన్న కవి పోరాట స్వభావాన్ని మెచ్చుకోవచ్చు. కానీ ఆ పోరాటం మత ఛాందసవాదం పైన అని, దానికి వత్తాసు పలికే పాలక వర్గాల పైన అని కవి స్పష్టం చేయాల్సిన పని ఇంకా మిగిలే ఉంది.. అంటూ విమర్శ చేస్తాడు పిళ్ళా. విప్లవకారుడంటే ఆకాశంలో వెండి వెలుగులనంట/ఆస్వాదించాలి, ఆఘ్రా ణించాలి.అంటూ విప్లవకారుని తత్వాన్ని తేటతెల్లం చేసిన ఆనందాచారి “స్ఫూర్తి శిఖరం" దీర్ఘ కవిత్వం సుందరయ్య కమ్యూనిస్ట్ గా బతికినా ఆదర్శమూర్తిగా అభివర్ణించారు. పేరులో చివరన 'రెడ్డి' ని తొలగించుకొని సామాజిక న్యాయం కోసం, దళితుల కోసం కృషి చేసిన ఆచరణవాదిగా అభివర్ణించిన విధానాన్ని ఎత్తిచూపారు. మార్కిస్ట్ భావాలుగల పిళ్ళా కుమారస్వామి గారికి కుడా సుందరయ్య సిద్ధాంతం తలకెక్కిందేమో “పిళ్ళా విజయ కుమార స్వామి రెడ్డి" పేరుతో ఉన్న ఈ రచయిత పిళ్ళా కుమార స్వామి గాను 'పిళ్ళా విజయ్ గాను తన పేరును మార్చుకున్నాడు. ఆదర్శం, ఆచరణలో ఉండాలని పైపై వేషాలు మనిషిని స్వచ్ఛంగా మారుస్తుందని రచయిత కూడా నమ్మడు. భారత దేశంలో కులమతాలు సమసి పోతాయనుకోవడం, కులరహిత, మత రహిత సమాజాన్ని కలగనడం ఆకాశానానికి నిచ్చెన వేసి చుక్కల్ని కోసుకోవచ్చనేంత సత్యం అవుతుంది. మనిషి అంతరాల్లో నుంచి వచ్చిన భావాలు ఆతని భవిష్యత్తును నిర్ణయాత్మకంగా చేస్తాయి. తమ చుట్టు ప్రపంచం మారలేదని నిరాకరిస్తూ ఉంటారు. ముందు తాము మారాలని అనుకోరు, నిజానికి మనిషికి మాత్రమే భయం. మార్పు బద్దకానికి వ్యతిరేకం, బద్దకాన్ని వదిలించుకుంటే మార్పుకు సిద్ధమౌతాడని నమ్మిన పిళ్ళా కుమారస్వామి సమాజంలో ఆధునిక స్థితి గతులకు సరైన అవగాహనతో అర్ధం చేసుకొని ఇంకెన్నో విలువైన వ్యాసాల్ని సమాజ మార్పు కోసం అందిస్తాడని ఆశిద్దాం. సీమ కవులు రచయతల సాహిత్యం మీదనే కాకుండా తెలుగు దేశాల నాలుగు మూలలనుండి వెలువడే సాహిత్యాన్ని అధ్యయనం చేసి విమర్శన దృష్టితో మరెన్నో లోతైన వ్యాసాలు అందించాలని కోరుకుంటూ ఈ రచయిత కృషిని అభినందిస్తున్నాను. 'విశద' వ్యాస సంపుటి అందరు చదవదగినదిగా భావిస్తాను. పిళ్ళా వారు తన సాహిత్య వ్యాసంగాన్ని ఆగిపోకుండా సాగిపోతూ మరెంతో సాహిత్య సృజన చేయాలనీ, చేస్తారని నమ్ముతూ ...

మరిన్ని వ్యాసాలు

కల్పవృక్ష వినాయక స్వరూపం శిల్పి
కల్పవృక్ష వినాయక స్వరూపం శిల్పి
- కుందుర్తి నాగబ్రహ్మాచార్యులు
సంత్ నరహరి సోనార్
సంత్ నరహరి సోనార్
- కుందుర్తి నాగబ్రహ్మాచార్యులు
మా చార్ధామ్ యాత్ర
మా చార్ధామ్ యాత్ర
- కర్రా నాగలక్ష్మి
Viswakarma
విశ్వకర్మ
- శ్రీ కుందుర్తి నాగబ్రహ్మచార్యులు అద్దంకి
తొలి వలపు తొందరలు...
తొలి వలపు తొందరలు...
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు