మనం ఎదురుగుండా ఉన్నంతసేపూ పొంగని పాలు ఒక్కక్షణం పక్కకి చూసే లోపులే పొంగిపోతాయి ఎందుకు!
వర్షం అనుకోకుండా పడుతుంటే గబగబా వెళ్లి బయట ఆరేసిన బట్టలు అన్నీ తీసి ఇంట్లోకి రాగానే వర్షం ఆగి భళ్ళున ఎండ వస్తుంది ఎందుకు!
గోరింటాకు పెట్టుకున్నప్పుడే ముక్కుకి దురద పెడుతుంది ఎందుకు!
కరెంటు పోయినప్పుడు మాత్రమే ఇంట్లో కొవ్వొత్తులు అయిపోయి ఉంటాయి ఎందుకు!
చీటికీ మాటికీ పోయే కరెంటు పరీక్షలప్పుడు పోదెందుకు!
రోజూవచ్చే వర్షం, మనం బయటికి గొడుగుతో వెళ్ళినప్పుడు రాదెందుకు!
నేను ఆవులిస్తే పక్కవాడు కూడా ఆవులించడం ఎందుకు!
బస్సు ప్రయాణంలో పక్కవాడు నిద్రపోతే మనకి కూడా నిద్రొస్తుందెందుకు!
కార్ లో వెళుతున్నప్పుడు, తటాలున ముందు అద్దం మీద- పై నుంచి నీళ్లు ఒక్కసారే పడ్డప్పుడు ఉలిక్కిపడి సీట్ లో వెనక్కి జరుగుతాం ఎందుకు!
ఇంట్లో అన్నీ ఉన్నప్పుడు ఆకలి వేయకుండా, ఇంట్లో ఏ చిరుతిళ్ళు లేనప్పుడే ఆకలేస్తుంది ఎందుకు!
ఒక్కళ్ళమే కాఫీ తాగేటప్పుడు చటుక్కున వెళ్లే మన చేయి- స్నేహితుల తో కాఫీ తాగేటప్పుడు పర్సు దగ్గరకు మెల్లిగా వెళ్తుంది ఎందుకు!
హోటల్ లో మెనూ చూసినా- పక్కవాడి ప్లేట్ లో చూసిన తర్వాతే ఆర్డర్ ఇస్తాం ఎందుకు!
రైల్లో వెళ్ళేటప్పుడు సాధారణంగా ఎదుటివాడు భోజనం తినటం మొదలు పెడితే గాని మనం తినం ఎందుకు!
మొబైల్ ఫోన్ బ్యాటరీ ఆఖరి గీతలో ఉండగానే అర్జెంటు కాల్స్ వస్తాయి ఎందుకు!
సులభ్ టాయిలెట్ కి వెళదామనుకున్నప్పుడే చిల్లర ఉండదు ఎందుకు!
చీరల షాపులో బొమ్మకు కట్టిన చీర మొదట్లో నచ్చక షాపు అంతా తవ్వి చీర ఎంచుకొన్నాక బొమ్మకు కట్టిన చీరే నచ్చుతుందెందుకు!
అబ్బాయి తననే చూస్తున్నాడని అమ్మాయి అతని వైపు చూడకుండానే ఆ అమ్మాయికి తెలుస్తుంది ఎలా!
ఎప్పుడూ కళ్ళముందు విపరీతంగా తిరిగే ఓలా- ఊబర్ కార్లు, మనకి కావలసినప్పుడు ఎప్పుడూ ఆలస్యంగా వస్తాయి ఎందుకు!
మనకి కావాల్సిన వస్తువు అవసరం అయినప్పుడు ఎంత వెతికినా దొరకనిది- అవసరం తీరాక దొరుకుతుంది ఎందుకు!
మన ఎంత పైఅంతస్థులో ఉన్నా- కిందికి రోజూ దిగుతూనే ఉన్నా- కిందివాళ్ళ మీద చిన్నచూపు ఎందుకు!
“నీ, నా” అనే తేడాలేకుండా, మనస్ఫూర్తిగా, అరమరికలు లేకుండా మాట్లాడేవాళ్ళం -ఇప్పుడు వడకడుతూ (ఫిల్టర్ చేస్తూ) ఆచి తూచి - కృత్రిమంగా మాట్లాడుతున్నాం. ఎందుకు!
ఇందులో చాలావరకు సహజమైనవే, మరికొన్ని మనలో వచ్చిన మార్పు; మనిషి చాలా మారిపోయాడు, పరిస్థితులు కావచ్చు, స్వభావం కావచ్చు, స్వార్ధం కావచ్చు, గర్వం- అహంకారం చేరి ఉండొచ్చు - గతాన్ని మర్చి పోయి ఉండొచ్చు, కారణాలు ఏమైనా సరే. మరీ అంతలా మారాలా? అంత స్వార్ధం అవసరమా, మూలాల్ని, మన ఉనికికి మూలమైన వాళ్ళను మర్చి బతికేస్తుండటం ఏమి గొప్పతనం - అదో గొప్పతనమా?
ఏమి సాధించామని జీవితంలో, మనలా సంపదలతో, ఆర్జనలతో కొన్ని కోట్లమంది ఉన్నారుగా- మరి ఏమిటి మన గొప్పతనం? పూర్వం ఓ సామెత ఉండేది “ఆలికి చీర కొంటే ఊరికి ఉపకారమా” అని!
తమ గొప్ప, తనం తమ పచ్చదనం చూసుకోవడమేనా ఎప్పుడూ? చుట్టుపక్కల పరిసరాలు, మనుషులతో కూడా పరస్పరం పరిచయాలు, సంబంధాలు పెంచుకోవచ్చుగా - ఇందులో డబ్బు ఖర్చేమీ కాదుగా!
తనకు, తన కుటుంబానికి వెలుపల విశాల ప్రపంచం ఉంది. అందులోంచే ప్రతి ఒక్కరూ వస్తారు. ఇతరులతో మన అవసరాలు తీరాక పోనుపోనూ, గళ్ళు గీసుకొని బతికేస్తున్నాం - అదీ ఓ జీవితమేనా - దానికి ఓ సార్ధకత ఉందా?
మానవుడు స్వతహాగా సంఘజీవి- కాలక్రమేణా స్వార్ధజీవి అయిపోయాడు. ఆత్మపరిశీలన, అంతర్మధనం చేయాల్సిన సమయం వచ్చింది అని అనిపించట్లా? మన ప్రవర్తన, స్వార్ధం మనతీరు మన పిల్లలు చూస్తున్నారుగా- “ఆవు చేలో మేస్తుంటే, దూడ గట్టునుంటుందా” అదే వాళ్ళూ నేర్చుకుని మనల్ని మించి స్వార్ధజీవులు అయితే! మన ముదిమిలో- వాళ్ళు మన బాటపడితే, మనం వంటరి అయిపోమా? ఇలా జరగదని హామీ లేదుగా,
మనం ఇలా తయారు అవుతామనేనేమో, 150 ఏళ్ల పూర్వమే స్వామి వివేకానంద అన్నారు “పిల్లలు మీమాట వినడం లేదని అనుకోవడం కాదు, మిమ్మల్ని చూసి నేర్చుకుంటారు అని తెలుసుకోండి” చక్కగా, నిస్వార్ధంగా బతకడానికి పెద్ద నేర్పరితనం అక్కర్లేదు, పెద్ద మనసు ఉండాలి- అందరి గుండె గుప్పెడేగా; ఆ గుండెనే కొద్దిగా లోపల విశాలంగా చేసుకుంటే జీవితం సుఖమయం అవుతుంది! గుండె పెద్దది అయి డాక్టర్ దగ్గరకి వెళ్లేకంటే- అదే గుప్పెడు గుండె తో మంచిగా బతికేస్తే పోలా!
"ఇట్స్ బెటర్ టు హావ్ లార్జ్ హార్ట్ దాన్ ఎన్లార్జిడ్ హార్ట్"