లాహిరి లాహిరి లాహిరిలో-2 - కర్రా నాగలక్ష్మి

Lahiri Lahiri Lahirilo -2

మాలా బయటకు వెళ్ల దలచుకోనివారు ఓడలోనేవుండొచ్చు. అలావుండిపోయిన వారికోసం రకరకాల పోటీలు, కూరగాయలు పండ్లతో రకరకాల ఆకృతుల తయారి, డాన్స్, పియానో క్లాసులు నిర్వహించేవారు, అవికాక డాన్స , నాటకాల ప్రదర్శనలుండేవి.

నాలుగింటికల్లా తిరిగి ఓడ చేరుకున్నాం. ఆరింటి వరకు లంగరెత్తలేదు.

ఆరోజు మా గ్రూపంతా కేప్టెన్ తో ఫొటోలు తీయించుకోవాలని అనుకున్నాం, నేను సాంప్రదాయకంగా చీర కట్టుకొని ఫొటో తీయించుకున్నాను.

ప్రయాణీకులలో సుమారు 200 మందిదాకా మనదేశస్థులున్నారు. ఆ రోజు కూడా ఆరో అంతస్థులో మరో రెస్టొరాంట్లో డిన్నరు తిన్నాం.

మరునాడు 8 గంటలకు హోండూరస్ లోని "రోటాన్" లో లంగరు వేసారు, ముందురోజులా రద్దీలో పడి వెళ్లేబదులు ఓ గంటాగి బయలుదేరుదామని నిర్ణయించుకున్నాం.

అనుకున్నట్లుగానే తొమ్మదింటికి బయలుదేరి ద్వీపం చేరుకున్నాం. ఈ ద్వీపాలన్నీ కూడా దక్షిణ అమెరికా ఖండానికి చెందినవి, ఒకప్పుడు ఈ దీవులన్నీ కూడా ఇంగ్లాండు రాణి విక్టోరియా పరిపాలనలోవుండేవట, ఈ హోండూరస్ 1840 లో స్వతంత్ర దేశంగా ప్రకటించుకుంది. మేం పోర్టు బయటకి వచ్చి ఓ టూరు ఆపరేటరుతో బేరసారాలు చేసుకొని ద్వీపం తిప్పి చూపించడానికి, జిప్ లైనరు లో తిప్పడానికి, స్నోర్కలింగ్ చెయ్యడానికి, గ్లాసు బోటులో షికారు కి మాట్లాడు కున్నాం. సముద్రతీర ప్రాంతం కావడంతో బాగా వేడిగావుంది, చమటలు బాగా పడుతున్నాయి. మా వేను వచ్చేలోపల చిరాకు పరిచింది ఎండ. లగ్జరీ వేను లోపల ఎసి చాలా చల్లగావుంది. అందులో మొత్తం ద్వీపమంతా తిరిగేక జిప్ లైనరు దగ్గర దిగేం. మాకోడలు చంటిపిల్లాడు ఉండడం వల్ల మాతో రాలేదు. మేం తొమ్మిది మంది పెద్దవాళ్లం ఎనిమిది మంది చిన్నపిల్లలు, అందరినీ తీసుకొని మరో వేనులో ఎత్తుగావున్న కొండపైకి తీసుకు వెళ్లేక నడుంకి కాళ్లకి బెల్టులు కట్టి, వాటికివున్న హుక్ ని కొండల మీంచి వేసిన కేబుల్స్ కి తగిలిస్తే మనం అక్కడనుంచి జారుతూ ఓ కిలోమీటరు దూరంలోవున్న చెట్టు చేరకోవాలి, అందరం సరదాపడి బయలుదేరేం కాని కాస్త భయం అనిపించింది, ధైర్యం చేసి దూకేసేను, అక్కడనుంచి మరో చెట్టుమీదకి అలా అలా మొత్తం 28 సార్లు జారితే బయలు దేరిన చోటికి చేరేం, ఒకచోటనుండి మరోచోటికి చేరేం అంటే అక్కడ ఏ కట్టడంవుండదు, పెద్ద చెట్టు కి కర్ర పలకలు వేసి కట్టిన మంచె మాత్రమేవుంటుంది. అక్కడనుంచి నేల చాలా కిందనుం టుంది. కిందలోయలో ప్రవహిస్తున్న నదులను చూస్తూ జారడం ఓ అనుభవం అంతే. మొదటి సారి చాలా భయం అనిపించింది కాని ఆ అనుభవం ఎలావుంటుందో అనే కుతూహలం ముందు భయం కాస్త వెనుక పడింది, ఆ అనుభవం బావుంది.

అక్కడనుంచి పెట్టింగ్ జ్యూ చూసుకొని మొత్తం ద్వీపం అంతా చూసేం, వాతావరణం, అక్కడవున్న చెట్లు అన్నీ కూడా కేరళ, గోవాలని గుర్తుచేసేయి. తరువాత చాక్లెట్ ఫేక్టరీ కి వెళ్లేం, ఫేక్టరీ అనే బదులు తయారీ అంటే సరపోతుంది, పొయ్యలమీద తయారు చేస్తున్నారు, స్థానిక తయారీ, రుచి బాగానేవుంది.

కారంగావున్న చాక్లెట్స్ కూడా తయారు చేస్తున్నారు.

అక్కడ నుంచి బీచ్ కి వెళ్లేం. స్నోర్కలింగ్ చెయ్యడానికి మా కోడలు వెళ్లడంతో నేను మనుమడిని తీసుకొని గ్లాస్ బోట్ ట్రిప్పు ఎంచుకున్నాను.

నేను మాతో పాటు వచ్చిన మరొకామె ఆమె పిల్లలు బీచ్ లో మా బోటు కోసం ఎదురు చూస్తూవున్నాం, పర్యాటకులు తగినంతమంది లేని కారణంగా మా బోటు బయలు దేరలేదు, ఈ లోపున మా వాళ్లంతా వచ్చేయడంతో మనుమడిని వాళ్లమ్మకి ఇచ్చి నేను బోటులో బయలు దేరేను. గ్లాస్ బోటులో ప్రయాణం అంటే మనం బోటు అడుగు భాగాన కూర్చుంటాం. కూర్చోడానికి బల్లలు వేసి ఉంటాయి, చుట్టూర గాజు కిటికీలు వుంటాయి, బోటు అడుగు భాగం కాబట్టి మనం నీళ్లలో ప్రయాణం చేస్తున్నట్లుంటుంది. బోటు ప్రయాణిస్తూవుంటుంది సముద్రపు నీటిలో ఉన్నవి మనకు కనిపిస్తూవుంటాయి, బోటు బయలుదేరినపుడు సముద్రంలో పారేసిన చెత్తాచెదారం కనిపించింది, బోటు సముద్రంలోకి వెళ్లిన తరువాత నీరెంత స్వచ్చంగావుందంటే సముద్రపు అడుగు భాగం చాలా చక్కగా కనబడుతోంది, పైకి నిశ్చలంగావుండే సముద్ర గర్భంలో కొండలు, అడవులు, తెల్లని ఇసుక, ఆ ఇసుకలో జలచరాలు చేసిన గీతలు, ఎలావున్నాయంటే ఎడారులలో ఇసుక తిన్నెలపై గాలి వల్ల ఏర్పడ్డ గీతలు సముద్రం అడుగునవున్నాయి. నాకిప్పటకీ అర్థం కానిదేమిటంటే నీటిలో గీతలు చెదిరిపోకుండా ఎలా వున్నాయని?.

సముద్రం లోపల మరో ప్రపంచముందంటే ఆశ్చర్యమే, కొండలు, లోయలు, నదులు ఓహ్ ఒకటేమిటి భూమి పైన ప్రకృతి మనకిచ్చినవన్నీ సముద్రంలో కూడా ఉన్నాయని నాకెవరైనా చెప్తే చచ్చినా నమ్మేదాన్ని కాదు, నా కళ్లతో నేను చూసేను కాబట్టి నమ్మగలిగేను. ఎన్నో రకాల జలచరాలు, పగడాల చెట్ల , ఎన్ని రంగులలో ఉన్నాయో, పగడాలుకూడా ఓ రకమైన జలచరమే ఆ జీవి చనిపోయాక కొన్ని వందల సంవత్సరాలు సముద్రంలోవుండటం వల్ల చెట్టుగట్టిపడుతుంది దానిని కావలసిన ఆకృతులలో కట్ చేస్తారు. మనకి పగడం అంటే నారింజరంగు గాని లేత ఎరుపు అనే తెలుసు కాని ఇక్కడ పసుపు, తెలుపు, ఎరుపు, గులాబి, నీలం, వంగపువ్వు రంగులలోవున్నాయి, వీటిలో చాలా మటుకు బ్రతికేవున్నాయి.

సముద్రం అడుగున నదులు, ఇసుక ఎడారులు, అడవులు ఎన్నో నమ్మశక్యం కావట్లేదు, అడవులు అంటే నిజంగా పెద్ద పెద్ద చెట్లు లతలతో కూడుకొనివున్నవి, ఇప్పటికీ ఆదృశ్యం తలచుకుంటే ఒక అద్భుతాన్ని చూసిన భావన కలిగుతోంది. ఎక్కడా ముత్యపు చిప్పలుగాని, శంఖాలు, గవ్వలు అలాంటివేవీ లేవు. మరి అట్లాంటిక్ మహాసముద్రంలో అలాంటివి ఉండవో లేక ఇంకా సముద్రంలో ముందుకు వెడితేవుంటాయో?. మనసంతా నిండిపోయింది, తీరానికి వచ్చి మా ఓడ వైపు వెళుతూవుంటే ఇన్నేళ్లల్లో అనుభవించనివి ఎన్నో అనుభవించిన అనుభూతి.

రోటాన్ ప్రజలకి ఆరోజు పండగే , ఎందుకంటే ఆరోజు సుమారు ఆరు ఓడలు యీ దీవిలో లంగరు వేసేయి . ఆఫ్ సీజనైతే కొన్ని వారాలు ఓడలే రావు . ఈ ద్వీపం లోని వారు మొత్తం పర్యాటకుల మీదే ఆధారపడి వుంటారు .

ఆరోజు అందరం ఓ విధమైన మత్తులో వున్నాం , చూసిన అధ్భుతాన్ని నెమరువేసుకోడంలోనే రాత్రి గడచిపోయింది.

మేం ఓడలోకి చేరేంతవరకు అహ్లాదకరంగావున్న వాతావరణం మారిపోయి ఆకాశం మేఘావృతమై సన్నగా తుప్పరగా మొదలై వాన పెద్దగా కురవసాగింది, మనసులో చిన్న భయం మొదలయింది, ఈ వాన సముద్ర తుఫానుకు దారితీస్తుందా?, ఓడ కి కుదుపులు ఎక్కువ అవుతాయా? అని. వెలుతురున్నంతవరకు సముద్రంలో కురుస్తున్న వానని చూస్తూ కూర్చొన్నాను, రోజూకన్నా తొందరగా చీకటి పడింది. మతోపాటు లంగరు వేసిన మరో రెండు ఓడలు మాకు దూరంగా వెళుతూ కనిపిస్తున్నాయి. చీకటి పడ్డ తరువాత శబ్దాన్ని బట్టి వాన బాగా కురుస్తోందని తెలుస్తోంది. కాని మా ఓడ ఎటువంటి కుదుపులకీ లోను కాలేదు.

మరునాడు మా ఓడ పగలు 8 గంటలకి మెక్సికో కి చెందిన "కోస్తా మాయ" లో ఆగింది. మాతో వచ్చిన మిగతావారు, పురాతన సమాధులు చూడడానికి టూరు బుక్ చేసుకున్నారు. మేం ఓ సారి వూరు చూసుకొని బీచ్ లో కూర్చొనొద్దామని తాపీగా పదింటికి బయలు దేరి ఓడ దాటి ద్వీపం చేరుకున్నాం. చాలా చిన్నద్వీపం, బయటకి రాగానే మెక్సికన్లు కొందరు డాన్సులు చేస్తూ, డప్పులు మ్రోగిస్తూ రంగురంగుల దుస్తులు పక్షి ఈకలు ధరించి అందరినీ ఆకర్షించే ప్రయత్నం చేస్తున్నారు. చిన్న పార్కు, రకరకాల తినుబండారాలు, రకరకాల పళ్లు అమ్మే దుకాణాలున్నాయి, వాటిని దాటుకొని బయటకి వెళితే గడ్డితో కప్పిన టాపులతో, ట్రాక్టర్లు లాగుతున్న బళ్లు పర్యాటకలను ఊరి మధ్యలోకి తీసుకు వెళుతున్నాయి, ముందుగా టికెట్లు తీసుకోవాలి సుమండి, అక్కడకి వెళ్లేక మేం టాక్సీ మాట్లాడుకున్నాం, వాడు మాకు ఊరు చూపించడానికి, బీచ్ లో కుర్చీ, గొడుగులాంటివి ఇవ్వడానికి,ఇంకా స్పీడ్ బోట్ మీద ప్రయాణం ఇలా ఏవేవో అన్నీ చెప్పి మొత్తం 50 $ అడిగితే మేం 40$ బేరమాడేం. ముందుగా సిటీ టూరని ఓ చిన్న మైదానంలో ఆపి ఇదే సిటీ సెంటరని సముద్రం ఒడ్డుకి తీసుకువెళ్లి అయిదు నిముషాల తరువాత వెనుకకి తెచ్చేడు. ఇక్కడ సముద్రం ఒడ్డున కూర్చోవచ్చు అన్నాడు, మేం అక్కడ కూర్చున్నాం, ఓ గంటన్నర అయేక మీ సమయమయిపోయింది, ఎక్కువ సేపుగడపాలంటే ఎక్కువ డబ్బులివ్వాలి అన్నాడు, సరే అని మేం బయలు దేరిపోయేం.

కాస్త దూరం వెళ్లగానే మీరు గంట అని గంటన్నర చేసేరు కాబట్టి 25$ ఎక్కువివ్వాలి లేకపోతే పొలీస్ స్టేషనుకి పదండన్నాడు. కాస్త దూరం వచ్చేక మళ్లీ అదే మాట, సరే పోలీస్ స్టేషనుకి పద అన్నాం, నిర్మానుష్యంగావున్న గల్లీలోకి కారు మళ్లించేడు, మా అబ్బాయి వెంటనే వాడి కాలరు పట్టుకొని పోర్టు పోలీస్ స్టేషనుకి పదన్నాడు. అతను "ఇది మెక్సికో తెలుసా? అని కారు ముందుకి నడిపాడు7, మా అబ్బాయి కారు తాళాలు లాక్కొని నేను కారు నడుపుతా పక్కన కూర్చో , నీకు పిల్లలున్నారు కదా, ఎక్కువ వేషాలు వెయ్యకు, జీవితాంతం జైలులో కూర్చుంటావని హెచ్చరించేడు. మావాడి రూపం చూసి కాస్త వెనక్కి తగ్గి, మమ్మల్ని పోర్టులో దింపి వెళ్లిపోయేడు. ఏదో మా అదృష్టం బాగుంది , వాడి దగ్గర ఆయుధాలలాంటివి లేవు. అందుకే కొత్త ప్రదేశాలలో గుంపులలో వుండడమే మంచిది. ముఖ్యంగా పర్యాటకులు తీసుకోవలసిన ముందుజాగ్రత్తయిది, అందుకే ఈ విషయమిక్కడ రాసేను. కోస్టమాయ లో ఓ గుణపాఠం నేర్చుకున్నాం. ముఖ్యంగా మెక్సికో లాంటి దేశాలలో చాలా జాగ్రత్తగావుండాలి.

మరునాడు ఆరుగంటలకే లంగరు వేసేరు, ఎప్పుడూ మా గది బాల్కనీ పోర్టు వైపు వుంటుంది, కాని ఆరోజు మా వైపు సముద్రముండటంతో లంగరు వెయ్యలేదనుకున్నాం. అది మా ఓడకి ఆఖరు మజిలి, ఆ ఊరు పేరు కోజుమల్. 8 గంటలకి ఓడ లంగరు వేసినట్లు అనౌన్స్ చెయ్యడంతో బయలుదేరేం. ఆరోజు అందరం స్పీడ్ బోట్ రైడ్, పారా గ్లైడింగు లకి బుక్ చేసుకున్నాం. స్పీడ్ బోట్ లో ప్రయాణం చాలా బాగుంటుంది, సముద్రపు జలాలను కోస్తూ చాలా వేగంగా బోటు పెడుతూంటే, అలల తాకిడికి బోటు యెగిరెగిరి నీళ్ల మీద పడుతూంటే కొందరు భయంతో పెట్టే కేకలు, కొందరు సంతోషంతో పెట్టే కేరింతలు కలగాపులగంగా వినిపిస్తూ, కేక వెయ్యడానికి తెరిచిన నోట్లో సముద్రపు నీరు ఉప్పగా పడుతూంటే అదో ఆనందం, ఇక పారా గ్లైడింగు పారాచూట్ కి వ్రేలాడుతూ ఎత్తుగా సముద్రం మీద యెగురుతూ క్రిందికి చూస్తూంటే భయంతోయెప్పుడు దిగిపోతామా అని అనిపిస్తుంది , దిగిపోగానే అయ్యో అప్పుడే అయిపోయిందా అనిపిస్తుంది.

పోర్టుకి తిరిగి వచ్చేటప్పుడు పోర్టుకి పక్కగావున్న చిన్నచిన్న దుకాణాలలో కర్రతో, అల్లికతో, షెల్స్ తో చేసిన కళాకృతులు చాలా బాగున్నాయి. ఓ షాపులో అతను హిందీలో "సస్తాకా మాల్ రస్తే మే" అనడం విని అక్కడ ఆగి అతనికి హిందీయెలా వచ్చని అడిగేం, మనదేశపు పర్యాటకుడు నేర్పేడని చెప్పేడు. మీరూ యేదైనా మీ భాషలో నేర్పండి అన్నాడు. "నమస్తే, ధన్యవాద్, అఛ్చామాల్ హై హమారేపాస్" అన్న పదాలు నేర్పేం , వెంటనే అతను పెన్ను పుస్తకం తెచ్చి పుస్తకంలో పదాలు రాసుకొని వాటిని ఏ సందర్భంలో వాడాలో రాసుకొని రెండు మూడుమార్లు ఉచ్చరించి సరిగ్గా అన్నదీలేనిదీ తెలుసుకున్నాడు. అతని జిజ్ఞాస చూస్తేఎంతో ముచ్చటగా అనిపించింది.

ఆ రోజు సమయం చాలలేదనే భావన కలిగింది. అన్నిరోజులూ అంతే, కాకపోతే ఇక్కడవున్న దుకాణాలలోని వస్తువులు చూడడానికే చాలా సమయం పట్టింది.

మరునాడంతా ప్రయాణమే, మేం బోటులో యేమీ చూడలేదు, అవేళ సాయత్రం కొన్ని అంతస్థులు చూద్దామని బయలుదేరేం. మా అంతస్థులో మధ్యన గదులులేవు అంటే గదులు రెండు వరుసలలోవున్నాయి, రెండు వరుసల వారికీ బాల్కనీ వుంటుంది, కొన్ని అంతస్థులలో మధ్యలో మరో రెండువరుసల గదులు వున్నాయి, మధ్యవరుసవారికి కిటికీలు గాని, బాల్కనీలు గాని వుండవు, అలాంటి గదులకి అద్దె తక్కువగా వుంటుంది. నాలుగవ అంతస్థునుండి కిందన వుండే అంతస్థులలో సిబ్బంది వుండడానికి గదులు, ఆహారం, ఇంధనం మొదలయిన వాటిని నిలువ చేసుకొనేందుకు ఉపయోగిస్తున్నారు. ఈ ఓడ యాజమాన్యంలో ఇలాంటి ఓడలు 11 వున్నాయట, వీటికి "ఎకొ ఫ్రెండ్లీ " సర్టిఫికేట్ వుందట అంటే యే విధమైన వ్యర్ధాలనూ సముద్రజలాలలోకి విడిచిపెట్టరని అర్దం.

లంగరు వేసిన ప్రదేశాలలో వ్యర్ధాలను విడిచిపెట్టడం, ఆహార పదార్ధాలను నింపుకోడం లాంటి యెన్నో పనులు వుంటాయని మాకు తెలిసింది, ఇన్ని వేల మందికి ఫ్రెష్ గా వండి పెట్టడం, ఏ పదార్ధమూ నిల్వ వాసన రాకుండ చూసుకోడం ఇక్కడి వంటవారికి సవాలే. ఆఖరుకు కోసి పెట్టిన పండుముక్కలు కూడా తాజాగా వుండడం కూడా వారి నిబద్దతకు నిదర్శనమని చెప్పుకోవాలి.

ఆరాత్రి కొన్ని గేమ్ లలో పాల్గొన్నాం, థియేటర్ లో డాన్స్ ప్రోగ్రాం కి వెళ్లేం, చాలా బాగుంది. ఆఖర్న మొత్తం ఓడ సిబ్బంది 1800 మంది తరఫున అన్ని డిపార్టుమెంట్స్ అధికారులు వేదిక మీదకి వచ్చి పర్యాటకులకు ధన్యవాదాలు తెలిపేరు.

ఆ రాత్రి డిన్నరు తరువాత లగేజీ టాగ్లు యివ్వబడ్డాయి , టాగ్ ల మీద యిచ్చిన సమయానికి మనం బయటకు వెళ్లాలి , తొందరగా బయటకు వెళ్లదల్చుకున్నవారు ఆ టైము టాగ్స్ తీసుకొని వారి లగేజీకి వేసి రాత్రి 11 గంటలకి రూము బయట పెట్టెస్తే సిబ్బంది వాటిపైనున్న సమయాన్ని చూసుకొని "మియామి " పోర్టులో అప్పచెప్పుతారు .

మేం 11 గంటల సమయం టాగ్స్ కట్టేం, తాపీగా లేచి బ్రేక్ ఫాస్టు చేసుకొని 11 గంటలకు బయటకి చేరేం, వీసా చెకింగు, లగేజీ చెకింగ్ అనంతరం పోర్టులో టాక్సీ తీసుకొని మియామీ హోటల్ లో చెకిన్ అయి మరునాడు డల్లాస్ చేరేం .

మేం దిగిన ఓడ తిరిగి అదే రోజు నాలుగు గంటలకి క్రొత్త పర్యాటకులతో తిరిగి యాత్ర మొదలు పెడుతుంది.

క్రూస్ బయలుదేరిన రోజు రాబోయే యేడాదిలో యెప్పుడైనా మరో ట్రిప్పును బుక్ చేసుకుంటే వెయ్యి డాలర్ల వరకు రాయితీ ఇస్తారు. అలా ఎవరైనా చూసినవే తిరిగి చూస్తారా? అన్న నా ప్రశ్నకు వచ్చిన జవాబు నన్ను విస్మయానికి గురిచేసింది. చాలా మంది రిటైర్డ్ అమెరికన్లు ఇంట్లోవుంటే అయే ఖర్చు కన్నా ఇలా క్రూస్ లలో వుండడం చవుకని కనిపెట్టి, ఆఫర్లోలో ట్రిపులు బుక్ చేసుకొన తిరిగెస్తారట, అంటే వారం తరువాత మియామి లో యెగ్జిట్ లోంచి బయటకి వచ్చి తిరిగి చెకిన్ అయి ఓడ ఎక్కెస్తారట, బాగుందికదా? సర్వ సదుపాయాలూ కష్టపడకుండా తక్కువ ఖర్చుతో పొందవచ్చు.

ఈ మధ్య కాలంలో సముద్రయానాలు పర్యాటకులలో ప్రాముఖ్యతను పొందుతున్నాయి. మన దేశంలో కూడా సముద్రయానాలు బాగా ఊపందుకున్నాయి , మన దేశం నుంచి థాయిలాండు , సింగపూరు, మలేషియ లకు ' క్రూస్ ' సౌకర్యం వుంది. విశాఖ , చెన్నైలనుంచి అండమాన్ దీవులకు " క్రూస్" సేవలున్నాయి.

ఇన్నేళ్లకి తీరిన కోరిక తీపి జ్ఞాపకాలను మిగిల్చింది .

మరిన్ని వ్యాసాలు

Maa chardham yatra
మా చార్ధామ్ యాత్ర
- కర్రా నాగలక్ష్మి
సినీ అప్సరస గీతాలు .
సినీ అప్సరస గీతాలు .
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
వివేకానంద రాక్ మెమోరియల్ స్థపతిశ్రీ.ఎస్.కె ఆచార్య
స్థపతిశ్రీ.ఎస్.కె ఆచార్య
- కుందుర్తి నాగబ్రహ్మాచార్యులు
రాజస్తాన్ ప్రాంత నిర్మాణ విశేషాలు
రాజస్తాన్ ప్రాంత నిర్మాణ విశేషాలు
- కుందుర్తి నాగబ్రహ్మచార్యులు
Kanyakumarilo vunna tiruvalluvar vigraham nirmana charitra
తిరువళ్లువర్ విగ్రహం నిర్మాణ చరిత్ర
- కుందుర్తి నాగబ్రహ్మాచార్యులు