శ్రీ ఉన్నవ లక్ష్మీనారాయణ గారి పేరు వినగానే మనకు గుర్తుకు వచ్చేవి వారు వ్రాసిన 'మాలపల్లి' నవల మరియూ గుంటూరులోని 'శ్రీ శారదా నికేతన్'. నేటికీ శ్రీ శారదా నికేతన్ నిరాటంకంగా కొనసాగుతూ వేలాదిమంది స్త్రీ, బాలికలను విద్యావంతులను చేస్తుంది. వీరు గొప్ప దేశ భక్తుడు, సంఘ సంస్కర్త, సామాజిక స్పృహ గల ఒక గొప్ప రచయిత. అన్నిటినీమించి గాంధేయవాది. శ్రీ లక్ష్మీనారాయణ గారు గుంటూరు జిల్లాలోని, వేమూరిపాడు అనే ఒక కుగ్రామంలో, 1877 డిసెంబరు 4వ తేదీన శ్రీరాములు, శేషమ్మ దంపతులకు జన్మించారు. ప్రాధమిక విద్య స్వగ్రామంలోనే జరిగింది. 1897 లో గుంటూరులో matriculation చదివారు. 1906 లో రాజమండ్రిలో టీచర్ గా ట్రైనింగ్ పొందారు. 1916 లో ఇంగ్లాండ్ లో బారిష్టర్ చదివారు.
ఆ తరువాత స్వదేశానికి వచ్చి న్యాయవాది వృత్తిలో కొనసాగారు. విశేషంగా ధనం, కీర్తి సంపాదించారు. గాంధీ గారి పిలుపు మేరకు, వాటినన్నిటినీ తృణ ప్రాయంగా వదిలేసి, సహాయ నిరాకరణ ఉద్యమాలలో పాల్గొన్నారు. పలుమార్లు జైలు శిక్షలు అనుభవించారు. 1892లోనే లక్ష్మీబాయమ్మగారితో వివాహం జరిగింది. 1900 వ సంవత్సరంలో గుంటూరులో young men literary అసోసియేషన్ ను స్థాపించారు. 1902 లో అక్కడే వితంతు శరణాలయాన్ని స్థాపించారు. వీరేశలింగం పంతులు గారి అధ్యక్షతలో తొలి వితంతు వివాహం జరిపించారు. 1917 లో మద్రాసు హైకోర్టులో న్యాయవాదిగా పనిచేసారు. 1922 లో గుంటూరులోనే శ్రీ శారదా నికేతన్ ను స్థాపించి బాలికలకు విద్యావకాశాలు కల్పించారు. ఇక్కడ స్త్రీలకు, బాలికలకు సాధారణ విద్యతో పాటుగా వృత్తి విద్యలలో కూడా శిక్షణ అవకాశాలు కల్పించారు. ఇక్కడ చదువుకున్న స్త్రీలు ఎంతోమంది విద్యావంతులై, జాతీయోద్యమంలో పాల్గొన్నారు.
రష్యాలో 1917లో జరిగిన బోల్షవిక్ విప్లవం వల్ల స్ఫూర్తి పొందిన మొదటి తెలుగు కవి ఈయన. కూలీల పక్షం వహించి కవులు రచనలు చేయడానికి ప్రేరణ నిచ్చింది రష్యా విప్లవమే. కూలీల ఆర్థికాభివృద్ధిని కాంక్షించి వారి పక్షం వహించి వారి దుస్థితిని తెలియ జేసిన మొదటి వైతాళికుడు శ్రీ ఉన్నవ. సామాన్య ప్రజల అభ్యుదయాన్ని కోరే కవిత్వం ప్రజలకు సులభంగా అర్థమయ్యే వాడుక భాషలో ఉండాలన్నది ఉన్నవ అభిలాష. సాంఘీక, ఆర్థిక అసమానతల్ని తొలగించి సమతాధర్మాన్ని స్థాపించడమే ఆయన ఆశయం. కులవ్యవస్థను నిరసించి సహపంక్తి భోజనాలు ఏర్పాటుచేశాడు. అగ్రవర్ణాలు, హరిజనులు అందరూ కలసి మెలసి వుండాలని భావించాడు . అందుకు నిరూపణగా "మాలపల్లి" అనే విప్లవాత్మకమైన నవలా రచన చేసారు. ఈ నవల లోని ప్రధాన ఇతివృత్తం 'అంటరాని తనం'. సంఘ దురాచారాలకు బలైపోయిన అనేకమంది అభాగ్యుల జీవిత చిత్రీకరణమే, ఈ నవల. అంత గొప్ప నవల కావటం వల్లనే, దీనిని శ్రీ కట్టమంచి రామలింగారెడ్డి గారు, గురజాడ వారి కన్యాశుల్కం సరసన నిలబెట్టారు. కన్యాశుల్కం, మాలపల్లి ఈ రెండూ పూర్తి వాడుక భాషలో వ్రాసిన మహత్తర గ్రంధాలు.
1922లో ఈ నవలను బెల్లంకొండ రాఘవరావు గారు రెండు భాగాలుగా ముద్రించారు. కానీ మద్రాసు ప్రభుత్వం, ఈ నవలలో బోల్షెవిక్ భావాలు వున్నాయని, మాలపల్లి నవలా భాగలపై నిషేధం విధించింది. 1926లో మద్రాసు శాసనమండలిలో కాళేశ్వరరావుచే మాలపల్లి నిషేధంపై చర్చలు జరిగాయి. 1928లో కొన్ని మార్పులతో మాలపల్లి ప్రచురణకు తిరిగి అనుమతి లభించింది. మద్రాసు ప్రభుత్వం ఆంధ్ర విశ్వవిద్యాలయంచే మాలపల్లిని ప్రచురింప చేసి ఆ నవలను పాఠ్యగ్రంథంగా కూడ ఎంపిక చేసింది. 1936లో మద్రాసు ప్రభుత్వం 'మాలపల్లి' నవలపై రెండోసారి నిషేధం తెలిపి ఆ నవలను పాఠ్యగ్రంథంగా తొలగించింది. 1937 లో సి. రాజగోపాలాచారి గారు మద్రాసు ముఖ్యమంత్రిగా ఎన్నికైనప్పుడు తొలి కాంగ్రెసు మంత్రి వర్గంచే మాలపల్లి నవలపై నిషేధపు ఉత్తర్వులు రద్దు జరిగింది. రాజకీయ వాతావరణాన్ని, గాంధీ మహాత్ముని ఆశయాల్ని, తెలుగువారి జీవన విధానాన్ని ప్రతిబింబించిన నవల మాలపల్లి. ఈ సాంఘిక నవలలో సాంఘిక దురాచారాలు, జాతీయ సత్యాగ్రహ ఉద్యమాలు, వర్ణ, వర్గ వ్యత్యాసాలు మొదలైన సమకాలీన పరిస్థితులను కన్నులకు కట్టినట్లు ఉన్నవ చిత్రించారు.
ఆనాడు హరిజనుల కుటుంబ గాథను ఇతివృత్తంగా ఎన్నుకొని నవల రాయడమే సాహసం. ఇందులో కథానాయకుని పేరు సంగదాసు. ఈ పాత్ర ద్వారా ఉన్నవ ఆర్థిక , సాంఘిక, కుల వ్యత్యాసాలు లేని సంఘ నిర్మాణ పునరుద్ధరణ చేయిస్తాడు కాబట్టి ఈ నవలకు 'సంగవిజయం' అనే పేరు కూడా సార్థకమయింది. ఉన్నవ ఈ నవలలో చరమగీతం, సమతాధర్మం అనే రెండు గేయ కవితల్ని సామాన్య ప్రజల వాడుక భాషలో జానపద గేయ రీతుల్లో రచించారు. ఈ నవలకు పీఠిక వ్రాసిన శ్రీ కాశీనాథుని నాగేశ్వరరావు పంతులు గారు ఈ నవలను గూర్చి 'ఆంధ్ర సాహిత్య హృదయ పరిణామాన్ని గ్రహించడానికి మాలపల్లి ఉత్తమ కావ్యం అని, తెనుగు మాటలు, తెనుగు దేశము, తెనుగు హృదయము, తెనుగు సంకల్పము, మాలపల్లి నవలకు అనిర్వచనీయ ప్రతిభను సమకూర్చాయి' అని కొనియాడారు.
తెలుగు విప్లప సాహిత్యంలో వచ్చిన ప్రథమ మహాకావ్యం 'మాలపల్లి'. నాయకురాలు, బుడబుక్కల జోస్యం, స్వరాజ్య సోది, భావతరంగాలు తదితర రచనలు కూడా ఉన్నవ వారు చేసారు. ఉన్నవ సాగించిన అనేక ప్రజాహిత కార్యక్రమాల్లో, స్వాతంత్ర ఉద్యమాల్లో అతనికి చేదోడు-వాదోడుగా ఉంటూ అతని భార్య ఉన్నవ లక్ష్మీబాయమ్మ సహధర్మచారిణిగా విశేష సేవలందజేసారు. మరో పదేళ్ళలో మనం 'మాలపల్లి' శతజయంతి ఉత్సవాలను జరుపుకోబోతున్నాం. దేశం మొత్తం మీద 'అంటరాని తనం' మీద వ్రాసిన మొట్ట మొదటి నవల 'మాలపల్లి' కావటం, మనం గర్వించతగ్గ విషయం. అయితే, కన్నడంలో శివరామ కారంత్ 1932 లో రచించిన 'చోమనదుడి' కీ, ఆ మరుసటి సంవత్సరంలో శ్రీ ముల్క్ రాజ్ ఆనంద్ వ్రాసిన 'Untouchable 'కూ దేశవ్యాప్తంగా వచ్చినంత పేరు, 'మాలపల్లి'కి రాలేదు. మంచి రచనల పట్ల మనకున్న నిర్లిప్తతకూ ఇంతకన్నా వేరే ఋజువులు అనవసరం.
చలం గారిని బ్రతికుండగానే మానసికంగా చంపిన సాహితీ పిపాసకులం, సంస్కరణాభిలాషులం మనం! ఇటువంటి చారిత్రిక వ్యక్తుల జీవిత విశేషాలు, వారి రచనలోని సందేశాలు, మనకు తెలిస్తేగదా, ముందు తరాల వారికి తెలియచేసేది! అందుచేత, దయ చేసి వెంటనే, ఈ నవలను కొని చదవండి. (మార్కెట్ లో దొరుకుతుంది) ఈ నాడు ఉన్నవ లక్ష్మీనారాయణ పంతులు గారి లాంటి మహనీయులను గురించి పరిచయం చేయటం ఒక రకంగా బాధ కలిగిస్తుంది. కారణం, తెలుగు తేజాలను గురించి తెలుగు వారికే పరిచయం చేయటం బాధగానే ఉంటుంది మరి! ఇటువంటి మహనీయులను, వారి వ్యక్తిత్వాలను గురించి గుర్తు చేస్తున్నందుకు గర్వంగా కూడా ఉంటుంది. తెలుగు నవలా సాహిత్య వైతాళికుడుగా విశేషమైన కీర్తి పొందిన శ్రీ ఉన్నవ 1958 సెప్టెంబరు 25న తుది శ్వాస విడిచారు.
ఆ మహనీయునికి నా ఘనమైన నివాళి!!!!