ప్రపంచంలో మనంత జాగ్రత్తపరులూ, తెలివైనవారూ లేరనే దురభిప్రాయం చాలామందిలో ఉంటూనే ఉంటుంది. రోజువారీ పనులు తిన్నగా జరుగుతున్నంత కాలమూ ఫరవాలేదు. అన్నిరోజులూ మనవి కావుగా. ఏదో ఓ కాగితమో, రసీదో ఇంకోటో అవసరం వస్తుంది. సరీగ్గా అలాటప్పుడే, ఆ మాయదారిది కనిపించకుండా పోతుంది. అదేదో లేకపోతే పనవదూ. అలాటప్పుడే మనం వీధిలో పడిపోతూంటాము. ఇలా అవసరాలకి కనిపించకుండాపోయే వస్తువులో, డాక్యుమెంట్లలో అగ్రస్థానం రేషను కార్డుది. ఆ రేషనుకార్డుమీద లభించే పంచధారది. వివిధ వస్తువులకీ అనర్హులమైనా, మన అస్థిత్వానికి ఋజువు ఆ రేషను కార్డేగా. ఓ పాన్ కార్డుకీ, పాస్ పోర్టుకీ, ఒకటనేమిటి ప్రతీదానికీ ఇదే కావాలి. ఏదో సందర్భంలో దీని అవసరమయిందనుకుందాం, ఎక్కడో జాగ్రత్తగా పెట్టేమనే అనుకుంటాము, కానీ ఎంతవెదికినా కనిపించదు. ఏ బట్టలక్రిందో, పోచ్ లోనో పెట్టేఉంటాము అతి జాగ్రత్తకదూ, ఓ అరడజనుదాకా ఫొటో కాపీలైనా కనబడతాయి కానీ, ఒరిజినల్ మాత్రం కనిపించదు. ఆ ఒరిజినల్ లేకపోతే ఒప్పుకోరాయె. గుర్తొచ్చిన ప్రతీచోటా వెదుకుతాము, అబ్బే... ఛస్తే కనిపించదు. ఒకవైపున మన బీపీ అంచెలంచెలుగా పెరిగిపోతూంటుంది, ఫలితం - లోకువగా దొరికే ఇంటావిడమీద చూపించడం. నోటికొచ్చినట్లు అరవడం - "ఒక్క కాగితమూ కనిపించదు... అప్పటికీ చెప్తూనే ఉన్నాను ముఖ్యమైన కాగితాలన్నీ ఒకచోట పెట్టూ అని... పెద్దావాడేదో చెప్పేడూ పోనీ వినొచ్చుగా, అబ్బే... వాడు చెప్పదేమిటీ మనం వినడమేమిటీ..." ఉద్యోగంలో ఉన్నప్పుడు పాపం అందరూ వినేవారు, కానీ ఇప్పుడో... ఎందుకులెండి. వెదగ్గా వెదగ్గా మొత్తానికి ఎక్కడో కనిపిస్తుంది, కానీ అది కనిపించేదాకా జరిగిన అల్లరీ... అప్పుడు ఇంటావిడకీ గుర్తొస్తుంది..." మర్చేపోయాను మొన్న అబ్బాయి పాస్ పోర్టు రెన్యూ చేయించడానికి తీసినట్టున్నాడు, ఊరికే అరవకండి కోడలు వింటే బాగుండదు కూడానూ..." అని ఓ లెక్చరిస్తుంది. మొత్తానికి కథ సుఖాంతం.
వీటిలో ద్వితీయ స్థానం పాన్ కార్డుది. మనకి పన్ను కట్టేంత ఆదాయం ఉన్నా లేకపోయినా ఫరవాలేదు కానీ, ఈ పాన్ కార్డుమాత్రం లేకపోతే, ఒక్క పనీ సవ్యంగా జరగదు. ఏదో ఉద్యోగంలో ఉన్నప్పుడు తీసికున్నది, జీవితాంతం ఏ పని చేయాలన్నా దీనితోనే మొదలెడతారు. సాధారణంగా డెబిట్ కార్డులతో పాటు, పర్సులో పెట్టేమనే అనుకుంటాము, అదేం కర్మో కానీ, ఏ బ్యాంకులోనో అదేదో టర్మ్ డిపాజిట్ చేయాలని దీనికోసం వెదికితే, ఏముందీ, ఆ పాన్ కార్డు తప్ప మిగిలినవన్నీ కనిపిస్తాయి. పోనీ దొరకలేదూ అని కొత్తదానికి అప్లై చేద్దామా అంటే, అదీ ఇవ్వరూ, పోనీ పాతది తప్పిపోయిందీ, ఓ డూప్లికేట్ ఇవ్వండీ అంటే, పాతదాని నెంబరేమిటీ అంటారు. ఏదో "ఆయనే ఉంటే..." అన్న చందాన, ఆ కార్డే ఉంటే ఈ గొడవంతా దేనికీ? అందుచేత చెప్పొచ్చేదేమిటంటే, ఈ రేషను కార్డూ, పాన్ కార్డూ మాత్రం ప్రాణప్రదంగా దాచుకుని, ఇంట్లో వాళ్ళందరితోనూ చెప్పుంచుకోవాలి. ఎవరో ఒకరికైనా గుర్తుంటుంది.
ఇంక వస్తువుల విషయానికి వస్తే ముందుగా సెల్ ఫోను. ఇదొకటీ అవసరమైనప్పుడల్లా మాయమైపోతూంటుంది. ఇంటికి తెచ్చినట్టే గుర్తూ, ఎక్కడ పెట్టానేమిటి చెప్ప్మా అని జుట్టుంటే పీక్కుంటూంటారు. పోనీ ఇంకో ఫోనునుంచి కాల్ చేస్తే దొరుకుతుందేమో అనుకుందామా అంటే మనమేమో స్టైలుగా దాన్ని సైలెంటు మోడ్ లో పెట్టుంచామే, ఇంకెక్కడ తెలుస్తుందీ? చివరకి ఏ సోఫా కుషన్ కిందో దొరుకుతుంది. ఈ జాతికి చెందిందే టీవీ రిమోట్. మనం ఏదో చానెల్ చూస్తూ, మనం ఏ మంచినీళ్ళో త్రాగడానికి, ఆ కార్యక్రమం బ్రేక్ లో ఏ వంటింట్లోకో వెళ్తాము. మనం లేచీలేవగానే, మనవడో, మనవరాలో చానెల్ మార్చేస్తారేమో అని, ఆ దిక్కుమాలిన రిమోట్ కూడా తీసికెళ్ళడం. బ్రేక్ ఎలాగూ ఓ పదినిముషాలుంటుందే. మధ్యలో లఘుశంక కూడా తీర్చుకుందామని, ఆ టీవీ రిమోట్ తో లోపలకి వెళ్ళడం. దాన్ని కాస్తా అక్కడే పెట్టి మర్చిపోవడం. తీరా ఈ పనులన్నీ పూర్తిచేసికుని హాల్లోకి వచ్చేసరికి, పిల్లలు ఇంకో చానెల్ చూస్తూంటారు. వాళ్ళకి రిమోట్లతో పనిలేదు, టుపుక్కున నొక్కేసి చానెల్ మార్చేసికోగల నిపుణులు. అసలు అంతంత జాగ్రత్తలెందుకూ అంట, ఆ రిమోట్టేదో అక్కడే వదిలేసి వెళ్తూ, ఈలోపులో మీక్కావాల్సిన చానెల్ ఏదో చూడండిరా అంటే వాళ్ళూ బుధ్ధిగా ఉండేవారూ, ఈయనగారిక్కవాల్సిన కార్యక్రమమూ చూడగలిగేవారు. ఆ రిమోట్ ఎక్కడ పెట్టాడో గుర్తుకొచ్చి చావదు, అడగడానికి నామోషీ, "మాకేం తెలుసూ కావాల్సొస్తే మీరే వెదుక్కోండీ..." అంటారేమో.
ప్రయాణాల్లో వెళ్ళేటప్పుడు ప్రతీదానికీ ఓ తాళం ఒకటీ. ఆ తాళాలు లేకపోతే క్లోక్ రూం వాడు మన సామాన్లు పెట్టుకోనీయడు. చిన్న చిన్న బ్యాగ్గులదగ్గరనుంచీ ప్రతీ దానికీ ఓ తాళం ముఖ్యం. ఒకే తాళం చెవితో అన్ని తాళాలూ వస్తాయి, అయినా సరే ఓ అరడజను తాళం కప్పలూ, వాటికి రెండేసో, మూడేసో తాళం చెవులూ. వీటన్నిటికీ ఓ గుత్తి ఒకటీ, ఈ గుత్తిని భద్ర పరచడానికి పెద్దాయనకి ఇస్తారు. ప్రయాణ మధ్యలో ఏ పెట్టో తీద్దామనుకుంటే, ఈయన్నే పిలవడం. గొంతుక్కూర్చుని, కావాల్సిన పెట్టె తెరుద్దామనుకుంటే, దేని చెవి ఏ తాళందో తెలియదు. గుత్తిలో ఉన్న నాలుగు బ్యాగ్గులూ, రెండు సూట్ కేసులకీ సంబంధించిన ఆరూ ఇంటూ మూడూ(వెరసి పధ్ధెనిమిది) తాళంచెవులతోనూ నానా తిప్పలూ పడ్డం, అంత బక్క తాళం కప్పా ఛస్తే తెరుచుకోదు. మధ్యలో ఈ సరంజామా అంతటికీ ఓ గొలుసూ, మళ్ళీ దానికో తాళం కప్పానూ. మొత్తానికి ప్రయాణం చేసి, కొంపకి చేరి, ఆ తాళాలూ చెవులూ ఓ ప్లాస్టిక్ డబ్బాలో జాగ్రత్తచేయడం, వచ్చేసారి ప్రయాణానికి ఉపయోగిస్తాయని. తీరా ఆ ప్లాస్టిక్ డబ్బా కోసం వెదికితే మళ్ళీ సీన్ రిపీట్... కొట్టుకి వెళ్ళడం మళ్ళీ తాళాలు కొనుక్కోడం...
అవసరానికి కనిపించకుండా పోయే వస్తువులు చాలానే ఉన్నాయి. ఏ కాలో బెణికిందనుకోండి, ఫౌమెంటేషన్ చేయండీ అంటాడాయన. అదేమీ బ్రహ్మవిద్యా ఏమిటీ ? పాతకాలంలో కాపడం అనేవారు, హాయిగా ఓ కుంపటీ, దానిమీద ఓ గిన్నే, దాంట్లో నీళ్ళూ, మరగపెట్టడం, ఓ పలచటి గుడ్డోటి దాంట్లో ముంచడం, పిడిచేసి ఆరారగా నొప్పి ఉన్నచోట పెట్టడం. ఈ గొడవంతా పడే ఓపికెవరికుందీ, ఓ రబ్బరు బ్యాగ్గూ, దాంట్లోకి మరుగుతూన్న నీళ్ళు పోసేసి ఇచ్చేస్తే, ఆ ముసలాయనో, ముసలావిడో వాళ్ళే పెట్టుకుంటారు. గీజరు ఒకసారి ఆన్ చేస్తే చాలు, వేణ్ణీళ్ళకి కూడా లోటు లేదు. వచ్చిన గొడవల్లా ఈ హాట్ వాటర్ బ్యాగ్గుతోనే, అదిమాత్రం కనిపించదు. క్రిందటిసారి పనైపోయిన తరువాత, నీళ్ళన్నీ పోవడానికి ఏ మేక్కో తగిలించుంటాం, కానీ గుర్తుకు రావాలిగా ఏ మేకో...
ఇలాటిదే థర్మా మీటరొకటీ. ఈ రోజుల్లో డాక్టర్లు కూడా ఏదైనా రోగం వస్తే, ప్రతీ గంటకీ టెంపరేచరు నోట్ చేసికోమంటున్నారు. నా నమ్మకం ఏమిటంటే, అసలు ఈ థర్మా మీటర్లుండడం వల్లే ఈ రోగాలు కూడా ఎక్కువయ్యాయి. బి.పీ, సుగర్, ప్రెగ్నెన్సీ, మొన్న ఎప్పుడో చదివాను క్యాన్సరు టెస్టింగు కూడా ఇంట్లోనే చేసుకోవచ్చుట. ఇదిగో ఇలాటివన్నీ కొంపలో పెట్టుకోవడం, ప్రతీ రోజూ చూసుకోవడం, దాన్ని గురించి నెట్ లో చదవడం, ఏవేవో ఊహించుకోవడం, ఇంట్లోవాళ్ళ ప్రాణాలు తీయడం, డాక్టర్ల బిజినెస్ పెంచడం తప్ప ఇంకోటి కాదు. ఏమన్నా అంటే ' ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్' అని జ్ఞానబోధ చెయ్యడం.
ఇంకోటుందుందండోయ్ ఫ్యూజ్ వైరు. ఇదివరకటి రోజుల్లో ఎప్పుడైనా ఇంట్లో కరెంటు పోతే ఇంట్లో వాళ్ళే ఫ్యూజు వేసికునే వాళ్ళు. వీడు ఏదో హై వాటేజ్ ఉండే హీటరో, గీజరో వాడడం మొదలెడతాడు. ఠప్పున షార్టైపోతుంది. అర్ధరాత్రీ, అపరాత్రీ ఎలెక్ట్రీ వాడెక్కడ దొరుకుతాడు, అందుకనో ఓ ఫ్యూజు వైరు ఇంట్లో ఉంచుకునే వాళ్ళు. లైట్లు పోయినప్పుడు, టార్చి లైటూ, ఫ్యూజు వైరూ లేకుండా కరెంటు ఎలాగొస్తుందీ? ఇప్పుడంటే ఇన్వర్టర్లూ సింగినాదం వచ్చేయి కానీ, మన ఊళ్ళల్లో ఇప్పటికీ ఈ ఫ్యూజు వైర్ల అవసరం ఉంటూనే ఉంటుంది.
ఇలా చెప్పుకుంటూ పోతే ఈ చిఠ్ఠాలోకి ఎన్నేసి వస్తువులొస్తాయో. గొడుగులూ, టార్చ్ లైట్లూ ఒకటేమిటి కావాల్సినన్ని. అవడం వస్తువు చిన్నదే కావొచ్చు, కానీ అవసరానికి కనిపించక అదృశ్యం అవడం వాటి జన్మహక్కనుకుంటాయి. ఏం చేస్తాం... అవీ తెలివిమీరిపోయాయి.